మనుషులు -ప్రేమలు

                                     మనుషులు -ప్రేమలు

                                             -శృంగవరపు రచన


సి. ఎన్. చంద్రశేఖర్ గారి కథల్లో ఊహించని మలుపులు, ఆలోచింపజేస్తూనే ప్రశ్నలుగా మిగిలిపోయే మనుషుల ఉనికి, ప్రేమ గురించి మనిషి లోతుగా ఆలోచించాల్సిన అవసరం వంటివి పాఠకుల ఆలోచనా పరిధిని అనుసరించి ఎన్నో ఉన్నాయి. అన్నింటిని మించి పఠనీయత లక్ష్యంగా సాగే ఆయన కథల్లో ఓ 11 కథల సంపుటే 'నీరాజనం.'
మొదటి కథ 'చందూ.'ప్రతి మనిషికి వ్యక్తిత్వ పరిధి ఉంటుంది. ఆ పరిధి బలమే ఆ వ్యక్తికి విలువను ఆపాదిస్తుంది. సమాజంలో అటువంటి విలువైన ఓ వ్యక్తి కేంద్రంగా సాగే కథ ఇది. ఆ వ్యక్తి చందూ. చందూ జీవితంలో తన చుట్టూ ఉన్న వ్యక్తులతో స్నేహం పెంచుకుంటూ, వారి కష్టాలకు స్పందిస్తూ, బాధల్లో పాలుపంచుకుంటూ ఉంటాడు. అతను ఒక రచయిత కూడా. అతనికి బస్సు ప్రయాణంలో పరిచయం అయినా స్త్రీ ఈ కథ పాఠకులకు పరిచయం చేస్తుంది. వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతున్న క్రమంలోనే చందూ ఎలా తన చుట్టూ ఉన్నవారికి సమస్య వస్తే తనకు సమస్య వచ్చినట్టే భావించి వారికి అండగా ఉంటాడో ఆమె చూసింది. ఆమె స్నేహితురాలు విజయకు, అలాగే తన స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు ఒకేలా స్పందించడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. విజయ భర్త ఉదయ్ మరణిస్తే ఆమెకు ఇంకో ఉద్యోగం ఇప్పించడం, భర్త తాలుకు డబ్బు వచ్చేలా చేయడం చేస్తాడు చందూ. ఈ విషయం నిమిత్తమై అతను కొన్నిసార్లు విజయ ఇంటికి వెళ్తాడు. వారిద్దరినీ కథానాయకి అపార్ధం చేసుకుంటుంది. తర్వాత తాను పెళ్ళి పీటల మీద నుండి వచ్చి ఉదయ్ ను చేసుకున్నానని,ఇద్దరి కుటుంబాల వాళ్ళు తమను ఆదరించలేదని, ఆ రోజు పీటల మీద ఉన్నది చందూ అని, అతను ప్రేమిస్తుంది ఆమెనే అని స్నేహితురాలు స్పష్టం చేసేసరికి ఆ అపార్ధాన్ని తొలగించుకుని అతన్ని అర్ధం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
రెండో కథ 'నీరాజనం.'ఏ విషయమైనా అర్ధం కావాలంటే ఉదాహరణలో, పోలికలో మనిషిని స్పృశించడం సహజం. ఈ కథలో రచయిత జీవితంలో ఒకే దశలో ఉన్న ఒకే ఉద్యోగాల్లో ఉన్న ఇద్దరి రిటైర్మెంట్ డే సందర్భంతో వ్యక్తి వృత్తి పట్ల పాటించాల్సిన నిబద్ధత గురించి స్పష్టం చేసే ప్రయత్నం చేసారు.
