ధైర్యం లోపించిన జ్ఞానం
ధైర్యం లోపించిన జ్ఞానం
కొన్ని కథలు చదువుతుంటే ఎంత బావుంది ఈ కథ? ఎంతో లోతైన అవగాహన రచయితది అని అనుకోకుండా ఉండలేము. ముఖ్యంగా సున్నితమైన అంశాల పట్ల రచయితకున్న ధృఢత్వం కూడా రచనావిలువను ఇనుమడింపజేస్తుంది. ‘రేప్’ లాంటి అంశంపై ఇంత లోతుగా, అవసరమైన చోట కేవలం పాత్ర చిత్రణ కోసం మాత్రమే బొల్డ్ గా రాయడం వివినమూర్తి గారి ‘ఒక రేపిస్టు ప్రేమ లేఖ’ కథకు పఠనీయతను, గంభీర మరియు విస్తృత దృక్కోణాన్ని ఏర్పరిచింది. ఈ కథ ఫిబ్రవరి 1, 2015 న ఆంధ్రజ్యోతి ఆదివార పత్రికలో ప్రచురించబడింది.
ఓ రేపిస్టు ఏం మాట్లాడతాడు? అతని ఆలోచనా స్వరూపం ఎలా ఉంటుంది? అతని దృక్కోణంలో స్త్రీ ఎలా ఉంటుంది? అతని ఆలోచనలు ఎలా రూపొంది ఉంటాయి? అతనిని మార్చే అవకాశం ఎలా ఉండవచ్చు? అతని పట్ల ఉన్న సమాజ ద్వేషం అతన్ని ఎలా ఆలోచించేలా చేస్తుంది? అన్న కోణంలో ఈ కథలో రేపిస్టు పాత్రను మలుస్తూనే, అతనికి నామధేయం కూడా ఇవ్వకపోవడానికి కారణం బహుశా సమాజం అతనికి అప్పటికే ఇచ్చిన నామధేయాల వల్ల అతని అసలు నామధేయానికి విలువ, గుర్తింపు ఉండవని చెప్పడానికే కావచ్చు.
ఈ కథలో రేపిస్ట్ తండ్రి ఓ పోలీస్ ఆఫీసర్. అతను కొడుకును ఎప్పుడు తప్పుల నుండి రక్షిస్తూ సమర్ధిస్తూ ఉంటాడు. తల్లి మాత్రం చట్టం, న్యాయం, ధర్మం, పాపం వంటి వాటికి విలువనిచ్చే స్త్రీ. తన తప్పులను కప్పిపుచ్చుతూ, తనను రక్షించే తండ్రికి దగ్గర అయ్యాడు, తల్లికి దూరమయ్యాడు. ఓ రేప్ చేసి విచారణ సమయంలో బెయిల్ మీద బయటకు వచ్చిన అతను అతను సమాజానికి భయపడి దాక్కోవడానికి ఓ అనామక స్థలంలో సెక్యూరిటీ గార్డుగా చేస్తూ ఉండేవాడు. అక్కడ ఓ స్త్రీ భర్త లేకుండా కొడుకు సాగర్ తో ఉంటుంది.
ఈ కథలో రేపిస్టుల పట్ల విపరీత ఆగ్రహాన్ని ప్రదర్శించే ఇదే సమాజం స్త్రీ మోసపోతే మాత్రం ఆమెను కూడా అదే రీతిలో పొడుస్తూ ఉంటుందన్న సత్యాన్ని ఈ కథకు ఇంకో కోణంగా రచయిత రాశారు. ఆ కోణానికి వర్తించే స్త్రీ పాత్ర సాగర్ తల్లి సత్యది. ఆమె తల్లిదండ్రులు కమ్యూనిస్టులు, కులాంతర వివాహం వారిది. అంటే ఆదర్శాలు ఉన్నవారు. సత్య ఒకరిని నమ్మి మోసపోయి బిడ్డను కన్నది. కానీ సమాజానికి భయపడి ఎవరికి తెలియకుండా ఆ బిడ్డను కని, అపరిచిత ప్రాంతంలో పెంచుతుంది. అటు రేప్ చేసి తప్పు చేసినా రేపిస్టు, ఇటు మోసానికి గురైన స్త్రీ ఇద్దరూ కూడా సమాజానికి భయపడటం అన్నది, సమాజ విలువల్లో, స్పందనల్లో, స్వీకరింపుల్లో ఉన్న ద్వందకోణాన్ని రచయిత పరోక్షంగా ప్రశ్నించడమే. ఈ రెండు కోణాలు ఈ కథలో జోడిస్తూ సామాజిక స్వరూపాన్ని, ఈ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో అలాగే వ్యక్తిగత స్థాయిలో కూడా విశ్లేషించే పరిచయం చేశారు కనుకే ఈ కథకు సామాజిక ప్రయోజనత్వం ఉందని భావించవచ్చు.
