అంతమైన ఆశలు

 అంతమైన ఆశలు 

      -శృంగవరపు రచన
                                                 


  డాక్టర్  కేశవరెడ్డి గారి రచనల్లో ఓ చిన్న కథలో సంఘర్షణను,మనుషుల మనసుల్లో చెప్పుకోలేకుండా ఉండిపోయిన  బాధలను,మనుషుల్లో  తాత్వికత  ఉత్పన్నమయ్యే  దశను,మనిషి తన ఉనికిని అనేక రూపాల్లో కాపాడుకోవడానికి పడే తపనను, ఓ వర్గం మీద ఇంకో వర్గం చేసే దోపిడి,హింసను,ఇంకా ఎన్నెన్నో ఒక్క చిన్న కథలో ఎన్నో ప్రశ్నలను,సరిపెట్టుకోవాల్సిన సమాధానాలను ఎన్నో విధాలుగా  స్పష్టం చేయడం కనబడుతుంది.ఓ వర్గం మీద జరిగిన దోపిడిని,అది వారిలో ప్రవేశపెట్టిన భయాన్ని,మనిషిలో ఉండే ఆశ ఎలా దోపిడికి,హింసకు ముడిసరుకుగా మారుతుందో స్పష్టం చేసే కేశవరెడ్డి గారి నవలే ‘చివర గుడిసె.’

 ఈ కథలో ముఖ్య పాత్రలు యానాదులైన మన్నోడు,అతని కొడుకు చిన్నోడు. వారుంటున్న ఊరి పేరు ఒంటిల్లు. ఆ ఊరిలో మిగిలిన యానాది కుటుంబం ఈ ఒక్కటే. కొన్నేళ్ళ క్రితం ఓ ఆంగ్ల దొర అడవుల్లో ఉంటున్న ఓ ఇరవై యానాది కుటుంబాలకు పట్టాలిచ్చి భూములు ఇప్పించి,గుడిసెలు కట్టించి,వారికి ఓ మంచి జీవితాన్ని కల్పించాడు. యానాదుల కుల వృత్తి ఎలుకలు,ఉడుతలు,కుందేళ్ళు,పాములు వంటివి పట్టడం. ఆ ఊరి పెద్ద మణియం తర్వాత ఆ ఊరిలో ఏ దొంగతనం జరిగినా యానాదుల మీద మోపి,వారిని జైలులో పెట్టించి హింసించేలా చేశాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన వారు ఓ గ్రామంలో ఉండలేక అడవిలోకో,వేరే ప్రాంతానికో పారిపోయారు. అందరూ పారిపోయినా అక్కడే మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి మన్నోడు. మన్నోడు మీద కూడా మేకల దొంగతనం మోపి,జైలులో పెట్టించి హింసించినా అతను మాత్రం అప్పటికే తల్లిని కోల్పోయి ఉన్న తన  మూడేళ్ళ కొడుకు కోసం ఆ గుడిసెలోనే ఉంటున్నాడు. మిగిలిన 19 గుడిసెలు శిధిలమైపోయాయి. ఆ యానాదులు పారిపోయారని,వారు సేద్యం చేయలేదని మొత్తానికి ఆ మొత్తం భూమి తన సొంతం చేసుకున్నాడు. ఆ భూమికి అప్పటికి యానాదిమిట్ట అని పేరు.

 ఓ రోజు మన్నోడు తన కొడుకు చిన్నోడుతో కలిసి ఊడతలు పడుతున్న సమయంలో ఓ బైరాగి కలుస్తాడు.అపరిచితుడైన బైరాగితో తమ జీవితం గురించి చెప్తాడు మన్నోడు. తన కొడుకు గురించే తన బెంగ అని,ఇరవై ఏళ్ళు వయసున్న అతనికి బుద్ధి మాత్రం పెరగలేదని,ప్రతి చిన్న విషయానికి భయపడటాడని,చూడడానికి శారీరక ధారుఢ్యం ఉన్నప్పటికీ  పిరికివాడు అని చెప్తాడు. ముప్పై ఏళ్లుగా ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ బైరాగి కూడా మొదటిసారి కదిలిపోతాడు.బైరాగిని తమతో పాటు తమ గుడిసెలో ఉండమని మన్నోడు ఆహ్వానిస్తాడు.

