అస్థిత్వ సంఘర్షణ
అస్థిత్వ సంఘర్షణ
-శృంగవరపు రచన
విశ్వ సాహిత్యంలోకి భారతీయులు బాష,వాతావరణం,వైవిధ్యాలతో 1980 ల్లోనే అడుగుపెట్టారు. ఎందరో తమిళం,కన్నడ,మలయాళం రచయితలు,ఉత్తర భారతదేశ రచయితలు ఆంగ్ల సాహిత్యంలో తమదైన ముద్రను నిలుపుకుంటూనే ఉన్నారు. బుకర్ పురస్కారాలు గత నాలుగు దశాబ్దాల్లో నాలుగు భారతీయ ఆంగ్ల రచనలను వరించాయంటే భారతీయ రచనా లోతుల్లో వచ్చిన గాఢతను ప్రశంసించాల్సిందే. సల్మాన్ రష్దీ ‘మిడ్ నైట్ చిల్డ్రన్ ‘, అరుంధతి రాయ్ ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’, అనితా దేశాయి ‘ద ఇన్ హరిటెన్స్ ఆఫ్ లాస్’ ,అరవింద్ అడిగా ‘ద వైట్ టైగర్’ బుకర్ మార్క్ పొందిన రచనలు. అనితా దేశాయి ‘ద ఇన్ హరిటెన్స్ ఆఫ్ లాస్’ అంశ గాఢత,తాత్వికత,మనుషుల మనసుల్లో ఉండే శూన్యత,గొప్పలు నిరూపించుకోవాలన్న తపన,పట్టించుకోనితనంలో పెరిగే మనుషుల జీవితాలు,తమ బాష-సంస్కృతి-జీవితం కోసం గోర్ఖాలు ఉద్యమం జరుపుతున్న నేపథ్యం మిగిలిన జీవితాలను అతలాకుతలం చేసిన తీరును స్పష్టం చేస్తుంది.
పశ్చిమ బెంగాల్ లో ని కళింపోంగ్ లో ఈ నవల మొదలవుతుంది. ఈ ప్రాంతంలో జెము భాయి పటేల్ అనే విశ్రాంత జడ్జ్ ,వంట వాడు మరియు తన మనవరాలైన సాయితో నివసిస్తూ ఉంటాడు. జెము పటేల్ ఓ కుక్కను కూడా పెంచుకుంటూ ఉంటాడు. దాని పేరు మట్.
జెము ఇంట్లో ఉండే వంటవాడు ఏ బాధాకర పరిస్థితి వచ్చినా తాను పేదవాడినని, నిస్సహాయుడినని బాధ పడుతూ ఉండటానికి అలవాటు పడినవాడు. అతని భార్య గొర్రెలకు మేత తీసుకురావడానికి చెట్టు ఎక్కి దాని మీద నుండి కింద పడి మరణించింది. అతనికి ఒక కొడుకు,బిజు. ఇమ్మిగ్రెంట్ గా అమెరికా వెళ్ళాడు బిజు. కొడుకును అమెరికా పంపించడం గొప్ప విషయంగా భావించి అందరికీ దాని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు వంటవాడు.
ఈ నవలలో మధ్యమధ్యలో జెము జీవితం గురించి కూడా రచయిత్రి మొత్తం పరిచయం చేస్తుంది. జెము తండ్రి కోర్టులో దొంగ సాక్ష్యులను తీసుకువచ్చేవాడు. ఆ రోజుల్లో చదివించడమే గొప్ప అని భావించబడుతుంటే మొత్తానికి జెము ఐసియస్ వరకు ఎదగగలిగాడు. అతన్ని ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ కు పంపడానికి అతని తండ్రి అప్పు చేసినా అది సరిపోకపోవడంతో, అతనికి పెళ్లి చేస్తే వచ్చే కట్నమే మార్గమని భావిస్తాడు. అప్పట్లో బ్రిటిష్ వారితో వ్యాపారంలో ఉన్న ఓ గొప్ప వర్తకవేత్త కూతురు నిమును జెము వివాహం చేసుకుంటాడు. పెళ్ళయిన నెలకే అతను ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు.
