సహజీవనం

                                         సహజీవనం

                                             -శృంగవరపు రచన


మనిషి ఏ దేశంలో ఉన్నా,ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా,ఏ సమస్యలు మనిషి జీవితంలో ఉన్నా,ఆ దేశానికి తగ్గట్టు లేదా ఆ దేశంలో ఆ మనిషికున్న స్నేహితులు,ఆప్తులకు తగినట్టు మెలిగే ప్రయత్నం చేయడం సహజం. వీటిని మనిషి సమాజంలో జీవించడానికి ఓ పరోక్ష అలిఖిత నియమంగా భావించుకుంటాడు.ఆ నియమ పరిధిని దాటే ధైర్యం మనిషి అనుభవించే పరిస్థితుల తీవ్రత మరియు వారికి ఈ సమాజానికి మధ్య ఉన్న దగ్గర-దూరాలను అనుసరించి ఉత్పన్నమవుతుంది.ఆ పరిధిని దాటి తమకు ఓ తోడు కావాలని నిర్ణయించుకుని ముందుకు సాగిన కొందరి కథే డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావు గారి ‘తోడు.’ ఈ నవల చతురలో ప్రచురించబడింది. అక్కినపల్లి సుబ్బారావు గారి రచనల్లో అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబ నేపథ్యం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.
కథలో ఓ ముఖ్య కుటుంబం విశ్వనాథంది. విశ్వనాథంకు ఒక్కడే కొడుకు రంగనాథం. రిటైర్ అయిన విశ్వనాథంకు పెన్షన్,సొంత ఇల్లు ఉన్నాయి. రంగనాథం అమెరికాలో స్థిరపడ్డాడు.అతని భార్య సునంద, కొడుకు వినోద్,కూతురు చిత్ర. వారు అమెరికాకు వెళ్ళి రెండు దశాబ్దాలు దాటిపోయింది. అమెరికాలో బ్యాంకులో పని చేస్తున్న రంగనాథంకు ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగం పోవడం అతను కొన్నాళ్లు ఇండియాలో ఉండటం ఆ తర్వాత అతను అమెరికాకు మరలా రావడం జరుగుతుంది.అతను ఇండియాలో ఉన్నప్పుడే అతని తల్లి ఓ యాక్సిడెంట్ లో మరణించింది. రంగనాథం భార్య సునంద విశ్వనాథం ఉంటున్న ఇల్లు కోట్ల విలువ చేస్తుందని కనుక దానిని అమ్మించి ఆయనను ఆశ్రమంలో జాయిన్ చేయిస్తే ఆ డబ్బుతో తమ పిల్లల బ్రతుకులు సెటిల్ అవుతాయని భర్తను రెచ్చగొడుతూ ఉంటుంది.రంగనాథం దంపతులు అమెరికా తిరిగి వచ్చారు. భర్తకు మరలా ఆఫీసు పని మీద ఇండియా వెళ్ళాల్సి రావడంతో ఆ సమయంలో ఆ ఇల్లు అమ్మే విషయం తేల్చుకురమ్మని చెప్తుంది సునంద.రంగనాథం తండ్రి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ తండ్రితో పాటు ఉన్న విశాలక్షిని చూసి షాకవుతాడు.ఆమెకు సొంత ఇల్లు ఉందని,పెన్షన్ వస్తుందని,ఒంటరిగా ఉండటం వల్ల వారిద్దరికి పరిచయం ఏర్పడటం వల్ల ఇలా స్నేహితుల్లా ఉంటున్నామని తండ్రి చెప్పిన దానిని బట్టి తెలుసుకుంటాడు రంగనాథం.ఆమెకు ఆస్తులు ఉండటం వల్ల ఆమె తండ్రి ఆస్తులు పొందే అవకాశం లేదని కాస్త ఊరట చెందుతాడు. తండ్రి దగ్గర ఇంటి అమ్మకం గురించి ఎత్తినప్పుడు దానిని అమ్మే ఉద్దేశ్యం తనకు లేదని కానీ తన తర్వాత ఆ ఇల్లు కొడుక్కే చెందేలా రాయించానని ఆ నకలు కాపీ కొడుక్కి ఇస్తాడు. తండ్రి నుండి ఎప్పుడు తాను ఆర్థిక సాయం పొందడమే కానీ తాను ఎప్పుడు ఆయనకు సాయపడకపోవడం గుర్తుకు వచ్చి రంగనాథం గిల్టీగా ఫీల్ అయ్యి తండ్రికి క్షమాపణ చెప్పి అమెరికాకు తిరిగి వస్తాడు.
