మార్గదర్శి
మార్గదర్శి
-శృంగవరపు రచన
తెలివైన వ్యక్తులు కూడా తాము అనుకున్నది సాధించలేకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి డబ్బు విషయంలో రిస్కు తీసుకోలేకపోవడం.రెండు మార్పుల వేగంలో వెనుకబడటం. ఈ రెండు అంశాల్లో మనుషులకుండే ప్రాధాన్యతలే వ్యాపారవేత్తల విజయాన్ని నిర్దారిస్తాయని స్పష్టం చేసే పుస్తకమే ‘It happened in India.’ పాంటాలున్స్ అనే బ్రాండ్ తో మొదలుపెట్టి బిగ్ బజార్,సెంట్రల్ ల్లతో రిటెయిల్ మార్కెట్ స్వరూపాన్నే భారతదేశంలో మార్చివేసే ప్రయత్నం చేసిన కిషోర్ బియాని వ్యాపార ప్రస్థానమే ఈ పుస్తకం. కిషోర్ బియాన్ నిర్ణయాలు తీసుకోవడంలో చూపిన చొరవ,వేగం తో పాటు డబ్బు గురించి కన్నా కూడా భవిష్యత్తులో వచ్చే మార్పులను ముందుగానే గ్రహించి,ఆ అవసరాలకు తగ్గట్టు తన వ్యూహాలను మార్చుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు తన బ్రాండ్ ను నిలపడానికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ పుస్తకం చదువుతున్నప్పుడు స్పష్టం చేస్తుంది.
రాజస్తాన్ నుండి ముంబై లో స్థిరపడ్డారు కిషోర్ పూర్వీకులు. మొదటి నుండే వ్యాపారంలో ఉన్న కుటుంబం అది. బట్టల వ్యాపారంలోనే ఉన్నప్పటికి అప్పుడు ఉన్న వ్యాపార పద్ధతుల్లో కొత్తదనం లేదని,మారుతున్న కాలానికి తగ్గట్టు లేదని కిషోర్ భావించాడు. బాలీవుడ్ సినిమాలను,క్రికెట్ ను ఇష్టపడే కిషోర్ తన తర్వాతి జీవితంలో అతని వ్యాపారంలో ఈ రెండు కూడా భాగం అయ్యేలా చూసుకున్నాడు.
కిషోర్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ సమయంలో ముంబైలో ఉన్న స్టోర్స్ అన్నింటిని గమనించేవాడు. కాలేజీకి ఓ స్నేహితుడు ‘స్టోన్ ఫ్యాబ్రిక్’ ట్రౌజర్ వేసుకొచ్చినప్పుడు ఆ ట్రెండ్ అప్పటికి ముంబైలోకి రాలేదని,కానీ అది ట్రెండ్ అవుతుందని గుర్తించి అది అమ్మే వారి దగ్గర ఎక్కువ క్లాత్ తీసుకుని దానిని అమ్మి ఆ వయసులోనే వ్యాపారం చేసిన వ్యక్తి కిషోర్. ఆ తర్వాత కుటుంబ వారసత్వ వ్యాపారంలో భాగం కాకుండా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఎదిగిన వ్యక్తి కిషోర్. తన బ్రాండ్ ఏర్పరచుకోవడానికి,రిస్కులు తీసుకోవడానికి అతనికి ఏనాడూ డబ్బు అడ్డంకిగా కనిపించలేదు.తాము పూజించే దేవతల పేర్లు లేదా కుటుంబ సభ్యుల పేర్లో తమ వ్యాపార సంస్థలకు పెట్టుకునే సంస్కృతికి స్వస్తి పలికి పేరు ప్రోడక్ట్ కు సంబంధించింది,కస్టమర్స్ కు కనక్ట్ అయ్యేలా ఉండాలని భావించి WWB పేరుతో ఓ ట్రౌజర్స్ బ్రాండ్ ను ప్రారంభించాడు.
