కనబడని నిజం

 కనబడని నిజం

-శృంగవరపు రచన



మనిషి ఈ ప్రపంచాన్ని తన కళ్ళతో,తన మనసులో ఉన్న ప్రేమ,ద్వేషం,అభిరుచులు,అభిప్రాయాలు,విలువలు ఆధారంగానే చూస్తాడు. ఏం జరిగింది అన్న దానికి మనిషి సాక్షి కాకపోయినా వీటి ఆధారంగా తనకు సంతృప్తినిచ్చే సమాధానాన్ని బట్టి అతను నిర్ణయాలు తీసుకుంటాడు. అలా తన వలయంలో తానే చిక్కుకుపోయిన ఓ కొడుకు కథను స్పష్టం చేస్తూ పాల్ డోరన్ రాసిన క్రైమ్ థ్రిల్లర్ నవలే ‘The Poacher’s Son.’
మయానే గేమ్ వార్డెన్ గా ఉన్న మైక్ బొల్డ్ విచ్ ఓ రాత్రి ఇంటికి వచ్చేసరికి అతని తండ్రి నుండి వచ్చిన కాల్ లో వాయిస్ మెసేజ్ ఉంటుంది. తండ్రితో పాటు అపరిచిత స్త్రీ స్వరం కూడా అందులో ఉంటుంది. రెండేళ్ళ నుండి దూరంగా ఉన్న తండ్రి ఆ రాత్రి తనకు ఎందుకు కాల్ చేశాడో మైక్ కు అర్ధం కాదు. మైక్ తండ్రి జాక్. తల్లితండ్రులు మైక్ కు తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడే విడిపోయారు. ఆ తర్వాత తల్లి నీల్ అనే లాయర్ ను వివాహం చేసుకుంది. ఆ కొత్త తండ్రి పెంపకంలో పెరిగాడు మైక్. జాక్ తో మైక్ కు ఉన్న అనుబంధం విచిత్రమైనది. జాక్ తండ్రి అడవిలో ఉన్న జంతువులను చట్టానికి వ్యతిరేకంగా వేటాడే వాడు. ఆ అడవిలో ఉన్న క్యాంపులో పని చేసేవాడు. తాగుడు వ్యసనం ఉంది.
తండ్రి నుండి కాల్ వచ్చిన తర్వాత ఉదయం మైక్ కు ఇంకో విషయం తెలుస్తుంది. అంతకు ముందు రాత్రి ఓ పోలీస్ ఆఫీసర్ మరియు తండ్రి నివసించే ప్రాంతంలో ఉన్న ల్యాండ్ ను లీజుకు తీసుకుంటున్న కొత్త కంపెనీ ప్రతినిధిని ఎవరో హత్య చేశారని,అందులో ప్రధాన అనుమానితుడు మైక్ తండ్రి అని. ఆ కొత్త కంపెనీ వల్ల అప్పటి వరకు అక్కడ నివాసం ఉన్న వారికి ఆశ్రయం లేకుండా పోతుంది. అందువల్ల దాని వల్ల నష్టపోయే ఎవరైనా సరే ఆ పని చేసి ఉండవచ్చని,తన తండ్రి అలాంటి విషయాన్ని పట్టించుకునే రకం కాదు కనుక తన తండ్రి ఆ పని చేసి ఉండడని నమ్ముతాడు మైక్.
గేమ్ వార్డెన్ అడవిలో జంతువులను కాపాడటం,క్రూర జంతువుల నుండి మనుషులను కాపాడటం,చట్టవ్యతిరేకంగా జరిగే వేటను నిరోధించడం వంటి పనులు బాధ్యతగా ఉన్న వ్యక్తి మైక్. మైక్ గర్ల్ ఫ్రెండ్ సారాతో రెండేళ్ళుగా ఉన్న అనుబంధం కూడా కొద్ది వారాల క్రితమే బ్రేకప్ అయిపోయింది. ఆ పోలీస్ ఆఫీసర్ మరియు కొత్తగా వస్తున్న సంస్థ ప్రతినిధుల హత్య విషయంలో జాక్ ను పోలీసులు విచారించడానికి వెళ్ళినప్పుడు తనను విచారరించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ను గాయపరిచి జాక్ తప్పించుకోవడంతో జాక్ హంతకుడు అని అందరూ భావిస్తారు.కానీ మైక్ మాత్రం తన తండ్రిని నమ్ముతాడు.
ఆ తర్వాత జాక్ గర్ల్ ఫ్రెండ్ నని,ఆ హత్యలు జరిగిన రాత్రి జాక్ తనతోనే ఉన్నాడని పోలీసులకు చెప్తుంది బ్రెండా. బాల్యంలో తండ్రి నుండి విడిపోయాక తల్లితో ఉంటున్న సమయంలో మైక్ ఓ సారి తండ్రితో కలిసి గడపడానికి వెళ్ళిన సమయంలో తన కన్నా నాలుగేళ్ళు చిన్నదైన బ్రెండాను మొదటి సారి చూస్తాడు మైక్. ఆమె తన తండ్రికి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి ఆశ్చర్యపోతాడు. జాక్ ను కావాలనే ఆ హత్యలో ఇరికించారని,ఆ అడవిలోని క్యాంపులో నివసించే పేలిటర్,ట్రూమన్ లు కలిసి చేసిన హత్యలను జాక్ మీదకు మరలేలా చేశారని,ఆ హత్య జరిగిన రాత్రి జాక్ తనతోనే ఉన్నాడని చెప్తుంది. తనకు తండ్రి నుంచి వచ్చిన కాల్ లో ఉన్న అపరిచిత స్త్రీ స్వరం బ్రెండాది అని గుర్తిస్తాడు మైక్.
ఓ వైపు పోలీస్ అధికారులు దాదాపుగా జాక్ నే హంతకుడిగా భావించి అతన్ని వెతుకుతూ ఉన్న సమయంలో అతన్ని నిర్దోషిగా నిరూపించే పనిలో ఉంటాడు మైక్.అప్పటికే మైక్ కు,ఆమె తల్లికి జాక్ ఫోన్ చేస్తాడు. తాను కెనడాలో ఉన్నానని,తాను ఈ హత్య చేయలేదని,తనను ఇరికించారని చెప్తాడు. తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి పేలిటర్,ట్రూమన్ లను విచారించడానికి వెళ్తాడు మైక్. ఆ సమయంలోనే వారిద్దరి హత్యలు ఎవరు చేశారో తెలియకుండా ఆ అడవిలో జరుగుతాయి. వారిద్దరూ ఒకరినొకరు చంపుకున్నారని మొదట భావించినా అది నిజం కాదని మైక్ కు అర్ధమవుతుంది. ఆ తర్వాత అక్కడకు వచ్చిన తండ్రిని చూశాక,అతనే ఆ రెండు హత్యలు చేశాడని అతనికి అర్ధమవుతుంది. కావాలనే తన తండ్రి కెనడాలో ఉన్నానని చెప్పి అధికారుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడని,ఆ హత్యలతో పాటు ఇప్పుడు రెండు హత్యలను కూడా తండ్రి చేశాడని దానికి కారణం బ్రెండా అని కూడా అతనికి అర్ధమవుతుంది. బ్రెండాకు మగవారిని కవ్వించి వారితో సంబంధాలు పెట్టుకునే అలవాటు ఉంది.అలా ఆమె ఎవరితో ఉన్నట్టు అయినా జాక్ గమనిస్తే మాత్రం ఆ నింద వారి మీదకు తోసేసేది. ఆ హత్యల్లో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ తో బ్రెండాకు సంబంధం ఉందని జాక్ కు తెలియడం,అతను తనను రేప్ చేశాడని బ్రెండా చెప్పడంతో అతన్ని చంపే ఉద్దేశ్యంతో పేల్చినా ఆ హత్యను కప్పిపుచ్చుకోవడానికి పక్కన ఉన్న ప్రతినిధిని కూడా జాక్ హత్య చేయాల్సి వచ్చింది. తన హత్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మైక్ ను చంపడానికి కూడా వెనుకాడకుండా అతన్ని కూడా బంధించి నది దాటిస్తున్న సమయంలో పడవ తిరగబడటం వల్ల అందరూ నదిలో పడటం, తలకు గట్టిగా ఏదో తగలటం వల్ల బ్రెండా మరణించడం,బ్రెండా మరణించడంతో తనను తాను షూట్ చేసుకుని జాక్ మరణించడం జరుగుతుంది.
మనుషుల స్వభావాలను వారి వ్యక్తిత్వాల అనుగుణంగానే చూడాలి తప్ప,వారితో ఉన్న అనుబంధ కోణం నుండి మాత్రం కాదు.తన కొడుకుకు తన మీద ఉన్న ప్రేమను ఊతంగా చేసుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే జాక్ ఉన్నాడు.అందుకే అందరికీ ముందే తెలిసిన సత్యమైన అతని తండ్రి హంతక ప్రవృత్తి అతనికి కనపడలేదు. నిజాన్ని నిజంగా చూడాలంటే మనుషులను పరిచిత కోణాల్లోని సత్యాలతో గమనించాలే తప్ప,ప్రేమ-ద్వేషం వంటి అంశాలతో ముడిపెట్టి కాదు అని స్పష్టం చేసే నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష