అనాగరిక దోపిడి

 అనాగరిక దోపిడి

-శృంగవరపు రచన


ప్రగతిని ఏ కోణం నుండి దర్శించి సమాజానికి మేలు కలిగిందని భావించాలి అన్న ప్రశ్నకు అధిక శాతం సాంకేతిక,ఆర్థిక అంశాలే ముఖ్యమైనవిగా కనిపించడం జరుగుతుంది. మనుషుల్లో చైతన్య స్పృహ ప్రగతికి సమగ్రత చేకూర్చుతుంది. భిన్నత్వంలో ఏకత్వ శైలి కనిపించే మన దేశంలో ఆచారాలు,సాంప్రదాయాలు మనుషులను ఒకటి చేసే మాధ్యమాలుగా వ్యవహరించడం ఓ కోణం అయితే,వాటిని దోపిడి మరియు భయాలకు ఊతాలుగా మార్చుకోవడం ఇంకో కోణం. నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటూ,ఆ ఆచార సాంప్రదాయాలను ప్రాణంగా భావిస్తూ,అడవి తల్లి బిడ్డలుగా జీవిస్తున్న ‘కొల్లిమలై’ అనే కొండ ప్రాంతంలో నివసించే గిరిజనుల జీవితాలను సామాజిక-ఆర్థిక-మానసిక-చైతన్య కోణాల్లో ఆవిష్కరిస్తూ తమిళ రచయిత చిన్నప్ప భారతి రాసిన నవలే ‘సంఘం.’ ఆచార సాంప్రదాయాల పట్ల ఉన్న భక్తి,అమాయకత్వాలను ఎలా దోపిడి వ్యవస్థను వివిధ దశల్లో నిర్మించడానికి విద్య ఉన్నవారు,అధికారం ఉన్నవారు వినియోగిస్తారో ఈ నవల స్పష్టం చేస్తుంది.
కొల్లిమలై ప్రాంతంలో తరతరాలుగా గిరిజనులు జీవిస్తున్నారు.ఆ ప్రాంతంలో ప్రజలు కూరగాయలు,పండ్లు,తేనె,చింతపండు వంటివి పండించి కొండ కింద మైదానంలో జరిగే సంతలో అమ్ముకుంటూ తమ జీవనం కొనసాగిస్తారు. వారి జీవితంలోని ప్రతి దశలో దోపిడి కూడా ఓ భాగమైపోయింది. ఆ ప్రాంతంలో ఉండే అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు,ఆ ప్రాంత కుల పెద్దలు,పోలీస్ అధికారులు,వడ్డీ వ్యాపారులు వారిపై ఈ దోపిడిని వివిధ స్థాయిల్లో చేస్తూనే ఉండటం ఈ గిరిజనులకు అలవాటైన అంశంగా మారిపోయింది.
ఈ కథలో ముఖ్య కుటుంబం తిరుమన్ కుటుంబం. తిరుమన్ భార్య తిరుమి. కొడుకు సడయన్. కూతురు పిడారి. అప్పటికే వారి చేను తాకట్టులో ఉండటం వల్ల దానిని విడిపించుకోవాలని,దానితో పాటు కూతురు,కొడుకుల పెళ్ళిళ్ళు చేయడం వంటివి చేయాలని,దాని కోసం ఎంత కష్టమైనా పడాలని భావించే మనస్తత్వం తిరుమిది. అప్పుడే ఆమె పెంచుతున్న పందికి పది పిల్లలు పుట్టడం,వాటి ద్వారా కూడా తమ జీవితాలను ఓ మేరకు ఆశాజనకంగా మార్చుకోవాలి అని,అందుకు ఓ రకమైన ధైర్యమని కూడా ఆమె భావించింది.
ఈ గిరిజన జీవితాల్లో ఎన్నో ఆచారాలు,ఆచార పరిహారాలు,తప్పుకు శిక్షలు కూడా ఉన్నాయి. ఈ ఆచారాల్లో ఒకటి స్త్రీ,పురుషులు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చు. స్త్రీకి ఓలి ఇచ్చి పెళ్ళి చేసుకుంటారు. ఒకవేళ విడిపోయే పరిస్థితి ఉంటే ఆ ఓలిని తిరిగి ఇవ్వాల్సిందే. అలాగే అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా ఇంకేదైనా తప్పు చేయడం వంటి జరిగితే ఆ ప్రాంతపు ధర్మకర్త జరిమానా ద్వారా ఆ పరిహారం చేస్తాడు.
