తాపీ ధర్మారావుగారు విద్యార్థిగా!
తాపీ ధర్మారావుగారు విద్యార్థిగా!
తాపీ ధర్మారావు గారి రచనల్లో ఎంతో అధ్యాయనం చేసిన అనుభవం అక్షరాల్లో కనిపిస్తూ ఉంటుంది.ఆయన రచనలు సాధారణ అంశాలను దాటి విశిష్టతను సంతరించుకున్నవే.ఇటువంటి విశిష్ట వ్యక్తులు బాల్యం నుండి ఆ విశిష్టత రూపొందే క్రమంలో ఎలా ఉంటారు అన్న అంశం పట్ల సామాన్య పాఠకులకు ఆసక్తి కలగడం సహజం. తాపీ ధర్మారావు గారు తన స్వీయ చరిత్రను అందులోనూ కేవలం ఆయన కళాశాల విద్యాభ్యాసం వరకు మాత్రం ‘రాలూ-రప్పలూ’ లో పొందుపరిచారు.ఇది అసంపూర్ణంగా ముగిసినా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. దీని తర్వాతి జీవితం గురించి కూడా ఆయన రాసి ఉంటే బాగుండేది.దాని వల్ల ఆయన ఆలోచనల క్రమం గురించి,రచనలపై దాని ప్రభావం గురించి,కళాశాల వరకు ఉన్న ఆయన ఆలోచనా శైలి జీవితం మొత్తం ఎలా ఉందో అన్న విషయం గురించి కూడా అవగాహన కలిగేది.కానీ ధర్మారావు గారు దీనిని ఇక్కడికే పరిమితం చేశారు.
ధర్మారావు గారు బరంపురంలో 1887 లో జన్మించారు.తండ్రి అప్పన్న గారు గొప్ప వైద్యులు. ఆ తర్వాత వారి కుటుంబం శ్రీకాకుళంకి వెళ్ళింది. వారి తండ్రి గారు రోగుల పట్ల ఎంతో ఆత్మీయతతో డబ్బు విషయంలో కఠినంగా లేకుండా వ్యవహరించేవారు.ఆయనకు విలాస స్వభావం ఉన్నది.మందు-మగువ అలవాట్లు కూడా ఉన్నవి.ధర్మారావు గారు విద్యలో ఎంతో ప్రతిభ ప్రదర్శించేవారు. ఆయన పాఠశాల విద్య చదువుకుంటున్న సమయంలో ఆయన తండ్రి గారు కూడా అంతకు ముందు అక్కడే చదువుకోవడం వల్ల,చదువులో చురుగ్గా ఉండటం వల్ల,తన ప్రతిభతో క్లాసులో ప్రత్యేక అభిమానం విద్యార్ధుల్లోనూ,ఉపాధ్యాయులోనూ కలిగించడం వల్ల ప్రత్యేకతకు ఆయన బాల్యం నుండే అలవాటు పడ్డారు.
ధర్మారావు గారు నాలుగవ లేదా ఐదవ తరుగతి చదువుతున్న సమయంలో ఆయన క్లాసులో ఇరవై రెండవ స్థానంలో ఉన్నారు.ఆ విషయం ఆయన తండ్రి గారికి తెలిసినప్పుడు ఆయన చదువుల్లో మంచి స్థానాలు బ్రాహ్మణులకే వస్తాయని అనడంతో పట్టుదలతో చదివి అప్పటి నుండి చదువులో ప్రథములుగా నిలిచేవారు. స్వతహాగా ధర్మారావు గారు దేనినైనా ప్రశ్నించే తత్వంతో పాటు సమాజానికి విభిన్నంగా పయనించే తత్వం కలవారు.ఇది వారి పాఠశాల జీవితం నుండే కళాశాల జీవితం వరకు కనిపిస్తుంది.
