సింపతీ కార్డ్
సింపతీ కార్డ్
-శృంగవరపు రచన
మనిషి మనుగడ క్రమంలో అనుబంధాలు ఏర్పడ్డాయో,అనుబంధ బంధనాల మధ్య ‘ఊపిరాడనితనం’తో మమేకమై,మనుగడ రూపాంతరం చెందిందో తెలియదు కానీ, ఈ రెండింటి మధ్య మనిషి ‘అనేక స్థాయిల్లో ఆశించి చేయడాన్నే’ సహజమైన జీవన పరిణామ క్రమంగా భావిస్తున్నాడు.
* * *
‘హలో ....పెదనాన్నా ....నేను ... గోపాల్ ని ‘
‘ఏమైందిరా? అంతా క్షేమమేనా?’
‘నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది. బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. హాస్పటల్ లో చేర్చాను. ఇంకా టెస్టులు చేస్తున్నారు. హాస్పటల్ లో వారం రోజులు ఉంచాలన్నారు. దాదాపు లక్షన్నర ఖర్చు అయ్యేలా ఉంది. ఓ యాభైవేలు సర్దగలరా?’
‘నేను పంపుతాను లేరా .... నాన్నకు ఓసారి ఫోన్ ఇవ్వు’
గోపాల్ తండ్రికి సైగ చేసి ఫోన్ అందించాడు.
‘హలో ....ప్రసాదూ... ‘
‘అన్నయ్యా ...నొప్పి భరించలేకపోతున్నాను. కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. బీ.పీ, షుగర్ ఎక్కువయ్యాయి. బ్రతికి వీడికి భారమై, హాస్పటల్ ఖర్చులు పెంచడం తప్ప ప్రయోజనం ఏముందన్నయ్యా?’ ఏడుస్తూ మాట్లాడుతున్న తమ్ముడిని మధ్యలోనే ఆపి, ‘మేమంతా లేమురా నీకు...దిగులు పడకు...ఏం కావాలన్నా మేము చూసుకుంటాము....ఎక్కువ ఆలోచించకు. గోపాల్ కి ఫోన్ ఇవ్వు’
తండ్రి అందించిన ఫోన్ అందుకున్నాడు.
‘ఒరేయ్ ...నాన్నను బాగా చూసుకో... డబ్బుల గురించి ఆలోచించకు’
జాగ్రత్తలు చెప్పి కాల్ ముగించాడు ఆ పెదనాన్న.
* * *
ఆ తండ్రికొడుకులు అటువంటి పెదనాన్నలకు,బాబాయిలకు, ఇంకా ఎందరో బంధువులకు కాల్స్ చేశారు. మొత్తానికి ఆ ఉదయం వంద రూపాయలు ఉన్న బ్యాంక్ బాలన్స్ ను సాయంత్రానికి రెండు లక్షలుగా మార్చారు ఆ ఇద్దరూ ‘రోగం-నిస్సహాయత’ లను పెట్టుబడిగా మార్చి.
‘ఒరేయ్ ....ఇంకెంతకాలం నేను పేషంట్ లా ఉండాలిరా?’
‘డాక్టర్ ని కలిసి వస్తాను నాన్నా ...’
పేషంట్ వార్డులో తండ్రిని వదిలివెళ్ళాడు గోపాల్.
* * *
‘మీ నాన్నగారికి ప్రమాదకరమైన దెబ్బలు ఏమీ తగలలేదు. అయినా ఆయన్ని ఎందుకు వారం రోజులు హాస్పటల్ లో ఉంచి. లేని రోగానికి వైద్యంగా బ్యాండెజ్,వాకింగ్ స్టిక్, ఎక్విప్ మెంట్ లను కూడా ఏర్పాటు చేయమంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. నేను డాక్టర్ నని మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది’ తీవ్ర స్వరంతో అన్నాడు డాక్టర్.
‘డాక్టర్ గారూ... ఈ వారం రోజులు మా నాన్నకు ఖరీదైన వైద్యం అవసరం. మీకు కూడా అది లాభమే’ డీల్ ను క్లోజ్ చేస్తున్న వ్యాపారిలా చెప్పాడు గోపాల్.
వైద్యం చేయకుండా డబ్బులు ఇస్తాననే రోగిని ఏ డాక్టర్ కాదనగలడు! అటువంటి డీల్ ఆ డాక్టర్ కి కూడా లాభసాటిగానే అనిపించింది.
* * *
ఆ వారం రోజులు దగ్గరలో ఉన్న బంధువులు వస్తూ పోతూనే ఉన్నారు. ఆ నాన్న అధిక మోతాదులో బాధను జీవిస్తూనే ఉన్నాడు. ఆ వచ్చినవారు ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు. వారం రోజుల తరువాత హాస్పటల్ ఖర్చులు పోనూ ఐదు లక్షలతో ఇంటికి తిరిగి వచ్చారు ఆ తండ్రికొడుకులు.