తిరుమి పిల్లల మీద ఉన్న ప్రేమ వల్ల ఏకపత్నివ్రతం పాటించింది. సడయన్ మిత్రులు పెరియస్వామి,యాండి. సంతకు సరుకు తోలాల్సిన సమయంలో అటవీ అధికారులు దౌర్జన్యంగా సగం లాక్కుపోవడంతో మిగిలిన సరుకును కొడుకుతో కలిసి తీసుకువెళ్తాడు తిరుమన్. అక్కడ ఆ సంతలో కొనడానికి వచ్చిన వర్తకులు మొదట అమాయక గిరిజనులకు ఎక్కువ రేటు అడగటం,ఆ తర్వాత సంత అయిపోయే సమయానికి ఏమి కొనకుండా ఉండటం వల్ల నష్టానికి అందరూ అమ్ముకోవాల్సి వస్తుంది. చౌకగా ఆ అమాయక గిరిజనుల నుండి వారి సరుకును కొనుక్కోవడానికి ఆ వర్తకులు అలా వారికి ఆశ కలిగించి చేశారని ఆ అమయకులకు అర్ధమైనా,దానిని తమ నిస్సహాయతగా భావించి సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నారు. ఆ సంతలో డబ్బులు వస్తే తమ కూతురికి పెళ్ళి సంబంధం చూడాలనుకున్న తిరుమి దంపతుల ఆశ అడియాస అవ్వడంతో ఉన్న పంది పిల్లల్లో రెండు పంది పిల్లలను అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అదే సమయంలో గ్రామ సభలో వ్యభిచార న్యాయం,ఏరువాక ముహూర్త ధిక్కరణ న్యాయం,బహిష్టు న్యాయం ధిక్కరణ చర్చించడానికి అందరిని పిలవడం జరుగుతుంది.అందులో సడియన్ మిత్రుడు పెరియార్ వివాహితతో సంబంధం కలిగి ఉండటం నిరూపించబడటం వల్ల అతను ఆ ఊరంతటికి మాంసాహార విందుతో పాటు డబ్బు చెల్లించాల్సి రావడం అతనికి తలకు మించిన భారం అవుతుంది. గత సంవత్సరం కోతలు ముగిసిన తర్వాత కొత్త సంవత్సరం మడిని దున్ని విత్తడానికి మునుపు, అందుకని వున్న కుటుంబం ‘ఏరువాక ముహూర్తం’ పాటించాలి. తర్వాతే మిగతా అందరూ తమ తమ భూములను దున్నుకోవాలి. ఆ రోజు గురించి దండోరా వేసి చాటింపబడుతుంది.ఆ రోజు ఎవరింటిలోనూ పొయ్యి రాజేయకూడదు. పెసలు వుడకపెట్టకూడదు. స్నానం చేయరాదు. బట్టలుతకరాదు. పనులు చేయరాదు. ముళ్ళకంపలు కాల్చరాదు. వీటిని ఉల్లంగించడం నేరమవుతుంది.ఆ ముహూర్తం రోజున తిరుమన్ ఆ రోజు గురించి మర్చిపోయి ముళ్ళకంపలు కాల్చడం వల్ల నష్ట పరిహారం కట్టాల్సి వస్తుంది. తెలియక చేసిన తప్పు అయినా క్షమించే లక్షణం లేకుండా ఒక్కో తప్పును వెతికి దాని ద్వారా ధర్మ కర్త సంపాదించే యోచనలో ఉంటాడు. ఆ తర్వాత బహిష్టు సమయంలో ఆ ఊరికి ఉన్న ఉమ్మడి గుడిసెలో ఉండకుండా ఉంటే అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఇలా ఆ గిరిజనవాసుల చేసే చిన్న చిన్న తప్పిదాల కోసం వేచి చూసి వారి నుంచి నష్ట పరిహారం ద్వారా దోపిడి చేసే వ్యవస్థ అక్కడ అప్పటికే ఆచారాల ముసుగులో నిలదొక్కుకుంటూ ఉండిపోయింది.
