బాధకు సమాధానం!

                                               బాధకు సమాధానం!

-శృంగవరపు రచన


జీవితం అంటే ఏమిటి? కష్టాలను ఎదిరించడం అంటే సమస్యను ఎలా చూసి స్పందించడం? వ్యక్తి బలహీనమైనప్పుడు సమాజమే మనిషికి సమస్యగా మారితే ఆ మనిషి ఎలా బలంగా మారాలి? మనిషి బలం-బలహీనతలే సమాజంలో ఆ మనిషితో ఉండే తీరును స్పష్టం చేస్తాయి. లోకం పోకడ లిఖించబడ్డ ధర్మాల్లోనే కాదు, మారిన మనుషులను అర్ధం చేసుకోవడంలోనూ, తగిలిన దెబ్బల బాధను ఇంకో వైపు మళ్ళించుకోవడంలోనూ ఉంది. ఆ మార్గమే సమాజంలో మనిషి జీవన స్థాయిని, సంతృప్తిని, పోరాట స్ఫూర్తిని స్పష్టం చేస్తుంది. అటువంటి పోరాటంలో యోధురాలిగా మారి, జీవితంలో అన్ని దశల్లో ఎన్నో సమస్యలు అనేక కోణాల్లో ఎదుర్కుని, ఆ పయనంలోనే ఆ సమస్యల తాకిడిలోనే తన మనసులోని మానవత్వ పరిమళం వికసింపజేసుకుని, తన చుట్టూ చీకటి ఉన్నా, అందరికి వెలుగును పంచాలన్న స్పూర్తితో ముందుకు సాగిన ఓ శక్తే కిన్నెర నాగచంద్రికా దేవి గారు. ‘కిన్నెర వెల్ఫేర్ సొసైటీ’ ద్వారా వృద్ధుల జీవితాల్లో చివరి దశ అనారోగ్యకరమై శాపమైన తరుణాల్లో వారి సేవను తన బాధ్యతగా స్వీకరించారు చంద్రికగారు. చంద్రిక గారి జీవితాన్ని ఎంతో నిజాయితీగా, అతిశయోక్తులకు పోకుండా, సహజంగా రాశారు డాక్టర్ గురజాడ శోభాపేరిందేవిగారు. ఆ పుస్తకమే ‘అమావాస్య చంద్రిక.’
నేటి సమాజంలో ఎందరో వివాహిత స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్య తమ భర్తలకు ఇతర స్త్రీలతో ఉన్న సంబంధాలు. ఈ సమస్య గురించి చెప్పుకోవడం కూడా మర్యాద కాదని భావించి, దాని వల్ల వచ్చే బాధను మనసులోనే దాచుకునే స్త్రీలు నేటికి ఎందరో. ఈ సంబంధాలు స్త్రీకి కళంకాన్ని, పురుషుడికి వీరత్వాన్ని ఆపాదించే సందర్భాలు అసహజం కాదు. చంద్రిక తల్లిదండ్రులకు నాగచంద్రిక తర్వాత ముగ్గురు మగపిల్లలు పుట్టారు. నాగచంద్రిక తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, లక్ష్మీనరసమ్మ. సుబ్బయ్య చెల్లెలు రామసుబ్బమ్మ. సంతానం లేకపోవడం వల్ల రామసుబ్బమ్మ దంపతులు చంద్రికను దత్తత తీసుకున్నారు. రామసుబ్బమ్మ భర్త సుబ్బన్న. చంద్రికకు మావయ్య అంటే ఎంతో ఇష్టం. సుబ్బన్న ఆమెను కన్నకూతురు కన్నా కూడా ఎక్కువ చూసుకునేవారు. ఆమెకు ఏదైనా ఆపద వస్తుందని అనుమానం వస్తేనే అది రాకుండా చూసుకునేవారు. ఎంతో అపురూపంగా పెరిగింది వారి పెంపకంలో చంద్రిక. బాల్యంలో చంద్రికకు తన మావయ్య సుబ్బన్న ఇంకో స్త్రీ ఇంటికి వెళ్ళడం,ఆమెకు నగలు,పళ్ళు లాంటివి ఇవ్వడం చూసి మావయ్యను ఆ బాల్యంలోనే ప్రశ్నించినా,సుబ్బన్న చంద్రికను కూతురిలా, చంద్రిక తన ప్రపంచంలో ప్రేమ అంటే మావయ్యే అనుకోవడం వరకు సాగిందే తప్ప ఏది వారి అనుబంధాన్ని కదిలించలేకపోయింది.