సాగర్ తో పరిచయం పెంచుకున్న రేపిస్ట్, అతన్ని తండ్రి లేడని సమాజం ఏడిపించడం గమనించి తానే తండ్రినని చెప్పి మొత్తానికి ఆ ఇంట్లో పాగా వేస్తాడు. అక్కడ ఆమె బయటి లోకానికి అతన్ని సాగర్ తండ్రిగా, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అతన్ని పని వాడు మరియు జీతగాడిగా చూడటంను ఆ రేపిస్ట్ మనసులోనే ఆ ద్వంద కోణాన్ని ప్రశ్నిస్తాడు.
ఈ కథలో రేపిస్ట్ పాత్ర ద్వారా రచయిత అడిగిన ప్రశ్నలు తప్పకుండా పాఠకులను ఆలోచింపజేస్తాయి.
‘మన దేశంలో వ్యక్తులు లేరు. సామాజిక జంతువులు తప్ప. మనకి గతం తప్ప భవిష్యత్తు లేదు. మన గతాన్ని రాజకీయ సంపదగా మార్చుకునే వ్యాపారులు తప్ప మన భవిష్యత్తు గురించి ఆలోచించే నేతలు లేరు.
సైన్యాలు పరదేశాలకు వెళ్ళి చేసే రేపులూ ... జాతులు పరజాతుల మీద కసితో స్త్రీలని జాతి సంపదలుగా పరిగణించి వారి శరీరాలపై చేసే రేపులూ...సామాజిక అసమానతల సమాజంలో తక్కువగా పరిగణించిన కులాల స్త్రీలపై అందుబాటులో ఉన్న వీధివార మొక్కలను పీకినట్లుగా...ఎవరికీ చెందని స్థలాలలోని చెట్లపై కాయలు కొట్టుకున్నంత సులభంగా...తమను తాము పెద్ద కులాలుగా...సంస్కారవంతమైన కులాలుగా భావించేవారు జరిపే రేపులూ ...అధికారాన్ని ప్రదర్శించదడానికి భయోత్పాతం కలిగించడానికి చేసే, చేయించే రేపులూ... ఎన్నో ఎన్నెన్నో. అన్నీ సామాజిక కారణాల వల్లే జరుగుతాయి. పెళ్లాలను ఇళ్ళల్లో వదిలి నగరాల్లో, విదేశీ గడ్డల పైనా రొట్టె కోసం..రొట్టె మీద వెన్న కోసం పరుగులెత్తించితే... అక్కడా ఇక్కడా మృగాళ్ళు ఒంటరి ఆడాళ్లపై జరిపే రేపులూ సామాజిక కారణాలే కదా...మూఢ నమ్మకాలతో జరిగేవి సామాజిక కారణాలే కదా ... ఈ రేపుల సంఖ్య ముందు .... వ్యక్తిగత కారణాలతో...విశృంఖలత, పెర్వర్షన్ లతో జరిగేవి సంఖ్యాపరంగా ఎన్ని? మంచిగా బ్రతికే అవకాశం ఇచ్చే సమాజం ...ప్రపంచం ఉంటే, మనం ఏర్పరచుకోగలిగితే ఇన్ని రేపులు జరుగుతాయా..!
చిట్టచివరగా ఒక ప్రశ్న...ఉన్న స్థితిని ప్రశ్నించే ధైర్యం గల మీరూ, మీ అమ్మ నాన్నగార్లూ ,మీలాంటి ఎందరెందరో...ప్రశ్నింపజేసిన జ్ఞానానికి తగిన ధైర్యంతో జీవించలేరెందుకు? నేరం చేసిన నాలాంటి వాళ్లలా దాక్కుని బ్రతుకుతారెందుకు? మీ ధైర్యమంతా వ్యవస్థలోని లోపాలనూ, తోటి వ్యక్తులలోని లోపాలనూ ఎత్తి చూపడానికి వినియోగించినంతగా మీలోని మిమ్మల్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఎందుకు వినియోగించరు?’
