ఇన్ సెన్సిటివ్ లోకంలో!

 

                                    ఇన్ సెన్సిటివ్ లోకంలో!

                                                           -శృంగవరపు రచన


       ఈ లోకంలో సెన్సిటివిటీ అంటే వ్యక్తికి తన ఎమోషన్స్ పట్ల ఉండే  భావోద్వేగ సున్నితత్వంగా భావించబడుతున్నా, వ్యక్తి సమాజంలో ఇతరుల పట్ల ఎంత సెన్సిటివ్ గా వ్యవహరిస్తాడు అన్నది ప్రశ్నార్ధకమే. ఎంపతీ లేని సెన్సిటివిటీ ఉన్న లోకంలో వ్యక్తి ప్రతిభా, సామర్ధ్యాలకు ప్రాధాన్యత దక్కకుండా, బాహ్య సౌందర్యానికి- భౌతిక స్వరూపానికి మాత్రమే విలువ దక్కే  సమాజపు దృష్టిలో వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే. రాజీ పడిపోతే జీవితం గడిచిపోవచ్చు, కానీ వ్యక్తిగా తన విలువను నిలబెట్టుకుంటే మాత్రం జీవితానికి ఓ అర్ధం ఏర్పడుతుంది. ఏ వ్యక్తి అయినా తన ప్రతిభా సామర్ధ్యాలకు అనుగుణంగా ఓ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ లక్ష్య క్రమంలో సమాజం పైకి పాటించకుండా చెప్పబడే ఆదర్శాలకు, హక్కులకు విలువ ఇవ్వదు. ఇది అందరికి  తెలిసిందే అయినా కొందరే తమ హక్కుల కోసం పోరాడి వ్యక్తి సమాజంలో తీసుకురాగలిగిన మార్పుకు నిదర్శనంగా నిలుస్తారు. ఆ నిదర్శనమే డాక్టర్ చెళ్లపీల్ల సూర్యలక్ష్మి గారి అపజయాలు కలిగిన చోటే... నవలాంశం. ఈ నవలకు 2016 లో ఆంధ్రభూమి వీక్లీ నవలా రచనా పోటీలో తృతీయ బహుమతి లభించింది.  దివ్యాంగుల పట్ల ఉన్న సామాజిక దృక్కోణాన్ని, వారి హక్కులు సహాయార్ధకాలుగా మారే క్రమాన్ని, వారు తమ జీవితంలో శారీరక వైకల్యం పట్ల కన్నా, తమ ఉనికి హక్కుల కోసం చేసే యుద్ధమే వారి జీవితంలో ప్రధానంగా మారే క్రమాన్ని ఈ నవల స్పష్టం చేస్తుంది. మనుషుల్లో ఓ రకం మనుషులు  ఊహల ఆధారంగా జీవితం ఎలా ఉండాలో అన్న అంశాన్ని నిర్ణయించుకుంటాడు. ఆ ఊహల్లో ఉండే పర్ఫెక్షన్ ను తనకు ఎదురయ్యే అన్ని అంశాల్లో ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా లేని వాటి పట్ల ఓ రకమైన ఏహ్యత ఏర్పరచుకుంటారు.ఇటువంటి మనుషుల్లో ఎంపతీ లోపిస్తుంది. ఆ ఎంపతీ లేకపోవడం వారు తమ లోపంగా కూడా ఎప్పటికీ గుర్తించలేరు. అటువంటి మనుషుల్లో మార్పు రావలసిన అవసరాన్ని కూడా ఈ నవల స్పష్టం చేస్తుంది.

      ఈ నవలలో ప్రధాన పాత్ర చేతన. ఆమెకు పుట్టుకతోనే హెమీప్లీజియా అనే రుగ్మత ఉంది. దాని వల్ల ఆమె ఎడమ కాలు కుడి కాలు కన్నా చిన్నగా ఉండేది. ఒక కుడి చెయ్యే సరిగ్గా పని చేస్తుంది. రెండు చేతుల మధ్య సమన్వయం సరిగ్గా ఉండదు. బాల్యంలో తనకు ఉన్న రుగ్మత వల్ల ఎదురైన ఇబ్బందులలో శారీరకమైనవి ఎలా అధిగమించాలో,ఎలా  వాటితో జీవించాలో అన్న అంశాన్ని తన అనుభవాల సాయంతోవాటికి అనుగుణంగా జీవన విధానాన్ని అలవర్చుకున్నా, ఉద్యోగ చోటులో తన హక్కులను కాపాడుకోవడానికి, సమాజంలో దివ్యాంగుల హక్కుల పట్ల అవగాహన లేని సమాజం, సహానుభూతి లేకుండా ప్రవర్తించే తీరు వల్ల చేతన ఎదుర్కున్న ఇబ్బందులు, ఆమె చేసిన పోరాటానికి, ఆ క్రమంలో ఆమె అనుభవించిన ఒత్తిడి-సమస్యలకు అక్షరరూపమే ఈ నవల. 

      ఈ నవలలో సాధారణ వ్యక్తిత్వం, మొక్కవోని పట్టుదల ఉన్న వ్యక్తిత్వం చేతనది. ఆమెలో సాధారణ మనుషులకు ఉండే కోపం, ఆవేశం, తనను వ్యక్తిగా తన సామర్ధ్యాల రీత్యా గౌరవించకుండా తన  రుగ్మత పట్ల విముఖంగా ప్రవర్తించే  సమాజ దృష్టి పట్ల ఆక్రోశం ఉంది. ఆ ఆక్రోశం బాధగా మిగిలిపోతే  అది పోరాటం అయ్యేది కాదు కానీ అన్యాయాన్ని ఎదిరించాలన్న పట్టుదల, తనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి పడ్డ తపన ఆమెను ఈ నవలకు ప్రధాన పాత్రగా మారేలా చేసింది. తెలుగు సాహిత్యంలో దివ్యాంగుల మీద వచ్చిన సాహిత్యంలో, దివ్యాంగులు తమ సామర్ధ్య ఆధారంగా సమాజంలో సాధారణ మనుషులలా జీవించాలన్న ఆశయాన్ని స్పష్టం చేసే రచనలు  ఎక్కువగా రాలేదనే చెప్పాలి.

      చేతన ఆలోచనలను అర్ధం చేసుకుంటే ఆమె ద్వారా దివ్యాంగులు ఆశించేవి  గౌరవం, తమను సాటి మనుషులుగా చూడగలిగే దృక్కోణాన్ని, తమ పట్ల విముఖతను  ముఖం మీద ప్రదర్శించే మనుషుల ఆలోచనల్లో రావాల్సిన మార్పును, తమ లోపాన్ని అధిగమించి ఎదిగితే దాని పట్ల సంతోషపడకపోయినా, ఆ ఎదుగుదలకు అడ్డు పడే మనుషుల్లో మార్పును అని స్పష్టం అవుతుంది.

         ఈ నవలలో చేతన సమస్యలను రెండు కోణాల్లో చూడవచ్చు. ఒకటి ఆమె రుగ్మత వల్ల తలెత్తివి అయితే, రెండోది సమాజం వల్ల ఆమె ఎదుర్కున్నవి. శారీరకంగా ఆ రుగ్మత ఏర్పడటం వల్ల  బెల్ట్ లేని చెప్పులు వేసుకోలేకపోవడం, ముగ్గు సులభంగా వేయలేకపోవడం, టేబుల్ మేనర్స్ పాటించలేకపోవడం, టైప్ చేయలేకపోవడం వంటివి అయితే చేతన వాటికి తగ్గట్టు తానే మారింది. స్కూల్ లో ఆటల్లో పాల్గొనలేకపోవడం కూడా జరిగింది. స్కూల్ కి సర్జికల్ షూస్ వేసుకువెళ్లాల్సి రావడం, వీటి అన్నింటికీ తగ్గట్టు ఎప్పుడూ వ్యాయామాలు చేస్తూ ఉండటం కూడా చేసేది. స్కూల్ లో ఆమెను బాల్యంలోనే తోటి పిల్లలు, విముఖత ప్రదర్శించే ఉపాధ్యాయులు ఆమెను బాధించేవారు. ఏ మనిషి తన చేతిలో లేని దాని పట్ల బాధ్యత వహించలేడు. అలాగే చేతన ఈ రకంగా ఉన్న సమాజ దృష్టి పట్ల బాధ ఉన్నా, తన లక్ష్యం పట్ల దృష్టితో ముందుకు సాగడమే నేర్చుకుంది.

        తన ప్రతిభతో పోటీ పరీక్షలో విజయం సాధించిన చేతన  ట్రెయినింగ్ సమయంలో కూడా తన హక్కులను నిలుపుకోవడానికి  ప్రశ్నించాల్సి వచ్చింది. ఆ సమయంలో పుస్తకాలు రాజ్యాంగ హక్కు ప్రకారం ఆమె గదికే తెచ్చి ఇవ్వాలి. కానీ అది జరగలేదు. చేతన అక్కడ ఉన్న తోటి వారిని అడిగినా సానుభూతితో స్పందించే వారు తక్కువే. విసుగెత్తిన ఆమె తన హక్కు గురించి యాజమాన్యాన్ని ప్రశించిన తర్వాతే ఆమె పుస్తకాలు ఆమెకు అందించబడ్డాయి. అలాగే ఆమె రుగ్మత వల్ల టైపిన్ చేయలేని స్థితిలో ఉన్నా ఓ పరీక్షా పత్రంలో దానికి చెందిన ప్రశ్నలే ఉండటంతో ఆమె దానిని కూడా ప్రశ్నించి విజయం సాధించింది.

