శూన్య అనుభవం

 శూన్య అనుభవం

                                                                     -శృంగవరపు రచన


ప్రతి మనిషి జీవితంలో ఓ దశలో శారీరక మరియు మానసిక ఒంటరితనం ఉంటాయి. బాధ్యతలు తీరేవరకు ఆ వలయంలో వ్యక్తిగా తన జీవితం గురించి ఆలోచించని మనిషి బాధ్యతలు తీరిపోయాకో,అవి లేని జీవితం ఉన్నప్పుడో జీవితంలో ఓ రకమైన శూన్యతను అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి శూన్యతలో వెలుగును తాత్కాలికంగా నింపుకుంటూ కొత్త ఆశను నిర్మించుకోవడంలోనే జీవితపు ఆశ్చర్యం ఉంది. అటువంటి వెలుగుల గురించి డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావు గారు రాసిన నవలే ‘మరో వసంతం.’ ఈ నవల చతుర పత్రికలో మార్చ్ 2008 లో ప్రచురించబడింది.
ఈ నవలలో ముఖ్య పాత్రలు కుమార్,జలజ,రాయుడు,రోజీ. కుమార్ అమెరికాలోని న్యూయార్క్ లో స్థిరపడ్డాడు. అతనికి ఎవరు లేరు. ఓ యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడు. అతను యవ్వనంలో ఓ సారి తనకన్నా వయసులో పెద్దదైన జలజను తాను భారతదేశంలో ఉన్నప్పుడూ చూస్తాడు.ఆమె సౌందర్యం అతని జ్ఞాపక చిత్రంగా మనసులో ముద్రించుకుపోతుంది. ఆ తర్వాత అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాక ట్యూషన్ లో అవసరం కోసం చనువుగా ఉన్న లీనాను చూస్తాడు. ఆ తర్వాత అతను అమెరికాకు వచ్చాక అంగవైకల్యం అతని జీవితంలో భాగం అయ్యాక అతను ఇంటి నుండే పని చేసే అవకాశం అతని ఉద్యోగం కలించింది.దానితో ఆర్థికంగా లోటు లేకుండా అతని జీవితం గడిచిపోతూ ఉంది.అయినా అతనికి ఒంటరితనం తనతో ఎప్పటికీ ఉంటుందన్న అసంతృప్తి ఉంది.
జలజకు ఓ కొడుకు సారథి,కూతురు సరోజ. వారిద్దరికి వివాహాలు అయ్యాయి. సారథి అమెరికాలో భార్య గిరిజతో స్థిరపడ్డాడు. వారితో కలిసి జలజ ఉండేది. ఆ సమయంలో ఆమెకు ప్రభాకర్ అనే దూరపు బంధువు ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ లో కుమార్ పరిచయమయ్యాడు. ఆమెను అంతకు ముందు యవ్వనంలో చూసింది అతనికి జ్ఞాపకం వస్తుంది. ఆ తర్వాత వారిద్దరు మంచి స్నేహితులు అవుతారు. జలజ హాస్పటల్ లో వాలంటీర్ గా పని చేయడం, సంగీతం క్లాసులు చెప్పడం చేస్తూ ఉంటుంది. ఆ సంగీతం క్లాసుల నుండి వచ్చే డబ్బులతో తనకంటూ ఓ ఆత్మగౌరవాన్ని ఏర్పరచుకుంటుంది. రోజు క్లాసుల నుండి తిరిగి వచ్చేటప్పుడు కొంత సమయం ఆమె కుమార్ తో కలిసి గడిపేది. వారి స్నేహం మూడేళ్ళ పాటు సాగింది. ఆ తర్వాత కూతురికి తన అవసరం ఉందని భావించి భారత దేశానికి జలజ తిరిగి రావడంతో వారి స్నేహానికి ఆటంకం ఏర్పడింది.అలా ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ మధ్యలో ఓ సారి కుమార్ ఆమె కోసం భారతదేశం వచ్చాడు.కానీ కూతురి అత్త కుటుంబం కుమార్ తన కోసం రావడం గురించి అపార్ధం చేసుకోవడంతో కూతురి కోసం,సమాజం కోసం అతన్ని రావద్దని చెప్తుంది జలజ.హతాశుడై అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు కుమార్.
రాయుడు రాజమండ్రిలో చిన్న వైద్యుడిగా పని చేస్తున్నాడు. చదువుకునే సమయంలో అతను రోజీ అనే వేశ్యను ఇష్టపడటం ఆమెను విడిపించి వివాహం చేసుకుని కొత్త కాపురం పెట్టడం,అతను తర్వాత వ్యాపారంలోకి దిగడం జరిగిపోయింది. వారిద్దరికి కరుణ అనే కొడుకు జన్మించడం,వ్యాపార రీత్యా రాయుడు ఎక్కువ సమయం వేరే వేరే ప్రదేశాల్లో గడపాల్సి రావడం జరిగింది. ఆ సమయంలో రోజీకి మేనమామ వరుస అయ్యే డేవిడ్ వస్తూ పోతూ ఉండేవాడు. అతను రాయుడు మీద వ్యతిరేకంగా చెప్పి ఆమెలో భర్త దూరంగా ఉండటం వల్ల ఉన్న చిన్న అసంతృప్తిని పెనుభూతం చేసి ఆమె భర్త నుండి విడిపోయి తనతో వచ్చేలా చేశాడు. ఓ రోజు ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్యా,కొడుకు కనబడకపోయేసరికి ఆశ్చర్యపోయి ఆమెను వెతికి మద్రాసుకు వెళ్తాడు.అక్కడ డేవిడ్ ప్రభ్వంలో ఉన్న ఆమె అతన్ని తిరస్కరిస్తుంది. డేవిడ్ రోజీను సినిమా తారను చేసి ఆమె ద్వారా డబ్బును సంపాదించాలని అనుకుంటాడు. అతికష్టం మీద కమిట్మెంట్ వల్ల ఆమెకు చిన్న చిన్న పాత్రలు వస్తూ తర్వాత క్రమేపీ అవి కూడా రాకుండా ఉంటాయి. తల్లి జీవితం పట్ల ఓ రకమైన విముఖత పెంచుకుంటాడు కరుణ. ఓ రోజు ఆమె ఇంటికి వచ్చేసరికి కరుణా యాక్సిడెంట్ వల్ల మరణించాడని తెలుస్తుంది.ఆ వార్త రాయుడికి తెలియజేశానని డేవిడ్ చెప్తాడు. కానీ ఆ వార్త రాయుడికి చేరేసరికి సంవత్సరం అయిపోతుంది. డేవిడ్ తన మీద అత్యాచారం చేయబోతున్నప్పుడు అతని మీద ఫిర్యాదు చేసి మద్రాస్ నుండి కాకినాడ తిరిగి వస్తుంది. అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కుట్టు మిషన్లు కూడా అద్దెకు తెచ్చుకున్ఈ మనుషులను పెట్టుకుని జీవితం గడుపుతూ ఉంటుంది. రాయుడు విలువ ఆమెకు ఆ దశలో తెలుస్తుంది. ఓ సారి రాయుడు కాకినాడ రావడం ఆమెను పలకరించడంతో ఆమె మనసులో మళ్ళీ అతనితో కలవవచ్చనే అభిప్రాయం కలుగుతుంది.
క్యాన్సర్ మొదటి దశలో ఉన్న జలజకు రాయుడు వైద్యం చేస్తాడు. రాయుడు కూడా జలజకు మంచి స్నేహితుడు అవుతాడు. జలజ మనసులో కుమార్ గురించి ఆలోచనలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి. కూతురికి కూతురు పుట్టడం,కూతురికి కూడా తన అవసరం లేదని తెలుసుకున్న జలజ తిరిగి అమెరికా వెళ్తుంది.అక్కడ కొడుకు ఓ అబ్బాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. వారికి తన వల్ల ఉండే లాభం లేదని జలజకు అర్ధమయ్యింది. ఆ సమయంలో కుమార్ కూడా ఓ అబ్బాయిని పెంచాలనుకుని డబల్ బెడ్ రూమ్ కు మారతాడు. అభ్యంతరం లేకపోతే తన దగ్గర ఉండవచ్చని అంటాడు. కొడుకు ఆమె వెళ్లడానికి అభ్యంతర పెట్టకపోవడంతో అక్కడ ఉంటుంది. కూతురి కోసం మరలా జలజ భారత దేశం వస్తుంది. ఓ పదిహేను రోజుల్లో తిరిగి వచ్చేస్తానని కుమార్ కు చెప్తుంది.
రాయుడు దగ్గరకు రోజీ తిరిగి రావడం,ఇద్దరు పరస్పర గౌరవంతో కలిసి ఉండాలని నిర్ణయించుకోవడంతో వీరి కథ ముగుస్తుంది. తిరిగి అమెరికా వెళ్ళి కుమార్ తో ఉండాలనే ఆలోచనతో ఉన్న జలజకు కొడుకు నుండి ఉత్తరం అందుతుంది. కుమార్ ను కారు కోసం దొంగలు హత్య చేశారని అందులో ఉంటుంది. అలా ఈ రెండు జంటల కథను రచయిత ముగిస్తాడు.
ఒంటరితనంలో మనిషి ఏం ఆలోచిస్తూ ఉంటాడు?ఎదుటి వారి నుండి ఏం ఆశిస్తాడు?ఒంటరితనం వల్ల ఎటువంటి పాఠాలను అతను నేర్చుకుంటాడు? చిన్న చిన్న అనుభూతుల గొప్పతనాన్ని ఎలా ఆస్వాదిస్తాడు? మనిషికి ఒంటరితనంలో శూన్యం ఎలా ఉంటుందో కుమార్,రాయుడు జీవితాల్లోకి ప్రవేశించి ఓ రకమైన కోణం నుండి చెప్తునే మనుషులు ఉన్నా ఒంటరిగా ఉండే పాత్రలైన జలజ,రోజీ ల కోణం నుండి ఇంకోలా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత. ఈ నవలలో పాత్రల చిత్రీకరణ,శూన్య అనుభూతిని,ఒంటరితనాన్ని చిత్రించిన విధానం ఎంతో హృద్యంగా ఉంది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