అప్పట్లో పాఠశాలలో మార్కులు కూడడము ఉండేది.అంటే ఆ రోజుల్లో ఏ రోజూకారోజు,ఏ పాఠానికి ఆ పాఠంలో ఎవరెవెరికెన్ని మార్కులో,మార్కుల రిజిస్టర్ లో వేస్తుంటారు. నెల చివరి రోజున ఆ మార్కులన్నీ కూడతారు. మార్కుల మొత్తాన్ని పట్టి పిల్లలకు ఫస్టు,సెకండ్ స్థానాలిస్తారు. మళ్ళీ నెలాఖరు వరకు అవే వారి స్థానాలు. అలా ప్రథముడిగా ఉన్న ధర్మారావు గారు క్లాస్ మానిటర్ అయ్యారు. బెంచీ తాళం కూడా ఆయన దగ్గరే ఉండేది. ఆ సమయంలో ఆయన ఓ సారి పంచె కట్టుకుని వచ్చారు. అందరిలా కాకుండా విభిన్నంగా కట్టుకోవడంతో స్కూల్ లో నవ్వడంతో ఆయన అలా ఎందుకు కట్టుకోకూడదని వాదించి అప్పటినుండి అలానే కట్టుకున్నారు. చిన్నప్పుడు ధర్మారావు గారి జాతకం తగలబడిపోకముందు ఓ జ్యోతిష్యుడు ఆయనను ఢిల్లీ రాజంతా గొప్పవాడవుతావని చెప్పడం వల్ల ఆయన్ని చిన్నప్పుడు ఢిల్లీ రావు అనే పిలిచేవారు. పాఠశాలలో ఉన్న సమయంలో ధర్మారావు గారికి వ్యాయామం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. డ్రిల్ మాస్టర్ కు తన తండ్రి వైద్యశాలలో ఉండే టించర్,ఐయోడిన్ వంటివి లంచాలుగా ఇచ్చి ఆ డ్రిల్ క్లాస్ తప్పించుకునేవారు. ఆయనకు బాల్యం లో అలవాటైన్ కాఫీ అలవాటు ఆయనతో పాటే పెరిగిపోయింది.
ఫస్ట్ ఫారంలో ఆయన స్నేహితుడితో కలిసి సిగరెట్ కాల్చడం చూసిన మాస్టారు ఆయని చేత ‘నేను సిగరెట్ తాగను’అని వంద సార్లు ఇంపోజిషన్ రాయించారు. ధర్మారావు గారి ఇంటి పేరు బండి వారో లేదా బండారు వారోనట. వారి పూర్వులు మిలటరీలో సిపాయిలుగా చేసేవారు. ధర్మారావుగారి నాన్నగారి తాత గారు మిలిటరీ నుండి తిరిగి వచ్చో లేక మిలటరికి పోకుండానో తాపీ పనిలోకి ప్రవేశించారు. అలా వృత్తి ధర్మ రీత్యా తాపీ లక్ష్మయ్య అన్న వాడుక రావడం,ఆ తర్వాత ఆ తాపీ ఇంటి పేరుగా స్థిరపడిపోవటం జరిగింది. తమ కుటుంబం ఒక కార్మిక వంశం అని జ్ఞాపకముంచుకోవడానికి,ఒళ్ళు వంచి కష్టం చేయవలసి వచ్చినప్పుడు చిన్నతనంగా భావించకుండా ఉండటానికి ఈ పేరు విశేషం అని ధర్మారావు గారు ఇందులో చెప్పారు.
శ్రీకాకుళంలో ఆయన చదువు 1900 వరకు అంటే థర్డ్ ఫారం వరకు సాగింది. వారి అన్నగారికి 13 వ ఏట వివాహమైంది. ఈ మధ్యలో ఎప్పుడు ధర్మారావు గారి తండ్రి బదిలీల మీద తిరుగుతూ ఉన్నా ఆయన తల్లిగారు మాత్రం పిల్లల చదువు చక్కగా కొనసాగేలా చూశారు. శ్రీకాకుళంలో ఉన్నప్పుడు ధర్మారావుగారు తన మిత్ర బృందం,పాఠశాల వరకు మాత్రమే పరిమితమయ్యారు.వారంతా ఓ పక్క నాటకాలు వేస్తూ,కవిత్వం రాస్తూ,పెయింటింగ్ లో కూడా ప్రవేశంతో,టైలరింగ్ తో సహ అన్నింట్లోనూ ధర్మారావుగారికి ప్రవేశం ఉండేది. ముంబై నుండి తిరిగి వస్తున్నప్పుడు నగలు,డబ్బు అన్ని అపహరించబడటంతో ఇక అప్పన్న గారు శ్రీకాకుళం నుండి విజయనగరంకు కుటుంబాన్ని మార్చారు.
