ఇండెంచర్ కూలీ జీవిత ప్రస్థానం

                                         ఇండెంచర్ కూలీ జీవిత ప్రస్థానం

                                                        -శృంగవరపు రచన

                                                    

జీవితంలో ప్రతి మనిషి తన వెనుక తరాల చిత్రాలలోకి తొంగిచూడగలిగితే తనకు తెలిసిన తెలియని వ్యక్తిత్వ స్పర్శలను తాకవచ్చు. జీవితపు వేగంలో మనిషి తన కుటుంబ బరువులు,సుఖాలు దాటి అడుగు ముందుకో,వెనక్కో వేసే పరిస్థితుల్లో లేని సందర్భాలు సహజమైపోయిన ఈ రోజుల్లో గుబిలి కృష్ణ గారు తన ముత్తాత వీరయ్యగారి గురించి తెలిసిన పరిమిత సమాచారంతో దాదాపు నాలుగు దశాబ్దాలు శ్రమ,ఖర్చు,నిరాశలను సహించి తమ కుటుంబంలో తమ ముత్తాత గారు దక్షిణాఫ్రికా జీవితాన్ని,అక్కడ వారి జీవన గమనాన్ని,పడిన బాధలను,జీవితాన్ని గెలిచిన తీరును,ఆత్మీయత కోసం అన్నీ కోల్పోయిన నిస్సహాయతను తెలుసుకుని,కుటుంబ వృక్షంలో ఉన్న దక్షిణాఫ్రికా బంధువులను కూడా జీవితంలో ముఖ్య భాగం చేసుకుని,ఈ పరిశోధన క్రమంలో ఇండెంచర్ కూలీల జీవితంలో వ్యథలకు కదిలిపోయి వారి దుస్థితి ఇంకో రూపంలో ఇంకా మారని పరిస్థితులని మార్చాలనే ఆశయాన్ని పెట్టుకుని,ఓ పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగిగా,ఇంకో పక్క ముత్తాత జీవితంలో అటువంటి వ్యథలు పడుతున్న ఎందరినో చూసి,దానిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ‘వీరయ్య’పుస్తకంగా రచించారు.దీనిని ఆంగ్లంలో కృష్ణ గుబిలిగారు రాస్తే,దానిని తెలుగులోకి వారి తండ్రిగారు గురుమూర్తి గుబిలిగారు అనువదించారు.
కృష్ణ గుబిలి గారికి బాల్యం నుండి నాయనమ్మ (తండ్రి తల్లి) తాతయ్య నాగూరు,ముత్తాత వీరయ్య గురించి చెప్పే చిన్న విషయాలే ఎంతో ఆసక్తిని కలిగించేవి. తన ముత్తాత వీరయ్య దక్షిణాఫ్రికాకు చెరుకు కూలిగా వెళ్లాడని,తర్వాత ఆరుగురు కొడుకులు,ఒక కూతురు ఆయనకు కలిగారని,ఆ తర్వాత ఆయన కూతురు మాత్రమే అక్కడ ఉండిపోతే ఆయన కొడుకులతో ఇక్కడకు వచ్చాడని ఆయన తన నాయనమ్మ మాటల ద్వారా తెలుసుకోగలిగారు.నాయనమ్మ దగ్గర బాల్యం నుండే ఈ విషయాలు విని పెరగడం వల్ల ఎలా అయినా తన దక్షిణాఫ్రికా బంధువులను కలుసుకోవాలని,తన ముత్తాత జీవితం అక్కడ ఎలా జీవించాడో తెలుసుకోవాలి అన్న కుతూహలం ఆయనలో అధికం అయ్యింది.
ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన దక్షిణాఫ్రికా బంధువుల చిరునామాకు ఎన్నో ఉత్తరాలు రాసినా వాటికి జవాబులు వచ్చేవి కావు. తర్వాత ఎన్నో ఏళ్ళకు ఆయనకు వీరయ్య కూతురు చెంగమ్మ కొడుకు డేనియల్ నాయుడు అనే బంధువు సమాధానం ఇవ్వడం,ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకు కానీ ఆయన కూడా స్పందించకపోవడం,ఆ తర్వాత మొత్తానికి ఆ పరిచయం ఆధారంగానే కృష్ణ గారు దక్షిణాఫ్రికా వెళ్ళడం,ఆయన వెళ్ళేటప్పటికి డేనియల్ అనారోగ్యంతో మరణించడం,ఆయన కొడుకు సాయంతో మొత్తానికి అక్కడి ఆర్కైవ్స్ వెతకడానికి కృష్ణ వెళ్ళడం జరుగుతుంది.ఎంతో కష్టపడి ఆయన జీవితం గురించి తెలుసుకోగలిగాడు కృష్ణ.
వీరయ్య తండ్రి రామయ్య,తల్లి నారమ్మ.ముగ్గురు ఆడసంతానం తర్వాత వీరమ్మ తల్లిని వేడుకుంటే పుట్టిన బిడ్డ కనుక వీరయ్య అని నామకరణం చేశారు తల్లిదండ్రులు1882 లో దక్షిణ భారతదేశంలోని కొర్లపాడు లో జన్మించాడు వీరయ్య. వీరయ్యకు ముగ్గురు అక్కలు.లక్ష్మి,దుర్గ,సరస్వతి.పెద్ద కూతురు లక్ష్మికి వివాహం చేశారు తల్లిదండ్రులు.లక్ష్మి భర్త నారయ్య చీటికి మాటికి ఆమెను కట్నం కోసం వేధించేవాడు.మొదట సొంత భూమిలో వ్యవసాయం చేసుకుని కాస్త కలిమి గల స్థితిలో ఉన్న వీరయ్య కుటుంబం కరువుల వల్ల,శిస్తుల వల్ల ఉన్న భూమిని జమీందారుకు అప్పగించి అందులోనే వ్యవసాయ కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకోకుండా నారయ్య మాత్రం వేధిస్తూనే ఉండేవాడు. ఈ సమయంలో ఓ పూట బయటకు వెళ్ళిన వీరయ్య ఇంటికి వచ్చేసరికి లక్ష్మి నగలు పోవడం,ఆ దొంగతనం వీరయ్య మీద పడటం,ఆ అవమానం భరించలేని వీరయ్య విజయవాడ రావడం,తిరిగి ఇంటికి వెళ్తే బంగారం,డబ్బు సంపాదించే వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది.
జీతం,రేషన్ విషయాల్లో మభ్యపెట్టి మొత్తానికి వీరయ్య లాంటి ఎందరినో పోగేసి,ఓడకు సరిపోయే జనం ఉండేంతవరకు కూడా ఓ షెడ్ లో ఉంచి మొత్తానికి ఆరువందల సంఖ్య దాటిన కూలీలతో దక్షిణాఫ్రికాకు ఓడ బయలుదేరింది. ఈ ప్రయాణంలో వీరయ్యకు వెంకటస్వామి ,షేక్ పరిచయమై మంచి స్నేహితులు అయ్యారు. ఆడ కూలీల పరిస్థితి దారుణంగా ఉండేది.వారికి వివిధ స్థాయిలో లైంగిక వేధింపులు తప్పేవి కావు. ఓడ దిగాక భార్యా భర్తలను,బిడ్డలను అందరినీ వేరు చేస్తూ వేరేవేరు సుగర్ ఎస్టేట్ లకు కూలీలుగా వీరంతా పంపబడ్డారు. వీరయ్య,షేక్,వెంకటస్వామి మాత్రం గ్లెడ్ హౌ ఎస్టేట్ కు తరలించబడ్డారు. ఆంగ్ల బాషలో ఉన్న పత్రాలపై వీరందరితో సంతకం చేయించుకున్నారు.చెప్పిన జీతానికి ఇచ్చే జీతానికి సంబంధం లేదు. గొడ్డు చాకిరి ఆ చెరుకు తోటల్లో చేయాల్సిందే. సంపాదన పక్కనపెడితే తిండికి,ఖర్చులకే మొత్తం సరిపోయేది. ఆంగ్లేయులు ఇలా కూలీలుగా వచ్చిన భారతీయులపై ఆటవిక ప్రాంతాలకు చెందిన జూహులను రక్షణ అధికారులుగా నియమించారు.ఇక్కడ అందరూ బానిసలే అయినా అందరికి మధ్య ఎప్పుడు స్నేహం ఏర్పడకుండా చేసేవారు ఆంగ్లేయులు.