చంద్రిక బాల్యంలో వారి ఇంటికి దగ్గరలో సినీ నటులు సుధాకర్ ఉండేవారు. ఆమె చంద్రికతో ఆదుకోవడం, అలాగే స్నేహితురాలిగా భావించి ఎన్నో విషయాలు చర్చించడం జరిగేది. వారి మాటల్లో భార్యాభర్తలు ఒకరికోసం ఒకరు జీవించాలని, భర్తకు ఒక్క భార్య మాత్రమే ఉండాలని, లేకపోతే ఆ బిడ్డల జీవితం సవ్యంగా ఉండదని సుధాకర్ అంటారు. సుధాకర్ మీద బాల్యంలో ప్రేమను పెంచుకున్నా, ఆయన తనను ప్రేమించాడా? స్నేహితురాలిగా చూసారా?లేక అన్నగా మంచి చెడు చెప్పారా? అన్న అంశం పట్ల ఆమెకు ఆ బాల్యంలో స్పష్టత లేదు, ఇది తెలియకముందే ఆయన అక్కడ నుండి వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె ఇంటర్ చదివే సమయంలో ఆమె కన్నా 16 ఏళ్ళు పెద్ద అయిన మురళితో ఆమె వివాహం జరిగింది. విద్యుత్ శాఖలో ఉద్యోగిగా ఉన్నాడు ఆయన. కానీ అతనికి కుష్టు వ్యాధి ఉన్న విషయం దాచి పెట్టి వివాహం చేయడం తర్వాత చంద్రికకు తెలియడం,ఆమె మనసు విరిగిపోవడం జరుగుతుంది.మురళిలో అపరాధ భావం ఉంది. అందుకనే ఎప్పుడు ఆమెను నొప్పించే ప్రయత్నం చేయకపోయినా కొన్నిసార్లు ఆమెను బాధ పెట్టె సంఘటనలు ఎన్నో జరిగిపోయాయి. మురళి వ్యాధి విషయం తెలిసాక చంద్రిక తల్లిదండ్రులు, మేనమామ దంపతులు ఆమెకు విడాకులు ఇప్పించి, చదువు చెప్పించి వేరే వివాహం చేద్దామనుకుంటే దానికి మురళి అంగీకరించినా,చంద్రిక మాత్రం ఒప్పుకోకుండా భర్తతో ఉండటానికే సిద్ధపడింది. కానీ అర్ధం చేసుకునే చంద్రిక గారు కూడా ఆ ఇంట్లో ఉన్న ఆస్తుల తగాదాల వల్ల ఓ సారి అత్తగారి చాడీల వల్ల భర్త చేయి చేసుకున్నప్పుడు,ఆ అవమానానికి బాధ పడిన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఆమెను హాస్పటల్ లో చేర్పించినప్పుడు ఆ మాత్రలు ఆమె తండ్రి ఇచ్చిన విటమిన్ టాబ్లెట్స్ అనుకుని వేసుకున్నట్టు చెప్పమని అత్తింటి వారు చెప్తే అలానే చెప్పింది ఆమె. ఈ దశలో తల్లిదండ్రులు చెప్పిన అత్తింటి గౌరవం నిలబెట్టడం అంటే తన బాధలను దాచుకోవడమే అని అనుకున్న చంద్రిక ఈ ఉదంతం తర్వాత మంచాన పడిన అక్కడ చూసే వారు లేకపోయినా ఆ బాధను మనసులో దాచుకుంది. ప్రేమించిన వారికి కష్టం వస్తే పసిగట్టగల మనసు ఉంటుందన్న విషయాన్ని నిజం చేస్తూ సుబ్బన్న మేనకోడలిని వెతుక్కుంటూ వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమె భర్త సేవకు అంకితమయ్యారు.వారికి ఓ పాప జన్మించింది. ఆ పాపే ఉమ.