1900 విజయనగరంలోని రిపన్ స్కూల్ లో ధర్మారావు గారి విద్య కొనసాగింది. ఆయన అన్నగారు కూడా ఫెయిల్ అవ్వడం వల్ల వారిద్దరూ ఒకటే చదువుతున్నారు. ధర్మారావుగారికి కొత్త పుస్తకాలు కొనే అలవాటు లేదు.తన సీనియర్స్ నుండి తీసుకునేవారు.అలాగే ఆయన చదువంతా కూడా స్కాలర్షిప్స్ మీదనే సాగింది. ఫస్ట్ మార్కుల కోసం ధర్మారావు గారు కొన్ని సార్లు మాస్టార్లతో ధర్మారావుగారు పోరాడేవారు.ధర్మారావుగారికి పెంకితనం కూడా ఉండేది. ఓ సారి క్లాసు పరీక్షలో ఫస్ట్ మార్కు రాకపోయేసరికి మాస్టారును అడిగితే చేతి రాత బావుండకపోవడం వల్ల అని చెప్తే అప్పటి నుండి తనకు తానే చూచివ్రాతలు రాసి తన దస్తూరిని మెరుగుపరుచుకున్నారు. ఇక్కడే లెక్కల మీద ఏర్పడిన అభిమానం వల్ల క్లాసు పుస్తకాలతో పాటు రిఫరెన్స్ లోనివి కూడా చేస్తూ ఉండేవారు ధర్మారావుగారు. ఓ సారి అలా చేస్తున్న సమయంలో ఆయనకు గుండె నొప్పి రావడం ఆయన తండ్రి వైద్యం చేయడం,ఆ సంవత్సరం ఆయన ఫెయిల్ అవ్వడం,ఆ తర్వాత సంవత్సరం చదవడం జరిగింది. ఆ సమయంలో విద్యార్ధుల మధ్య ఎంతో పోటీ ఉండేది.ధర్మారావు గారు తన ఇంట్లో స్టూడెంట్స్ డిబేటింగ్ సొసైటీ స్థాపించారు. అలా ధర్మారావు గారు తన జీవితంలో విద్యార్ధి దశలో ఉండాల్సిన ఉత్సాహాన్ని,సామర్ధ్యాన్ని వినియోగించుకున్నారు.
ఆ సమయంలో విజయనగరంలో ఎన్నో వైభవాలు,భోగం మేళాలు జరిగేవి. ఎందరో తమ సంసారాలను సాని కుటుంబాల కోసం వదులుకున్నారు. కొంత ధర్మారావు గారి తండ్రి కూడా మందు మగువ వల్ల ఆస్తులు పోగొట్టుకున్నారు. సంగీతం వేశ్యల కళ అనే దురభిప్రాయం ఏర్పడటం వల్ల సంగీతం పట్ల,అది నేర్చుకున్నవారి పట్ల ధర్మారావు గారికి విముఖత ఏర్పడింది. కానీ అది దురభిప్రాయం అని తరువాత తెలుసుకున్నానని ధర్మారావు గారు స్పష్టం చేశారు.
ధర్మారావుగారి సోదరికి వివాహ సంబంధం కోసం వచ్చినప్పుడు వారితో పాటు ఉన్న చిన్న అమ్మాయి అన్నపూర్ణతో ధర్మారావుగారికి కూడా వివాహం నిశ్చయమైపోయింది. అప్పటికి అన్నపూర్ణ గారి వయసు 10 ఏళ్ళు,ధర్మారావు గారి వయసు 15 ఏళ్ళు. సంస్కరణ భావాలు కలిగిన ధర్మారావుగారు భార్యను తనతో పాటు నాటకాలకు తీసుకువెళ్లడం,అప్పటి అలవాట్లను సౌఖ్యానికి తగ్గట్టు మార్చే ప్రయత్నం చేయడం,అలాగే ఆమె విద్య,తన విద్య ఓ దారికి వచ్చేవరకు వివాహం చేసుకోకుండా వాయిదా వేయడం వంటివి ఇప్పుడు సహజమే అయినా అప్పట్లో గొప్ప విషయాలనే చెప్పవచ్చు.