ఇండెంచర్ కూలిగా ఐదేళ్లు గడిపితే ఫ్రీ కూలీలుగా మారతారు. ఫ్రీ కూలీలకు ఆదాయం ఎక్కువ,పని సమయంలో వెసులుబాటు ఉండేది. ఆ సమయం కోసం వీరయ్య స్నేహత్రయం ఎదురుచూసింది . కానీ ఆ కాలం గడిచాక కూడా మరలా వారికి ఇండెంచర్ కూలీగానే ఉంచేశారు. అలా పదేళ్లుగా మారిన తర్వాత ఫ్రీ కూలీలను కూడా ఇండెంచర్ కూలీలుగా మార్చేశారు.అలా ఇక ఎప్పటికైనా మామూలు జీవితం గడుపుతామనే ఆశ వారిలో అంతమైపోయింది.ఆ సమయంలో గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఈ కూలీల పరిస్థితుల గురించి,భారతీయుల పట్ల అసమానత్వం గురించి ఫొనిక్స్ నుండి పోరాడుతున్నారు. బాలయ్య అనే కూలి అనారోగ్యంతో పని చేస్తున్నా పట్టించుకోకుండా కొరడాలతో కొట్టడం వల్ల ప్రాణానికి అపాయం ఏర్పడే సందర్భం ఏర్పడటంతో ఆ సమయంలో అతన్ని రక్షించడానికి గాంధీజీ ఆశ్రమానికి ఏ ఎస్టేట్ అధికారులకు తెలియకుండా తీసుకువెళ్తాడు. అక్కడ గాంధీజీని మొదటిసారి కలుసుకున్న వీరయ్య అక్కడి ఎస్టేట్ లో పరిస్థితులు,బాలయ్య పరిస్థితి చెప్తాడు. బాలయ్యను వైద్య రీత్యా అక్కడ ఉంచమని గాంధీజీ సూచించడంతో అతన్ని అక్కడే ఉంచి తాను తీర్గి ఎస్టేట్ కు వెళ్తాడు వీరయ్య.
మరునాడు బాలయ్య తప్పించుకున్నాడని ఫిర్యాదు ఇచ్చి అతన్ని పోలీస్ స్టేషన్ లో కొట్టిస్తారు.అతన్ని ఆ బాధ నుండి తప్పించమని వీరయ్య గాంధీజీని కోరడం,జాతి పిత వల్ల మొత్తానికి బాలయ్యను ఇంకో ఎస్టేట్ కు కూలిగా పంపడం జరుగుతుంది.అప్పటికే గాంధీజీ ప్రభావం ఎంతగానో దక్షిణాఫ్రికాలో ఉంది.ఆ తర్వాత ఆ ఎస్టేట్ లో ఓ కులీ పాము కరిచి వైయ సాయం అందక మరణిస్తాడు.అతని భార్యను ఆ అధికారుల నుండి కాపాడటానికి ఆమెను వెంకటస్వామికి వివాహం జరిపిస్తాడు వీరయ్య.ఆ తర్వాత గాంధీ ప్రభావం వల్ల వీరయ్య అతని మిత్రబృందం ఏ ఇబ్బందులు లేకుండానే హూస్టన్ ఎస్టేట్ కు కూలీలుగా వెళ్తారు.
