చెరుకు రైతుల చేదు జీవితాలు
చెరుకు రైతుల చేదు జీవితాలు
1987 లో ఆదురి వెంకట సీతారామమూర్తి గారు ‘తీపి గురుతు’ నవల వ్రాసారు. ఈ నవల ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడి, నాటికి సుప్రసిద్ధ రచయితలైన మధురాంతకం రాజారాం, బలివాడ కాంతారావు, కేశవరెడ్డి, చేకూరి రామారావు, సినారె వంటి వారి ప్రశంసలను అందుకుంది. ఈ చిరు నవలలో పూర్తిగా సన్నకారు రైతుల మనస్సులను, వారికుండే జీవకారుణ్యాన్ని, వారి అవసరాలను,ఆ అవసరాల వల్ల భయపడి ఉండే వారి మనస్తత్వాలను ఆసరాగా చేసుకుని ఎలా వడ్డీ వ్యాపారులు, గ్రామాధికారులు, ప్రభుత్వ అధికారులు వారిని దోపిడి చేసేవారో రచయిత స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. విద్య లేకపోవడం, సమాజంలో జరిగేవి అర్ధం చేసుకోకలేకపోవడం వంటి అంశాలు సన్నకారు రైతుల్లో చైతన్యహీనులని ఎలా చేసిందో, వారి జడత్వం వల్ల వారి కోసం నిలబడే నాయకులు ఒంటరిగా ఎలా మిగిలి బలైపోతారో కూడా రచయిత ఈ నవలా పరిధిలోనే చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ కథ చౌడపేట గ్రామంలో జరుగుతుంది. ఈ కథలో పాఠకుడిని కథలోకి నడిపించే ముఖ్య పాత్రలు సంగమయ్య, దేవుడు. సంగమయ్య తండ్రి రంగయ్య. తన వాటాకు వచ్చిన భూమిలో చెరుకు పండిస్తూ అదే తన కొడుకు సంగమయ్యకు అప్పగించాడు. సంగమయ్య భార్య కోటీశ్వరమ్మ. రంగయ్య కాలం నుండి కూడా కడుపు నిండడానికి ఇంట్లో ఉన్న వారంతా ఏదో ఒక పని చేయాల్సిందే. సంగమయ్య ఫ్యాక్టరీకి చెరుకు తోలతాడు. కాస్త డబ్బు ఉన్న రైతులు ఆ ఫ్యాక్టరీలో షేర్లు కొనుక్కుంటారు. వారికి సరుకు వేయమని చీటి పంపిస్తారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఇంకొందరు రైతులు ధైర్యం చేసి అప్పు చేసి కూడా ఆ షేర్లు కొనుక్కుంటారు. దాని వల్ల తర్వాత వారికి రుణాలు కూడా ఇస్తారు. కాకపోతే ఆ రుణాలకు వడ్డీలు పెరుగుతూ, పంట చేతికి వచ్చాక దానికే సరిపోతుంది. ఇది ఇక్కడి వ్యవహారమైతే ఇక ఊరిలో అప్పులిచ్చే రామకోటి దగ్గర కూడా అప్పులు తీసుకుంటారు రైతులు. చెరుకు పంట చేతికి వచ్చాక దానిని గానుగ ఆడించి, బెల్లంని రామకోటికి ఇవ్వాల్సిందే. ప్రతిసారి వచ్చిందంతా అటు ఫ్యాక్టరీకో, ఇటు రామకోటికో ఇవ్వాల్సిందే. అలా ఇస్తే ఏమి మిగలని రైతులు తర్వాతి పంట పెట్టుబడి కోసం మరలా అప్పు చేయాల్సిందే. ఈ వలయం నుండి బయటపడలేరు సన్నకారు చెరుకు రైతులు.
సంగమయ్య భార్య కోటీశ్వరమ్మ కడుపుతో ఉంది. తనకు పుట్టబోయే బిడ్డ తన కన్నా గొప్పగా బ్రతుకుతాడన్న నమ్మకం లేకపోయినా,ఆ బిడ్డ తనలా అయినా బ్రతికితే చాలన్న ఆలోచనలో ఉన్నాడు సంగమయ్య. తాను కొంత ధైర్యం చేయకపోతే తన కుటుంబం ఎప్పటికీ అలానే ఉంటుందని అనుకుని మిత్రుడైన దేవుడిని కలుస్తాడు. ఇంకో రైతు దగ్గర కొంత పొలం తీసుకుని చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకంలో భాగంగా రుణం మీద గేదెను కూడా తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని మిత్రుడికి తెలియజేస్తాడు. ఆ ఊరి కరణంతో ఆ గేదె తెచ్చుకునే విషయం మాట్లాడతాడు దేవుడు సంగమయ్య కోసం. ప్రభుత్వ పథకం కింద ఆ గేదె రావడానికి కరణం, సూపర్ వైజర్ ,మెడికల్ ఆఫీసర్ కు సంగమయ్య లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ని ఇచ్చినా తనకు నచ్చిన గేదెను ఎన్నుకునే స్వేచ్చ అతనికి ఉండదు. అతనికి బక్క చిక్కిన గేదెను ఇస్తారు.
వరద ముంచెత్తడం, ఊరు మునిగిపోవడం, సంగమయ్య ఎడ్లు, గేదె ఆ వరదలో కొట్టుకుపోవడం జరుగుతుంది. వరద బాధితులకు ప్రభుత్వం ఆహారానికి, నివాసం ఏర్పరచుకోవడానికి ఇచ్చిన పరిహారంలో కూడా కొంత భాగం గ్రామాధికారులు తీసుకుంటారు. రామకోటి తన దగ్గర అప్పు పెట్టిన రైతుల పొలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే రైతులు ఎదురుతిరుగుతారు. ఈ అన్యాయాలకు ఎదురు తిరిగి పోరాడినందుకు దేవుడుని హత్య చేయిస్తారు. ఇది ఒక తరం కథ. గ్రామ ప్రజల కోసం ధైర్యంగా నిలబడే దేవుడు లాంటి వ్యక్తి కోసం నిలబడలేని వ్యక్తుల నిస్సహాయ తరం ఇది.
ఇక రెండో తరంలో సంగమయ్య కొడుకు భోగేష్ , దేవుడు కొడుకు సత్యం. సత్యం తండ్రి మార్గాన్ని ఎంచుకుని రైతుల కోసం పోరాడేవాడు. తరం మారినా ప్రజల కష్టాలు మారలేదు. ప్రభుత్వం గ్రామాధికారాన్ని రద్దు చేసినా, శిస్తు రద్దు చేసినా, సమాజంలో జరుగుతున్న మార్పులు, ఇదే సమాజంలో తమలా బ్రతుకుతున్న ప్రజల్లో ఉన్న చైతన్యం గురించి తెలుసుకోలేని తరంగానే ఇది కూడా కొంతమేరకు ఉన్నా సత్యం తరంతో పాటు ఓ అడుగు ముందుకు వేశాడు. అనేక గ్రామాల నుండి రైతులు చెరుకు సదస్సు నిర్వహిస్తే చౌడపాడు రైతుల కోసం ఆ సదస్సులకు వెళ్ళేవాడు సత్యం. అలాగే ఆ ఊరిలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేవాడు. రామకోటి కొడుకు బుచ్చిశెట్టి హయాం వచ్చేసరికి, అతను తన బావమరిది ప్రతాప్ ను ప్రెసిడెంట్ గా నిలబెడితే, అతను స్త్రీలోలుడు, దుర్మార్గుడు కావడంతో,ఆ ఊరిలో అందరికి మేలు చేసే మాధవరావును ప్రత్యర్ధిగా నిలబెట్టి ఆయన గెలుపుకు కారణమవుతాడు. దీని వల్ల అతని శత్రువులు పెరుగుతారు. ఫ్యాక్టరీలో షేర్లు తీసుకున్న రైతులకు పంచదార ప్రతి నెల ఇచ్చేలా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, మధ్యలో ఉండే ఫీల్డ్ ఆఫీసర్ ఆ రైతులు పంచదార, బెల్లం వాడరు కనుక తెలివిగా ఆ కార్డులు తన దగ్గర ఉంచుకుని ఆ పంచదార తానే తీసుకుంటాడు. ఓ రైతు కూతురు పెళ్ళికి పంచదార అవసరం అవ్వడంతో ఆ రైతు అడిగితే ఆ ఆఫీసర్ ఎదురు తిరుగుతాడు. సత్యం ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పొరాడి రైతులకు న్యాయం జరిగేలా చేస్తాడు. ఆ ఆఫీసర్ ఉద్యోగం పోతే,ఆ ఆఫీసర్ తండ్రితే సహా వచ్చి అడిగితే జాలి హృదయంతో మరలా ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. తండ్రి లానే ఆ పోరాటాల వల్ల అతను హత్యకు గురవుతాడు. అతను మరణించడం, అతనికి కొడుకు పుట్టడం ఒకేసారి జరుగుతాయి. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న సంగమయ్య ద్వారా రచయిత ఆ రైతుల్లో ఆ మరణం, ఈ జననంతో ఓ చైతన్యం వచ్చిందని, వారి తర్వాతి నాయకుడు అవ్వబోయే సత్యం కొడుకు ఊపిరిపోసుకోవడం, ఆ రైతుల్లో మొదటి సారి చైతన్య ఊపిరి కూడా మొదలైంది అని చెప్పడంతో రచయిత నవలను ముగిస్తారు.
ఈ నవలలో చెరుకు రైతుల కథనం ప్రధానంగా ఉన్నా, దాదాపు అందరు రైతుల వ్యథలు ఇందులో ఉన్నాయి. ఈ నవలలో రచయిత రైతుల బాషను పట్టుకున్న తీరు, కొంత ప్రకృతితో మమేకం, జీవకారుణ్యం, రైతుల్లో ఉండే జాలి, దయ,కరుణ, తాము ఎంత మోసపోతున్నా ఎదుటి వారిని మోసం చేయాలని అనుకోకపోవడం వల్ల కూడా వారు అనేక కోణాల్లో దోపిడీకి గురవుతున్నారన్న అంశాన్ని స్పష్టం చేస్తుంది. 1987 లో ఇటువంటి రచన రావడం రచయిత విభిన్న తీరులో ఆలోచించి అక్షరీకరించిన తీరుకు నిదర్శనం. గ్రామీణ స్పృహతో, రైతుల్లో రావాల్సిన చైతన్యం గురించి వాస్తవికంగా రాసిన రచయిత శ్రీ ఆదురి వెంకట సీతారామమూర్తి గారికి అభినందనలు.
* * *

Comments
Post a Comment