వ్యాపారవేత్తలు మూడు రకాలు.మొదటి రకం Creators. అంటే కొత్త ఆలోచనతో తమ వ్యాపారానికి ఓ ముద్రను నిలిపేవారు. ఇక రెండవ రకం Preservers. అంటే వారసత్వంగా వచ్చే వ్యాపారాన్ని నడిపేవారు. వీరు మార్పు గురించి,ఎదగడం గురించి ఆలోచించరు. ఉన్న వ్యాపారం ఆర్థికంగా నిలబెట్టుకునేంత వరకే పరిమితమవుతారు. మూడవ రకం Destroyers. ఈ రకం వారు అవసరమైతే అప్పటి వరకు ఉన్న వాటిని నిర్మూలించి,మార్పుకు తగ్గట్టు మళ్ళీ క్రియేటర్స్ గా మారతారు. క్రియేటర్ గా మొదలుపెట్టి అవసరమైనప్పుడు డిస్ట్రాయర్ గా వ్యవహరించిన వ్యాపారవేత్త కిషోర్.
భారతదేశంలో వ్యాపారం చేస్తున్నప్పుడు భారతీయ పద్ధతిలోనే చేయాలని భావించి,భారతీయ పద్ధతి అంటే భారతీయుల్లా ఆలోచించగలగడం,వారు పనులు చేసేలా చెయ్యగలగడం వారిని పూర్తిగా అర్ధం చేసుకుని వారికి తగ్గట్టు వ్యాపారాన్ని చేయగలగడం అని నమ్మిన వ్యక్తి. పాంటాలున్స్ కు కష్టపడి బ్రాండ్ ఏర్పరిచాక అక్కడితో ఆగిపోలేదు కిషోర్.మార్కెట్ లో వస్తున్న మార్పులు,వినియోగదారుల్లో వస్తున్న మార్పులకు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగాడు. ఆ రోజుల్లో రిటేయిలింగ్ ను ప్రత్యేక వ్యాపారంగా కాకుండా టెక్స్ టైల్ పరిశ్రమలో భాగంగా భావించిన బ్యాంకులు ఆ రోజుల్లో లోన్స్ ఇవ్వడానికి అంగీకరించేవి కాదు. ఆ రోజుల్లో కేవలం కొన్ని ఫార్మాసూటికల్ కంపెనీలకే పరిమితమైన బ్రాండ్ విలువను లెక్క గట్టే పద్ధతిని తన బ్రాండ్ కు కూడా అమలుపరిచి,ఆ విలువ ఆధారంగా బ్యాంకు రుణాలు సాధించాడు కిషోర్. రెడీ మేడ్ గార్మెంట్స్ కు మార్కెట్ లేని రోజుల్లో రాబోయే మార్పును దృష్టిలో ఉంచుకుని వాటి మీద వ్యాపారం చేసి లాభాలు సాధించాడు కిషోర్.
ఆ వ్యాపార పయనంలో ఎన్నో తప్పులు చేస్తూ నేర్చుకునే స్వేచ్చను,అవసరమైనప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని తన ఉద్యోగులకు ఇచ్చాడు కిషోర్. పాంటాలున్స్ నుండి బిగ్ బజార్ కు ఎదిగాక Force Of Consumerism ను పెంచే ప్రయత్నం చేశాడు. సాధారణంగానే పేదవారు,మధ్యతరగతి వారు షాపింగ్ మాల్స్ లేదా మార్కెట్ స్టోర్స్ అనగానే ఖరీదైనవి అనే భావనతో వాటికి దూరంగా ఉంటారు. ఆ భావనను పోగొట్టి అందరికి కాకపోయినా ఓ మేరకు తమ అవసరాలు తీర్చుకోగలిగే వారికి అనుకూలమైన మార్కెట్ ను సృష్టించింది బిగ్ బజార్. ‘సబ్సే సస్తా దిన్’ ఆఫర్ ప్రకటించినప్పుడు బిగ్ బజార్ స్టోర్స్ అన్ని నిండిపోవడమే కాకుండా,స్టోర్స్ బయట ట్రాఫిక్ నియంత్రించలేని స్థాయికి పెరగడం,అన్ని తరగతుల వారిని ఆకర్షించడంతో షాపింగ్ మాల్స్ ను,మార్కెట్ స్టోర్స్ లో మార్కెట్ లో ఓ వర్గానికి వెసులుబాటు కల్పించింది బిగ్ బజార్.
భారత దేశంలో ఎక్కువ కుటుంబాల్లో కొనడం వంటివి చేసేది స్త్రీలే.అలాగే పొదుపు చేసే సంస్కృతి భారతీయ వ్యవస్థలో ఉంది. ఉదాహరణకు గోదుమ పిండి లాంటివి చూసుకుంటే గోధుమలు ఓ చోట,మిల్లు ఇంకో చోట ఇలా విడిగా ఉత్పత్తిని పొందే సంస్కృతిలో అన్నింటిని లూజ్ గా కూడా ప్రవేశపెట్టింది.బిగ్ బజార్ కు ఫ్రాంచైస్ లతో విస్తరించడం, సెంట్రల్ ఆగమనంతో ఎంటర్ టెయిన్మెంట్ గా మారడంతో కిషోర్ తన బ్రాండ్ ను నిలుపుకోవడంలో విజయం సాధించినా,కాలం-పోటీదారులు-మార్పుల మధ్య ఎప్పుడూ రిస్కులు తీసుకుంటూ,డానికి బాధ్యత కూడా వహిస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి కిషోర్.
కిషోర్ లో వ్యక్తిగతంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి.కార్పొరేట్ హంగులను నమ్మని వ్యక్తి కిషోర్. తన దగ్గర పని చేసే వారు టైలు కట్టుకుని గొప్పగా కనబడటం వల్ల లాభం లేదని కస్టమర్స్ ను ఆకర్షించగలగాలని,కస్టమర్ల కన్నా తక్కువగా కనిపించాలని,కస్టమర్లలో వారిని చూడగానే తమ లాంటి వారే అనిపించాలి తప్ప తమ కన్నా గొప్ప వారనే భావన కలగకూడదని భావిస్తాడు. అలాగే ఏదైనా వ్యాపారానికి సంబంధించి ఏదైనా కొనుగోలు వ్యవహారం ఉన్నప్పుడూ ఎప్పుడు బేరసారాలు సారించని వ్యక్తి కిషోర్. డబ్బు కన్నా ఆ కొనుగోలు వల్ల వచ్చే బిజినెస్ భాగస్వాములతో దీర్ఘ కాలంలో ఉండే సంబంధం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తే కిషోర్.ఎవరికైనా ఫ్రాంచైస్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవాలంటే అది తీసుకోవాలనుకున్న స్టోర్ కు వెళ్ళి రెండు విషయాలను గమనించి నిర్ణయం తీసుకునేవాడు కిషోర్. మొదట స్టోర్ తెరిచే సమయం గమనించడం.రెండు భారతీయ వ్యాపార సంస్థల్లో ఎక్కువ మంది తమ రోజులో మొదట పూజ చేసిన తర్వాత వ్యాపారం మొదలు పెడతారు. కస్టమర్ కు ప్రాధాన్యత ఇస్తారో,పూజకు ఇస్తారో అన్న విషయం రెండవది. ఈ రెండు విషయాలను బట్టి నిర్ణయించేవాడు కిషోర్.
సినిమాల్లో కూడా అడుగుపెట్టిన కిషోర్ రెండు బాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి, అందులో విఫలం అవ్వడంతో సినిమాల నుండి విరామించుకున్నారు. ఆ రోజుల్లోనే క్రికెట్ స్టార్స్ మరియు ఫిల్మ్ స్టార్స్ తో పాంటాలూన్ బ్రాండింగ్ ను బలపరిచారు కిషోర్. మార్కెటింగ్, బ్రాండింగ్ కు ప్రాధాన్యత ఇచ్చిన వ్యాపారవేత్త కిషోర్.
తాను అనుకున్నది సాధించడానికే తన జీవితం అని, ఈ క్రమంలో జరిగే తప్పులను చూసి భయపడకూడదని ఎటువంటి పరిస్థితుల్లో అయినా మార్పుకు తగ్గట్టు మారాలని,వ్యాపారాన్ని కస్టమర్ల అభిరుచులు,వారు పెరిగిన వాతావరణానికి తగ్గట్టు మార్చుకోవాలని నమ్మి ఆచరించి విజయం సాధించిన కిషోర్ బియన్ పయనం కేవలం వ్యాపారవేత్తలకు మాత్రమే కాదు జీవితంలో తాము నచ్చింది చేయాలనుకుని భయపడి వెనుకడుగు వేసే అందరికి స్ఫూర్తిని ఇచ్చే ప్రస్థానమే.
* * *

Comments
Post a Comment