మణి -మార్పు
మణి -మార్పు
భారతీయ ఆంగ్ల రచయితల్లో ప్రసిద్ధి పొందిన రచయిత అశ్విన్ సాంఘి. ‘చాణక్యాస్ చాంట్’ తో పాఠకుల మనసులో నిలిచిపోయిన సాంఘికి ఆ తర్వాత అంతే పేరు తెచ్చిన రచన ‘ద కృష్ణా కీ.’ ఈ నవలలో కథ కన్నా కూడా మహాభారతంలో కృష్ణుడి మీద,కృష్ణుడికి సంబంధించిన అంశాల మీద చేసిన పరిశోధన కథను మించి విస్తరిస్తాయి. ఈ నవలలో పరిశోధనా శైలి ఆంగ్ల రచయిత డాన్ బ్రౌన్ ను పోలి ఉంటుంది. దాదాపు 500 పేజీలు ఉన్న ఈ నవల చదువుతున్నప్పుడు కొన్ని సార్లు ఈ నవలలో పరిశోధన పేరుతో చొప్పించబడిన అంశాలు అతిగా అనిపించక మానవు. కానీ ఈ నవల మొత్తంలో రచయిత విశేష కృషి కూడా స్పష్టమవుతుంది.
ఇక కథకు వస్తే ఈ నవలలో ముఖ్య పాత్ర రవి సైని. రవి హిస్టరీ ప్రొఫెసర్. అతని మిత్రుడు అనిల్ వర్షిణి. అనిల్ భారత దేశంలో జరిగిన తవ్వకాలలో దొరికిన వాటి మీద పరిశోధన చేసేవాడు. అతను ఓ ఆర్కియాలజిస్ట్. అతనికి ద్వారక,కాలిబంగన్,మథుర,కురుక్షేత్ర ప్రదేశాల్లో కృష్ణుడికి సంబంధించిన సీల్స్ దొరుకుతాయి. అవి నాలుగు ఏదో రహస్యాన్ని దాచి ఉంచాయని అతను భావిస్తాడు. అందులో ఒకటి తన దగ్గర ఉంచుకుని మిగిలిన వాటిని తన స్నేహితులైన రవి సైని, నిఖిల్ భోజ్ రాజ్,కుర్కురే ,చేడ్డి లకు ఇస్తాడు. రవి సైనిని ఇంటికి ఆహ్వానించి ఆ సీల్ ఇచ్చినప్పుడు కూడా తనకు ఏమైనా జరిగితే, తాను మిగిలిన మిత్రులకు ఇచ్చిన వాటిని కూడా కలుపుకుని ఆ రహస్యాన్ని చేధించమని చెప్తాడు. ఆ రాత్రి రవి సైని ఆ సీల్ తీసుకుని వెళ్తాడు. అతను వెళ్ళిన తర్వాత అనిల్ ను తారక్ వాకిల్ అనే అతను హత్య చేసి, అతని తల పైన విష్ణువు ఆయుధాల్లో ఒకటైన చక్రం వేసి, అతని వెనుక గోడ మీద ఓ సంస్కృత శ్లోకం రాస్తాడు. ఆ సీల్ ను దొంగిలిస్తాడు.
ఆ తర్వాత ఆ హత్య నేరం రవి మీదకు నెట్టబడుతుంది. రవి సైని దగ్గర డాక్టరేట్ చేస్తున్న ప్రియ తండ్రి పేరు పొందిన క్రిమినల్ లాయర్ అవ్వడం వల్ల, అతని సాయంతో రవిని తప్పిస్తుంది ప్రియ జెయిల్ నుండి. ఆ సమయంలో రవి సైని ఇంటి దగ్గర ఉన్న సీల్ ను, ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న రాధిక సింగ్ స్వాధీనపరచుకుంటుంది. ప్రియ సాయంతో నిఖిల్ భోజ్ రాజ్ దగ్గరకు వెళ్ళేసరికే అతను హత్య చేయబడి ఉంటాడు. ఆ హత్య కూడా రవి మీదకే నెట్టబడుతుంది. ఆ తర్వాత కుర్కురే కూడా హత్య చేయబడతాడు. ఇక చెడ్డిని మాత్రం కాపాడగలుగుతాడు రవి. వారిద్దరూ కలిసి ఈ సీల్స్ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఈ కథలో మిగిలిన ముఖ్య పాత్రలు ప్రియ, ఖాన్ ,సంపత్ శర్మ. ప్రియ తండ్రి ఓ లాయర్.బాల్యంలోనే తల్లి మరణించడం వల్ల ఆమెను ఓ ఆయా పెంచింది. ఆ ఆయా భర్త ప్రియా మీద అత్యాచారం చేయబోతున్న సమయంలో ప్రియా తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో అతన్ని హత్య చేస్తుంది.ఆ విషయం తెలిసిన ఆయా ప్రియను కాపాడటానికి తను ఆత్మహత్య చేసుకుంటుంది,భర్తకు తనకు మధ్య జరిగిన దాడిలో ఇద్దరూ మరణించారనే విషయాన్ని నమ్మించడానికి. జరిగింది కూతురు ద్వారా తెలుసుకున్న ప్రియ తండ్రి అప్పటి వరకు ఆ ప్రాంతంలో దాదాగా ప్రసిద్ధి పొంది ఎన్నో అనైతిక కార్యకలాపాల్లో భాగస్థుడు అయిన ఖాన్ తో చేతులు కలిపి అతని లీగల్ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు.