రంగనాథం ఇండియాకు వెళ్ళిన సమయంలో వినోద్,మరియా అనే అమ్మాయిని ఇంటికి తీసుకువస్తాడు. ప్రాజెక్ట్ వర్క్ మీద తీసుకువచ్చానని చెప్పిన కొడుకును ఏమి అనలేకపోతుంది సునంద. కానీ ఆ పరిచయం ఎంత వరకు అన్నది ఆమెకు పూర్తిగా తెలియకపోయినా ఏమి అనలేకపోతుంది.అమెరికాలో పుట్టి పెరిగిన వినోద్,చైత్ర ఇద్దరినీ భారతీయత పట్ల మళ్ళించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.అమెరికన్ లైఫ్ స్టైల్ కు వారు అలవాటు పడిపోయారు.వారిద్దరు చదువు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ మీద సాగుతుంది కనుక తల్లిదండ్రుల మీద ఆధారపడేది లేదు.రంగనాథంకు ఇంటి మీద లోన్ ఉంది.
ఇక ఈ కథలో ఇంకో ముఖ్య పాత్ర అమృత.ఆమె భర్త కామేశం మరణించి ఎనిమిది నెలలు అయ్యింది.ఆమెకు ఆర్థికంగా లోటు లేదు.ఆమె కూతురు సుగుణ. వారు ఉండేది టెక్సాస్ లో. అమృత ఉండేది కాలిఫోర్నియాలో. కొంతకాలం వారితో ఉండటానికి వెళ్ళినా అక్కడ వారితో ఆమె ఇమడలేకపోయింది. తిరిగి కాళీఫోర్నియాకు వచ్చేసింది. ఒంటరితనం ఆమెకు భరింపరాని విషయంగా అనిపించింది.ఆ సమయంలో ఆమెకు ఇంటర్నెట్ ద్వారా కొందరు ఫ్రెండ్స్ పరిచయమవ్వడం వారిలో ఆమె జేమ్స్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. సునంద అమృతకు తెలిసిన వ్యక్తే. సునందకు ఈ విషయం తెలిసినప్పుడు ఆమెను విమర్శిస్తుంది. కానీ తన జీవితంలో తనకంటూ ఓ తోడు ఉండటం ముఖ్యమనుకున్న అమృత జేమ్స్ తో స్నేహాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటుంది. అమెరికా తిరిగి వచ్చిన భర్తతో ఇంటి విషయం ప్రస్తావిస్తే దాని గురించి మాట్లాడవద్దని గట్టిగా చెప్తాడు సునందతో భర్త. ఇక్కడితో నవల ముగుస్తుంది.
మనిషికి తోడు అవసరం అని,ముఖ్యంగా స్త్రీ-పురుషుల తోడు జీవితానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని,వయసు మళ్ళిన తర్వాత స్నేహానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని,జీవితంలో మలిదశలో స్త్రీ పురుషులు ఒంటరి వారైన క్రమంలో వారు స్నేహం చేయడంలో ఉన్న తప్పొప్పులను గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల జీవితంలో ఆ చివరి దశలో అదే సమాజం వారికి తోడుగా నిలవదని,ఆ స్నేహాన్ని అర్ధం చేసుకునే స్థాయికి సమాజమే ఎదగాలని రచయిత చెప్పే ప్రయత్నం చేశారు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