మెప్పించలేని మనిషి
మెప్పించలేని మనిషి
-శృంగవరపు రచన
మనిషి జీవితంలో ప్రతి దశలోనూ క్రమశిక్షణ,పెద్దల మీద గౌరవం,మంచి భవిష్యత్తు ఇలా ఏదో ఒక పేరు మీద ఇతరులతో వినయంగా ఉండటం,ఇతరులను ఏదో ఒక దశలో మెప్పించేలా ఉండగలగడం మంచి మనిషికి ఒక లక్షణంగా అలిఖిత సామాజిక రాజ్యాంగం స్పష్టం చేసింది. వయసు,అనుభవం రీత్యా మనుషులను,వారి పనులను,వారి హోదాలను అనుసరించి గౌరవించాలని పైకి చెప్పినా పరోక్షంగా వారి అహాలు దెబ్బ తినకుండా,ఇగో ఫీడ్ కు ఉత్పత్తుల్లా మారడం తప్పనిసరి అని కూడా స్పష్టం చేసినట్టే. అలా జీవించలేకపోతే ఆ స్థాయి వారు ఎలా తమ బలహీన మనస్తత్వాలలో బలాన్ని చేకూర్చుకుంటారో,అటువంటి వ్యవస్థలో విద్యా-గురువులతో అటువంటి ముసుగులో ఉండలేక విద్య విషయంలో లోటు లేకపోయినా,వివేకం ఎక్కువైన ఓ మెడికో జీవితం ద్వారా స్పష్టం చేసే నవలే కేశవరెడ్డి గారి ‘సిటీ బ్యూటిఫుల్.’
ఈ నవలలో ముఖ్య పాత్ర దేవీదాస్. అతను ఓ మెడికల్ స్టూడెంట్. అతన్ని అందరూ దేవదాస్ గానే పిలుస్తారు. ఈ విషయం గురించి కూడా రచయిత ప్రస్తావించడానికి కారణం ప్రతి మనిషికి ఉండే ప్రత్యేకతల్లో ఒకటి అతని నామధేయం కూడా. కానీ సమాజ స్వరూపంలో సమాజం తనకు తెలిసినాదానితోనే దేనినైనా గుర్తించే ప్రయత్నం చేస్తుంది. అందుకనేమే దేవదాస్ పేరు ఎక్కువగా అందరికి తెలియడం వల్ల,ఆ అందరే సమాజం కావడం వల్ల అతన్ని అందరూ అతని పేరుతో కాకుండా తమకు తెలిసిన పేరునే అతని పేరుగా భావించి పిలిచేవారు.ఈ సమాజంలో ఎవరికి ఎదుటి వ్యక్తి గురించి తెలియాల్సిన అవసరం లేదు.దేవీదాస్ కు ఉన్న ఇంకో విశిష్టత అతనికి ఎడమ చేతి వాటం ఉండటం. అందరూ అతన్ని ఆ విషయంలో కూడా విచిత్రంగా చూసేవారు. ఈ రెండు లక్షణాలను రచయిత ప్రస్తావించడానికి కారణం దేవీదాస్ లో ఉన్న విభిన్నతలను పాఠకులకు పరిచయం చేయడానికి కావచ్చు.
దేవీదాస్ లో మనలో చాలమందిలో ఉండే విద్యార్ధులను మనం చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ దశలో నేను కూడా అదే రకమైన ఆలోచనాశైలిలో ఉన్నాను. కానీ కొంతమేరకు ఉన్న భయం వల్ల అటెండెన్స్ కు లోటు లేకుండా పోయింది. దేవీదాస్ తెలివైన విద్యార్ధి. మెడికోగా ఇరవై ఏళ్ళ వయసు ఉన్న అతను తనకు ఏ క్లాసు ఉపయోగపడుతుందో తెలుసుకోగల స్పష్టతలోనే ఉన్నాడు. ఏనాడూ ప్రాక్టికల్ క్లాసులు ఎగ్గొట్టింది లేదు.అందులో అతనికి పూర్తి అటెండెన్స్ ఉంది.అలాగే క్లాస్ సబ్జెక్ట్స్ కూడా అతను తన సొంతంగా ఎన్నో రిఫరెన్స్ బుక్స్ తో సహా చదివేశాడు. క్లాస్ సబ్జెక్ట్స్ లో ఏ ప్రశ్నకు అయినా సమాధానం చెప్పగల సత్తా అతనిలో ఉంది. అతనికి ఏనాటమీ థియరీ క్లాసులు నచ్చేవి కావు. నోట్స్ మాత్రం డిక్టేట్ చేసే ఆ బోధనా శైలి అతనికి రుచించలేదు. ఆ నోట్స్ కోసం క్లాసుకు రాకపోయినా పర్లేదని అతను భావించాడు. ఎందుకంటే అదే నోట్స్ సీనియర్స్ నుండి కొనసాగుతూ ఉంది. అంటే ఆ క్లాసు అందరికి నచ్చిందని కాదు కానీ వారంతా భయంతో అయినా క్లాసుకు వచ్చారు. కొందరు క్లాసులో తమకు నచ్చిన పుస్తకం చదువుకున్నారు కూడా. కానీ దేవీదాస్ ప్రత్యక్షంగా క్లాసులకు రాకపోవడం వల్ల కనీసం 20 శాతం అటెండెన్స్ లేకపోవడం వల్ల అతన్ని అనాటమీ ప్రొఫెసర్ సలహాపై ప్రిన్సిపల్ డిటెయిన్ చేశాడు.
ప్రిన్సిపల్ ను అడిగితే ప్రొఫెసర్ ద్వారా మాత్రమే సాధ్యం అది చెప్తాడు. ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళినా దేవీదాస్ ఆ పరీక్ష బాగా రాస్తాడని తెలిసినా,కేవలం తన క్లాసులకు రాకుండా తనను అవమానించడానికి భావించిన ఆ ప్రొఫెసర్ కావాలనే తన ప్రతీకారం అలా తీర్చుకున్నాడని దేవీదాస్ కు స్పష్టమవుతుంది. కాలేజ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎనభై శాతం అటెండెన్స్ లేకపోతే పరీక్ష రాయడానికి వీల్లేదని స్పష్టం చేసిన ఆ లెక్చరర్ దాని ప్రకారమే ముందు వెర్బల్ గా లేదా ఓరల్ గా ఇవ్వాల్సిన రిమైండర్స్ గురించి అడిగితే దానిని పట్టించుకోడు. అది నియమాలకు,క్రమశిక్షణకు సంబంధించింది కాదని కేవలం ఉపాధ్యాయ హోదా ఇచ్చిన అధికారాన్ని,ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగా నిరూపించే అవకాశం అని దేవీదాస్ కు అర్ధమైపోతుంది.
ఆ తర్వాత దేవీదాస్ స్నేహితుడు స్టూడెంట్ యూనియన్ ద్వారా పరిష్కరించే సలహా ఇచ్చినా మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా ఆ యూనియన్ నిలబడలేదని అర్ధమైన దేవీదాస్ వద్దని చెప్తాడు.దేవీదాస్ కు ఉన్న గర్ల్ ఫ్రెండ్ లావణ్య కూడా అతను రాసిన ఓ ఉత్తరం ద్వారానే దూరం అవుతుంది. అతను మనసులో ఉన్నవి ఉన్నట్టుగా తాగి రాసిన ఉత్తరం వల్ల అది జరిగింది. అలా కాకుండా మనసులో అనిపించింది అనిపించినట్టుగా కాకుండా తన చుట్టూ ఉన్న వారిలా ముందు డిగ్రీ వచ్చే వరకు ప్రదర్శించాల్సిన లోక జ్ఞానాన్ని దేవీదాస్ అలవర్చుకుని ఉంటే అతని జీవితం లో లావణ్య,అనాటమీ పరీక్ష రెండు ఉండేవి. కానీ అతను అలా మారిపోతే అతను అతను కాదు. బహుశా దేవీదాస్ మనందరిలో ఉన్న ఇంకో వ్యక్తి. ఆ వ్యక్తిని నిద్ర పుచ్చకపోతే మనం ఈ సమాజంలో అందరిలా ఉండలేము. అలా అందరిలా ఉండటానికే మనలోని ఆ పరిచిత వ్యక్తిని రోజురోజుకి అపరిచితం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము.
ఆ తర్వాత దేవీదాస్ పరీక్ష రోజున స్నేహితుడి మోటార్ సైకిల్ నడుపుతూ యాక్సిడెంట్ కు గురై ఎడమ భుజానికి ఫ్రాక్చర్ కావడంతో హాస్పటల్ లో పడతాడు. అలా అతని మనసు ముక్కలైనట్టే శరీరం కూడా కుదుపుకు లోనవ్వడంతో నవల ముగుస్తుంది. విద్య లక్ష్యం వినయం,సంస్కారం కూడా నేర్పించడం అయితే ఆ విద్యార్ధి కేవలం విద్యాలయాల వరకే పరిమితమా? ప్రతి మనిషి ఆ సంస్కారం,వినయం ముసుగులో తనదైన వ్యక్తిత్వాన్ని భవిష్యత్తులో కించపరచుకోవడానికి సిద్ధపడాలా? ఏమో ...ఇలాంటి ఎన్నో ప్రశ్నలను పాఠకులకు వదిలేసి ఈ నవలను ముగించారు రచయిత. ఇంత చిన్న నవలలో మనిషిలో ఉండే ద్వంద సంఘర్షణను ఎంతో చక్కగా ఆలోచింపజేసేలా స్పష్టం చేశారు కేశవరెడ్డి గారు.
* * *
.jpg)
Comments
Post a Comment