మధ్యతరగతి స్త్రీ
మధ్యతరగతి స్త్రీ
స్త్రీ వాద రచనల కాలం పూర్తిగా సాహిత్యంలో ప్రాధాన్యత సంతరించుకోకముందే అర్నాద్ (డి.హరనాథ్ రెడ్డి) గారు 1984 లో ‘ఈ తరం స్త్రీ’ నవలను రాశారు. మధ్యతరగతి స్త్రీల జీవితంలో ఉండే ఇబ్బందులను, శీలం స్త్రీలకు మాత్రమే అన్న మనస్తత్వం మధ్యతరగతి వర్గంలో ఎక్కువగా ఉన్న భావనను, మధ్యతరగతి భర్తల విచిత్ర మనస్తత్వాలను, భార్యల పట్ల, పరాయి స్త్రీల పట్ల వారికి ఉండే భావనల గురించి, ఉద్యోగినులైన స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఏ మాత్రం స్వేచ్చను, సమానత్వాన్ని అనుభవించలేని పరిస్థితులను, ఆ స్వేచ్చ కావాలని అనుకుంటూనే దాని కోసం ముందడుగు వేయలేని భార్యల గురించి, ఆ స్వేచ్చను అర్ధం చేసుకుని, దాని పట్ల స్పష్టతతో ముందుకు సాగిన స్త్రీ జీవితం, ఇలా మధ్యతరగతి వర్గంలో ఉద్యోగినులు అయిన స్త్రీల కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత ప్రాధాన్యతలను, భార్యాభర్తలిద్దరిలో ఉండే ద్వంద వైఖరిని కూడా ఈ నవలలో స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.
ఈ నవలలో ముఖ్య పాత్రలు మూడు జంటలు అంటే ఆరు పాత్రలు. చెలం, విజయ దంపతులు. రవి, సుజాత దంపతులు. ఛాయ, రాంబాబు దంపతులు కారు కానీ దేహ సంబంధం, స్నేహం కలవారు. ఈ మూడు జంటల జీవితాల ద్వారా దాదాపుగా మధ్యతరగతి భార్యాభర్తల సంబంధాన్ని రచయిత ఎంతో చక్కగా చిత్రీకరించారు. చెలం తల్లి పార్వతమ్మ. ఆమె ముందు తరం మనిషి. ఆమె భర్తకు ఎంతో మంది స్త్రీలతో సంబంధం ఉండేది. అలాగే భార్యను చావతన్నేవాడు. ఆమె చదువుకోలేదు, ఆర్థిక స్వాతంత్ర్యం లేదు. ఆమె దృష్టిలో భర్త అంటే సగటు మగవాడి స్వరూపానికి ప్రతిరూపం. అందువల్ల ఆమెకు భర్త భార్యను కొట్టడం, ఇతర స్త్రీలతో సంబంధం కలిగి ఉండటం సహజమని ఆమె అభిప్రాయం. సమాజంలో స్త్రీకి పురుష స్వభావంపై ఓ అభిప్రాయం, ఆమోదం కలగడానికి మూలం ఆమె తండ్రి, భర్త లాంటి వారి నుండే కలుగుతుంది. స్త్రీ విద్యావంతురాలైతే,ఆ అభిప్రాయాలకు,ఆమోదాలకు ఆమె విద్యా సంస్కారం కూడా తోడవుతుంది. చెలం మధ్యతరగతి వాడు. చెలం, విజయ ప్రేమించి వివాహం చేసుకున్నారు. విజయ కూడా ఉద్యోగిని.
విద్య, ఉద్యోగరీత్యా వీరిద్దరికి సమాన అర్హతలు ఉన్నా, చెలంలో భార్య భర్తకు మాత్రమే సొంతమని, ఆమెను ఆస్తిలా భావించే స్వభావం ఉంది. కానీ విజయ అంటే ఎంతో ప్రేమ ఉంది. మొదట వారిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉండేది. ఒకరితో ఒకరు సమయం గడిపే కాలం కూడా ఎక్కువే. వారిద్దరికి ఒక్కడే కొడుకు సందీప్. బాగా సంపాదించాలన్న ఆశ చెలంలో పెరిగిపోయింది. దాని కోసం ఉద్యోగంతో పాటు ఇంకో వైపు స్థలాలు తక్కువకు కొని, అక్కడ ఫ్లాట్లు వేసే వారికి అమ్ముతూ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా మారిపోయాడు. బాగా సంపాదిస్తూ, ఇంట్లో ఎన్నో సౌకర్యాలు అమరుస్తూ ఉండేవాడు. విజయ కూడా కొంతకాలం ఆ సౌకర్యాలు,ఆస్తులు తెచ్చే సౌఖ్యాలకు అలవాటు పడి, సంతోషించింది. కానీ క్రమక్రమంగా ఆమెకు వాటి కన్నా భర్తతో రోజు సమయం గడపటమే ముఖ్యంగా భావించింది. కానీ అప్పటికే చెలం పూర్తిగా సంపాదన తప్ప ఏమి పట్టని స్థితిలో మునిగిపోయాడు. ఈ విషయం వల్లే ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతూ ఉండేది.
సుజాత ఉద్యోగరీత్యా హైదారాబాద్ లో ఉంటే, రవి వైజాగ్ లో ఉంటాడు. వారికి ఇద్దరు చిన్న పిల్లలు శిరీష, సురేష్. వారిద్దరి మధ్య ఉన్న దూరం వల్ల ఇద్దరికీ శారీరక, మానసిక అసంతృప్తి ఉంది. సుజాతకు ఉద్యోగం వదిలేసి పిల్లలతో సహా భర్త దగ్గరకు వచ్చేయాలని ఉన్నా, రవికి సుజాత జీతం వదులుకోవడం ఇష్టం లేదు. అందుకని సుజాత మాట దాటవేస్తూ ఉంటాడు. రవి పనిమనిషితో సంబంధం పెట్టుకుంటాడు.
ఛాయకు తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. తండ్రి రిటైర్ అయిపోయాక, కుటుంబ బాధ్యత ఛాయ మీద పడింది. ఛాయ సంపాదన వదులుకోవడం ఇష్టం లేక, ఆమెకు వచ్చే సంబంధాలు ఆమె తల్లిదండ్రులే చెడగొట్టి, ఆమెకు వివాహం కాకుండా చూస్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నాక ఆమెకు అప్పటి వరకు ఉన్న సమాజ నీతి నియమాల మీద నమ్మకం పోతుంది. వివాహం మీద విముఖత ఏర్పడుతుంది. ఆమె దృష్టిలో పురుషుడు కేవలం సుఖం కోసం, స్నేహం కోసం మాత్రమే. వివాహం పేరుతో ఒకరి మీద ఒకరికి వచ్చే హక్కులు,అధికారాలు అంటే ఆమెకు ఇష్టం లేదు. ఆమెకు ఆమె ఆఫీసులో పని చేసే వివాహితుడు అయిన రాంబాబుతో ఏర్పడిన స్నేహం, శారీరక సంబంధం వరకు విస్తరించింది. వీరిద్దరి మధ్య సంబంధం బాహాటంగానే సాగింది. సమాజానికి భయపడలేదు ఛాయ.
చెలంకు సర్కిల్ పెరిగింది. హై కల్చర్ క్లబ్స్ కు తిరిగే చెలం తన భార్యను మాత్రం ఆ కల్చర్ లోకి రానివ్వకూడదనే అనుకుంటాడు. మొదట చెలం మాత్రమే లోకమనుకుని బ్రతుకుతున్న విజయ ఛాయ సలహాపై బిజీ అవ్వడానికి ఆఫీసులో కల్చరల్ యాక్టివిటీస్ లో పని చేస్తూ ఉంటుంది విజయ. విజయ తన కోసం ఎదురు చూసినప్పుడు ఆమె తనకు అడ్డు పడుతుందని భావించిన చలం ఎప్పుడైతే ఆమె తన లోకంలో తాను బిజీగా ఉంటుందో ఆమె తన ఉనికికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బాధ పడుతూ ఉంటాడు. వ్యాపార స్నేహితుడు అయిన కనకరాజు భార్య హైమ వైపు ఆకర్షితుడు అవుతాడు. ఓ సాయంత్రం కనకరాజు కోసం అతని ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో అతను ఇంట్లో ఉండకపోవడం, హైమ ఉండటం, వారిద్దరూ ఒక్కటవ్వడం, అనుకోకుండా కనకరాజు, విజయ అది చూడటం జరుగుతుంది. ఈ విషయం మీద గొడవపడి విజయ చెలాన్ని వదిలేసి వెళ్లిపోతుంది కంపెనీ క్వార్టర్స్ లో విడిగా ఉండటానికి. సందీప్ ను మాత్రం విజయకు ఇవ్వడు.