      ప్రభుత్వ ఉద్యోగినిగా మారాక ఆమె ఎన్నో చోట్లకు బదిలీ అయ్యింది. ఆమె దివ్యాంగురాలన్న దృష్టితో కాకుండా సాధారణ మనుషులలా తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగాలని అనుకున్నది. అందుకోసమే దివ్యాంగుల కోసం ఉన్న ప్రత్యేక లాభాలకు ఆమె దూరంగా ఉండటమే కాకుండా పిహెచ్ సర్టిఫికేట్ కూడా పెట్టలేదు. ఆమె ఆత్మస్థైర్యాన్ని అభినందించే సమాజం లేకపోయినా, ఆమెను ఇబ్బంది పెట్టే అధికారుల మధ్య ఆమె పని చేయాల్సి వచ్చింది. దివ్యాంగులు పని చేసే చోట వారు నడవటానికి వీలుగా ర్యాంపులు, వారి జీవనాన్ని కష్ట పెట్టని మౌలిక వసతులు ఉండాలన్న రాజ్యంగ హక్కుల గురించి తెలియకపోయినా మనుషులుగా తోటి మనుషుల పట్ల ప్రవర్తించే తీరు తెలియని వారి పట్ల చేతన మెలగాల్సి రావడంతో ఆమె ప్రతి సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం పోరాటమే చేయాల్సి వచ్చింది.

      ఓ చోట లిఫ్ట్ లేకపోవడం, ఇంకో చోట ఆమె ఎక్కువ మెట్లు ఎక్కే స్థితి లేకపోయినా పై ఫ్లోర్స్ లో క్యాబిన్ ఇవ్వడం జరిగినా పని మీదే దృష్టి పెట్టి పదోన్నతులు పొందింది. ఈ క్రమంలో ఆమె కాలు ఒక సారి బెణకడం, అది వైద్యుల నిర్లక్ష్యం వల్ల పెద్ద సమస్య అవ్వడం, ధ్యానం-యోగా-డైట్ , స్పోర్ట్స్ థెరపిస్ట్ సాయంతో పట్టుదలతో ఆరోగ్యం పొందడం జరిగింది. ఆమె మీద ఉన్న వ్యక్తిగత కక్షతో ఓ అధికారి ఆమెకు టాయ్లెట్ వసతి లేని క్యాబిన్ ఇవ్వడం, దాని కోసం ఆమె అరమైలు దూరంలో ఉన్న ఇంకో ఆఫీసుకు వెళ్లాల్సి రావడం, టాయ్లెట్ కట్టడానికి ఆ అధికారి అడ్డంకులు కల్పించడం జరిగితే పొరాడి కోర్టు ద్వారా తన హక్కును సాధించుకున్నా,ఆమెను ప్రమోషన్ లిస్టు నుండి తప్పిస్తే మరలా దాని కోసం కూడా ఆమె యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి దివ్యాంగుల కోసం పోరాడుతున్న స్వచ్చంధ సంస్థలో పని చేయాలని నిర్ణయించుకుంటుంది.

        సమాజంలో ఎంపతీ లోపించడం వల్ల ఇతరుల జీవన హక్కును గుర్తించే సంస్కారం లేకపోవడం వల్ల, మనుషులను రూపం ఆధారంగా కాకుండా గుణం ఆధారంగా గుర్తించే స్వరూపం లేకపోవడం వల్ల దివ్యాంగుల జీవించే హక్కు ఎలా హరించబడుతుందో, దానిని సమస్యగా పట్టించుకోలేని సంస్కృతిలో మనుగడ ఎంత కష్టమో, ఇటువంటి సంస్కృతిలో మార్పు రావాలంటే ప్రశ్నించి పోరాడటం తప్పనిసరి అని ఈ నవల స్పష్టం చేస్తుంది. ఈ ఇన్ సెన్సిటివ్ సమాజంలో తోటి మనుషుల పట్ల ఉండాల్సిన సెన్సిటివిటీని కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను ఈ నవల స్పష్టం చేస్తుంది.దివ్యాంగుల పట్ల మారాల్సిన దృక్కోణం గురించి స్పూర్తి దాయకమైన నవల రాసిన రచయిత్రికి ఈ సందర్భంగా అభినందనలు.

(పుస్తక ప్రతుల కోసం రచయిత్రిని నేరుగా9445184363 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. )

                             *          *        *    

Comments

Post a Comment

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!