* * *
‘అమ్మా ...తాతయ్య సంవత్సరానికి రెండుమూడు సార్లు హాస్పటల్ లో ఎందుకు ఉంటాడు?’ అడిగింది గోపాల్ కూతురు తల్లిని.
‘నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవడానికి,స్కూల్ కి వెళ్ళడానికి, ఇల్లు గడవటానికి డబ్బులు కావాలి కదా!అవి సంపాదించడానికి తాతయ్య హాస్పటల్ కి వెళ్ళాలి.’
‘అంటే తాతయ్య ఉద్యోగం చేస్తాడా?’
‘అటువంటిదే అనుకో. తాతయ్య మీద ప్రేమ ఉన్నవాళ్ళు తమ ప్రేమను ఆర్థికంగా ప్రదర్శించడానికి ఈ ఉద్యోగం అవసరం.’
‘ఏమో అమ్మా ......నాకేం అర్ధం కావడం లేదు’
‘అర్ధం కాకపోతేనే మంచిదమ్మా!”అంది తల్లి ముభావంగా.
* * *
‘మీరు చేస్తుంది ముమ్మాటికి తప్పే”గట్టిగా అంది గోపాల్ భార్య.
‘ ఏది తప్పు? మా పెదనాన్నలు,బాబాయిలు అందరూ కోట్లు సంపాదించి పిల్లలకు ఇస్తే మా నాన్న ఉన్న ఆస్తులను అమ్ముకుని దారిద్రాన్ని,అప్పుల్ని నాకిచ్చాడు. ఈ దరిద్రం భరించలేకే అమ్మ పోయింది.
నైతికంగా నేను చేసే దాని గురించి నేను ఆలోచించడం లేదు. నాన్న ఖర్చులు వెళ్ళిపోవాలి,మన కుటుంబం గడిచిపోవాలి. అంతే!ఇదంతా నేను నాన్నకు ఇష్టం లేకుండానే చేస్తున్నాననుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆయనకు ఆకలితో నిజాయితీగా ఉండటం ఇష్టమా?ఏదైనా సరే, సుఖంగా జీవితం గడిచిపోవడం ఇష్టమా?
మనిషి ఎందుకు కోట్లు సంపాదించాలనుకుంటాడు? ఎందుకు పదవులు కోరుకుంటాడు? తన గొప్పతనాన్ని, తన ప్రమేయాన్ని ఇతరుల జీవితాల్లో నిరూపించుకోవడానికే కదా! ఒకే కడుపున పుట్టినవారు కూడా ఒకరితో ఒకరు పోల్చుకుంటూ,తాము మెట్లు ఎక్కుతూ క్రింద ఉన్నవారికి వారి స్థాయిని గుర్తి ఉంటారు. ‘అవసరాలు-ఇబ్బందులు’ పేరుతో ఆ పై మెట్టు మీద ఉన్నవారిని సాయం అడిగినప్పుడల్లా తమ స్థాయి కన్నా అడిగినవారు, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారో వారికి తెలియజేసి, వారి గొప్పతనాన్ని, ప్రమేయాన్ని ‘సహృదయత-సాయం’ పేర్లతో నిరూపించుకునే అవకాశం వారికి వస్తుంది. అటువంటివారి ఆహాన్ని,ఆధిక్యతను ఆమోదిస్తూ, వీలైనప్పుడు పెంచుతూ, ‘ఆత్మగౌరవం,ఆత్మాభిమానం’ అనే విలువ లేని మా జీవిత అంశాలకు నేను,నాన్నా ‘సింపతీ కార్డ్’ తో ఆర్థిక విలువ ఏర్పడేలా చేస్తున్నాము.
ఏ మనిషి లాభం లేకుండా ఏ పని చేయడు. వారి మనసుల్లో ఏదో సంతృప్తో, సాయం చేస్తున్నామన్న భావనో,వీరి కన్నా మేము బాగున్నాము అనే చులకనో, మా వల్లే వీళ్ళు బ్రతుకుతున్నారన్న గర్వమో,చేసింది ఏదో రూపం లో తిరిగి వస్తుందన్న ఆశించే మనసో ....ఏదో ఒకటి మనిషిని ఇతరుల పట్ల ఉదారత,జాలి చూపించేలా చేస్తుంది’ అని భార్యకు ఆ భర్త ‘సింపతీ కార్డ్’ సిద్ధాంతోపదేశం చేసాడు.
* * *
Comments
Post a Comment