ఇక ఎఫ్.ఏ అంటే ఇప్పటి ఇంటర్ చదవడానికి ధర్మారావు గారు పర్లాకిమిడి వెళ్లారు. విజయనగరంలో చదవడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో ఆయన ఉచితంగా చదువు చెప్తూ అప్పటికే విద్యార్ధి సంఖ్య ఉన్న ఒరియా జమీందారు వారు నిర్మించిన కాలేజీలో చేరారు ధర్మారావుగారు.ఆయనకు అక్కడ భోజన వసతి కూడా ఉంది. ఎన్ని ఉచిత ఏర్పాట్లు చేసినా అక్కడ విద్యార్ధుల సంఖ్య 10-15 మందిని మించేది కాదు. అక్కడి కాలేజీ ప్రిన్సిపాల్ మంగు శ్రీనివాసరావు పంతులు గారు.అక్కడ వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అక్కడ గిడుగు గారి మాట ప్రిన్సిపాల్ గారి కన్నా అధికం. చరిత్ర బోధకులు అక్కడ. మొదటి సారి రామ్మూర్తి గారి క్లాసులో మొహానికి బొట్టు లేకపోవడం ఎందుకు పెట్టుకోలేదని రామ్మూర్తి పంతులు గారు ధర్మారావు గారిని ప్రశ్నించడం,దానితో ఏర్పడిన విముఖత రెండు నెలల పాటు కొనసాగింది.గిడుగు రామ్మూర్తి గారు ఇష్టమైతే ఎంత బాగా ఉంటారో లేకపోతే అంతే నిర్దయగా ఉండేవారు. అప్పటి నుండి ధర్మారావు గారి వైపుకు తన వీపు కనిపించేలా పాఠం చెప్పేవారు.
అప్పటి నుండి చరిత్ర పుస్తకాలను వేటిని క్లాసుకు సంబంధించిన వాటితో పాటు ఇంకెన్నో చదివేవారు ధర్మారావుగారు. రెండు నెలలకు కానీ ఓ మ్యాపులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి గిడుగు వారి అభిమానానికి పాత్రుడు కాగలిగారు ధర్మారావుగారు. అప్పటి నుండి రామ్మూర్తి గారు ధర్మారావుగారి పక్కనే తన కుర్చీ వేసుకుని పాఠం చెప్పేవారు.అంతే కాకుండా తన దగ్గర ఉన్న పుస్తకాలు ఇవ్వడమే కాకుండా,ఆ తర్వాత ధర్మారావు కోసం హాస్టల్ కు కూడా వచ్చేవారు. అక్కడి నీటి వల్ల మలబద్ధకం కలగడం,ఓ మిత్రుడు చుట్ట తాగితే ఆ సమస్య తగ్గుతుందని చెప్పడం,అప్పటి నుండి ఆయనకు చుట్ట అలవాటు కావడం జరిగింది. గిడుగు రామ్మూర్తి గారికి చెవుడు.కళాశాలలో ఫిజియాలజీ చెప్పే ఉపాధ్యాయుడు చివరిలో వెళ్లిపోవడంతో వారంలో ఆ పాఠాలు నేర్చుకుని విద్యార్ధులకు బోధించారంటే ఆయన ప్రతిభ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. రామ్మూర్తి గారి ప్రియా శిష్యుడిగా మారడంతో చరిత్ర పట్ల కాస్త నిర్లక్ష్యం ఏర్పడింది ధర్మారావుగారికి. పరీక్షలకు రెండు నెలలు ఉన్నాయనగా ఆయన అడిగిన ఓ ప్రశ్నకు క్లాసులో ఎవరు సమాధానం చెప్పలేకపోవడంతో ఆయన ప్రధాన కోపం ధర్మారావుగారి మీదే ఉండి అప్పటి నుండి ఆ క్లాసుకు పాఠాలు చెప్పడం మానేశారు. చివరి పరీక్షల్లో కూడా ఆయన ఆశీర్వాదం లభించకుండానే పరీక్ష సెంటర్ విజయనగరంలో కావడం వల్ల అక్కడ పరీక్ష రాశారు. ఆ పరీక్షల్లో ఫస్ట్ క్లాసు తెచ్చుకున్నారు ధర్మారావుగారు.
