మనుగడ లేని వ్యక్తిత్వం

 మనుగడ లేని వ్యక్తిత్వం

-శృంగవరపు రచన



ఈ సమాజంలో స్త్రీని సుకుమారురాలిగా భావించడం,ఆమెను అల్లారు ముద్దుగా చూసుకోవడం,ఆమెకు మంచి భర్తను తీసుకురావడమే ఆమెను బాగా పెంచినట్టు భావించే తల్లిదండ్రుల నేపథ్యంతో అమ్మాయిల పెంపకం పట్ల అవగాహన లేకుండా పెంచితే వారి జీవితాలు ఎలా మారతాయో రెండు విరుద్ధ కోణాల నుండి స్పష్టం చేసే నవల వాసిరెడ్డి సీతాదేవి గారి ‘వైతరణి.’
పున్నమ్మ,మాధవరావు భార్యాభర్తలు. వారికి నలుగురు మగపిల్లలు. సుబ్బారాయుడు,నాగభూషణం,సుందరయ్య,సత్యనారాయణ. కానీ ఆ భార్యాభర్తలు ఓ ఆడపిల్ల కోసం ఎన్నో పూజలు,వ్రతాలు . చేశారు. చివరకు వారికి ఓ ఆడపిల్ల పుట్టింది.నాగమ్మ అని పేరు పెట్టుకుని,ఆమెను ఎంతో అపురూపంగా,గారాబంగా పెంచుకున్నారు.ఆమె అక్షరాభ్యాసం ఆ ఊరిలోనే పెద్ద వేడుకగా జరిగింది.కానీ నాగమ్మకు చదువు అబ్బలేదు. కుట్లు,అల్లికలు,వచ్చిన ప్రతి పనిలోనూ ఏదో అడుగు పెట్టడం మరలా వదిలివేయడం,ఆమెను నెత్తిన పెట్టుకుని చూసుకోవడం,ఆమె అన్నలు కూడా ఆమెను ఎంతో ప్రేమించేవారు. అన్నలకు వివాహమైంది. సుబ్బరాయుడు భార్య నాగరత్నం. నాగభూషణం,సుందరయ్య ఇద్దరు అక్కాచెల్లెలనే పెళ్లి చేసుకున్నారు. ఆ కోడళ్ళకు నాగమ్మకు జరుగుతున్న వైభోగం నచ్చలేదు. తమ భర్తలకు రావలసిన వాటా కూడా మొత్తం ఆమెకే అత్తామామలు దోచిపెడుతున్నారని వారి భావన. భర్తలకు చెల్లెలి మీద ఉన్న ప్రేమ వల్ల కొంతమేరకు మనసులోనే ఉంచుకున్నా, సమయం దొరికినప్పుడు వారి కోపాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నారు.
నాగమ్మ చదువుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది.ఆమె ఇష్టపడిన వెంకట్రావు ఎమ్.ఏ చదివాడు. అతనికి పన్నెండు వేలు కట్నం ఇవ్వడానికి కొంత పొలం అమ్మి మరి ఆ వివాహం చేస్తారు ఆ తల్లిదండ్రులు. వెంకట్రావు అనాధ. అతని మేనమామ అతన్ని పెంచాడు. వచ్చిన కట్నం అతన్ని పెంచి చదివించినందుకు వారే తీసుకుంటారు. లెక్చరర్ గా ఉద్యోగం అతనిది. నాగమ్మ కాపురం విశాఖపట్నంకు మారింది. నాగమ్మను తల్లిదండ్రులు చూసుకున్నట్టే ఎంతో ప్రేమగా చూసుకునేవాడు భర్త కూడా. భర్తను చూసి మురిసిపోయేది. పెళ్ళయిన మూడేళ్లకు నాగమ్మ గర్భవతి అయ్యింది.
అప్పటికే మాధవరావు కుటుంబ పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చింది. అతని చిన్న కొడుకు సత్యనారాయణ విప్లవకారులతో కలిసి తిరిగేవాడు.అలా అతను కుటుంబానికి దూరం అయ్యాడు.మొత్తానికి భార్యల పట్టుదలలకు తల వంచిన భర్తలు తండ్రి ఆస్తి పంపకాలు చేసేలా చేశారు. ఆస్తిని ఐదు భాగాలు చేసి నాలుగు భాగాలు కొడుకులకు,ఇంకో భాగం తల్లిదండ్రులకు వచ్చేలా చేశారు. సత్యం లేకపోవడం వల్ల అతని వాటా మీద పెత్తనం కూడా సుబ్బరాయుడికే దక్కింది. నాగమ్మ పుట్టింటికి ప్రసవానికి వస్తుంది. ఆమెకు కూతురు పుడుతుంది.నాగమ్మ ఇంట్లో వచ్చిన మార్పులను గమనిస్తుంది.