ఆ తర్వాత కొంతకాలానికి ఎంతో ప్రేమించే మేనమామ సుబ్బన్న మరణించాడు. పెళ్ళయిన ఆరేళ్ళకు మురళి కూడా అనారోగ్యంతోనే మరణించాడు. చంద్రిక ఒంటరి పోరాటం చేయాల్సిన దశ ఇప్పుడు ప్రారంభమైంది. భర్త ఉన్నంతవరకు ఆమె కష్టాలు కుటుంబంలోని ఆస్తులు గొడవల వల్ల ఉంటూనే ఉన్నాయి. భర్త మరణించాక ఆమె జీవితంలో కష్టాలు అన్ని దిశల్లోంచి వచ్చి రెట్టింపు అయ్యాయి. భర్త మరణించాక భర్త ఉద్యోగం ఆమెకు తెచ్చుకోవడం కోసం ఎంతో శ్రమపడిన ఫలితం దక్కలేదు. 1985 నుండి కష్టపడితే 1987 కు మొత్తానికి మింట్ కాంపౌండ్ లో ఉద్యోగం వచ్చింది. అప్పటి వరకు బంధువుల నిరాదరణ, కన్నకూతురికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వంటివి ఎన్నో ఎదుర్కున్నారు. ఆ ఉద్యోగం వచ్చాక కూతురితో సహా కొత్త ఇంట్లోకి మారిపోయారు చంద్రిక.
ఇక్కడితో చంద్రిక గారి జీవితం సుఖాంతం అవ్వలేదు. ఆర్థికంగా నిలదొక్కుకున్నా సరే ప్రతి మనిషికి ఓ తోడు ఉండాలి.లేకపోతే యాంత్రిక జీవితం మనిషిలో ఒత్తిడిని కలిగిస్తుంది. చంద్రిక గారికి టీవి నటులు అచ్యుత్ గారు దూరపు బంధువులు. ఆయనతో మాట్లాడుతున్నాననుకుని ఓ అపరిచిత వ్యక్తితో రోజు తన కష్టసుఖాలను పంచుకునేవారు. చివరకు ఆ వ్యక్తి అచ్యుత్ కాదని తెలియడం,ఆ తర్వాత ఆ వ్యక్తి విజయ్ చౌదరి అని తెలుసుకోవడం,ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. తన జీవితంలో తనకో మంచి తోడు దొరికిందని చంద్రికగారు సంతోషించే లోపే విజయ్ చౌదరి గారి జీవితంలో ఉన్న ఇంకో స్త్రీ స్వరూప చంద్రిక మీద దాడి చేయడానికి అనేకసార్లు రావడం జరిగింది. ఉమకు వివాహం చేసేసాక, స్వరూప వ్యవహారం వల్ల భర్తతో పెరుగుతున్న దూరాన్ని గ్రహించిన చంద్రిక తనకో తోడు కావాలని అనుకున్నారు. గర్భవతి అయిన ఆవిడ భర్తకు ఇష్టం లేకపోయినా ఓ కొడుకును కన్నారు. ఆమె ప్రసవం సమయంలో కూడా ఆ భర్త లేడు. ఆ కొడుకుకి ఆ తండ్రి విస్రోజ్ అని పేరు పెట్టారు. హిమాలయాల పర్వతాల దగ్గరలో ఉన్న ఓ మొక్కకు వందేళ్ళకు ఒకసారి పూసే పువ్వు పేరు విసిరోజ్. అదే పేరు కొడుక్కి ఆయన పెట్టారు. గర్భవతిగా చంద్రిక ఉన్న సమయంలో స్వరూప నడి రోడ్డు మీద ఆమె కడుపు మీద కాలుతో కొడితే ఆ భర్త గర్భవతిని అక్కడే వదిలేసి స్వరూపతో వెళ్లిపోయాడు. అప్పుడు పోలీస్ ఫిర్యాదు చేయడం వల్ల చంద్రికకు మరింత దూరమైపోయారు విజయ్ చౌదరి. ఆ తర్వాత కూడా స్వరూప విస్రోజ్ ను కూడా చంపే ప్రయత్నాలు చేయడం వంటివి కూడా చేశారు. ఎంతో ఓర్చుకుని, సహించిన వ్యక్తి చంద్రిక.
చంద్రికను భార్యగా పట్టించుకోకపోయినా, స్వరూపకు పిల్లలు లేకపోవడంతో ఓ పాపను దత్తత తీసుకుని,ఆమెకు ఆరోగ్యం క్షీణిస్తే ఆమె బాధ్యత తీసుకున్నాడు విజయ్. చంద్రికా గారికి కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు మధ్యలో వచ్చినా ఆమెను ఏనాడూ పట్టించుకోలేదు. మనుషుల్లో మంచితనాన్ని ఎలా గుర్తించగలరు ఎవరైనా? సమయంతో మారే ప్రేమ ఉద్దేశ్యాన్ని ఎలా తెలుసుకోగలరు ఎవరైనా? మొదట మురళిని ప్రేమించకపోయినా అంగీకరించి తన బాధ్యత నిర్వర్తించినా, తర్వాత ప్రేమించి విజయ్ ను చేసుకున్నా ఆ బంధాలు ఆమెకు మానసిక బలాన్ని ఇవ్వలేకపోయాయి.
జరిగిపోయిన సంఘటనలకు చంద్రిక గారు బాధ పడినా తన జీవిత పయనంలో ఇంకో బాధ్యతను తీసుకున్నారు. తన మేనత్త వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతూనే వృద్ధాశ్రమంలో చేర్పిస్తే అందులో అనారోగ్యంతో ఉన్న వృద్ధుల దుస్థితిని గమనించి, దాని కోసం ఏమైనా చేయాలన్న తపనతోనే కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ద్వారా అలాంటి ఎందరో వృద్ధులకు సేవ చేశారు. ఈ క్రమంలో చంద్రిక గారికి ఎదురైన ఆర్థిక,మానసిక ఇబ్బందులు అన్ని ఈ పుస్తకంలో శోభా గారు సవివరంగా రాశారు. దశాబ్దం పైగా ఈ సేవలో మునిగిపోయి ముందుకు సాగుతున్న చంద్రికగారు, స్వరూప అనారోగ్య దశలో ఉన్నప్పుడు ఆమెను క్షమించమని అడగటానికి వెళ్ళడం, వ్యక్తిత్వ పరిణతికి, సేవా-క్షమల ఆవశ్యకతను అర్ధం చేసుకుని ఆచరించే మహనీయతకు నిదర్శనం. అలాగే తన తల్లి మరణించినప్పుడు దహన సంస్కారాలు చేయడం చంద్రిక గారి పురోగమభావజాలానికి నిదర్శనం.
ఈ పుస్తకం సాధారణ వ్యక్తులకు స్పూర్తినిస్తుంది. సాధారణ మనుషుల జీవితాల్లో ఎదురయ్యే బాధలు, జరిగే తప్పిదాలు, దాని వల్ల వచ్చే బాధలు, వాటిని పక్కకు మళ్లించి ఇంకో లక్ష్యంతో ముందుకు సాగాల్సిన తీరు అన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. బాధకు సమాధానం ఎలా చెప్పవచ్చో ఈ చంద్రిక గారి జీవితం స్పష్టం చేస్తుంది. ఈ సందర్భంగా ఎందరికో స్పూర్తినిస్తున్న చంద్రికగారికి, వారి జీవితాన్ని ఈ పుస్తకం ద్వారా పరిచయం చేసిన రచయిత్రి శోభాపేరిందేవి గారికి అభినందనలు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