కూతురిని కాపాడుకోవటానికి అలా అడుగు పెట్టిన ప్రియ తండ్రి అందులోనే మునిగిపోతాడు. హిస్టరీ చదువుతున్న ప్రియను తీసుకురమ్మని ఖాన్ ప్రియ తండ్రికి చెప్తాడు.అలా ప్రియా,ఖాన్ కలుస్తారు. ఖాన్ ముస్లిం కాదు.అతను బాల్యంలో తండ్రితో మధ్యప్రదేశ్ లో ఉండేవాడు. అతని పూర్వీకులు ఎన్నో దేవాలయాలను నిర్మించారు. అలా ఎన్నో తరాల నుండి ఓ సంస్కృత శ్లోకం ఉన్న ప్లేట్ వారికి వస్తూ ఉంది. ఖాన్ అసలు పేరు కృష్ణ. అతని తండ్రి కూడా తన కొడుకుకు ఆ ప్లేట్ ఇచ్చి,దానిని కాపాడమని చెప్తాడు. ఆ తర్వాత మతకలహాల్లో తండ్రి మరణించడంతో ఖాళీ జేబుతో ముంబై చేరుకున్న అతన్ని రహీమ్ భాయ్ అతన్ని ఆదరించి అతన్ని తనతో పాటు దొంగతనాలు,నేరాల్లో భాగం చేస్తాడు.అతని పేరు ఖాన్ గా మార్చబడుతుంది. అలా రహీమ్ తో కలిసిన ఖాన్ దగ్గర ఉన్న ప్లేట్ ను రహీమ్ కొన్ని కోట్ల రూపాయలు రావడంతో ఆక్షన్ కు పంపడంతో ఇద్దరికీ గొడవ అయ్యి విడిపోతారు.
అప్పటికే ఆ ప్లేట్ గురించి,కృష్ణుడు గురించి కొంత పరిశోధన చేసిన ఖాన్ ఆ నాలుగు సీల్స్ కనుగొనబడటం తెలుసుకుని,వాటిని తన తండ్రి తనకు ఇచ్చి తాను పోగొట్టుకున్న ప్లేట్ పైన పెడితేనే అసలు రహస్యం తెలుస్తుందని భావిస్తాడు. కృష్ణుడు శమంతకమణిని ఎక్కడ దాచాడో అన్నదే ఈ రహస్యం అని ఖాన్ భావిస్తాడు. శమంతకమణి లెడ్ ను బంగారంగా మారుస్తుందని,దానిని ఎలా సాధించే ప్రయత్నంలో భాగంగా ప్రియను రవి సైని దగ్గర విద్యార్ధిగా అయ్యేలా చేస్తాడు.
ఆ రహస్యం చివరి వరకు ప్రియకు కూడా తెలియదు. ఈ ప్రయత్నంలో అడ్డుగా ఉన్న వారిని తొలగించుకునేందుకే ఆమె సంపత్ శర్మా అనే విద్యార్ధినిని స్కూల్ నుండే కల్కి అవతారం అని నమ్మించి అతనికి ఎన్నో శిక్షణలు ఇచ్చి అతని పేరు వాకిల్ తారక్ గా మార్చి అతని చేత అన్ని హత్యలు చేయిస్తుంది. కృష్ణుడు వారసులు అయిన యాదవ జాతుల్లో సైని,కుర్కురే,చెడ్డీ,భోజాస్ కూడా ఉన్నారని,ఆ నలుగురు అందుకు చెందిన వారనే కూడా గుర్తిస్తారు. చివరకు ఆ రహస్యం తెలుసుకున్న ప్రియ ఖాన్ ను హత్య చేసి ఆ శమంతకమణిని తానే స్వంతం చేసుకుందామని అనుకుంటుంది.
రాధికా సింగ్ అసలు హంతకుడు రవి కాదని,ప్రియ అని తెలుసుకుంటుంది. చివరకు చేడ్డి కూడా మరణిస్తాడు. ప్రియ,వాకిల్ తారక్ కూడా పట్టుబడతారు. శమంతకమణి ద్వారా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే బంగారంగా మారడం అంటే మనిషిలో మార్పు రావడం అనే ఆలోచనకు వస్తారు సైని,రాధిక. సైని,రాధిక ఒక్కటవ్వడంతో నవల ముగుస్తుంది.
మనిషి ఆలోచనల్లో మార్పు రావడమే మనిషి జీవితంలో అసలైన మణి అనే భావనను కలిగించడంతో ఈ నవలలో మణికి తత్వ స్థాయిలో అర్ధాన్ని ఇచ్చి రచయిత ముగింపు ఇస్తాడు. పరిశోధనాపరంగా ఇది చదవాల్సిన నవల.
• * * *

Comments
Post a Comment