మరవకూడని సందర్భం

  మరవకూడని సందర్భం

-శృంగవరపు రచన


‘కవిత్వం వాస్తవ యదార్ధం. అది జీవిత మూలంలోనే ఉంది. గడ్డ కట్టిన ముద్దగ పేరుకుపోయిన సమాజ చరిత్రయే కవిత్వం. ప్రకృతి పోరాటంలో మానవుని ఆవేశాల స్వేదమే కవిత్వం. మానవుని శ్రమావేశాల సమాహారమే కవిత్వం’, అని ‘భ్రమ-వాస్తవం’(కవిత్వమూలాల అధ్యయనం) పుస్తకంలో క్రిష్టో ఫర్ కాడ్వెల్ రాశారు. అటువంటి ప్రకృతితో మానవుడు కరోనా సమయంలో చేసిన పోరాట స్థాయిని వ్యక్తిగత-సామాజిక స్థాయిల్లో స్పష్టం చేసేందుకు మధుకర్ వైద్యుల గారు తన బాధావేశ స్వేదంగా మలచిన కవిత్వమే ‘వలపోత.’ ‘నా హృదయం సంక్షోభించిన ప్రతిసారి కవిత రాసుకుని, నాకు నేనే వినిపించుకున్నా’అంటారు మధుకర్ గారు.ఈ సంపుటికి ‘వలపోత’ అన్న పేరు కూడా కరోనా కలిగించిన దుఃఖంకు సంకేతమే అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నో మహమ్మారి రోగాలను ఎదుర్కున్నది మానవ సమాజం నేటి వరకు. ఓ వైపు కలరా, ప్లేగు లాంటి వ్యాధులనే కాదు, కరువు కాటకాలను కూడా చూస్తూ ముందుకు సాగిపోతుంది మానవ ప్రపంచం. కానీ ఆ క్రమంలో మానవ జాతి అనుభవించే క్షోభ స్థాయి, వారి జీవితాలు తారుమారయ్యే సందర్భాలను తరువాతి తరం లేదా తరువాతి మనిషి మర్చిపోవచ్చు. కానీ ఆ నడచిపోయిన కాలంలోని మనిషి మాత్రం ఆ తర్వాతి మనిషి కోసం ఆ నడచిన దారిని ఏదో ఒక రూపంలో నమోదు చేసే ప్రయత్నం చేస్తాడు. అటువంటి ఓ మహత్తర ప్రయత్నమే ఈ కవిత్వం కూడా.
కరోనా మనుషుల జీవితాలను అతలాకుతలం చేసిన సమయంలో వ్యక్తి,ఆ వ్యక్తి కుటుంబం ఎంతటి సమిష్టి దుఃఖాన్ని అనుభవించారో, అదే సమయంలో ప్రాణానికి హాని అని తెలిసిన పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు తమ ప్రాణాలకు తెగించి ఎలా తమ కర్తవ్యాన్ని నిర్వహించారో ఎంతో చక్కగా రాశారు. ఈ సమయంలో మనిషి కోల్పోయిన ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం గురించి, కరోనా మనిషి ఆలోచనలను కూడా అతలాకుతలం చేసిన విధానం గురించి కూడా వ్యధాభరితంగా రాశారు.
‘అతనొక లోకం
అతనిలో ఒక శోకం
అతనొక సత్యం
అతనిలో దుఃఖం నిత్యం
అతనొక సాధన
అతనిలో ఒడువని వేదన
అతనొక ఆత్మ
అతనిలో గాయపడ్డ అంతరాత్మ
అతనొక శవం
అతనిప్పుడు ముగిసిన శకం’ అని ‘ముగిసిన శకం’ కవితలో మనిషి విలువలను,ఆదర్శాలను, ఆలోచనలను, లక్ష్యాలను, మనసును ఎలా కరోనా గాయపరిచిందో హృద్యంగా రాశారు.
పద్దెనిమిది కవితల ఈ సంపుటిలో దుఃఖం మాత్రమే కాదు,ఆ దుఃఖాన్ని వెలిబుచ్చుకునే మార్గం, బయటపడలేని పరిస్థితుల్లో చేయాల్సిన పోరాటం, ఆ పోరాటానికి సిద్ధపడటం,ఆ పోరాటంలో అయ్యే గాయాలు వంటివి ఎన్నో ఉన్నాయి.
కరోనా అంతగా ప్రభావితం చేయని ఇప్పుడు కూడా కరోనా గురించి తల్చుకుంటే ఓ రకమైన గగుర్పాటు కలుగక మానదు అందరిలో. వ్యక్తిగతంగా ఆ కరోనా బాధను అనుభవించి, దాని వల్ల భౌతిక స్థాయిలోనే కాక మానసిక, సామాజిక స్థాయిల్లో కూడా వేదనను అనుభవించి,ఆ అనుభవాన్ని అక్షరీకరించిన ఈ కవి హృదయం ఆ కాలపు వ్యథల్లోకి మనల్ని కూడా తీసుకుపోతుంది. ఈ సమయంలో లాక్ డౌన్ వల్ల కొలువులు లేక సొంత ఊర్లకు వలస పోయే సమయంలో పడిన బాధలు,తమను సమాజం అసహ్యించుకున్న తాము మాత్రం మానవత్వంతో ముందుకు సాగుతాము అని నిరూపించిన హిజ్రాల మానవత్వం గురించి కూడా వాస్తవదృక్కోణంతో రాశారు.
ఈ కవిత్వంలో వ్యక్తి చరిత్ర, సమాజంలోని అనేక వర్గాల మరియు సమాజ చరిత్ర ఓ కాలానికి వర్తించి ఉంది. సంతోషాన్ని కూడా పంచుకోలేని మానవులు దుఃఖంలో మాత్రం ఒకటిగా అవుతారు ఆలోచనల్లో అని కరోనా నిరూపించింది. అందుకే ఇది గతించిన కాలం మిగిల్చిన సమకాలీన దుఃఖం మరియు నేర్చుకున్న జీవిత పాఠాల సారం కూడా.
‘నాలో నేను దుఃఖమై, కన్నీటి చెలిమినై వలపోసిన సందర్భంలో రాసిన కవితలే ఇవి’ అని నిర్భయంగా రాసిన మధుకర్ వైద్యులగారు ఈ సందర్భంగా ఇంకెన్నో ప్రభావిత రచనలు చేయాలని కోరుకుంటూ, వారికి అభినందనలు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