ఒంటరి జీవితం

                                 ఒంటరి జీవితం

                                 -శృంగవరపు రచన


కాలం మార్పులకు ఓ గీటురాయి. ఆ మార్పులకు భయపడినా,సంతోషించినా ఆ మార్పుతో పాటు ఏదో రకంగా జీవితాన్ని సాగించక తప్పదు. అటువంటి మార్పులు వృత్తిలో,ప్రవృత్తిలో,మానవ సంబంధాల్లో,సాంప్రదాయాల్లో ,కుటుంబాల్లో సంభవించడం సహజం. ఆ మార్పులలో ఒంటరితనం ఉండవచ్చు,కలిసి జీవిస్తున్నా కలవనితనం కూడా ఉండవచ్చు.మనిషి కాలాన్ని అర్ధం చేసుకుంటేనే మనుషులు తమ జీవితంలో జరగబోయే దానిని కూడా ఊహించి అర్ధం చేసుకోగలుగుతారు. ఆ కాలమే మార్పుల చరణాలను మార్చుకుంటూ సాగుతూ ఉంటుంది.ఆ సాగడమే స్థిరమైనది.కాలంలోని మార్పులు తరాలతో ఒంటరిగా,తోడుగా పయనించే స్త్రీ పురుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అన్న అంశాన్ని స్పష్టం చేసే నవలే డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావు గారి ‘కాలంలో మూడు చరణాలు.’ ఈ నవల చతురలో ఫిబ్రవరి 2021లో ప్రచురించబడింది.
ఈ నవలను కథ కన్నా కూడా జీవితంలో వివిధ దశల్లో మార్పును చూడగలిగే దార్శనికతగా భావించవచ్చు. కథలో ఉంది ముఖ్యంగా మూడు తరాలు. ఒక తరం వెంకట్రావు,కామాక్షిలది. తర్వాతి తరం అతని కొడుకు రఘునాథ్ ది. మూడో తరం వెంకట్రావు తన మనవడిగా పెంచుకున్న శశిధర్ ది. వెంకట్రావు చదువుకున్నవాడు. ఉద్యోగం చేసినవాడు. ఆచారాలు,సాంప్రదాయాలు పాటించే కాలంలో జీవితంలో సగం కాలం గడిపినవాడు.కానీ విద్య-వృత్తి వల్ల అతనిలో మార్పును అర్ధం చేసుకునే ఆలోచనా ధోరణి అలవడింది. కానీ అతని భార్య కామాక్షి మాత్రం సాంప్రదాయాన్ని తన జీవితంలో ముఖ్య భాగం చేసుకుని దానికి ఏది విరుద్ధంగా జరుగుతుందని అనిపించినా వెంటనే దాని పట్ల వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఉంటుంది. వెంకట్రావుకు అతని భార్యకు ఆలోచనల్లో వైరుధ్యం ఉన్నా,వెంకట్రావు తన వాదన వల్ల భార్యలో వచ్చే మార్పు కన్నా కూడా ఇద్దరి మధ్య తలెత్తే గొడవలే ప్రాధాన్యత వహిస్తాయని భావించడం వల్ల వీలైనంత వరకు సౌమ్యంగా భార్యతో వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం రిటైర్ అయ్యి భార్యతో ఉంటున్నాడు. ఆయన వాయ్సు వాడే అయిన రామారావు కుటుంబం కూడా సమీపంలో ఉండటం వల్ల ఆయనకు వారికి స్నేహం ఉంది.అక్కడ వారికి ఆప్తులు వారు మాత్రమే. రామారావు కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. తల్లిదండ్రులను కూడా తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. కానీ మధ్యలో రామారావు గారి భార్యకు క్యాన్సర్ రావడం ఆవిడ మరణించడంతో తండ్రిని మాత్రం అక్కడికి తీసుకువెళ్ళిపోయాడు. దానితో వెంకట్రావు గారి కుటుంబం ఒంటరి అయింది.
వెంకట్రావు కొడుకు రఘునాథ్. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే నచ్చిన కన్నడ అమ్మాయి వసంతతో సహజీవనం చేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు వారికి వివాహమైందనే భావించారు. రఘునాథ్ కు వివాహం చేసుకోవాలని ఉన్నా వసంత పెళ్ళి పట్ల ఆసక్తి చూపించలేదు. పెళ్ళయిన ఏడేళ్లకు వసంత గర్భవతి అయ్యింది. కానీ ఆఫీసు బస్సుకు అయిన యాక్సిడెంట్ లో ఆమెకు గర్భం పోవడంతో ఆమె పూర్తిగా నిస్పృహకు గురయ్యింది. తర్వాత ఉద్యోగానికి ఆర్నెల్లు వెళ్ళలేదు. దత్తత తీసుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. వారిద్దరూ వివాహం చేసుకోకపోయినా వారు అంతే ఆప్యాయంగా ఉంటున్నా ఈ గర్భస్రావం వసంతను పూర్తిగా మార్చేసింది.ఆమె పూర్తిగా నిర్లిప్తంగా ఉంటుంది.ఆ తర్వాత కంపెనీ తరపున అమెరికా వచ్చే అవకాశం రావడంతో వసంత సంవత్సరం పాటు అమెరికా వెళ్ళింది. తిరిగి వచ్చాక ఆమె వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దానికి కారణం అక్కడ ఆమె పై అధికారి ఆమెకు పెళ్ళయిన చిహ్నాలు కనిపించకపోవడంతో ఆమె పట్ల చనువుగా ప్రవర్తించడం. ఆ వివాహం తర్వాత వారికి దత్తతకు ఓ పిల్లవాడిని తీసుకోవడానికి అనుమతి లభించింది. ఇది వారి కథ.
ఇక మూడో కథ శశిధర్ ది. శశిధర్ తండ్రి,తాతయ్య మరణించడంతో తాతయ్య తమ్ముడు వెంకట్రావు సొంత మనవడిలానే అతన్ని పెంచారు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న అతను అల్కా అనే ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు.ఆమె లేని సమయంలో అనిత వస్తే ఆమెతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అప్పటి వరకు ఎంతో సౌఖ్యవంతంగా గడిచిపోతున్న అతని జీవితం అతని మీద కంపెనీకి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో ఉద్యోగం పోవడంతో కష్టాల్లో చిక్కుకుంది. అల్కా,అనిత ఇద్దరు తనకు పరిచయస్తులు,వారిద్దరు ఓ సారి మాట్లాడుకోవడం కూడా శశిధర్ చూశాడు. కానీ పరిచయం జరగడంలో ఇద్దరి పరస్పర ఇష్టం ఉన్నప్పుడూ తనను ఇలా దోషిని చేయడం బాధించినా అతను ఆ తర్వాత అంతకు ముందు అతనికి పరిచయమైన క్లయింట్ సాయంతో అమెరికాలో ఉద్యోగం సాధించాడు. అమెరికాకు వెళ్ళేముందు వెంకట్రావు ఇంటికి వచ్చాడు.అక్కడ తాతయ్య,నాయనమ్మలను చూశాడు. వారిలో ఒకరికి ఏమైనా అయితే ఇంకొకరి పరిస్థితి ఏమిటి?అని ఎంతో ఆలోచించాడు. ఓ వృద్ధాశ్రమంలో పైకం చెల్లించాడు.అందులో చేరే ఆలోచనను వెంకట్రావులో నింపాడు.తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు.
ఈ నవలలో ఈ పాత్రల జీవితంలో ఏదో రకంగా ఒంటరితనంతో ఉన్న పాత్రల మనస్తత్వాలను చిత్రీకరించే ప్రయత్నంగానే నవలా గమనాన్ని రచయిత నడిపినట్టు అనిపిస్తుంది. వివాహమైనా విరుద్ధ అభిప్రాయాలూ ఉన్న వెంకట్రావు ఓ రకంగా ఒంటరి అయితే, సహజీవనం చేస్తున్న వసంత-రఘునాథ్ ల మధ్య కొంత కనిపించని కలవలేనితనం వారిద్దరికి ఉన్న వ్యక్తిత్వాల వల్ల ఉంది. ఇక శశిధర్ ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి అల్కా,అనితలతో సన్నిహితంగా ఉన్నా అది అతని సమస్యకు పరిస్కారం కాలేదు.
జీవితంలో మనిషికి ఏదో ఒక దశలో ఒంటరితనం సహజం. అది లేదు అని మనిషి తనను తాను మభ్యపెట్టుకుని బ్రతకవచ్చు. కానీ ఉన్నది కనుక ఏదో ఒక రూపంలో,ఏదో ఒక సమయంలో మనసును అది వెంటాడుతూ ఆ వెలితిని గుర్తు చేస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఒంటరితనంలో ఏ దశలో ఉన్నా భవిష్యత్తులో కాలంతో పాటు జరిగే వాటిని కొంతమేరకు అంచనా వేసి ఆ మార్పులతో వచ్చే ఒంటరితనాన్ని ఎలా ఆహ్వానించాలో ఆలోచించుకుని అంగీకరించుకోవడం మనిషికి కొంత సాంత్వనను ఇస్తుంది.అది క్రమేపీ మార్పులో మనిషి భాగమయ్యే ప్రక్రియను వేగపరుస్తుంది. ఈ వేగమే మనిషిని త్వరగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కోలుకునే మనోధైర్యాన్ని ఇస్తుంది. అటువంటి మనోధైర్యం ఆవశ్యకతను గురించి పరోక్షంగా చర్చించే నవలే ఇది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