నాగమ్మ భర్త ఆరోగ్యం క్షీణిస్తుంది. అతనికి టిబి ఆఖరి దశలో ఉండటం,అప్పటి వరకు అతను నిర్లక్ష్యం చేయడంతో మదనపల్లిలో చేర్చినా అతను మరణిస్తాడు. తర్వాత నాగమ్మ జీవితం మారిపోతుంది.కూతురితో తల్లిదండ్రుల పంచన చేరుతుంది. కొన్నాళ్ళకు తల్లిదండ్రులు కూడా మరణిస్తారు.
పెద్దన్నయ్య దగ్గర ఉంటున్న నాగమ్మ ఆ ఇంటికి పనిమనిషిలా ఉన్నా ఎన్నో అవమానాలు. ఆమె కూతురు పార్వతి చదువు అతి కష్టం మీద ఎనిమిదో ఫారం వరకు సాగినా ఆ తర్వాత పట్టించుకునే వారు లేక ఆగిపోతుంది.పార్వతి పుట్టినప్పటి నుండి ఆ ఇంటిలో తిరస్కారాలను,అవమానాలను చూస్తూ పెరగడం వల్ల అన్నింటికీ ఎదురు తిరిగే మనస్తత్వం ఆమెకు అలవడింది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూసే వారు లేక ఏభై ఏళ్ల సుబ్బయ్య శెట్టికి రెండో పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి పార్వతికి ఇష్టం లేకపోయినా సరే తల్లిని ఆ నరకం నుండి తప్పించడానికి ఒప్పుకుంటుంది. తనతో పాటు తన తల్లి కూడా ఉంటుందన్న షరతు ముందుగానే పెడుతుంది.
శెట్టి పార్వతి తల్లి దగ్గర కూడా చనువుగా ఉండే ప్రయత్నం చేయడం చేస్తాడు. శెట్టి మేనల్లుడిని పార్వతి ఇష్టపడుతుంది. మాధరావుతో లేచిపోతూ తల్లికి ఉత్తరం రాస్తుంది. కూతురు చేసింది మంచిదే అని అనిపిస్తుంది నాగమ్మకు.నాగమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది.
ఈ నవలలో నాగమ్మను ఎంతో ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు ఆమె ఒక్కర్తే జీవితాన్ని ఎలా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలో మాత్రం నేర్పించలేదు.వారి మటుకు వారు ఆమెను ఎంతో ప్రేమించారు.ప్రేమను తమదైన పద్దతిలో వ్యక్తపరిచారు.ఆమెకు ధైర్యాన్ని ఇచ్చే విద్య,ఏదో ఒక కళ,స్వీయ వ్యక్తిత్వం గురించి నాగమ్మ ఏనాడూ ఆలోచించకోలేని విధంగా ఆమె పెరిగింది.అందుకే ఆమె తల్లిదండ్రులు,భర్త దూరం అవ్వగానే ఆమె జీవితం ఎటు కాకుండా పోయింది. ఇక పార్వతి విషయానికి వస్తే బాల్యం నుండే చదువు మీద ఆసక్తి ఉన్నా,ఆమెను చదివించే వారు లేరు.ఆమెకు తల్లి నిస్సహాయత,ఇంట్లో వారి తిరస్కారాలు మాత్రమే తెలుసు.అందుకే ఆమెలో సమాజం మీద,ఆ కుటుంబం మీద కసి పెరిగింది. అందుకే తన జీవితాన్ని తానే వెతుక్కోవాలని అనుకుంది.అది తప్పో,ఒప్పో తర్వాతి విషయం కానీ ప్రస్తుతపు జీవితం కంటే మెరుగైనదే అని ఆమె భావించింది.
ఏ పరిస్థితుల్లో అయినా మనుగడ కొనసాగించేలా సాగడమే జీవితం.ఆ నైపుణ్యం అలవర్చుకోగలగడమే జీవితం. అది లోపించిన ప్రేమ వల్ల మనుషులు తమకు తాము ఉపయోగపడని వారుగా తయారు అవుతారని ఈ నవల స్పష్టం చేస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!