ఆమె 'స్త్రీ'గానే ఉండిపోయింది!
ఆమె 'స్త్రీ'గానే ఉండిపోయింది!
అంతా ఆమెలోనే ఉంది!
అనువు కాని చోట
వారి అభిరుచులు-అలవాట్లు
అవసరాలు-ఆనందాలున్న
నాలుగు చక్రాల బండిని
నడుపుతూ సారధిగా
జీతాన్ని అందుకోలేని
అసక్తతను బాధ్యతగా
ఆమె భావించడానికే
అలవాటు పడిపోయింది!
అభ్యాసంతో ఆమె
అలవాటుపడిపోయినతనం గురించి
కూరగాయలకు తోడుగా
తెగిన చేతి వేళ్ళు
వేడి నూనెతో
కలిసిపోయిన ఆమె చర్మం
సాక్ష్యులయ్యి చెప్తాయి!
పొగ చూరిన వంట గదికి
చిమ్నిలు, ఎగ్ జాస్టర్ లు ఉన్నాయి
కానీ ఆ ఇంటిలో
ఆమె అలసట శుద్ధికి
ఏది లేదే!
ఆమె వారి ఆలోచనల
ప్రపంచానికి ఆరోవంతు
ఇందనమైన ఆహారాన్ని
అన్ని ఋతువుల్లో
ప్రేమ, బాధ్యతలతో
వారికి శక్తి కోసం
సిద్ధం చేస్తూనే ఉంది
ఆ శక్తిని మాత్రమే
తీసుకున్న వారిలో
అదే ప్రేమ
ఉద్భవించేలా ఆమె
వండిన వంట చేయలేకపోయింది!
ఇవి చూసిన
చదువుకున్న ఆమె
విశిష్ట వ్యక్తిత్వాన్ని
ఏర్పరచుకుంటే
అది 'స్త్రీ కానీ తత్త్వం'గా
వారు ఆపాదిస్తారు!
ఆమె అభిరుచుల్లో
పూజ, వంట
ఇంటి వారి సేవ
భాగం కాకపోతే
ఆమెలో చేతకానితనాన్ని
వారు గుర్తిస్తారు!
బ్రహ్మచారులకు పెళ్ళి
జిహ్వ దాహన్ని
ఉచితంగా తీర్చుకోవడానికి
మార్గమని వారు బోధిస్తారు!
చదువు, జీతం
ఆమెను స్త్రీ నుండి
సమాన మనిషి గా మార్చలేకపోయాయి!
ఎందుకంటే అప్పటికే
వారు ఆమె మారడాన్ని
'నిర్వచనం లేని చెడ్డతనం'
అనే బ్రాండ్ గా మార్చివేశారు కనుక!
'మంచితనాన్ని ' మురికిగా
మనసుకు పట్టించి
చెడిపోయిన వెలుతురుగా
పురోగతిని వారు
పునర్నిర్వచించారు!
* * *

Comments
Post a Comment