ఈ ఎస్టేట్ లో వసతులు మెరుగ్గా ఉంటాయి.పని ఎక్కువైనా పనికి తగ్గ వేతనం కూడా ఉంది. ఈ మొత్తం కాలంలో వీరయ్య భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే జనుల బాషలనే కాకుండా జూహు బాషను కూడా నేర్చుకుంటాడు.జూహులతో కూడా ఎంతో స్నేహంగా ఉంటాడు. ఓ నాయకుడిలా అందరి సమస్యలను తీరుస్తూ కూడా ఉంటాడు.ఆ తర్వాత వీరయ్య పనితనాన్ని,చురుకుదనాన్ని గమనించిన యాజమాన్యం అప్పటికి అతన్ని సర్దార్ గా నియమిస్తుంది.ఒక ఇండెంచర్ కూలీగా తన జీవితాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా తన కృషితో,కష్టపడే తత్వంతో,తన తోటి వారి కోసం తపించే గుణంతో ఆ స్థాయికి ఎదిగాడు వీరయ్య. ఆ తర్వాత ఆ కలగడం జరుగుతుంది.ఆమె చెంగమ్మ. అప్పటికే వీరయ్య పిల్లలు కూడా పెళ్ళి వయసుకు వచ్చారు. వీరయ్యకు చెంగమ్మ అంటే ఎంతో ఇష్టం. వీరయ్య కొడుకుల్లో వ్యవహార దక్షత కలిగినవాడు,చదువుకున్నవాడు నాగూరు. అప్పటికే ఎప్పటి నుండో వీరయ్యకు భారతదేశంలో తన వారి దగ్గరకు వెళ్లాలనే కోరిక బలపడిపోయింది. తన వారిని చూడాలని అతనికి ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. వెంకటస్వామి కొడుకు చెంగమ్మ ప్రేమించుకోవడం వారికి వివాహం ఇరు కుటుంబాల సమ్మతితో జరగడం ఆ తర్వాత వీరయ్య తన కుటుంబం మొత్తాన్ని భారతదేశానికి తీసుకువెళ్లడం జరుగుతుంది. వీరయ్యతో పాటు కూతురు,అల్లుడు కూడా వచ్చారు.
భారతదేశానికి ఎంతో ఆశతో తిరిగి వచ్చిన వీరయ్యకు తన తల్లిదండ్రులు ఆ తర్వాత మరణించారని,లక్ష్మిని భర్త నారయ్య చంపి దుర్గను వివాహం చేసుకున్నాడని తెలియడంతో గుండె పగిలిపోతుంది. అక్కల కోసం వెతుకులాట మొదలుపెడతాడు వీరయ్య.నాగూరు కూడా తండ్రికి ఎంతో సహకరిస్తూ ఉంటాడు.అప్పటికే ఆత్మీయులను కోల్పోయిన వీరయ్యను బంధువుల పేరుతో చుట్టూ చేరిన ఎంతో మంది అతని ఆస్తి మొత్తం ఏదో ఒక కష్టం పేరుతో ఏమి లేకుండా చేసేశారు. ఎలాగో ఇద్దరు అక్కలను వీరయ్య కలుసుకోగలుగుతాడు వీరయ్య. అదే సమయంలో చెంగమ్మ భర్త తండ్రి అయిన వెంకటస్వామికి ఆరోగ్యం బాలేదనే వార్త రావడంతో ఆమె తన భర్తతో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం,వద్దని చెప్పిన సోదరులతో ఆమె సంఘర్షణ పడి పుట్టింటి వారు ఇచ్చిన నగలు అక్కడే విసిరికొట్టి వెళ్లిపోవడం జరుగుతుంది.ఆ తర్వాత ఆ నగలు బంధువులు తీసుకుని పరారవ్వడం జరుగుతుంది. జరిగిన పరిణామాలతో వ్యథకు గురవుతాడు వీరయ్య.
