సొంత వారి తప్పులు!

  సొంత వారి తప్పులు!

-శృంగవరపు రచన



మనిషి అందరిలోని తప్పులు వెదుకుతాడు. తాను ప్రేమించేవారు, తన వారు మాత్రం తప్పు చేయరు, చేయలేదు అనే భావిస్తూ ఉంటాడు. దీనికి మినహాయింపు కష్టమే. ఆ తప్పు ఎలా స్థాయిల వారీగా జరిగిపోతుందో అన్న అంశాన్ని చక్కగా రాశారు పి.సత్యవతి గారు తన కథ ‘దొంగ’లో. ఈ కథలో ముఖ్యపాత్రలు క్యాథరిన్ మరియు ఉషాబాల. ఇద్దరు పిల్లలే. ఒకే స్కూల్ లో చదువుకుంటూ ఉంటారు. క్యాథరిన్ తల్లి నర్స్. తండ్రి చనిపోవడంతో తల్లే కుటుంబాన్ని నడపాల్సి వస్తుంది. స్కూల్ లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్న క్యాథరిన్ ను వైట్ సాక్స్ వేసుకురావడం లేదని టీచర్ హెచ్చరిస్తూ ఉంటుంది. తల్లిని అడిగినా కొని పెట్టలేని పరిస్థితి.
ఉషాబాల తల్లిదండ్రులు ధనవంతులు.ఆమెకు చదువుతో పాటు నాట్యం కూడా నేర్పిస్తూ ఉంటారు. ఆమెకు ఆసక్తి లేదు. చదువు కన్నా ఇతర వ్యాపకాల ద్వారా తమ కూతురి గొప్పతనాన్ని తమ స్థాయిలో ప్రదర్శించాలని ఆమె తల్లి తపన. పరీక్షలు దగ్గరికొచ్చాయి. ఉషాబాల ఎప్పుడు తెలుగులో మంచి మార్కులు తెచ్చుకోలేదు. క్యాథరిన్ అవసరాన్ని గుర్తించి ఆమెకు వైట్ సాక్స్ లు కొనిపెట్టి ఆమె పరీక్ష పేపర్ నుండి కాపీ కొడుకుతుంది.క్యాథరిన్ కు మొదటి ర్యాంకు వస్తే , ఉషాబాల కు మూడో ర్యాంకు వస్తుంది. ఇంట్లో సొరుగులో ఉన్న పది రూపాయలతో క్యాథరిన్ కు ఓ మిల్క్ చాక్లెట్ కొనిపెడుతుంది.
తప్పు చేసి మూడో ర్యాంకు తెచ్చుకున్నానన్న భావన ఉషకు కలుగదు. ఎంతో సంతోషంగా ఇంటికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తో వస్తుంది. అప్పటికే ఇంట్లో ఉన్న పది రూపాయలు ఆ ఇంట్లో పని చేస్తున్న పనిపిల్ల తీసిందని భావించి ఉషా తల్లి ఆమెను చితకబాదుతుంది. ఆ దృశ్యం చూసి ఎంతగానో బాధ పడి తాను చేసింది అంతా చెప్తుంది. అంతకు ముందు రోజు చైల్డ్ సైకాలజీ మీద ఇచ్చిన ఉపన్యాసం గుర్తుకు వచ్చిన ఆమె తల్లి షాక్ అవడంతో కథ ముగుస్తుంది.
క్యాథరిన్ కు పేదరికం వల్ల తప్పు చేయాల్సి వచ్చింది. ఉషాబాల చదువుకునే సామర్ధ్యం లేకపోవడం వల్ల తప్పు చేయాల్సి వచ్చింది. వీరిద్దరి తప్పులు బయట పడలేదు. అందుకే ఉషారాణి తప్పు చేసి తెచ్చుకున్న ర్యాంకు పట్ల గర్వంగా ఉంది. కానీ పనిపిల్ల మాత్రం చేయని తప్పుకి తన స్థాయి వల్ల, ఆ ఇంటి యజమానురాలు ఆమె మీద సంపాదించుకున్న అధికారం వల్ల తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వచ్చింది.తప్పుల వల్లే మనుషులను దొంగలుగా లేదా ఒక్కో అభిప్రాయముద్రతో పరిగణించబడతారు.
ఎవరో అన్నట్టు, ‘తప్పు చేయాలంటే భయం వేస్తుంది. కానీ చేశాక మొండి ధైర్యం వస్తుంది. అది సహజమేనని తనకి తాను నమ్ముతూ ఇతరులను నమ్మించే ప్రయత్నం చేస్తాడు మానవుడు.’ ఆ తప్పు బయటపడటమే మనిషి తనకు ప్రతికూలంగా మారిన పరిస్థితుల పట్ల తప్ప తప్పు పట్ల చింతించని పరిస్థితి ఉంది. చిన్న కథ అయినా ఆలోచింపజేసే కథ.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