ప్రసాద్, నాగరాజు ఒకే ఆఫీసులో పని చేసి ఒకే రోజు రిటైర్ కాబోతున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. ప్రసాద్ తన వృత్తి జీవితంలో అంకితభావంతో పని చేసే వాడు. అలాగే తన తోటి వారితో ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు.అలాగే తాను చేరిన కొత్తలో అవమానాలు సహించి పని నేర్చుకున్నాడు. తన అనుభవాలు దృష్టిలో ఉంచుకుని తన తరువాతి వారికి తన సహాయసహాకారాలు అందించాడు. రోజు కోలిగ్స్ తో కలిసి భోజనం చేసేవాడు. ఆఫీసును కుటుంబంలా భావించేవాడు.
నాగరాజు రోజు ఆఫీసుకు వెళ్ళేవాడు. వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవాడు. ఎవరితోనూ కలిసే ప్రయత్నం చేయలేదు. తన జీతం, తన బెనిఫిట్స్ కే తన జీవితం అని అనుకునేవాడు. పట్టించుకోకపోతే పని తప్పించుకునే ప్రయత్నం చేసేవాడు.
ఈ ఇద్దరు ఒకే రోజు రిటైర్ కాబోతున్నారు. ఆ రోజు ఉదయం ప్రసాద్ ఆఫీసుకు వచ్చేసరికి అందరూ ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతారు. ఫంక్షన్ లో కూడా ప్రసాద్ కు ఇచ్చిన ప్రాధాన్యత నాగరాజుకు దక్కదు. దానితో కాస్త అక్కసు ఉన్నా నాగరాజు కొడుకు లోకేష్ కూడా తన ఉద్యోగం కోసం సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉండటం, తండ్రిలాగే నలుగురికి సాయం చేసే గుణం గురించి చెప్పడంతో నాగరాజు తన లోపాన్ని తెలుసుకుని మనఃస్ఫూర్తిగా ప్రసాద్ ను అర్ధం చేసుకుంటాడు.
మనం ఏది చేసినా దాని ఫలితాన్ని కచ్చితంగా పొందుతాము. ఆ చేసే పనిలో కాస్త ప్రేమ, ఆత్మీయత, మన తోటివారు అని ఆలోచించగలిగితే అప్పుడు మనం అందరి ప్రేమకు అర్హులమవుతామని జీవితం అంటే అంతిమ దశలో వాటిని అనుభూతిస్తూ ఆస్వాదించగలగడమే అని ఈ కథ స్పష్టం చేస్తుంది.
మూడవ కథ 'శుభసంకల్పం.' ప్రేమ వివాహంకు దారి తీయవచ్చు కానీ అన్ని వైవాహిక బంధాలను ప్రేమే నడిపిస్తుందని నిర్దారించలేము.అలా విచ్చిన్నమైన వైవాహిక బంధాల వల్ల వచ్చే ఒంటరితనం ఎలా కొన్ని సార్లు స్త్రీల జీవితాలను నాశనం కావడానికి ఆస్కారాన్ని ఇస్తుందో ఈ కథ స్పష్టం చేస్తుంది.
స్కూల్ టీచర్ గా పని చేస్తున్న సాధన భర్త నుండి చట్టపరంగా విడిపోయింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న ఆమెకు లాయర్ చలపతితో ఏర్పడిన పరిచయం సన్నిహిత సంబంధంగా కూడా మారింది. సాధన పక్కింట్లో అద్దెకు దిగిన చంద్రం కుటుంబంతో సాధనకు అనుబంధం ఏర్పడుతుంది. చంద్రం భార్య డబ్బు, నగలు, ఖరీదైన జీవితం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి అని, సాధారణ జీవితం ఉన్న చంద్రంను వీటి కోసమే వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోయిందని చంద్రం తల్లి ద్వారా తెలుసుకుంటుంది సాధన. ఆ తర్వాత చంద్రం మంచితనం సాధనకు నచ్చుతుంది. వారిద్దరికి చంద్రం తల్లి వివాహం జరిపిస్తుంది. వివాహమయ్యాక ఓ ఆడిటోరియంలో చలపతి ఎదురుపడితే చంద్రం మాట్లాడతాడు.ఆ తర్వాత చంద్రం మొదటి భార్య కూడా అతని వలలో పడిందని సాధన గురించి చెప్పబోయినా చంద్రం నమ్మలేదని సాధనకు తెలిసి భర్త మీద గౌరవం పెరుగుతుంది.
మనిషి వ్యక్తిగత సంతృప్తి-సంతోషాల విషయంలో తప్పు-ఒప్పుల గురించి మనిషి ప్రాధాన్యతలకే ప్రాముఖ్యత ఉన్నప్పటికి ఆ ప్రాధాన్యతల వల్ల మనిషి బాధలు ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం ఆ ప్రాధాన్యత మనిషికి సమాజానికి ఉన్న సంబంధాన్ని గుర్తుకు తెస్తుంది. ఇది సహజంగా జరిగేదే.ప్రేమ-నమ్మకం-గౌరవం జీవితం మీద కలిగించలేని నిర్ణయాలు మాత్రం మనిషిని అగాధంలోకి తోసేస్తాయని, మనిషి వివేకమే అటువంటి పరిస్థితుల నుండి రక్షించగలదని ఈ కథ స్పష్టం చేస్తుంది.
నాలుగవ కథ 'ఎంత మంచివాడవురా!' బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న నవీన్ కి ఓ బస్సు ప్రయాణంలో పరిచయమైన శాలిని అంటే ఇష్టం ఏర్పడుతుంది. శాలిని అంతకు ముందు ఓ సారి నవీన్ పని చేస్తున్న బ్యాంకుకు వస్తే ఆ సమయంలో నవీన్ ఆమెకు సాయపడ్డాడని ఆమె చెప్తుంది. హైదరాబాద్ కు నవీన్ ట్రెయినింగ్ కు వెళ్తుంటే శాలిని పెళ్ళి చూపులకు వెళ్తుంది. ట్రెయినింగ్ కు ఇంకా సమయం ఉండటంతో ఓ హోటల్ లో రూమ్ తీసుకున్న నవీన్ తన పక్కన రూమ్ లో ఉన్న అమ్మాయి, అబ్బాయిలను చూస్తాడు. వారిద్దరూ భార్యాభర్తలని అనుకుంటాడు.ఆ అమ్మాయిని చూసిన అతని మనసు చలిస్తుంది కూడా. హోటల్ బాయ్ కావాలంటే ఆ అమ్మాయినే అరేంజ్ చేస్తానంటే అప్పుడు అతనికి వారూ భార్యాభర్తలు కారని తెలుస్తుంది. కానీ మనోనిగ్రహంతో ఆ కోరికను అణచివేసుకుంటాడు నవీన్.
ఆ తర్వాత శాలిని, నవీన్ కలుస్తారు. పెళ్ళి కొడుకు ఫోటోను నవీన్ కు చూపినప్పుడు అతను హోటల్ రూమ్ లో తాను చూసిన వ్యక్తే అనుకుంటాడు.ఆ విషయం శాలినికి చెప్తాడు. అలాగే అతను ఏదో అలా తప్పు చేసినా అతనికి మారే అవకాశం ఇవ్వమని శాలినికి సూచిస్తాడు. అలాగే అతన్ని కలిసి జరిగింది చెప్తాడు. మొదట అతను కోప్పడినా తర్వాత తన ఒంటరితనం వల్ల అలా చేశానని ఒప్పుకుంటాడు.
శాలిని నవీన్ మంచితనాన్ని, బాధ్యతను ఇష్టపడుతుంది. సంబంధం రద్దు చేసుకుని నవీన్ ను వివాహం చేసుకుంటుంది.
జీవితంలో కొన్ని ఎంతో ఆకస్మికంగా జరిగిపోతాయి.మంచి చేసే వారికి అంత కన్నా మంచే జరుగుతుందని ఈ కథ స్పష్టం చేస్తుంది. ప్రేమించే మనిషితో ఉండాల్సిన నిజాయితీ గురించి కూడా ఈ కథలో రచయిత చెప్పే ప్రయత్నం చేసారు.
