అన్వేషణ-స్పృహ
అన్వేషణ-స్పృహ
కోట్ల మంది మనుషులతో నిండిన ఈ ప్రపంచంలో కోట్ల వ్యక్తుల ఏకైక స్పృహల- సందేహాల-భయాల కూడికలు, హెచ్చవేతలు, భాగింపులు, తీసివేతలు ఎప్పటికప్పుడూ అనేకమైపోతూ,ఆ అనేకంలో మరలా ఏకత్వాన్ని వెతుక్కునే మానసిక సంఘర్షణ, అన్వేషణ 'ఏకం' సినిమా.
కష్టాలు ఎదురైనప్పుడూ కొందరూ వాటిని సహజంగా భావించి ఆ దారిలోనే ముందుకు వెళ్తే, ఇంకో వర్గం వారు మాత్రం ఆ కష్టాలలో ఉన్న ప్రపంచాన్ని విడిచి తమ ప్రపంచాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు.ఆ ఇంకో వర్గం వారు తమ ప్రపంచాన్ని పంచభూతాల్లో ఒక్కో తత్త్వమై ఎలా తమను సమాజం-జీవితం నుండి విడిగా తమను తాముగా చూసుకునే ప్రయత్నం చేసారో స్పష్టం చేసే సినిమా ఇది.
ఇందులో జలతత్వానికి ప్రతీక అయిన పాత్ర డేవిడ్. అగ్ని తత్వానికి ప్రతీక నిర్వాణ పాత్ర. ఆకాశానికి ప్రతీక అయిన పాత్ర అప్పయ్య. పృథ్వికి ప్రతీక దివ్య. వాయువుకు ప్రతీక ఆనంద్ పాత్ర.
ఆకలి-పేదరికం-అనాధగా మారిన పరిస్థితుల్లో కిరాయి హంతకుడిగా మారిన డేవిడ్ 'ఏకం'పుస్తకంలో తనను తాను వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు. అప్పటి నుండి మారిపోతాడు. తాను ఓ వ్యక్తిని ప్రేమించాక, ఓ మాల్ లో ట్రయల్ రూమ్ లో బయట పడిన వీడియో వల్ల ప్రేమను, కుటుంబాన్ని, సమాజంలో గౌరవాన్ని కోల్పోయిన పాత్ర నిర్వాణ.అప్పయ్య ఓ వైష్ణావాలయంలో అర్చకుడు. అరవై ఏళ్ళ వయసు రావడంతో ఉద్యోగం పోవడంతో దేవుడి మీద ఆ కోపాన్ని ప్రదర్శించే భాగంగా దైవ విగ్రహాన్ని స్మశానంలో ఉంచి, తను అక్కడే ఉండిపోతాడు. దివ్య కాఫీ షాప్ పెట్టాలన్న కలను నిజం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో కాఫీ షాప్ పెట్టిన సఫలం కాలేకపోతుంది. ఇక ఆనంద్ ఉద్యోగం రీసెషన్ వల్ల లేకపోవడం, గర్ల్ ఫ్రెండ్ వదిలెయ్యడంతో అనాధ కావడంతో తన జీవితాన్ని తానే అన్వేషించుకునే మార్గంలో ఉంటాడు.
పృథ్వి తత్త్వం కల దివ్య బాయ్ ఫ్రెండ్ సంతోష్. ఆమెను ప్రోత్సహిస్తున్నట్టే ఉంటూ ఆమె చేతే కాఫీ షాప్ మూయించే ప్రయత్నం చేస్తాడు సంతోష్. అదే సమయంలో డేవిడ్ తన పాత జీవితానికి స్వస్తి చెప్పి ఆ కాఫీ షాపులో ఉద్యోగం కోసం రావడం, డేవిడ్ కు వివిధవైవిధ్యాల్లో కాఫీ పెట్టే అనుభవం ఉండటం, రోజుకో రకం కాఫీ అనే ఐడియాతో మొదలుపెట్టిన దివ్య అతని సాయంతో తన కలతో కలిసి బ్రతకడం, తన నుంచి తననే దూరం చేయడానికి ప్రయత్నించిన సంతోష్ ను వదిలివేయగలగడం ఆమెలో పృథ్వికి ఉండే బ్యాలనస్డ్ నేచర్ వల్ల వచ్చింది. జల తత్త్వం కల డేవిడ్ తనకు ఒప్పు అనిపించే చిన్న కలలో కూడా తన రూపాన్ని మార్చుకోగలగడం వల్ల అతని ప్రపంచాన్ని ఒక కలకు ఆసరాగా ఉండటంలో నిర్మించుకున్నాడు. ఈ రెండు పాత్రలు తమ అన్వేషణను తమ ఆలోచనలు-ఇష్టాలు-కలల పరిధిలో సాగిస్తూ తమ సంతృప్తి అనే ప్రపంచాన్ని నిర్మించుకున్నారు.