దేశం మార్పుతో మనిషికి సంస్కృతి,ఆచార వ్యవహారాలు,మానవ సంబంధాల్లో ఉండే మార్పులు తెలుస్తాయి. వీటితో పాటు మనిషిలో పరాయితనం కూడా కనిపిస్తుంది. ప్రతి మనిషికి తనదైన ఓ ఒరిజినాలిటీ ఉంటుంది. అది అతని నడతలో,స్పందనలో,అభిప్రాయాల్లో,విలువల్లో,సంఘర్షణల్లో స్పష్టమవుతుంది. దీనికి విరుద్ధంగా ఉండే వాతావరణంలో ఎప్పుడు అతను పరాయిగానే మిగిలిపోతాడు. తన వేషధారణ మొదలుకుని అన్ని అంశాల్లో తనను తాను అక్కడ ఉన్నవారితో తక్కువగానే భావించుకున్న జెము మొత్తానికి ఆ సంస్కృతిలో కొంత వంటబట్టించుకుని భారతదేశం తిరిగి వస్తాడు.
జెము పెరిగిన వాతావరణంలో ఏదైనా అందరిదే అన్న భావన ఉంది. ఇంగ్లాండ్ నుండి వచ్చాక తన వస్తువులు,తన జీవితంగా తన పరిధిని మార్చుకున్న అతను తన కుటుంబంతో ఇమడలేకపోతాడు. భార్యతో వేరే కాపురం పెట్టినా వారి మనసుల మధ్య ఎంతో దూరం ఉంది. మెల్లగా అతను హింసతో ఆమెను నియంత్రించే ప్రయత్నం చేశాడు. ఏ పార్టీకి ,ఫంక్షన్ కు వెళ్ళినా ఆమె ఆ సంస్కృతిలో ఇమడలేదని గ్రహించిన జెము ఆమెను ఇంటికే పరిమితం చేశాడు. ఓ రోజు ఆమె ఇంటి పక్క వారు ఆమెను తమతో పాటు తీసుకువెళ్ళారు. నెహ్రూ రైల్వే స్టేషన్ కు కాంగ్రెస్ తరపున వచ్చినప్పుడు ఆయన్ని చూడటానికి వెళ్తున్న సంగతి కూడా నిమికి తెలియదు.జెము అప్పటికే బ్రిటిష్ అధీనంలో ఉన్న భారత దేశంలో పని చేస్తున్న కారణంగా అతని భార్య వారికి వ్యతిరేకమైన కాంగ్రెస్ కు మద్ధతు ఇచ్చిందన్న కారణంగా అతని ప్రమోషన్ వెనుకంజలో పడిపోయింది. అప్పటికే అంతంతమాత్రం ఉన్న ఆ భార్యాభర్తల సంబంధం ఈ విషయంతో ఇంకా బలహీనమై,విడిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ కారణంగా భార్యను పుట్టింటికి పంపేశాడు జెము నిమిని.
నిమి అప్పటికి గర్భవతి అవ్వడం వల్ల అందుకని పంపబడిందని నిమి పుట్టింటివారు భావించారు. ఆ తర్వాత నిమికి ఆడపిల్ల పుట్టింది. తనకు భార్య అవసరం లేదని జెము స్పష్టం చేశాడు. ఆ తర్వాత స్టవ్ పేలి నిమి మరణించడం జరిగింది.బహుశా ఆ మరణానికి తానే కారణమని కూడా భావించాడు జెము. ఆ తర్వాత కూతురుని ఓ కాన్వెంట్ లో చదివించాడు.ఆమె అనాధగా పెరిగిన ఓ వ్యక్తిని వివాహం చేసుకోవడం,వారికి సాయి జన్మించడం జరిగిపోయాయి. ఈ వివాహం తర్వాత కూతురితో ఉన్న బంధాన్ని తెంచుకున్నాడు జెము. సాయి తండ్రికి రష్యన్ స్పేస్ సైంటిస్ట్ గా అవకాశం రావడం వారు కలకత్తాలో సాయిని చదువు నిమిత్తం వదిలి అక్కడకు వెళ్ళడం,అక్కడ యాక్సిడెంట్ లో మరణించడం, ఆ తర్వాత జెము సాయిని తన ఇంటికి పంపమనడం,అలా సాయి ఆ ఇంట్లో వ్యక్తి అవ్వడం జరిగింది.
బిజు అమెరికా వెళ్ళినా అక్కడి వాతావరణంలో ఇమడలేక, ఓ స్థిరమైన వృత్తి లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. చట్ట విరుద్ధంగా విదేశాల్లో ఉండే వారిని తక్కువ వేతనాలతో వెట్టి చేయించే ఆ అమెరికన్ రెస్టారెంట్లలో ఇమడలేకపోవడం ఒక కారణమైతే, గోవును దేవతగా పూజించే దేశంలో జన్మించి బీఫ్ వండే వాతావరణంలో భాగం అవ్వలేకపోవడం,దానిని కాదని భారతీయులు నెలకొల్పిన రెస్టారెంట్లలో పని చేసిన శ్రమదోపిడి తప్పని పరిస్థితులు,పరాయి దేశంలో పరాయి వారీగా మిగిలిపోవడం అతన్ని అమెరికాలో అనాధగా భావించేలా చేస్తాయి. అతని తండ్రి తన కొడుకు అమెరికాలో ఉన్నాడన్న గొప్ప భావంతో తన స్థాయిలో ఉన్న వారి పిల్లలు కూడా అమెరికా వస్తే వారికి కూడా సాయం చేయమని కొడుకుకు ఉత్తరాలు రాయడం తన కొడుకు గొప్పతనాన్ని అందరికీ స్పష్టం చేయాలన్న తపనను స్పష్టం చేస్తాయి.
జెము మధ్యలో ఆగిపోయిన సాయి చదువు కొనసాగడానికి ఆ ప్రాంతంలో ఉన్న నోని దగ్గర ట్యూషన్ పెట్టిస్తాడు. లోలా,నోలా అక్కాచెల్లెళ్ళు. లోలా భర్త మరణించాక అవివాహితురాలైన ఆమె చెల్లెలు నోని ఆమెతో కలిసి ఆమె ఇంట్లోనే ఉంటుంది. సాయికి పదహారేళ్లు వచ్చేసరికి తాను ఆ ఫిజిక్స్,మ్యాథ్స్ చెప్పలేనని నోని స్పష్టం చేయడంతో గ్యాన్ అనే కొత్త ట్యూటర్ ను సాయి కోసం ఏర్పాటు చేస్తాడు జెము. గ్యాన్ ,సాయి ప్రేమలో పడతారు.
ఆ సమయంలో గోర్ఖా ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్,కళింపోంగ్ ప్రాంతాల్లో ఆ ఉద్యమం హింసాత్మకం కూడా అయ్యింది. ఓ రోజు జెము ఇంటికి ఆ ఉద్యమం చేస్తున్న కొందరు యువకులు వచ్చి వారిని బెదిరించి వంట సామానులను, ఆ ఇంట్లో ఉన్న జడ్జి తుపాకులను కూడా తీసుకుపోతారు. ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు జెము. గ్యాన్ ,సాయి ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నా గ్యాన్ మాత్రం తన ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పకపోవడం గుర్తిస్తుంది సాయి. దానికి కారణం అతను బ్రతుకుతున్న పేదరికం,అతను కూడా గోర్ఖా అవ్వడం అని తెలుసుకుంటుంది. తమకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత,అక్కడి పౌరులుగా అన్ని అంశాల్లో గుర్తింపు కావాలని గోర్ఖా ఉద్యమం జరుగుతున్న సమయంలో గ్యాన్ కూడా అందులో పాల్గొంటాడు.
ఇక ఇదే నవలలో ఇంకో రెండు ముఖ్య పాత్రలు ఫాదర్ బూటి,అంకుల్ పాటి. ఈ ఇద్దరూ కూడా జెము పొరుగువాళ్లు. లోలా కూతురు ఇంగ్లాండ్ లో బీబీసి లో పని చేస్తూ ఉంటుంది. ఓ రోజు లోలా,నోని,ఫాదర్ బూటి,అంకుల్ పాటి,సాయి దగ్గరలోని పట్టణ ప్రాంతానికి వెళ్తారు.సాయి,లోలా,నోని లైబ్రరీకి వెళ్ళి వచ్చాక అందరూ కలిసి భోజనం చేసి తిరిగి వస్తున్న సమయంలో సాయికి సీతాకోకచిలుకలు ఇష్టం అని ఆ ఫోటోలు ఫాదర్ బూటి తీస్తాడు.అదే సమయంలో పోలీసులు వారి వాహనాన్ని పట్టుకుంటారు. బూటి ఆ ఫోటోలో బ్రిడ్జిని తీశాడని ఆరోపిస్తారు.అలాగే లోలా తీసుకున్న పుస్తకాలను,కెమెరాను తీసుకుంటారు.వాటిని తిరిగి తర్వాత ఇచ్చేసినా ఫాదర్ బూటి స్విస్ ప్రీస్ట్ అయ్యి ఉండి, ఇక్కడ న్యాయ విరుద్ధంగా డైరీ నడపటం నేరం అని చెప్పి అతను వారంలో అక్కడి నుండి ఖాళీ చేసేలా చేస్తారు. అదే రోజు సాయి గోర్ఖా ఉద్యమంలో పాల్గొన్న గ్యాన్ ను చూస్తుంది సాయి.
ఏ ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడూ సాయికి ట్యూషన్ చెప్పడం ఓ మంచి అవకాశంగా కనిపించిన గ్యాన్ కు,గోర్ఖా ఉద్యమంలో భాగం అయ్యాక తనను వారు దోపిడి చేస్తున్న భావన కలిగి ఆ ట్యూషన్ చెప్పడం మానేస్తాడు. కానీ అతని మనసులో సాయి పట్ల ఆకర్షణ ఓ వైపు, ఆ వర్గపు ప్రజల పట్ల ఉన్న కోపం,విముఖత ఇంకో వైపు యుద్ధం చేస్తూ ఘర్షణ ఏర్పడింది. గ్యాన్ ను వెతుక్కుంటూ వెళ్తుంది సాయి.అక్కడే ఆమె గ్యాన్ ఆ యువకులకు తమ చిరునామా ఇచ్చి ఆ వంట సామాను, తుపాకులు తీసుకునేందుకు సాయం చేశాడని తెలుసుకుంటుంది. ఓ వైపు గ్యాన్ పట్ల ప్రేమ,అతని మనసులో ఉన్న అస్పష్ట ఆలోచనల వల్ల ప్రవర్తిస్తున్న తీరు ఆమెను కూడా కలిచివేస్తాయి.
గోర్ఖా ఉద్యమం చేస్తున్న యువకులు లోలా ఇంటి ముందు ఉన్న ఆమె గార్డెన్ స్థలాన్ని ఆక్రమించి ఆ చోటులోనే తమ ఇల్లులు వేసుకుంటారు. అదే యువకులు ఆ తర్వాత పోలీసులు వెతుకుతున్న సమయంలో అదే ఇంట్లో తల దాచుకుంటూ కూడా ఉంటారు. గోర్ఖా ఉద్యమంలో పాల్గొన్న ఎందరో యువకులు తిండి,డబ్బు,ఆయుధాలు బెదిరించి లాక్కుంటూ ఉంటారు.కళింపోంగ్ ప్రాంతం అంతా అల్లర్లతో అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో కర్ఫ్యు కూడా విధిస్తారు.
జెము పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుకు బదులుగా పోలీసులు ఆ నేరం చేయని వ్యక్తిని అరెస్టు చేస్తారు.ఆ వ్యక్తి భార్యా,మామయ్య జెము ఇంటికి వచ్చి అతన్ని విడిపించమని వేడుకుంటారు. వారు అలా రెండుసార్లు వచ్చిన జెము స్పందించడు. ఆ భార్య,మామయ్య ఆ ఇంట్లో ఉన్న మట్ ను చూస్తారు .పేదరికంతో ఉన్న వారు ఓ రోజు వచ్చి ఎవరూ చూడకుండా దానిని అపహరించుకుని తీసుకుపోతారు. మట్ కనిపించకుండా పోవడంతో ఎంతో బాధపడతాడు జెము.
