విలువల కర్మలు

 విలువల కర్మలు

-శృంగవరపు రచన



ఎలా పుట్టాయో
ఎప్పుడు పుట్టాయో
ఎందుకు పుట్టాయో
విలువలు
ఎప్పుడూ కొత్తగా
పుడుతూనే ఉన్నాయి!
కాలంతో-మనుషులతో
తెలివితేటలతో-సిద్ధాంతాలతో
మతంతో-మానవత్వంతో
స్వార్ధంతో-శాంతితో
పేదరికంతో-పెద్దరికంతో
బలంతో-వ్యసనంతో
అవసరాలతో-అవకాశాలతో
మమేకమైవుతూ
విలువలు మరణిస్తూ
జన్మిస్తూ
కాలభ్రమణంలో
చక్కర్లు కొడుతూనే ఉన్నాయి!
కురచ బట్టల్లో
ఒకడు వాటిని
కుదిస్తే
తలెత్తిన గౌరవమై
క్రీడా స్ఫూర్తి
పతకమై తిరిగి వచ్చాయి!
నోట్ల సవ్వడిలో
ఇంకొకడు వాటి
శృతి తప్పిస్తే
హోదాను-స్థాయిలను
వర్గాలతో మార్చుకుంటూ
ఒకేసారి పుడుతూ
వందల సార్లు మారిపోతూ
చంచలిని అంశలుగా
అవతరించాయి!
కొందరికి
మానసికంగా మనిషిని
హత్య చేసే
ఆయుధమయ్యాయి!
ఇంకొందరికి
బలహీనతలను జయించే
మార్గమయ్యాయి!
మతంలో మత్తుమందుగా
మనుగడలో మార్పుగా
ఇమిడిపోయాయి
సామాజిక-సైద్ధాంతిక
సంఘర్షణలో!
పోయేదేముంది
కనిపించని మనఃసాక్షితో
మాత్రమే ముడిపడిన
రూపం లేని విలువలు
సాక్ష్యులు లేని
లోకంలో
సాక్షులు ఉండే
రూపంలోకి మారిపోతుంటే!
నిందించడానికి
ఎవరో ఒకరు
ఉన్నంతకాలం
విలువలు అదృశ్య స్వరూపాలే!
కర్మభూమిలో
తమ కర్మను
మనసు కనిపించదని
కనుగొన్న సాంకేతిక
మర మనుషుల
మెదడుల్లో
అవసరం మేరకు
ఉత్పత్తి అయ్యే
ఇందనంలా పుట్టేసాక
ఎలా ఉంటే మాత్రం
వాటికి విలువేముంది!
మనుషుల కర్మను
అనుభవించడానికి
జన్మించే విలువలు
స్వేచ్చ లేని
మానవత్వానికి మందిరాలు!
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