మనుషులు –స్వభావాలు

 మనుషులు –స్వభావాలు

-శృంగవరపు రచన


మనుషులు జీవితంలోని ప్రతి దశలోనూ ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఉన్న పరిస్థితులు, వాటి ఫలితాలు, తదనుగుణంగా తాము చేయాల్సిన వాటి గురించి ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉండటం మనిషి జీవితంగా అనుకోకుండానే జరిగిపోయే ఓ ప్రక్రియ. కానీ ఆ ప్రణాళికలు తప్పినా సరే మరలా అదే ప్రక్రియలోకి మనిషి తన జీవితాన్ని జారనివ్వడం కూడా ఈ ప్రక్రియలో జరిగిపోయే ఇంకో ప్రక్రియ. ఇలా మనుషుల ఆలోచనలకు, ప్రణాళికలకు భిన్నంగా మనిషి జీవితం ఎలా ముందుకు సాగుతుందో, స్వార్ధం-అసూయ- అవకాశవాదం వంటి లక్షణాలతో ఉండే చుట్టూ సమాజ మనుషులు, వీటికి ఎలా కారణం అవుతుందో స్పష్టం చేసే కథలే దుత్తా దుర్గాప్రసాద్ గారి కథలు. ఈ కథా సంపుటిలో మొత్తం పది కథలు ఉన్నాయి. ప్రతి కథలోనూ అంతర్లీనంగా ఈ ప్రక్రియ ఏదో ఒక మానవ జీవన స్థాయిలో స్పృశించబడింది.
మొదటి కథ ‘హిరణ్యకరచాలనమ్.’ ఫోర్మన్ గా ఉద్యోగం చేసిన వెంకటేశం వియ్యారెస్సు రిటైర్మెంట్ తీసుకున్నాడు. దాని వల్ల అతనికి ఆ తర్వాత వచ్చే డబ్బు తొమ్మిది లక్షలు. అతని కొడుకు రాంబాబు, కోడలు. కూతురు, భార్య –వీరు అతని కుటుంబ సభ్యులు. రిటైర్మెంట్ వేడుక పూర్తయ్యాక వారం రోజులకు కానీ అతనికి ఆ డబ్బు రాదు. ఈ లోపే అతని ఇంటి చుట్టూ ప్రైవేట్ బ్యాంకుల వారు, ఇన్సూరెన్స్ వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఆ డబ్బును తమ దగ్గర దాచుకునే పద్ధతుల గురించి ఇంటి దగ్గర వాలిపోయి మరి చెప్తున్నారు. అతని కొడుకు రాంబాబు పని చేసే యజమాని, తన దగ్గర కారు తిప్పుకునే బదులు దానినే కొనుక్కోమని రాంబాబుకు ఆశలు పెంచాడు. ఇకపోతే కోడలి పుట్టింటి డబ్బు తీసుకున్నందువల్ల ఆమెకు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత కూతురుకు ఇంగ్లీష్ చదువు చెప్పించాలి. ఇలా మొత్తానికి అతని తొమ్మిది లక్షల ప్రణాళికలు ఇంటి దగ్గరే మొదలయ్యాయి. ఇవి కాకుండా అతని చివరి రోజుల వరకు హాయిగా గడిచిపోవటానికి కూడా డబ్బు కావాలి. అదే సమయంలో పెరుమార్ అతని దగ్గరకు వచ్చాడు. తాగించి, అతని సమస్యలకు పరిష్కారం చూపించి, ఆ డబ్బు ఓ ప్రైవేట్ చిట్టీ సంస్థలో పెట్టించాడు. కొడుకు కారుకు డౌన్ పేమెంట్ కట్టి, నెలా నెలా కట్టించే ఏర్పాటు చేశాడు. అలా ఆ కుటుంబం అంతా ఆనందంగా ఉన్న సమయంలో వెంకటేశం దేశ యాత్రకు వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి పరిస్థితి తారుమారు అయ్యింది. ఆ చిట్టీ సంస్థ ప్లేటు ఫిరాయించడంతో కుటుంబం చిన్నాభిన్నమయింది. ఆ స్థితి చూసి వెంకటేశం ఓ రోజు ఇల్లు వదిలి