మొదట రేపిస్ట్ గా మాత్రమే ఉన్న పాత్ర సత్య వ్యక్తిత్వంతోనూ,ఆ ఇంట్లో ఉన్న లైబ్రరీ తో అనుబంధం వల్లనూ, తన గురించి తాను ఆలోచించుకునే మూలం సత్యతో సంభాషణల వల్ల ఏర్పడటం వల్లనూ, చివరికి అసమానతలు, పేదరికంతో పెరిగిన తండ్రి పెద్ద అధికారిగా, సంపాదనాపరుడిగా మారాక, తాను అనుభవించనివి కొడుకుకు ఇవ్వాలనే తపనలో మంచి చెడు మధ్య వ్యత్యాసం గుర్తించలేకపోవడం గురించి కూడా ఇదే రేపిస్ట్ పాత్ర ఆలోచించగలిగింది. ఆ తండ్రి ఎదుర్కున్న అసమానతల ప్రభావం కూడా ఇలా ఓ కొడుకు భవిష్యత్తును మార్చింది. ఓ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేని వ్యక్తి మనసు ఏదో రకంగా తృప్తి పొందే దశలో ఏదో స్థాయిలో అదే అన్యాయానికి, అసమానత్వానికి దోహదకారిగా కూడా మారుతుంది అన్న భావనను కూడా రచయిత పరోక్షంగా స్పష్టం చేశారు ఈ కథలో.
ఓ దొంగతనం చేసిన వ్యక్తి తనకు శిక్ష పడి, హత్య చేసిన వాడికి శిక్ష పడనప్పుడు తన కన్నా అతని తప్పు పెద్దది కనుక తన తప్పును ఆ పెద్ద తప్పుతో పోల్చుకుని తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఈ కథలో ఆ రేపిస్ట్ తన తప్పు చిన్నది అని సమర్ధించుకునే కోణంలో చెప్పినా, ఈ స్థాయిని మించి అజ్ఞాతంగా జరిగిపోతూ, కాలంతో పాటే కప్పబడిపోతున్న రేపుల గురించి చెప్పడం నిజంగానే ఏ స్థాయిలో ఎలా చేస్తే ఈ సమాజం దృష్టి నుండి తప్పించుకోవచ్చు అనే స్పష్టత ఇంత కన్నా పెద్ద స్థాయిలో జరిపే వారికి ఉన్నదన్న భావన కూడా కలుగుతుంది. అలాగే జ్ఞానానికి ధైర్యం ఆసరాగా లేకపోతే ఒప్పు కూడా తప్పుగానే మారిపోతుందన్న హెచ్చరిక సత్య పాత్ర ద్వారా పరోక్షంగా చేశారు రచయిత. ఈ కథలో ఆ రేపిస్టులో వచ్చిన మార్పు వల్ల తల్లికి దగ్గర అవ్వాలనుకోవడం, లొంగి పోయి శిక్ష అనుభవించాలి అనుకోవడం అన్నది కూడా అతనికి ఆ జ్ఞానం ఇచ్చిన ధైర్యం వల్లే అని అదే మూలంగా చెప్పడం ఈ కథకు కొసమెరుపు. జ్ఞానం పిరికివాడి కన్నా, ధైర్యవంతుడికే ఆలంబన అవుతుందన్న అంశం ఈ రెండు పాత్రల మధ్య ఉన్న ద్వంద వైఖరి ద్వారా స్పష్టం అవుతుంది. కథను స్వగతంగా, విస్తృత పరిధిలో చర్చ ద్వారా, ప్రశ్నల ద్వారా, ఎక్కడ అనవసర వాఖ్యానాలు లేకుండా అవసరాన్ని గుర్తించి రాయడం వల్ల ఈ కథ నిజంగానే విశిష్ట కథ. ‘రేప్’ అంశం మీద వచ్చిన కథల్లో నేను చదివిన వాటిల్లో మూల మనస్తత్వాన్ని అన్ని స్థాయిల్లో విశ్లేషిస్తూ, భావోద్వేగాలకు లొంగిపోకుండా, సమన్వయంగా రాసిన కథ ఇదే. సామాజిక ప్రయోజనాన్ని, ఆలోయిచింపచేసే శైలిని దృష్టిలో పెట్టుకుని ఈ కథను రాసిన రచయిత వివినమూర్తి గారికి ఈ సందర్భంగా అభినందనలు.
* * *

Comments
Post a Comment