అత్యుత్సాహం
అత్యుత్సాహం
-శృంగవరపు రచన
కుతూహలం ప్రతి మనిషిలో ఉండటం సహజం. కానీ తన చుట్టూ ఉన్న వారి వ్యక్తిగత జీవితాల్లోకి అది చొచ్చుకుపోతే అది అత్యుత్సాహంగా మారుతుంది. అత్యుత్సాహం అతిగా గల సమాజంలోనే నేడు మనమందరం బ్రతికేది. బహుశా అందులో మనం కూడా ఓ భాగమే పరోక్షంగా కావచ్చు. ఆ అత్యుత్సాహం హద్దు దాటినప్పుడు అది వ్యక్తుల జీవితాలలో కల్లోలాను సృష్టిస్తుంది. అటువంటి అత్యుత్సాహం గల మనుషులు, స్వప్రయోజనం కోసం హద్దులు దాటిన మనుషుల వల్ల జీవితాలు ఎల్లా ఛిన్నాభిన్నం అవుతాయో స్పష్టం చేసే నవలే మన్నెం శారద గారి ‘నిదురించే తోటలోకి.’ ఈ నవల కౌముది అంతర్జాల పత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది.
ఈ నవలలో ముఖ్య పాత్ర హేమంత్. అతని జీవితం చుట్టూ అల్లుకుని ఉన్న కథే ఇది. హేమంత్ తల్లి శాంత, తండ్రి సుందరయ్య. సుందరయ్యది ఓ విచిత్ర ప్రవృత్తి. భార్య మీద, పిల్లల మీద ఏనాడూ ప్రేమను చూపించి ఎరుగడు. ఎప్పుడూ చిరాకు, విసుగు, తన చుట్టూ ఉన్న వారి మొహాల్లో సంతోషం చూడలేని తత్వం అతనిది. శాంత స్నేహితురాలు సరోజిని. సరోజిని ఏం చదువుకోకపోయినా సంస్కారం, జీవితంలో చమత్కారం, అభ్యుదయ భావాలు కలది. ఆమె భర్త కనకారావు. హేమంత్ తాను ఉద్యోగం చేసి తల్లిని బాగా చూసుకుందామని అనుకున్నా, అతని చదువు పూర్తి కాక మునుపే అతని తల్లి మరణిస్తుంది. అతని పెద్దక్క రాజేశ్వరికి మేనమామ రామారావుతోనే వివాహమవుతుంది. మిగిలిన వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. సుందరరావు తన మేడ ఇంటి కోసం కోర్టు కేసు కోసం వచ్చిన డబ్బు అంతా ఖర్చు చేస్తున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన హేమంత్ కు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
ఈ ఉద్యోగం ద్వారానే అతనికి వాస్తవ జీవితం ఏమిటో అర్ధమవుతుంది. అక్కడ ప్రతిభకు స్థానం ఉండదని, -పలుకుబడి-అవకాశవాదంకు మాత్రమే పైకి ఎదిగేలా చేస్తుందని తెలుసుకుంటాడు. అతను ఆ వాతావరణంలో ఇమడలేకపోయినా అతనికి చదువుకు,ఉద్యోగానికి మధ్య ఉన్న సమాజం అర్ధమవుతుంది. అతని పై అధికారి రమేష్. అతనికి పని రాదు.ఆ ఆఫీసులో పని బాగా వచ్చిన వారికి ప్రమోషన్లు రాకపోయినా కచ్చితంగా ప్రక్క వారి పనులు కూడా అంటగడతారు. అలా రమేష్ బాబు పనులు హేమంత్ చేయాల్సి వచ్చేది.
రమేష్ ఇల్లరికానికి వచ్చిన అల్లుడు. అతని భార్య ధనవంతురాలు. అతనికి ఇంట్లో గౌరవం ఉండదు. అతను ఇంటికి ఓ రూపాయి ఇచ్చి ఎరుగడు. అతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నా ఇంకో అమ్మాయిని వివాహం చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. అలా అతను ఆ ప్రయత్నం చేసిన స్త్రీనే వరూధిని. వరూధిని చదువుకున్న అమ్మాయి. ఎంతో సంస్కారం అర్ధం చేసుకునే తత్వంతో అందమైన అమ్మాయి. కానీ ఆమెకు చక్రవర్తితో వివాహం కావడం, అతనికి ఎన్నో వ్యసనాలు ఉండటం, ఆమెను హింసించడం, ఓ కూతురు పుట్టడం, అతని బాధలు పడలేక ఆమె విడాకులు తీసుకోవడం జరుగుతుంది. వరూధిని కూతురి పేరు చిత్ర. వరూధిని విడాకులు తీసుకున్నా వరూధినిని డబ్బు కోసం చక్రవర్తి వేధించే వాడు. ఆ సమయంలో ఆమె తల్లి రాజేశ్వరి ఆమెకు ఇంకో వివాహం చేస్తే తమకు రక్షణ ఉంటుందని భావిస్తుంది. వరూధిని తండ్రి మరణంతో ఆ ఇంటికి పోయిన మగ రక్షణ అలా వస్తుందని ఆ తల్లి అనుకుంటుంది.
రమేష్ అలా ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చినవాడే. వరూధిని అతన్ని కలిశాక అతని మనస్తత్వం గమనించి అతన్ని తిరస్కరించడంతో ఆమె గురించి అవమానకరంగా ఆమె తల్లి ముందు మాట్లాడతాడు. దానికి బదులు చెప్పడానికి ఆమె అతని ఆఫీసుకు వెళ్ళి అతన్ని అవమానిస్తుంది.ఆ సందర్భంలోనే వరూధిని పరిచయం అవుతుంది హేమంత్ కి. ఆ తర్వాత బండి కింద పడబోతున్న హేమంత్ ను రక్షిస్తుంది ఆమె.అలా వారి స్నేహం బలపడుతుంది. అది ప్రేమగా మారుతుంది.రమేష్ ఎన్నో పథకాలు వేసి వారిని విడగొట్టడానికి ప్రయత్నించినా ఆమెను అతను అర్ధం చేసుకుంటాడు. ఈ విషయం సరోజినికి చెప్తాడు. సరోజిని అతన్ని సమర్ధిస్తుంది.ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని చెప్తుంది.
ఆ తర్వాత హేమంత్ కు గ్రూప్ వన్ పరీక్షల ద్వారా పదోన్నతి రావడంతో వరూధినితో ఓ రెండు రోజులు గడపాలని అనుకుంటాడు. ఆమెను సరోజిని ఇంటికి తీసుకు వస్తాడు.ఆమెను వైజాగ్ లోని ప్రకృతి రమణీయ ప్రదేశాలకు తీసుకువెళ్తాడు. అప్పటికే సుందరరావు తనకు మేడ కోర్టు కేసు కోసం డబ్బులు ఇచ్చిన చెల్లెలు వసుంధర కూతురు నాగినితో తన కొడుక్కి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత వరూధినిని స్టేషన్ లో రైలు ఎక్కించి ఓ రెండు రోజులు ఇంట్లో ఉండి హేమంత్ ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడు. ఆ సమయంలో మమత అనే స్నేహితురాలు వరూధిని ఇంటికి వస్తుంది.హేమంత్ వరూధిని కి ఫోన్ చేసి తాను వారంలో వస్తానని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని చెప్తాడు. వారి వివాహం చెడగొట్టడానికి పూనుకున్న మమత మెల్లగా వరూధిని ద్వారా విషయాలన్నీ తెలుసుకుని అవన్నీ సుందరయ్యకు తెలిసేలా చేస్తుంది. ఆయన వరూధిని ఇంటికి వచ్చి తన కొడుకును వదలకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ ఇల్లు కూడా వదిలేసి మమత సలహాపై మద్రాసుకు వెళ్లిపోతారు.
అక్కడ సుశీల వరూధిని నైపుణ్యాలను గుర్తించి తన బట్టల ఫ్యాక్టరీ ఆమె చేతిలో పెడుతుంది. వరూధిని ఎక్కడకు వెళ్ళిందో తెలియక బాధపడినా, హేమంత్ పరిస్థితులకు తల వంచి నాగినిని వివాహం చేసుకుంటాడు.ఆ తర్వాత సుందరయ్య కోర్టు కేసులో ఇంటిని గెలిచినా ఆ తర్వాత మరణిస్తాడు.ఆ తర్వాత నాగినితో మొదట బావుండకపోయినా తర్వతా సర్దుకుంటాడు. అదే సమయంలో నాగిని గర్భవతి అవుతుంది. ఆ సమయంలో వరూధిని తన పై దాడి చేసి తల్లిని హత్య చేసిన చక్రవర్తిని హత్య చేస్తుంది.ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.ఆ సమయంలో హేమంత్ చిత్ర బాధ్యత తీసుకుంటాడు. చిత్ర అతని కూతురే అన్న అనుమానంతో నాగిని అతన్ని వదిలేస్తుంది. ఆ తర్వాత ప్రసవంలో ఓ ఆడ పిల్లకు జన్మనిచ్చి నాగిని మరణిస్తుంది. మూడేళ్లు ఆ పాపను పెంచి హేమంత్ కు అప్పగిస్తుంది అతని అత్తయ్య.హేమంత్ తన ఉద్యోగం మానేసి కాంట్రాక్టర్ గా పని చేస్తూ ఆ ఇద్దరి పిల్లల బాధ్యతను తీసుకుంటాడు. వరూధిని విడుదల అయ్యాక ఆమెకు ఆమె కూతురిని చూపిస్తాడు.ఆ తర్వాత క్యాన్సర్ తో ఆమె మరణిస్తుంది.
మనిషి జీవితంలో స్నేహం, మానసిక అనుబంధం శారీరక సంబంధం కన్నా ఎంతో ధైర్యాన్ని ఇచ్చే అంశాలు. ఏ మనిషికి ఏ మనిషి పట్ల అటువంటి స్నేహ భావం కలుగుతుందో చెప్పడం కష్టం. అది స్త్రీ పురుషుల మధ్య కలిగితే ఈ సమాజం అత్యుత్సాహం వల్ల అది ఆ స్త్రీ జీవితాన్ని ఛిద్రం చేస్తుంది. వరూధిని స్నేహంలో ఆమె సహచర్యం వివాహం వరకు వెళ్లకపోయినా ఆమె కూతురి బాధ్యత తీసుకుని తన స్నేహాన్ని నిలుపుకున్నాడు హేమంత్. మమత అత్యుత్సాహం ప్రమాదకరమైంది అయితే సరోజిని కి ఉన్న కుతూహలం ఎదుటి జీవితాల పట్ల కలిగిన శ్రద్ధ.
మన వల్ల ఎదుటి వారికి మేలు జరగకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రం జరగకూడదన్న ఆలోచనా శైలి ఉండకపోవడం,తమ వల్ల జరిగే కీడు నుండి ఓ రకమైన సంతోషంని పొందడం ఈ అత్యుత్సాహవంతుల లక్షణం. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో ఈ నవల స్పష్టం చేస్తుంది.
* * *
.jpg)
Comments
Post a Comment