బిజూ విదేశంలో ఉండలేక తాను అప్పటి వరకు దాచుకున్న సేవింగ్స్ మరియు కొన్ని వస్తువులు కొని భారతదేశానికి బయల్దేరతాడు. ఆ సమయంలో గోర్ఖా ఉద్యమం ఉధృతంగా ఉండటంతో, కళింపోంగ్ కు ఏ వాహనాలు వెళ్ళకపోవడం,కేవలం గోర్ఖా ఉద్యమం చేస్తున్న యువకుల వాహనాలు మాత్రమే ఆ దారిలో వెళ్తూ ఉండటంతో,వేరే మార్గం లేక వారి వాహనంలోనే తన తండ్రి దగ్గరకు బయల్దేరతాడు బిజూ. కానీ దారిలో వారు అతన్ని దోపిడి చేస్తారు. అలా అమెరికాకు ఆశలతో బయల్దేరి,స్వదేశానికి ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోయి మొత్తానికి బిజూ తండ్రిని కలుసుకోవడంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో ఉనికిని కోల్పోయిన జీవితాలు,ఆ ఉనికి కోసం హింసను అవలంభించిన పద్ధతులు,వ్యక్తిగత జీవితాల్లో ఉన్న అసంతృప్తులు,జీవితం బాగుపడుతుందన్న ఆశతో విదేశాలకు వెళ్ళి అక్కడ మనిషిగా కూడా గౌరవాన్ని,గుర్తింపును పొందలేని పరిస్థితుల్లో జీవించే మనుషుల అంతరంగాలను,మారే మనుషులు మారుతూ,తమతో పాటు తమ వారిని కూడా ఎలా వదిలేస్తూ మారిపోతారో స్పష్టం చేసే అంతర్లీన సందేశం ఉంది.
ఉద్యమాలకు సరైన నాయకత్వం లేనప్పుడు,అవి సమాజాన్ని ఎలా అస్తవ్యస్తం చేస్తాయో,తమ ఉనికిని నిలబెట్టుకునే క్రమంలో జన్మించే నిస్సహాయతలో నుండి హింస జన్మించడం,క్రమేపీ అది వర్గ ద్వేషంగా మారిపోవడం అన్న దశలను కూడా రచయిత్రి ఈ నవలను అటు మన దేశస్థులు విదేశాల్లో ఉండే స్థితుల ద్వారా,అలానే మన దేశంలో పరాయి వారీగా ఉండే మనుషుల జీవితాల ద్వారా స్పష్టం చేశారు. ఈ నవలలో పాత్రలకు,వారి మానసిక ఉద్వేగాలకు తగ్గట్టు బాషను మలచగలగడం కూడా కథా వాతావరణాన్ని బలపర్చడంలో పాత్ర వహించిందనడం అతిశయోక్తి కాదు.
ఎవరిని ప్రేమించని జెము మట్ మీద ప్రేమ పెంచుకోవడం మనిషి జీవితంలో ప్రేమ రాహిత్యం మనుషులకు దూరంగా ఉండిపోయేతనంగా మారిపోయేలా చేస్తుందని స్పష్టం చేస్తుంది.అందుకనే ఎవరికి దగ్గర అవ్వలేని జెము మట్ ను ఎంతగానో ప్రేమించాడు.జీవితంలో ప్రేమ విషయంలో భార్య పట్ల అతను ప్రవర్తించిన తీరు అతనిలో పశ్చాత్తాపాన్ని కలిగించి ఉండటం వల్లే అతను సాయి బాధ్యత తీసుకున్నా,ఓ ఆడపిల్లగా యుక్తవయసులో ఉన్న ఆమెతో పాటు పెరుగుతున్న నిర్లిప్తతను,ఒంటరితనాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు జెము.బహుశా మనుషులకు దూరంగా ఉండిపోయిన జెము మట్ కు దగ్గర అయ్యి తన ప్రేమను దాని మీదకు మళ్ళించి ఉండవచ్చు.
మనిషికి గౌరవం విదేశాలు వెళ్ళడం,డబ్బు సంపాదించడంలో కన్నా కూడా తన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడంలో ఉంటుందని,తనవారితో సంతోషంగా ఉండటంలో ఉంటుందని బిజూ తెలుసుకుని తిరిగి రావడం కూడా మనిషి ఉనికి పట్ల ఉన్న భ్రమలను,సంఘర్షణలను స్పష్టం చేస్తుంది. తమ పిల్లలు విదేశాల్లో ఉండటమే గొప్పగా,విజయ సంకేతంగా భావించే తల్లిదండ్రులు తమ బిడ్డల సంతోషం గురించి కూడా ఆలోచించాలని ఈ నవల పరోక్షంగా హెచ్చరిస్తుంది. భారతీయ ఆంగ్ల సాహిత్యంలో వస్తున్న వైవిధ్యతను స్పష్టం చేసే అద్భుతమైన నవల ఇది.అవకాశం ఉంటే తప్పక చదవండి.
* * *

Comments
Post a Comment