వీరయ్యకు ఉన్న ఒక కొడుకు ఈ మధ్యలో అనారోగ్యంతో మరణించడం కూడా అతన్ని ఇంకా బాధ పెడుతూ ఉంటుంది.ఆ సమయంలో మిగిలిన కొడుకులు వారి జీవన ఉపాధి కోసం వేరే చోట స్థిరపడినా,నాగూరు తండ్రికి ధైర్యం చెప్పి ఎలాగో ఇండెంచర్ కూలీలకు భారత ప్రభుత్వం ఇచ్చే భూమిని ఎంతో ప్రయాస పడి తెచ్చుకోగలుగుతాడు. నాగూరు దక్షత వల్ల ఆ బీడు భూమి పంట భూమిగా మారుతుంది. కానీ ఈ పొలం మీద కన్నేసిన సుబ్బారావు వారి నుండి కొనాలని ప్రయత్నించినా దానికి వీరయ్య నిరాకరించడంతో ఓ సారి కపటంతో వారిని భోజనానికి ఆహ్వానించడం,ఆ తర్వాత నుండి నాగూరు క్రమక్రమంగా అనారోగ్యం పాలయ్యి మరణించడం జరుగుతుంది. దక్షత కలిగిన నాగూరు మరణించడం,వీరయ్య వృద్ధాప్యంలో ఉండటంతో మిగిలిన కొడుకులను ఒప్పించి మొత్తానికి ఆ భూమి రాయించుకుంటాడు సుబ్బారావు. అప్పటికే నాగూరు భార్య నాంచారమ్మకు గురుమూర్తి పుట్టాడు.పుట్టింట్లో కాలం గడిపింది కొడుకుతో నాంచారమ్మ.అప్పటి నుండి వీరయ్య ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. గురుమూర్తిని సెలవుల్లో తీసుకువస్తే ఎంతో సంతోషంతో గడిపేవాడు వీరయ్య.నాగూరు వినాయకచవితి నాడు మరణించడంతో ఆ పండుగ జరపడం మానేసినా ఆ తర్వాత కొన్నాళ్ళకు వారు మరలా పండుగ జరుపుకోవడం ఆ రోజే వీరయ్య మరణించడం జరుగుతుంది. ఇది వీరయ్య కథ.నాగూరు భార్య నాంచారమ్మ తన భర్త గురించి,మామ గురించి చెప్పిన విషయాలే కృష్ణ తన ముత్తాత జీవితాన్ని తెలుసుకునేందుకు ప్రేరణ అయ్యాయి.
దీని ద్వారా మొత్తానికి చెంగమ్మ సంతానాన్ని,దక్షిణాఫ్రికాలో స్థిరపడిన బంధువులను,అమెరికాలో స్థిరపడిన బంధువులను ఒక్కటిగా చేయగలిగాడు కృష్ణ. ఈ పయనంలో ఇండెంచర్ కులీ ఇంకో విధంగా చెప్పాలంటే పరదేశాలకు డబ్బు సంపాదించాలనే ఆశతో వెళ్ళి అక్కడ నానా బాధలు అనుభవిస్తూ చాకిరీ చేసే బానిసలుగా ఇంకా మిగిలిపోతున్న ఎందరి గురించో కూడా కృష్ణ తెలుసుకోవడంతో పాటు ఈ సమస్య గురించి పాఠకులు ఆలోచించేలా చేయగలిగారు. ఇంత మంచి చరిత్రను ఎంతో ఆసక్తికరంగా,అలాగే చెరకు పరిశ్రమల్లో ఉండే పని,అక్కడి జీవన శైలి గురించి,ఇండెంచర్ కూలీల వంశాల నుండి ప్రపంచ ఖ్యాతి గడించిన వారి వివరాలను ఆ చరిత్రను ఎంతో విపులంగా రాసిన రచయితకు అభినందనలు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