 అప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయం. అందుకని రోడ్లు వేయడానికి ఊరూరా తిరిగి ఆ పనికి పనికి వచ్చే వారిని ప్రభుత్వం నియమించుకుంటుంది. ఆ విషయం గురించి బైరాగి మన్నోడికి చెప్పి చిన్నోడికి ఆ ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేయమని చెప్తాడు. ఊర్లోకి తిరిగి వచ్చి కొడుకును తీసుకువెళ్లి ఆ పని అయ్యేలా చేస్తాడు మన్నోడు. ఆ సాయంత్రం బైరాగి,మన్నోడు,చిన్నోడు ఆ గుడిసె దగ్గరకు తిరిగి వస్తారు.మన్నోడు పెంచుకుంటున్న కుక్క పేరు రాజీ. ఆ సాయంత్రం యానాది మిట్ట పొలంలో ఎలుకలు ఎక్కువ అవ్వడంతో మణియం మన్నోడు దగ్గరకు వచ్చి వాటిని పట్టమని చెప్తాడు. ఆ రాత్రి  కొడుకుతో వెళ్ళి ఆ పని పూర్తి చేసి ఎలుకలు,కొన్ని ఒడ్లు దొరికిన సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి కొడుకులు వాటిని వండుకుని ఆ రాత్రి బైరాగితో కలిసి ఆటపాటలతో సంతోషంగా  చిందేసి పడుకుంటారు. ఆ రాత్రి ఆ పొలంలో మూడు ఎకరాల్లో పండిన ఒడ్లును ఎవరో దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం మన్నోడి మీద మోపి అతని ఇంటికి వచ్చి చచ్చేలా కొట్టి పోతాడు మణియం. చనిపోయే పరిస్థితుల్లో కొడుకును జాగ్రత్తగా చూసుకోమని  బైరాగికి చెప్తాడు మన్నోడు. మన్నోడికి వైద్యం కోసం అడవిలోకి చిన్నోడితో కలిసి వెళ్తాడు బైరాగి. అదే సమయంలో రాజీ కూడా వారిని వెంబడించి వస్తుంది.

 అదే సమయంలో ఆ ఊరిలో వాగు దగ్గరకు వచ్చిన మణియంను చూస్తాడు బైరాగి. రాజీని అతని మీద ఉసికొల్పడం, రాజీ అతని కంఠాన్ని కొరికేస్తుంది.అతను అక్కడికక్కడే మరణిస్తాడు. ఆ దృశ్యం చూసిన చిన్నోడు మణియం రాజీ అలా చేసినందుకు తనను చంపేస్తాడని భయంతో అరుస్తూ అడవిలోకి పారిపోయి ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంటికి వచ్చి ఆ విషయం మన్నోడికి జరిగింది చెప్తాడు. చిన్నోడి గురించి విషయం తెలియడంతో మన్నోడు అప్పటికే దెబ్బల వల్ల అయిన గాయాలకు ఈ బాధ కూడా తోడవ్వడంతో మరణిస్తాడు.

 అలా  ఆ ఒక్క రోజులోనే బైరాగి ఆ చివరి గుడిసెలో ఉన్న వ్యక్తులతో ఆత్మీయత పెంచుకుని,అంతలోనే అది అంతమై, ఈ మాయ విచిత్రానికి ఆశ్చర్యపడుతూ,అక్కడ వారికి జరిగిన అన్యాయానికి బాధ పడుతూ రైలులో ఇంకో చోటుకు ప్రాయాణానికి సిద్ధమవుతాడు. ఆ చివరి గుడిసె కూడా కొన్నాళ్ళకి శిధిలమైపోతుంది.

 ఓ దోపిడీకి, ఓ వ్యవస్థకు ఎదురు తిరిగి ప్రత్యక్షంగా పోరాడలేకపోయినా తమ చివరి శ్వాస విడిచేవరకు ఆ చివరి గుడిసెలోని కుటుంబం మాత్రం అక్కడే ఉండి తమ ఉనికికి అర్ధం నిలుపుకున్నా చివరకు ఆ దోపిడి,దౌర్జన్యాలకు ఆహుతి అయిపోయారు. ఒకరు దెబ్బల వల్ల అయితే, ఇంకొకరు భయంతో తనను తానే అంతం చేసుకున్నాడు.

 మనిషి జీవితంలో తలెత్తే బాధలు కొన్ని తమ ఆర్థిక వెనుకబాటుతనం వల్ల అయితే ఇంకొంత సమాజంలో వర్గ వైషమ్యాల వల్ల కూడా ఉత్పన్నమవుతాయి. అటువంటి పరిస్థితులను,ఆ పరిస్థితుల్లో పుట్టే భయం గురించి, ఆ భయం తర్వాతి దశగా బాధలోకి మార్పు చెందడం వరకు కేశవరెడ్డి గారు కథ వల్ల మాత్రమే కాదు అంతకు మించి బలమైన కథనం వల్ల కూడా అద్భుతమైన భావ ఆవరణను చిత్రించగలరు అన్న అంశాన్ని స్పష్టం చేసే నవల ఇది. 
    *         *          *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