ఐదో కథ 'బాలు.' బాలకృష్ణ, శ్రావణి కాలేజీ రోజుల్లో ప్రేమించుకుంటారు. ఆ తర్వాత శ్రావణి ఆ ప్రదేశం నుండి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఇంకో వ్యక్తితో ప్రేమలో పడి బాలును మర్చిపోతుంది. అతని ద్వారా మోసపోయిన తర్వాత బాలు విలువ తెలిసినా ఏం చేయలేకపోతుంది. కొన్నేళ్ల తర్వాత శ్రావణి బాలుకు ఫోన్ చేస్తుంది. తనకు డేవిడ్ తో వివాహమైందని శ్రావణి చెప్తే తనకు అప్పటికే వివాహమైపోయిందని ఓ కూతురు కూడా ఉందని ప్రస్తుతం భార్యా కూతురు పుట్టింట్లో ఉన్నారని చెప్తాడు. తాను వస్తున్నానని తనతో కలిసి ఓ రోజు ఉండమని అడుగుతుంది శ్రావణి. అలాగే అంటాడు బాలు.
ఆ రోజు ఇద్దరు ఎంతో సంతోషంగా హార్సిలి హిల్స్ లో గడుపుతారు మంచి స్నేహితుల్లా. ఇంటికి తిరిగి వచ్చాక బాలు సెల్ రింగ్ అవుతుంటే అతను నిద్రపోయాడని అనుకుని ఆమె కాల్ అటెండ్ చేస్తుంది. ఆ ఫోన్ బాలు స్నేహితుడు చేస్తాడు.
బాలు శ్రావణి ప్రేమలో పడి ఇంకెవరిని వివాహం చేసుకోలేదని ఆ బాధతోనే హార్ట్ ప్రాబ్లం తెచ్చుకున్నాడని ఆ రోజు అతనికి సర్జరీ ఉందని, ఉదయం నుండి ఫోన్ అందుబాటులో లేదని వెంటనే అతన్ని హాస్పటల్ కు తీసుకురమ్మని చెప్తాడు ఆ స్నేహితుడు. బాలు కోసం బెడ్ రూమ్ కు వెళ్ళిన శ్రావణికి అప్పటికే మరణించిన బాలు శరీరం, అతని చేతిలో శ్రావణిని ఇంకా ప్రేమిస్తున్నాను అన్న సంకేతం కనిపిస్తుంది.శ్రావణి కూడా అతను బాధ పడకూడదని తనకు వివాహమైందని అబద్ధం చెప్తుంది.
ప్రేమ కథల్లో నాటకీయత ఉన్నప్పటికి అది శారీరకతను మించిన ఔన్నత్యంకు సూచన కాగలిగితే ఆ కథ మనసును కదిలిస్తుంది. అటువంటి ఓ కదిలించే కథ ఇది.
ఆరవ కథ 'పెద్దన్నయ్య.' మనిషి డబ్బు కోసం ఎలా ప్రేమను, ఆప్యాయతను, తనను ప్రేమించే వారిని కోల్పోతున్నాడో స్పష్టం చేసే కథ ఇది.ఈ కథలో పెద్దన్నయ్య పాత్ర శివరాంది. రచయిత ఈ కథాసంపుటి లో రాసిన ఈ పాత్రకు 'ఆశయాల పల్లకి' కథా సంపుటిలో రాసిన 'తల్లి దీవెన'కథలో మురళి పాత్రకు దగ్గరగా ఉంటుంది. రచయిత ఆశించిన కుటుంబ అనుబంధాల్లో ఉండాల్సిన ప్రేమ, అర్ధం చేసుకునే మనస్తత్వం, అపార్ధాలకు తావు లేకుండా చూసుకునే సహృదయత, కుటుంబం కోసం ఎల్లప్పుడూ ఉండటం వంటివి ఈ రెండు పాత్రల్లో రెండు కోణాల్లో పాఠకులకు కనిపిస్తాయి.'తల్లి దీవెన'కథలో మురళి ది ఉమ్మడి కుటుంబం కాదు. ఈ కథలో శివరాం పెరిగింది ఉమ్మడి కుటుంబంలో. శివరాం తండ్రికి సోదరులకు మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల కొంత ఆ కుటుంబంలో దూరం ఏర్పడిన సందర్భంలో శివరాం పిల్లలందరిని ఒకటీగా చేశాడు. వారి మధ్య ప్రేమ నిలబడేలా చేశాడు.చిన్న వయసులోనే కుటుంబం అంతా ఒకటిగా ఉండాలనుకునే వ్యక్తిత్వం అతనిది.శివరాం ఉపాధ్యాయుడు.