తిరుమన్ ఆ నష్టపరిహారం వల్ల ఇంకో రెండు పంది పిల్లలను అమ్మవలసి వస్తుంది. అలా జీవితంలో ఏం జరిగినా సరే అందులో సహజంగా జరిగే కష్టాలకు బాధ్యులు అవ్వడంతో పాటు దానికి పరిహారం కూడా చెల్లించే పరిస్థితుల్లో ఉంటారు ఆ గిరిజనవాసులు. సడయన్ స్నేహితుడైన వెళ్ళియన్ భార్యను డబ్బు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తీసుకువెళ్తాడు. శ్రీ లంకలోని ఫ్యాక్టరీలో పని చేసి కొండిమలైలో స్థిరపడిన వాడు శ్రీరంగన్. ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను చూసి వాటిని ఎలా ఎదిరించాలనే నిర్ణయం తీసుకున్నాడు. అతను శ్రీలంకలో ఉన్న సమయంలో అక్కడి సంఘాలను,వాటి ద్వారా సమస్యల పరిష్కారానికి చేసే ఉద్యమాలను చూసి ఉన్నాడు. వెళ్ళియన్ భార్యను తీసుకుపోవడం చూసిన శ్రీరంగన్ వెళ్ళియన్ కు ధైర్యం చెప్పి ఆ వడ్డీ వ్యాపారి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ పోలీసు అధికారి ఆ వడ్డీ వ్యాపారికి సానుకూలంగా మారిపోయి వెళ్ళియన్ ను భయపెట్టి మరలా అతని చేత ఆ వ్యాపారి దగ్గర అప్పు చేయించి,అదే ముడుపుగా తీసుకుని,అతన్ని కొట్టి వదిలేస్తారు. తన కళ్ళ ముందే జరిగిన అన్యాయాన్ని చూసిన శ్రీరంగన్ పక్క పట్నంలో ఉన్న సంఘం నాయకులను కలిసి ఆ గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను గురించి చెప్తాడు. సంఘం నాయకుడు ఈ సమస్యలను పరిష్కరించడానికి తాము వారితో ఉన్నామని హామీ ఇస్తాడు.
ఓ రోజు అడవిలో పశువులను మేపుకోవడానికి కొండిమలై ప్రాంత వాసులు వెళ్తూ ఉండగా అక్కడికి వచ్చిన అధికారులు వారు అలా మేపుకుంటున్నందుకు కూడా డబ్బు వసూలు చేస్తారు. అలా డబ్బు కట్టని సడియన్,శ్రీరంగన్ లను అరెస్ట్ చేసి,వారు అడవిలో చెట్లను నరుకుతున్నారనే తప్పుడు కేసు పెట్టి వారికి శిక్ష పడేలా చేస్తారు. జైలులో ఉన్న సమయంలోనే సడియన్ అక్కడ ఆ జైల్ లో ఉన్న ఖైదీల కోసం పోరాడుతున్న కుమార్ అనే నాయకుడిని చూస్తాడు. అక్కడ ఉన్న సమయంలోనే సడయన్ చైతన్యవంతుడవుతాడు. వెళ్ళియన్ సంఘ నాయకుడి సాయంతో తన భార్యను విడిపించుకుంటాడు.
విడుదల తర్వాత కొండిమలై ప్రాంత ప్రజల కోసం సడయన్ ఓ సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ప్రాంతవాసులకు ఉన్న ఇంకో సమస్య సంత కింద జరగడం. సంత పైనే జరగడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఆ గిరిజన వాసులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా అక్కడి అధికారులు తమ లాభానికి వాడుకుని ఆ ప్రజలను మోసం చేస్తూ ఉంటారు.అప్పుడే సడయన్ వైపు చైతన్యవంతమవుతున్న వారి తోటలను,సడయన్ తోటలను ధ్వంసం చేస్తారు.అక్కడ ప్రజలు ఉంటున్న భూముల్లో అవి వారివి కాదని ప్రభుత్వానివని చెప్పి అక్కడ జెండాలు పాతేస్తారు. అమాయకంగా అధికారులు చెప్పిన చోటల్లా వేలుముద్రలు వేసిన ఆ అమాయకుల జీవితలను అడుగడుగున ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. అప్పటి వరకు సడయన్ వల్లే తమకు కష్టాలని భావించిన తిరుమన్ కూడా తన ఇంటిని ఆక్రమించుకుని,కూల్చబోతున్న సమయంలో వారికి అడ్డుగా నిలబడతాడు.అతన్ని అరెస్ట్ చేస్తారు. ప్రజలందరూ ఎదురు తిరుగుతారు. వారిలో చైతన్యం క్రియాశీలకమయ్యింది అని స్పష్టం చేయడంతో ఈ నవల ముగుస్తుంది.
ఈ నవలలో విద్య-న్యాయం ల గురించి తెలియని వారిని ఆచారాల,అధికార భయాలతో ఎలా దోచుకునే సమాజం కూడా ఈ మానవ సమాజంలో ఎలా భాగంగా కలిసిపోయిందో రచయిత స్పష్టం చేశారు. విద్య,తమ హక్కులు తెలుసుకోకపోతే మనిషి నాగరికత నుండి మరలా దోపిడి వ్యవస్థకు బానిసగా మళ్ళినట్టే.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