వెళ్లిపోవడం, తిరిగి ఎప్పటికో రావడం, ఆ తర్వాత పెరియార్ మరలా వారికి తారసబడి, కొడుక్కి కార్ సగం తన పెట్టుబడితో ఇప్పించే ఏర్పాటు, లాభం సగం, అలాగే వెంకటేశంను కూడా సభల్లో పార్టీలకు జై కొట్టే పని ఇప్పించడం, కూతురికి తన ఆఫీసులో ఉద్యోగం ఇలా ఇవన్నీ ఇప్పించి, వారి ఇరువురు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో కథ ముగుస్తుంది. మనిషి తన పరిస్థితులు తారుమారైనప్పుడు, మరలా ఆ దశలో మెరుగుపడే ప్రక్రియ గురించే తప్ప, తాము ఆ స్థితికి రావడానికి కారణమైన అంశం గురించి ఆలొచించడని ఈ కథ స్పష్టం చేస్తుంది. అందుకే వెంకటేశం కుటుంబం దుస్థితికి కారణం పెరియార్ అయినా మరలా అతను మాటనే రెండోసారి నమ్మడం అదే అంశాన్ని స్పష్టం చేస్తుంది.
రెండో కథ ‘నరవానరీయం.’ ఈ కథ మనుషులు జంతువులతో ఎలా ప్రవర్తిస్తే అవి ఆ తీరులోనే స్పందిస్తాయనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. ఈ కథలో హనుమంతరావు బదిలీ మీద ధవళేశ్వరం వస్తాడు. అక్కడ కోతుల బెడద ఎక్కువ. మొదట వాటిని పారద్రోలే ప్రయత్నం చేస్తాడు. తర్వాత వాటికి మంచి స్నేహితుడు అవుతాడు. అలాగే ఇంకొందరు వాటిని పట్టించే ప్రయత్నం చేసినప్పుడు అవి భీభత్సం సృష్టిస్తాయి. కోతులను ఆడించేవాడు ఓ బ్రతికున్న కోతి మరణించిందని చెప్పి, అది తన కోతి కాకపోయిన జన సానుభూతితో డబ్బులు సంపాదిస్తాడు.ఆ సమయంలో దానిని కొబ్బరి కాయతో కొడితే ఆ కోతి మరణించడం, మిగిలిన కోతులు అతనిపై దాడి చేయడం, జనులు దేహశుద్ధి చేయడం జరుగుతుంది. ఇకపోతే ఆ తర్వాత హనుమంతరావు తల్లి మరణించినప్పుడు కోతులు కొన్ని పూలు విసరడంతో కథ ముగుస్తుంది. జీవ కారుణ్యం మీద రాసిన ఈ కథలో నాటకీయత ఎక్కువైనా, పాఠకుల మనసులో ఆ కోతులు ఉన్న భావన మాత్రం కలుగుతుంది.
మూడో కథ ‘చలం-చంచలం-చెంచెల్ గూడా కాంచెదం.’ ఈ కథలో చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారి కన్నా కూడా డబ్బు ఎలా సంపాదించాలో, మనుషుల బలహీనతలు-అవసరాలు దానికి ఎలా తోడ్పడతాయో అన్న లౌకిక జ్ఞానం ఉన్న వ్యక్తులు వృత్తి రీత్యా తక్కువ స్థాయిలో ఉన్నా సరే పెద్ద స్థాయిలో ఉన్నవారిని సైతం తమకు తగ్గట్టు తమకు లాభం చేకూర్చేలా వ్యవహరించగలరని, వారికున్న అధికారం ఈ చదువుకున్న వారికన్నా ఎక్కువ అని రచయిత స్పష్టం చేస్తారు. ఓ అటెండర్ ఆఫీసులో ఎలా చక్రం తిప్పుతున్నాడో, మేనేజర్ స్థాయి వ్యక్తులను సైతం తనకు అనుకూలంగా ఎలా మలచుకున్నాడో, తన మీద ఫిర్యాదు చేస్తానన్న ఆఫీసరును ఎలా ఏసీబికి పాటించాడో అన్నదే కథ. మనుషుల మీద అధికారం సంపాదించడానికి కావల్సిన విద్య, ఉద్యోగ విద్య రెండు వేరు అని ఈ కథ స్పష్టం చేస్తుంది.