ఇక ప్రస్తుత కథాకాలంకు వస్తే శివరాంకు బాబాయి కొడుకు దివాకర్. దివాకర్ బ్యాంకులో పని చేస్తున్నాడు. శివరాం భార్యకు అనారోగ్యంగా ఉందని ఆ విషయం గురించి మాట్లాడటానికి బ్యాంకుకు వస్తాడు శివరాం. అన్నయ్య తనను ఎక్కడ డబ్బు అడుగుతాడో అని తర్వాత మాట్లాడుకుందామని దాటవేస్తాడు దివాకర్. దివాకర్ ఆ తర్వాత రోజు లోన్ తీసుకుని కార్ కొనుక్కుంటాడు. తర్వాత తీరిగ్గా శివరాం ఇంటికి కొత్త కారుతో వెళ్తాడు. శివరాం ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఆ ఇంటి పక్కన ఉంటున్న రామకృష్ణ దివాకర్ తో కలిసే బ్యాంకులో పని చేస్తున్నాడు. శివరాం పూర్వ విద్యార్థి శివరాం భార్యకు ఆపరేషన్ చెన్నైలో ఏర్పాటు చేశాడని అక్కడికి వారే తీసుకువెళ్లారని చెప్తాడు.రామకృష్ణ ఆ ఊరికి కొత్తగా వచ్చినప్పుడు దివాకర్ తన అన్నయ్య కొత్త ఇల్లు వెతికి పెట్టడానికి సాయం చేస్తాడని అన్నయ్య మంచితనం గురించి అప్పట్లో రాసిన ఉత్తరం దివాకర్ కు రామకృష్ణ ఇస్తాడు.ప్రేమ ఉంటే తప్పించుకోకుండా చేయవచ్చని, అప్పట్లో తనకు తన పక్కన ఇల్లు ఇప్పించడమే కాకుండా ఎప్పుడు తనకు సాయంగా ఉండేవారని అటువంటి అన్నయ్య కష్టంలో తోడుగా ఉండకపోవడం ఆలోచించుకోవాల్సిన విషయమని మందలిస్తాడు రామకృష్ణ దివాకర్ ను.
ఆ ఉత్తరం మరలా చదివి తనకు అన్నయ్యకు మధ్య వచ్చిన ఈ గ్యాప్ కు కారణం తన స్వార్ధం అని అర్ధం చేసుకున్న దివాకర్ అన్నావదినలు ఇంటికి తిరిగి వచ్చాక వెళ్తాడు. వారి మాటల ద్వారా అన్నయ్య డబ్బు కోసం రాలేదని ఆ ఊరిలో బంధువులు ఎవరూ లేకపోవడం వల్ల ఆ బాధ పంచుకుందామని వచ్చాడని తెలుసుకుని పశ్చాత్తాపడతాడు దివాకర్. అన్నయ్యను క్షమాపణ అడుగుతాడు.