డిగ్రీ చదవలనే కోరిక ఉన్నా,ఎన్నో కళాశాలలు స్కాలర్షిప్ ఇచ్చినా కుటుంబ ఆర్థిక స్థితి వల్ల అప్పటికే అన్న మెడిసిన్ చదువు ఇంకో సంవత్సరం ఉండటం వల్ల ఆ సంవత్సరం ఏదో ఒక ఉద్యోగం చేసి ఆ తర్వాత డిగ్రీ చదువుదామని నిర్ణయించుకున్నారు.అలా రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా మారిపోయారు,ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సమవత్సరం ఆయన డిగ్రీ చదవడానికి ఎన్నో కాలేజీల నుండి స్కాలర్షిప్స్ రావడం చివరకు మద్రాసులోని పచ్చన్న కాలేజీని ఎన్నుకుని అక్కడ జేరిపోవడం జరిగింది.అక్కడ తెలుగు,ట్రాన్స్లేషన్ సబ్జెక్ట్స్ చెప్పే ఉపాధ్యాయులకు ప్రతిభ లేదని ఆయన గ్రహించడం జరిగింది.అలా అప్పట్లో ట్రాన్స్లేటర్ గా ఉన్న శేషాద్రి అయ్యంగారు ఓ పద్యం బోర్డు మీద రాసి,దానిని అనువాదం చేయమని చెప్పడంతో ఓ క్లాసు అయిపోయేది.అప్పటికే ధర్మారావు గారు తమ దగ్గర పాఠ్య పుస్తకాలు ఉన్నాయని,బోర్డు మీద రాయాల్సిన అవసరం లేదని ఎదురు తిరిగి చెప్పారు. అంతే కాకుండా బోర్డు మీద పద్యంలో అరసున్న,ర-ఱ ల విషయంలో ఒకదాని బదులు ఒకటి రాశారు. దాని వల్ల అర్ధాలే మారిపోతాయని తెలిసిన ధర్మారావు గారు ఆ తప్పులే అనువాదంలో చేసి,తాను ఎందుకు చేశానో కూడా చెప్పినా ఆయన్ని అవమానించడంతో ధర్మారావుగారు ఎదురు తిరిగి సమాధానం చెప్పడం,అది ప్రిన్సిపాల్ వరకు వెళ్ళడం,శబ్ద రత్నాకరం తెప్పించి మరి ఆ మాస్టారు చెప్పిన తప్పులు చెప్పడం వల్ల మొత్తానికి అయ్యర్ గారి బదులు ధర్మారావు గారు సూచించిన ట్యూటర్ గా ఉన్న వెంకట రంగయ్యగారికి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది.దీని వల్ల అయ్యర్ గారికి ధర్మారావు గారికి కొంత విరోధం ఏర్పడ్డా,ఆ తర్వాత అది స్నేహంగా మారిపోయింది.
ధర్మారావు చదువులో ముందుండటం వల్ల ఆయనకు ప్రత్యేకత లభించేది. తమిళనాడు విద్యార్ధులు,తెలుగు విద్యార్ధులు రెండు జట్లుగా ఉండేవారు. ఆంధ్రా వారు డబ్బు ఖర్చు పెట్టడమే తప్ప చదవరని తమిళుల అభిప్రాయం. తమిళులు పొదుపుగా ఉండేవారు.అలాగే ఆంధ్రులకు బాష రాకపోవడం వాలాల్ రిక్షా వాడి నుంచి మోసం చేసే ప్రయత్నం చేసేవారు. తన ఆర్థిక పరిస్థితి రీత్యా ధర్మారావు గారు కూడా తమిళుల వలె పొదుపుగా మారిపోయారు.ఆయన నోట్సులు చదివి సహ విద్యార్ధులు పరీక్షలు గట్టెక్కేవారు.ఆయన మద్రాసులో ఉన్నప్పుడే ఆయన అన్నగారు మెడిసిన్ పరీక్ష కోసం మద్రాస్ వచ్చారు. పరీక్ష ముందు చదవడం ధర్మారావుకు అలవాటు లేదు.ఏ రోజుకు ఆ రోజు చదవడం,పరీక్ష ముందు కులాసాగా ఉండటం ఆయన పద్ధతి. అన్న గారి పరీక్ష తర్వాత మద్రాసులో చూడాల్సినవి చూశారు.తర్వాత ఆయన మెడిసిన్ లో పాస్ అయ్యారు. ఇలా ఆయన డిగ్రీ చదువుతున్న విషయాలు చెప్తూనే ముగించేశారు ధర్మారావుగారు.
నేటి విద్యార్ధులు కచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇది. బాల్యంలో ఉన్నప్పుడు చదువు పట్ల నిర్లక్ష్యం చూపకుండా ఎలా అన్నింట్లో భాగం కావచ్చో,అందరి మధ్య ప్రత్యేకంగా ఉండటం అలవాటు పడిన ధర్మారావుగారి తెలివితేటలు పాఠకులను అబ్బురపరచక మానవు.దానితో పాటు అప్పటికి ఇప్పటికీ వచ్చినా విద్యా మార్పులు కూడా ఇందులో కొన్నిచోట్ల గోచరిస్తాయి.
* * *

Comments
Post a Comment