ఇక సుజాత ఉద్యోగం మానేసి భర్త దగ్గర ఉందామని వచ్చినా, ఆమెకు ఇంకో సంబంధం ఉందని బయటపడటంతో ఇద్దరికీ గొడవ అవ్వటం,ఆమె హైదారాబాద్ తిరిగి వెళ్లిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమెను ఏడిపించటానికి పిల్లలను తన దగ్గరకు తెచ్చుకున్నా, వారిని పెంచలేక ఆమె దగ్గరకే పంపేస్తాడు రవి. ఇక ఛాయ రాంబాబు వల్ల గర్భవతి అవుతుంది. రాంబాబుకి ఆడపిల్లలే తప్ప మగసంతానం లేదు. ఛాయను వివాహం చేసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. గర్భ నిరోధక మాత్రల విషయంలో ఛాయను మోసం చేసి ఆమెకు గర్భం వచ్చేలా చేస్తాడు. అలా అయినా ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఛాయ అందుకు ఒప్పుకోదు. బిడ్డను కంటుంది. ఆమె గర్భవతి అయితే పరువునష్టంగా భావించి ఆమె ఇంటి నుండి వెళ్లిపోయేలా చేసిన ఆమె కుటుంబం నెలా నెలా ఆమె జీతం మాత్రం తీసుకుంటూనే ఉన్నారు. చివరకు సుజాత, రవి ఒకటవుతారు. ఛాయ వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకుని రాంబాబు ఆమెకు స్నేహితుడిగానే మిగిలిపోతాడు. ఇక చెలం వ్యాపారంలో శత్రువుల దాడి వల్ల మరణిస్తాడు. ఇంతటితో నవల ముగుస్తుంది.
మద్యతరగతి స్త్రీల మనస్తత్వంలో ఆర్థిక స్వాతంత్ర్యం వల్ల కొంతమేరకు తమ వ్యక్తిగత జీవితంలో స్వేచ్చను, తమ వ్యక్తిత్వ ఉనికిని అర్ధం చేసుకుని, ప్రశ్నించగలిగే తత్వం ఉన్నప్పటికీ, ఆ ఆలోచనలు భర్తతో విడిపోయేంత వరకు మాత్రం పయనించలేవు. దీనికి నిదర్శనమే సుజాత, విజయ పాత్రలు. చదువుకున్న మగవాడైనా సరే భార్యను ఆస్తిగానే భావించడం మధ్యతరగతి వర్గంలో ఎక్కువ ఉంటుందన్న భావనను రచయిత ఈ నవలలో బలపరిచారు. ఛాయ సమాజానికి వ్యతిరేకంగా పయనించినా చట్ట రీత్యా తన హక్కులు కాపాడుకుంటూ, ఎవరిని పట్టించుకోకుండా, తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే ధైర్యం ఉంది. ఉద్యోగినులుగా ఉన్నా సరే స్త్రీ మనస్తత్వం, పురుషుడి మనస్తత్వం ఒకలానే ఉండిపోతాయని, దిగువ ,ఎగువ వర్గాల్లో కాస్త తెగించే తత్వం ఉన్నప్పటికీ కూడా మధ్యతరగతి వ్యక్తిత్వాల్లో ధైర్యంగా సమాజాన్ని దాటి పయనించే మనుషులు అరుదని ఈ నవల స్పష్టం చేస్తుంది.
పురుషుడు తప్పు చేసినప్పుడు దొరికిపోతే తనను తాను సమర్ధించుకుంటే, స్త్రీ మాత్రం కొంత భయపడుతుంది. ఇద్దరికీ వారి వారి కారణాలు ఉన్నప్పటికి, కొంత పురుష స్వామ్యంలో భార్యల కన్నా తమకే ఆ సంబంధంలో ఆధిపత్యం ఉందని భర్తలు భావించడం జరుగుతూ ఉంటుంది. ఈ నవలలో మధ్యతరగతి భార్యాభర్తల మనస్తత్వాలను ఈ మూడు జంటల ద్వారా రచయిత ఎంతో చక్కగా చెప్పారు.
* * *

Comments
Post a Comment