చాలా సమయంలో జీవితంలో మనిషికి మనుషుల తోడు ఆర్ధికంగా కాకుండా ఆత్మీయంగా కావాలని అనిపిస్తుందని, ఆ ఆత్మీయత నుండి ఎప్పుడు ఆర్ధిక కోణం బయట పడుతుందో అన్న భయంతో చాలా మంది ఆత్మీయులను కూడా కోల్పోతారని ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఈ కథాసంపుటిలోని ఓ థ్రిల్లర్ కథే ఏడవ కథ 'అయిదో శత్రువు.'మనిషి తన జీవితంలో చేసిన తప్పులను కొంత కాలం వరకు తన మనుగడ కోసమే అని సమర్థించుకున్నా ఓ దశ దాటాక పాపభీతి మొదలవుతుందని, దానిని బలపరిచే ఘటనలు ఏవి జరిగినా అదే అతని ప్రాణాన్ని తీస్తుందని స్పష్టం చేసే కథ ఇది.
అశోక్ ఎన్నో మోసాలు, పాపాలు చేసి కోటీశ్వరుడిగా ఎదిగాడు. అతను ఓ రోజు స్వామీజీని కలిసినప్పుడు ఆ పాపమే దయ్యమై అతన్ని చంపుతుందని అంటాడు. కొంత నమ్మనట్టు ఉన్నా మనసులో మాత్రం అశోక్ కు భయంగానే ఉంది.
అశోక్ తన జీవితంలో నష్టం కలిగేలా ప్రవర్తించిన వ్యక్తులు నలుగురు.వారు వినోద్, జలజ, సుభాష్,రవి. వారందరూ బ్రతికే ఉన్నారు. ఆ రోజు డ్రింక్ పార్టీలో వారిని కలిసాడు అశోక్. స్వామీజీ చెప్పింది వారికి చెప్తాడు. అయినా ఆ నలుగురు తనను ఏమైనా చేయవచ్చన్న అనుమానంతో ముందుగానే జాన్ అనే బాడీ గార్డ్ ను తెచ్చుకున్నట్టు చెప్పాడు. అతను మూగవాడని, అతనికి మాటలు రావని ఏం అర్ధం కాదని, అయినా ఎప్పుడు తన పక్కనే ఉంటాడు కనుక అతన్ని వారు మాయ చేసి తనకు వ్యతిరేకంగా వాడే అవకాశం లేదని చెప్తాడు. ఆ మాటల్లోనే అతని వల్ల నష్టపోయిన ఇంకో స్త్రీ సుశీల అని, ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుందని ఆ నలుగురితో పంచుకున్న అశోక్ కు అప్పుడు భయం మొదలవుతుంది.
ఆ పార్టీ అయిపోయాక ఆ చీకట్లో వెళ్తుంటే అక్కడ గజ్జెలు కట్టుకుని వస్తున్న స్త్రీ సుశీలలా ఉండటంతో గుండె ఆగి మరణిస్తాడు అశోక్. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అశోక్ మోసం చేసిన సుశీల తమ్ముడు గిరి ఆ రోజు డ్రింక్ పార్టీలో వారికి సర్వ్ చేసాడని,మధ్యలో అశోక్ బాత్ రూమ్ కు వెళ్ళినప్పుడు గిరితో కలిసి గిరి సుశీల కూతురును వివాహం చేసుకోవడం వల్ల భర్తకు గుండె పోటు అని చెప్తే ఆమె వస్తుందని ఆమెను చీకట్లో చూస్తే ఈ భయంతో అతని గుండె ఆగిపోతుందని మిగిలిన నలుగురు అతనితో కలిసి ప్లాన్ చేయడం, అందులో ఒకరు భయంకర శబ్దాలు మిమిక్రి కూడా చేయడంతో నిజంగానే అతని ప్రాణం పోయిందని తెలుస్తుంది. ఇకపోతే అశోక్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి జాన్ గురించి అబద్ధం చెప్పాడని, ఆ తర్వాత అతని డ్రింక్ లో మత్తు మందు కలపడం వల్ల అతను అశోక్ దగ్గర లేడని, అతన్ని మూగవాడిగా భావించి వారు తర్వాత తమ ప్లాన్ గురించి మాట్లాడుకున్నది అతను పోలీసులకు చెప్పాడని తెలుస్తుంది.