నాలుగో కథ ‘డిటెక్టివ్ కథ.’ డిగ్రీ చదివిన ఇద్దరు స్నేహితులు ఓ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుని, తెలిసిన, తెలుసుకున్న విషయాలనే జనాలకు చెప్పి తెలివిగా సంపాదిస్తూ ఉంటారు. జగన్నాథరావు వారికి చదువు చెప్పిన గురువు. ఆయన కొడుకు రామస్వామి తన కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డాడు. కూతురు అల్లుడు ఉద్యోగాల్లో ఉన్నారు. తల్లిదండ్రుల ఆస్తుల మీద వారిద్దరికి యావ. ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకరు జగన్నాథరావు గారికి సన్మానం చేసి, కొంత డబ్బు ఇస్తే, దానిని ఆయన మంచి కార్యాలకు వినియోగించమని తిరిగి ఇచ్చేయ్యడం ఆయన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. ఈ గొడవలో ఆయనకు హార్ట్ ఎటాక్ రావడం, మరణించడం, ఆ కార్యక్రమాలు అయిపోయాక,ఆ డిటెక్టివ్ మిత్రుల్లో ఒకరికి ఆయన గొలుసు ఆయన భార్య భర్త కోరిక మేరకు ఇవ్వడం, దానితో రామస్వామి అతని మీద దొంగ కేసు పెట్టించి, అతన్ని ఏడిపించే ప్రయత్నం చేయడం, మొత్తానికి అది అతని మీదకే తిరగబడి బోలెడు ఖర్చు అవ్వడం జరుగుతుంది. పిల్లల గురించి తెలిసిన జగన్నాథరావు అప్పటికే భార్యకు తన పెన్షన్ తో పాటు కొంత ఆస్తి ఆమెకు ఉంచడం,ఆమె అనాథాశ్రమంలో ఉండి,వారి కోసమే దానిని వినియోగించడం జరుగుతుంది. కథలో పఠనీయత లోపించినా మనుషుల మనస్తత్వాలను డబ్బు ఎలా మార్చేస్తుందో చెప్పే కథ కనుక మంచి అంశమే.
ఇదో కథ ‘ఉపన్యాసాల వీరాస్వామి కథ.’ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో ఉన్న వీరస్వామి లంచాలకు అలవాటు పడినవాడు. ఉద్యోగం పోవడంతో ఏ అవకాశం దొరికితే ఆ అవకాశంతో పాటు అతను చివరకు రాజకీయాల్లోకి ప్రవేశించడమే కథ. ఈ కథ చాలా క్లుప్తంగా ఉంటుంది. రాజకీయాలు అంటే ఉండే నటనా ప్రదర్శన మీద మాత్రమే రచయిత దృష్టిని నిలిపారు.
ఆరవ కథ ‘టి.పి. రామయ్య కథ.’ ఇది రిటైర్ అయ్యాక బ్రతకనేర్చిన రామయ్య కథ. భార్య మరణం తర్వాత కష్టాల మీద పుస్తకం రాసి సంపాదించి, తన అవసాన దశలో సేవల కోసం ఓ ముప్పై ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని,ఆమెకు తన తర్వాత పెన్షన్ ఏర్పాటు చేసి ఉంచాడు.అలా పరిస్థితులకు తగ్గట్టు బ్రతికి మరణించిన ఇంజనీర్ కథ ఇది. ఈ కథ కూడా క్లుప్తంగానే ఉంటుంది.
ఏడవ కథ ‘రైలు బండి రానున్నది –చితికి నోళ్ళకందు చోటున్నది.’ ఈ కథలో మనిషి బాహ్య స్వరూపం కన్నా మనిషి ఆలోచనల స్వరూపమే గొప్పదనే భావనను స్పష్టం చేసే ప్రయత్నం చేశారు రచయిత. జానీ బాల్యంలో అతని తల్లిని తండ్రి హత్య చేశాడు. ఆ తర్వాత అతన్ని ఓ హిందీ మాస్టారు చేరదీశారు. ఉదర స్వభావం కలిగిన ఆయన కుటుంబం సత్రంగా మారడంతో ఆయన అత్తగారు అయిష్టం ప్రకటించడం వల్ల జానీ ఆయనకు చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఆయన అతనికి చదువు చెప్పి అల్లుడిని చేసుకోవాలనుకున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన కూతురి పెళ్లి కోసం డబ్బు రైలులో తెస్తున్నప్పుడు దొంగలు పడి దోచుకోవడం, ఆ సమయంలో జానీ తారసపడి తాను కూడబెట్టిన డబ్బు ఇవ్వడం, ప్లాట్ ఫార్మ్ మీద జీవించే అతను పెళ్ళికి వచ్చి ఇంకొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. నాటకీయత స్థాయి ఎక్కువే అయినా సాయానికి స్థాయి అవసరం లేదని స్పష్టం చేసే కథ ఇది.
ఎనిమిదవ కథ ‘కామినీయం.’ అప్పుల్లో మునిగిపోయిన భర్త తన భార్యకు ఇల్లు గల వారబ్బాయితో సంబంధం ఉండటం గమనించి, దానిని తనకు ఆర్థిక వనరుగా మార్చుకోవాలని ప్రయత్నించడం, భార్య తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు అంగీకరించడం, ఆ తర్వాత అది తిరగబడటం,ఆ తర్వాత ఆ భార్య అతనికి విడాకులు ఇస్తే ఆమెను వివాహం చేసుకోవడానికి ఆ అబ్బాయి ఒప్పుకోవడంతో కథ ముగుస్తుంది. ఊహించని ఘటనలు ఎలా మనిషి జీవితంలో వేగంగా జరిగిపోతాయో స్పష్టం చేసే కథ ఇది.
తొమ్మిదో కథ ‘ఏనుగంత తండ్రి కన్నా ఎలికంత తల్లి మేలు.’ తాగుబోతు భర్త భార్యను హింసించడం,ఆమె స్వరక్షణ కోసం ఎదురుతిరగడం, అతను మరణించకపోయినా ఆమె జైలు పాలవ్వడం, ఆ తర్వాత ఆ తండ్రి ఇంకో వివాహం చేసుకోవడం,ఆ భార్య కూడా మంచిదే అవ్వడం, ఆమె కొడుకును బాగా చూసుకోవడం, మొదటి భార్య విడుదల అయ్యాక వారిద్దరు సఖ్యంగా ఉంటూ భర్తను వదిలేయడం, తండ్రి ప్రవర్తన వల్ల జైలు పాలవ్వడం, ఆ కొడుకు మంచివాడుగా పెరుగుతాడు అనే ఉద్దేశ్యంతో రచయిత కథ ముగిస్తారు. బలవంతుడైన తండ్రి కన్నా ప్రేమ, వివేకం ఉన్న తల్లి మేలు అన్న భావనను రచయిత చెప్పాలనుకున్నా ఆ స్థాయిలో ఈ కథ లేదు.
స్వర్గీయ దుత్తా దుర్గాప్రసాద్ గారు విభిన్న రచయిత. ఆయన కథా శీర్షికలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. కథనం, కథ నడిచే తీరు కూడా అంతే. కొంత వ్యంగ్యం, మానవ జీవితాల్లో ఉండే దౌర్భాగ్యం, బలహీనతలు, వాటి వల్ల మనిషి స్వభావం మారిపోయే పరిస్థితులు ఆయన కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