నిర్వాణ తను పొందిన అవమానం, ఎవరూ లేకపోవడం, నిస్సహాయతల వల్ల ఈ సమాజం-ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచాన్ని నిర్మించాలనుకుంది. దానికి ఊతమైన భావొద్వేగాలు బాధ, కోపం మాత్రమే.నిర్వాణ సంఘం పేరుతో ఓ వ్యాను ఉండటం, అందులో ఓ వాయిస్ మెసేజ్ లో ఒకతను ప్రపంచాన్ని మార్చాలనుకోవడం అని చెబితే, అగ్నిలా దాని మీదే వ్యాపిస్తూ తన ప్రపంచాన్ని నిర్మించుకుంది. ఇక ఆనంద్ ప్రపంచం అంతా తిరుగుతూ, కోట్ల మంది ఆకలి తీర్చే దేవుడు తన గురించి కూడా పట్టించుకుంటాడన్న నమ్మకంతో ఏకాంతంగా సంచారిస్తూ తన అనుభవాలతో తన ప్రపంచాన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు. నిర్వాణ ఉన్న వ్యాన్ దగ్గరకు వచ్చిన అతను తన అనుభవంతో ఆమె ఏం చేస్తుందో అన్న అంశం గురించి ఆలోచించేలా చేస్తాడు. అంతకుముందు ఓ డ్రగ్ ఎడిక్ట్ ఆ వ్యాన్ లో అలా ప్రపంచాన్ని మారుస్తా అని చెప్తూ మరణించడం, అతన్ని పిచ్చి వాడిగా అందరూ భావించడం గురించి చెప్తాడు ఆనంద్ ఆమెకు. అతను తన సందేహాలు-సమాధానాలు రాసుకున్న పుస్తకం ఆమెకే ఇచ్చేస్తాడు. అది రాసేసాక తనకు దానితో ఎటాచ్మెంట్ లేదని అంటాడు.దానినే 'ఏకం'పుస్తకంగా ప్రచురించి తన జీవిత మార్గం ఏమిటో తెలుసుకుంటుంది నిర్వాణ.
అప్పయ్యను స్మశానంలో కలుస్తాడు ఆనంద్. దేవుడిని శిక్షించాడని భావిస్తున్న అతనితో ఆనంద్,'ఒకవేళ నువ్వు శిక్ష-నిరుద్యోగం అనుకున్నది దేవుడు మార్పు అనుకుని ఉండవచ్చు.దేవాలయంలో ఉన్న దేవుడు స్మశానంలోకి అనుగుణంగా మారిపోయాడు. మార్పు, జీవితం లో జరిగే వాటితో జీవితం చెప్పే వాటిని ఎలా చూడాలో అప్పయ్య ఆనంద్ మాటలతో తెలుసుకుంటాడు.
వాయువు తత్త్వం ఉన్న ఆనంద్ సత్యంతో ఎటాచ్మెంట్ ను, అనుభూతి-అనుభవాలతో డిటాచ్మెంట్ ను పెంచుకుంటూ, నిత్యాన్వేషణనే జీవితం చేసుకుని, అందులో సంతోషం పొందుతూ సాగిపోయాడు.
సమాజం ఏర్పడింది అనేక నమ్మకాలతోనే. మనుషులు నమ్మితే ఉండేదే సమాజం. మనిషికి ఉండే అనేక నమ్మకాల నుండి మనిషి తనను నిర్వచించే ఏక నమ్మకంతో సాగితేనే తను ఏకమైన ప్రపంచం అతనికి ప్రత్యక్షమవుతుంది.
* * *

Comments
Post a Comment