ఐదో శత్రువు సుశీల తమ్ముడు గిరి. అక్క మరణం మీద ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి విషయంలో మాత్రం అశోక్ జాగ్రత్త పడలేకపోయాడు. పాపభీతి మోటివ్ తో రాసిన ఈ కథ విభిన్నమైనది.
ఎనిమిదో కథ 'కబ్జా.' రాత్రి పడుకోబోయేటప్పుడు 'కబ్జాల కథనాలు'చదివి పడుకున్న విశాల్ కు కలలో తమ కాలనీలో తన ఇంటితో సహా అన్ని ఇళ్లను కబ్జా చేసుకున్నట్టు కల వస్తుంది. మనిషి ఆలోచనలలో అతను చుట్టూ చూసి, చదివి ఏదో ఒక రూపంలో మెదడులో నిక్షిప్తం చేసుకున్నవి ఎలా ఏదో ఒక రూపంలో అతని భయాలతో కలుపుకుని బయట పడతాయో స్పష్టం చేసే కథ ఇది. మనిషి మనస్తత్వంలోని ఓ భాగమే కలలు. దానిని కొత్తగా రచయిత ఈ కథలో చెప్పే ప్రయత్నం చేసారు.
తొమ్మిదో కథ 'సజ్జన సాంగత్యం.' మనిషిలో ఉన్న మంచితనం ఎలా ఈర్ష్యను జయించేలా చేసి, వ్యక్తిత్వ ఎదుగుదలకు తోడ్పడుతుందో, మంచి ఇరుగుపొరుగు ఉండటం ఎంత మంచిదో ఈ కథ స్పష్టం చేస్తుంది. భాస్కర్, కల్పనా దంపతులు.భాస్కర్ ఆఫీసులో ఎంతో బాగా పని చేసేవాడు, తన కోలిగ్స్ తో ఎంతో చక్కగా వ్యవహరించేవాడు.అతని కొడుకు విజయ్. విజయ్ పదవ తరగతిలో ఉన్నప్పుడు భాస్కర్ కు కలకత్తా ట్రాన్స్ఫర్ అవుతుంది. భాస్కర్ కలకత్తాలో ఉంటే అతని భార్య కల్పన కొడుకు విజయ్ తో హైదరాబాద్ లో ఉండేది.సంస్కరించి ఎప్పటికప్పుడు మంచి మార్గంలో పయనించేలా పట్టించుకునే తండ్రి దగ్గర లేకపోవడంతో విజయ్ చదువు నుండి దారి తప్పి ఇంటర్ లో పరీక్ష తప్పుతాడు. సెల్, స్నేహితులు అతని ప్రపంచం అవుతుంది. వారింటికి పొరుగులో ఉంటున్న కరుణాకర్ భాస్కర్ పై అధికారి.తన భార్య సునీత భాస్కర్ మంచితనం గురించి, కుటుంబం పట్ల అతను తీసుకునే బాధ్యత గురించి చెప్పడంతో అతని మీద ఈర్ష్య పెంచుకున్నాడు భాస్కర్. ఆఫీసులో బ్రహ్మచారులు ఉన్నా సరే అతన్ని ఇబ్బంది పెట్టాలనే కావాలని అతన్ని కలకత్తాకు బదిలీ చేయించాడు. కానీ విజయ్ దారి తప్పడం, కల్పన ఉద్యోగంతో కొడుకును సంభాళించుకోలేక పడుతున్న బాధలు చూసిన సునీత భర్త ఇది చేయించడం తెలుసుకుని ఆ కుటుంబం అలా అవ్వడానికి కారణం తామే అని అనడంతో ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత కరుణాకర్ కు ముంబైకి, భాస్కర్ కు హైదరాబాద్ కు బదిలీలు అవుతాయి. ఆ సమయంలో యవ్వనంలో ఉన్న కరుణాకర్ కూతురు ప్రేమ విషయంలో తప్పు చేయకుండా కాపాడటం, ఆ కుటుంబానికి భాస్కర్ కుటుంబం అండగా ఉండటం జరుగుతుంది.