పోయే వాళ్ళను పోనీ!

                                         పోయే వాళ్ళను పోనీ!

                                                                    -శృంగవరపు రచన


కోట్ల మంది మనుషుల్లో
వందలతో తిరిగే నువ్వు
పదులతో ప్రాణమవుతావు
ఆ పదులు
నీకు పది జన్మలకు
సరిపోయే ఆత్మీయతను
పంచుతున్నారని
మురిసిపోతావు!
ఆ పదులు
ఆత్మీయతలోని
అధికారంతో
నిన్ను దూరం
పెట్టిన రోజు
కృంగిపోతావు!
ఆ పదుల లాంటి
వారు దొరకరని
భావిస్తూ
వారితో పాటే
నీ మనసును
తోడుకుని పోతావు!
నీకు
తెలిసి తెలియనిది
ఏమిటంటే
ఆ పదుల లాంటి వారు
వారిని మించిన వారు
వారితో పోలికే లేని వారు
ఎందరో
కోట్ల మందిలో
కలిసిపోయి ఉన్నారని!
పదుల ప్రవాహం
వస్తూ పోతూ
ఉంటుందని!
పోయిన వారి కళ్ళల్లో
నుండి నువ్వు
అద్దంలో చూసుకుంటూ
బాధలో
అపరాధ భావంలో
మునిగిపోతే
వారి నిష్క్రమణతో
నువ్వు నీ నుండి
నిష్క్రమించినట్టే!
పోనీ
వాళ్ళను పోనీ!
పోయేదేముంది!
నిన్ను గెంటిన దూరంలో
భారాన్ని మోస్తూ
వారూ పోతూ ఉంటే
బరువును దింపుకుంటూ
ఇంకో
ద్వారం తెరుస్తావు నువ్వు!
* * *

Comments

Popular posts from this blog

రహస్యపు జీవితం

మనిషిలో తాత్వికత

మరణ శిక్షలు లేని కలల లోకం!