తర్వాత కరుణాకర్ హైదరాబాద్ కు బదిలీ అయ్యి వచ్చాక కూడా భాస్కర్ అంతే ప్రేమతో ఉండటంతో ఆశ్చర్యపోతాడు.భాస్కర్ బదిలీ నాటికే ఆఫీసర్ గా ఎదిగి వచ్చాక ఆ ఆఫీసులో అందరిని కుటుంబంగా చూసుకోవడం, ప్రోత్సహించడం వల్ల ఆ ఉద్యోగులు ఇంకా ఉత్సాహంతో పని చేయడం జరుగుతుంది. ప్రోత్సహించే వాతావరణంలో పని చేయగల సామర్ధ్యం ఎలా రెట్టింపు అవుతుందో, అలాగే మానవత్వంతో వ్యవహరించే పొరుగు వారు ఉండటం వల్ల కలిగే మేలును కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఈ కథా సంపుటిలోని చివరి రెండు కథలు సింగిల్ పేజీ కథలు.క్లుప్తంగా ఎంతో చక్కగా ఈ కథలను తల్లి, తండ్రి ప్రేమల్ని స్పష్టం చేసేలా రాసారు.
పదవ కథ 'వెన్నంటి మనసు వెన్నంటే...' మాధవి ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయింది. మోసపోయి తిరిగి వచ్చిన ఆమెకు తన తండ్రి మరణించినట్టు తెలుస్తుంది. వైద్యం చేయించుకుంటే బ్రతికే అవకాశం ఉన్నా మొదట మాధవి వివాహం కోసం డబ్బు ఇబ్బంది ఉండకూడదని చేయించుకోలేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రేమించిన వ్యక్తి మోసగాడని తెలుసుకుని ఒంటరిగా ఉన్న ఆమె ఇబ్బంది పడకూడదని ఆ డబ్బును ఆమెకు ఆసరాగా తండ్రి మిగిల్చి వెళ్ళడం చూసి తండ్రి ప్రేమకు కదిలిపోతుంది మాధవి.
పదకొండో కథ 'అమ్మ మనసు.' తల్లిని వృద్దాశ్రమంలో చేర్చడానికి తీసుకువెళ్తున్న కొడుకుకి గతంలో తల్లికి ఆమె బావ రాసిన ఉత్తరం కనిపిస్తుంది. అందులో భర్త చనిపోయిన ఆమెను తన కోట్ల ఆస్తితో పాటు రాణిలా చూసుకుంటానని, కొడుకును మాత్రం అనాధాశ్రమంలో చేర్పించమని ఉంటుంది. తల్లి తననే ఎంచుకోవడం అతనిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఇంత చిన్న కథల్లో ఇంత గొప్ప ప్రేమనుభూతిని, ప్రేమ లక్ష్యాన్ని తెలియజేయడం రచయిత రచనా కౌసలానికి నిదర్శనం.
ప్రేమలో, అనుబంధాల్లో ఉండాల్సిన అలాగే ఉండకూడని కోణాలను రచయిత తన కథల్లో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేసారు. ఆ ప్రేమ స్త్రీ-పురుషుల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగుల మధ్య కావచ్చు, వృత్తిలో కోలిగ్స్ మధ్య కావచ్చు. ఇన్ని సంబంధాల్లో ఉండాల్సిన ప్రేమ, బాధ్యత, ఆత్మీయత గురించి తన కథల ద్వారా స్పృశించిన రచయితకు అభినందనలు.
* * *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష