మనిషి-మార్పు

                                                 మనిషి-మార్పు

                                                     -శృంగవరపు రచన

                                                

రచయిత రచనల్లో రచయిత చెప్పాలనుకున్న అంశాలను, జీవితం పట్ల ఉన్న అవగాహనను, సమాజంతో మెలగాల్సిన తీరును, వివిధ ఆపదల్లో స్పందించాల్సిన పద్ధతులను కొంతమేరకు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కుటుంబాల్లో తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య ఉండాల్సిన ప్రేమ గురించి, అమ్మాయిలు యుక్త వయసులో ప్రలోభాలను జయించాల్సిన అవసరం గురించి, మారే తరాల్లో ముందు తర్వాతి తరాలను వ్యక్తి అర్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి, అత్యాచార ప్రవృత్తి ఉన్న వాతావరణంలో స్త్రీ స్పందించాల్సిన తీరు గురించి,తల్లిదండ్రుల విలువలు పిల్లలు అర్ధం చేసుకునే కోణం గురించి, ఎంతో సున్నితంగా మానవ-కుటుంబ-సమాజ సంబంధాలు పటిష్టమవ్వడానికి తెరగా ఉన్నా అభిప్రాయభేదాలని తొలగించుకోవాల్సిన అవసరం గురించి కూడా సూటిగా, హృద్యంగా రచయిత సి.ఎన్. చంద్రశేఖర్ గారు తన కథాసంపుటి 'ఆశయాల పల్లకి'లో స్పష్టం చేసే ప్రయత్నం చేసారు.
మొదటి కథ 'ధర్మో రక్షతి రక్షితః." ఈ కథలో అంశం సామజికమై కొంతమేరకు సాధారణమైనదే అయినా కథకు ప్రాణం ఆ సాధారణత్వంలో రచయిత దర్శించే అసాధార దృక్కోణం.ఓ అమ్మాయిను ఇద్దరు అత్యాచారం చేస్తారు. ఆ ఇద్దరికి స్నేహితుడైన ఇంకో వ్యక్తి ఆ ప్రయత్నం ఆపాలని ఎదుర్కొన్నా విఫలుడు అవుతాడు.ఈ సంఘటన జరిగిపోయాక ఆ మిత్రుడు, ఆ అమ్మాయి ద్వారా రచయిత కథ నడిపించిన తీరు కొత్తగా ఉంటుంది.ఈ రెండు పాత్రలు సమాజ స్థాయికి, వ్యక్తిగత స్థాయికి మధ్య ఉన్న బాధ్యతా, న్యాయం వంటి వాటికి సూచికలుగా భావించవచ్చు. ఈ ఘటన తర్వాత ఆ మిత్రుడు ఆ అత్యాచారం చేసిన స్నేహితుల మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి మానసికంగా ఎంతో దెబ్బ తింటుంది. పురుషుడి స్పర్శకు ఉన్మాదిగా మారిపోతుంది. మానసిక చికిత్సాలయం నుండి ఆమె తప్పించుకుని మిత్రుని ఇంటికి రావడం, అతని ఇంట్లో పడుకోవడం, అప్పటికే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినందుకు అతని మీద కోపంతో అతని మిత్రులు అతని ఇంటికి రావడం, ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళడం ఆమె వారిని హత్య చేయడం జరుగుతుంది.ఇది జరిగిన తర్వాత ఆమె మామూలు మనిషిగా మారిపోతుంది.ఈ కథలో నాటకీయత ఉన్నది.కానీ అన్యాయం జరిగిన వ్యక్తి బాధిత స్థాయిలో నిస్సహాయతతో ఉండి తర్వాతి జీవితానికి అక్కడే ముగింపు పలికే ప్రయత్నం చేస్తాడు.బాధితులకు న్యాయం జరగడం అన్నది జరిగిన అన్యాయాన్ని తుడిపేయలేకపోవచ్చు కానీ సామాజిక మద్ధతును బాధితులకు ఇచ్చే ప్రయత్నం ఇది. ఆ తర్వాత ఆమెకు వివాహం కూడా అవుతుంది. రచయిత అటు సమాజ స్థాయిలో ఇటూ వ్యక్తి స్థాయిలో మార్పు కోసం పడే తపనను ఈ కథ స్పష్టం చేస్తుంది.
రెండో కథ 'మా నాన్న బంగారం.' మారుతున్న సాంకేతికత, విద్య, నూతన పోకడలు తల్లిదండ్రుల ప్రేమ కోణంలో కూడా ప్రవేశించిన విధానాన్ని ఓ పక్కన చెప్తూనే,పిల్లలను కాపాడుకోవడానికి తండ్రి చేసిన సాహసాన్ని, త్యాగాన్ని కూడా ఈ కథలో స్పష్టం చేసారు.
శ్రీనివాస్, రమ దంపతుల కూతురు కావ్య. ఆ తండ్రికి కూతురు అంటే ఎంతో ప్రేమ. బాల్యం నుండి ఎంతో సన్నిహితంగా ఉండే కూతురు ఇంటర్, ఇంజనీరింగ్ విద్యల్లోకి వచ్చేసరికి మానసికంగా దూరమైపోవడం ఆయన గమనిస్తూనే ఉన్నాడు. కావ్యకు తండ్రి పాతకాలపు మనిషిలా అనిపిస్తున్నాడు.తన స్నేహితుల తల్లిదండ్రులతో తండ్రిని పోల్చుకోవడం వల్ల వారిలా తనకి తిరిగే స్వేచ్చ ఇవ్వడం లేదని, సెల్ ఫోన్ ఇవ్వలేదని, ఫ్యాషనబుల్ గా ఉండటం లేదని ఆమెకు అసంతృప్తిగా ఉంటుంది. ఓ సారి పార్టీలో ఆమెకు పరిచయమైన వెంకట్ ఆమెను ప్రలోభపరిచి, ఆమెను నాశనం చేయబోతున్న సమయంలో కూతురిని కాపాడుకోవడానికి ఆ వ్యానుకు అడ్డంగా తన స్కూటర్ తో వెళ్ళి యాక్సిడెంట్ చేసి తన కూతురు పారిపోయేందుకు అవకాశాన్ని కల్పిస్తాడు. జాగ్రత్త పడాల్సిన అవసరం గురించి అప్పుడు కావ్యకు అర్ధమవుతుంది. తండ్రి తన ప్రాణాలకు తెగించి తనను కాపాడటం ఆమెకు తండ్రి ప్రేమకు ఏ హంగులు అవసరం ఉండవని ఆమె తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది. తరాల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రేమను గుర్తించలేని మనస్థితి ఉన్న ముందర తరం ఆలోచనా శైలిలో అర్ధం చేసుకునే స్థాయి వాస్తవికతకు దగ్గరగా ఉండకపోతే జరిగే ప్రమాదాలను రచయిత ఈ కథలో 'తండ్రి ప్రేమ' కేంద్రంగా మలిచారు.
మూడో కథ 'మాటే మంత్రము.' మనిషి వ్యక్తి కేంద్రంగా నడిపే జీవితానికి, కుటుంబ-సమాజ కేంద్రంగా గడిపే జీవితానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఈ కథ ద్వారా రచయిత స్పష్టం చేసే ప్రయత్నం చేసారు.సాహితి చదువుకున్న స్త్రీ. కానీ కుటుంబానికి, బంధాలకు విలువనిచ్చి, ఎవరిని ఎప్పుడు నొప్పించకుండా మెలుగుతూ ఉండేది. అందుకే ఆమె చుట్టూ ఆమె కుటుంబం, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం. కానీ ఉష అలా కాదు. తన వ్యక్తిగత ప్రాధాన్యతలను మాత్రమే గెలుపుంచుకుంటూ ఒంటరిగా మిగిలిపోయింది. సాహితి జీవితం ఆమెలో మార్పు తీసుకురావడం, ఆమె భర్తతో కలవడంతో కథ ముగుస్తుంది. మనిషి ఒంటరిగా జీవించలేడు. ఓ మనిషి పూర్తిగా మారలేకపోయినా ప్రేమించే వారి కోసం కొంత సర్దుకుపోవడంలో తప్పు లేదని ఈ కథ స్పష్టం చేస్తుంది.
నాలుగో కథ 'ఇది కథ కాదు.'అవమానాలకు క్రుంగిపోయి ఇక జీవితంలో గౌరవంగా బ్రతికే అవకాశం ఉండదని భావించి అంతటితో జీవితాన్ని ముగించుకోవాలనుకునే అమ్మాయిలు అలాంటి పరిస్థితుల్లో ఆలోచించుకోవాలని, జీవితం నుండి మధ్యలో తప్పుకోకుండా ఆ సమస్యను తీర్చగలిగే అనుభవం ఉన్న వారిని సంప్రదించి జీవితం మీద భరోసాతో ముందుకు నడవాలని ఈ కథ స్పష్టం చేస్తుంది. ఈ కథకు 'సోమేపల్లి పురస్కార కథల పోటీల్లో'ప్రథమ బహుమతి లభించింది.
సమీర కలక్టర్ కావాలన్న ఆశయంతో చదువుకుంటున్న అమ్మాయి. ఆమె కాలేజీలో కొందరూ యువకులు ఆమె స్నానం చేస్తున్న వీడియో తీసి ఆమెను బెదిరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఆ హాస్టల్ వార్డెన్ కాత్యాయని ఆమెకు ధైర్యం చెప్పి ఆ సమస్య పరిష్కరించే మార్గం చూస్తానని భరోసా ఇస్తుంది.తన స్నేహితుడైన రచయిత విశ్వంతో ఈ సమస్య గురించి చెప్తుంది. అతను తనకు తెలిసిన పోలీస్ అధికారి సాయంతో వారిని సెల్ లో పెట్టించి బెదిరిస్తే అది ఆమె వీడియో కాదని మార్ఫింగ్ చేసిందని చెప్తారు. వారి చేత ఓ నేరం చేసినట్టు స్టేట్ మెంట్ రాయించుకుని మరలా ఆ అమ్మాయిని వేధిస్తే ఆ కేసులో అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో సమీర సమస్య పరిష్కారం అవుతుంది. పదేళ్ల తర్వాత ఆమె కలెక్టర్ అయ్యింది.
ఆడపిల్లలు శీలం అన్న మాటను శరీరానికి ఎక్కువ అనుసంధానం చేసి అదే గట్టిగా నమ్ముతూ, ఆ శరీరంలోనే తమ గౌరవం ఉందని భావించడాన్ని ఆమె బలహీనతగా గుర్తించిన వ్యక్తుల్లో ఆమె బలహీనతలో తమ నేర ప్రవృత్తిని దాచుకుంటూ, ఆమె గౌరవం వైపు అందరి దృష్టి మళ్ళిస్తూ తన పైశాచికత్వాన్ని హీరోయిజంగా భావించే మానసిక రోగుల నుండి స్త్రీలు ఎప్పటికప్పుడు తమను తాము కాపాడుకోవడానికి యుద్ధం ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉండాలని ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఐదో కథ 'తల్లి దీవెన.'సావిత్రికి మురళి, గోపి, రమ్య పిల్లలు. బాల్యం నుండి కుటుంబ బాధ్యతలు, సమాజంలో తనకు తెలిసిన వారికి సాయం చేయడం మురళి ప్రవృత్తిలో ఓ భాగం. అతని తల్లి సావిత్రి గోపి, రమ్యల దగ్గర కొంతకాలం గడిపి ఆ తర్వాత మురళి దగ్గర ఉండటానికి వస్తుంది. ఆమెకు అనారోగ్యంగా ఉంటే మురళి భార్య కూడా ఆమెను తల్లిలా చూసుకుంటుంది. హాస్పటల్ లో జాయిన్ చేసినా ఫలితం ఉండదు. ఆమె మరణిస్తుంది.
మరణించ్చేముందు తల్లి తనకు రాసిన ఉత్తరం చదువుతాడు మురళి. తన మరణం గురించి ముందే తెలిసిన తల్లి తన చివరి రోజులు తన దగ్గర గడపాలని అనుకోవడం వల్ల చివరిలో వచ్చానని రాస్తుంది. ఇల్లు కట్టడానికి, రమ్య పెళ్ళికి, తండ్రి అనారోగ్యానికి మురళి అప్పులు చేసి మరి కుటుంబానికి అండగా ఉన్నాడని, అతనికి ఎప్పటికీ అన్యాయం జరగదని, అదే వారసత్వం అతని పిల్లలకు వస్తుందని ఆశీర్వదిస్తుంది.ఆ తర్వాత మురళి కూతురి వివాహం సమయంలో డబ్బు దొరకక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ 'అమ్మ ఆశీర్వాదం' ఫలించి మురళి కొడుకు తన తోబుట్టువు వివాహానికి డబ్బు సర్దడంతో మురళి వ్యక్తిత్వం అతని కొడుకుకు కూడా వారసత్వంగా వచ్చింది అన్న భావనను స్పష్టం చేస్తూ రచయిత ఈ కథను ముగిస్తారు.ఓ వ్యక్తి ఎటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాడో అదే వ్యక్తిత్వం అతని చుట్టూ ఉన్న సమాజంలో కూడా ప్రతిఫలిస్తుందని ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఆరో కథ 'ఆశయాల పల్లకిలో.' తండ్రి నిజాయితీ, విలువలు గమనిస్తూ పెరిగిన కూతురు తనకు అటువంటి లక్షణాలు గల భర్త కావాలని కోరుకుంటుంది.అవినీతి సంపాదన ఉన్న సంబంధాలను తిరస్కరిస్తూ వస్తుంది.చివరకు ఓ సంబంధం వస్తుంది. ఆ పెళ్ళి కొడుకు తన గురించి నిజం దాచిపెట్టి తనకు ఆమెతో వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారని చెప్తాడు. తను ఓ గదిలో అద్దెకి ఉంటున్న సమయంలో ఓ రౌడీ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కూతురిని రోజు ఏడిపిస్తూ ఉండేవాడు.ఓ రోజు అడ్డుపడి ఆమెను కాపాడే ప్రయత్నం చేసినందుకు తన మీద దొంగ కేసు పెట్టారని చెప్తాడు. తాను తన చుట్టూ ఉన్న మనుషుల కోసం నిలబడతానని చెప్తాడు. అతని విలువలు, నిజాయితీ నచ్చిన మమత అతన్ని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది.
తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు, సమాజం, జీవితం, విలువలు, సుఖం వంటి వాటి గురించి ఎటువంటి నమ్మకాలు ఏర్పరుస్తారో, అవే వారి జీవితాలను అంటిపెట్టుకుని, వారి జీవన గమనాలను నిర్దేశిస్తాయని ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఏడో కథ 'ఓ తండ్రి కథ.' ముంబైలో స్థిరపడి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్న రాజేష్ తండ్రిని నమ్మించి ఇంటిని అమ్మించి ఆ డబ్బు తీసుకుని కొన్నాళ్ళు తండ్రిని తమతో ఉంచుకుని, ఆ తర్వాత తిరుమల చూపిస్తానన్న నెపంతో ఆయన్ను అక్కడ వదిలించుకుంటాడు. ఆయన మరలా వస్తాడేమోనని ఇల్లు కూడా భార్యతో సహా మార్చేస్తాడు. ఆ తండ్రి ఒకప్పుడు ఓ ఉపాధ్యాయుడు. ఆయన పూర్వ విద్యార్థి ఆయన్ని గుర్తించడం,ఆయనకు జరిగింది అర్ధమై, తన జీవితాన్ని ఆ విద్యార్థి ఇచ్చిన ధైర్యం, ఆసరాతో ట్యూషన్స్ చెప్పుకుంటూ ఆ ఇంటి పైన ఉన్న మేడలో గడపడం జరుగుతుంది. ఓ ఏడాది తర్వాత రాజేష్ మరలా తిరిగి వస్తాడు. తండ్రి గురించి ఆ విద్యార్థి భార్యను అడుగుతాడు. దానికి ఆమె ఆయన ఆ మనస్థాపం తట్టుకోలేక మరణించారని చెప్తుంది. మొదట బాధ పడినట్టు నటించి ఆ తరవాత తన తల్లి నగల గురించి అడుగుతాడు. ఆ నగలు అతనికే ఇస్తుంది. అవి తీసుకుని అతను వెళ్ళిపోతాడు. భర్త అడిగితే అతను మారలేదని ఈ సారి నగల కోసం ఆయన్ను ఎక్కడ వదిలేస్తాడో కూడా తెలియదని, అందుకే తనకు ఇచ్చిన నగలను ఇచ్చి ఆయన మరణించాడని అబద్ధం చెప్పానని లేకపోతే ఆయన జీవితం తరువాత మళ్ళీ బాధల్లో పడవచ్చని చెప్తుంది.
తల్లిదండ్రులను కేవలం ఆస్తికి సాధనాలుగా భావించే పిల్లలను కేవలం ప్రేమతో భరించడం వారి బలహీనతగా భావించే పిల్లల నుండి దూరంగా ఉండటమే మంచిదని ఈ కథ స్పష్టం చేస్తుంది. ఎమోషన్స్ వ్యాపారం చేసే సంస్కృతిని అర్ధం చేసుకుని మెలిగే స్థాయికి మనుషులు ఎదగకపోతే ఎప్పటికీ వంచించబడుతూనే ఉంటారని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఎనిమిదో కథ 'రాజువయ్యా... మహా రాజువయ్యా.' రచయిత తానే రాసే విలువలకు ఎలా కట్టుబడి ఉండాలో స్పష్టం చేసే కథ ఇది. రామకృష్ణ రచయిత. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా తన విలువలను ఏనాడు వదులుకోలేదు. తనను అభిమానించిన తన పొరుగింటి వారితో స్నేహంగా ఉండేవాడు. ఘోస్ట్ రైటింగ్ చేసేవాడు. ఓ రోజు ఓ స్త్రీ తనను రామకృష్ణ అనే రచయిత మోసం చేసాడని పొరుగింటికి వస్తుంది.రామకృష్ణను చూసి అతను కాదని అంటుంది. ఆ పేరుతో ఉన్న ఇంకో రచయిత మోసం చేసాడని, కానీ ఆ అమ్మాయి అభిమానించిన రచయిత మాత్రం ఈ రామకృష్ణ అని చెప్తుంది. అప్పటికే గర్భవతి అయినా ఆమె కుటుంబాన్ని ఒప్పించి తానే కారణం అని చెప్పి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత అతని ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతూ ఉండటం, అయినా తన విలువలను మాత్రం కాపాడుకుంటూ ఉండటం జరుగుతుంది.
రచయిత ఆదర్శంగా ఉంటాడు అనేది పాఠకుల ఊహా. కానీ ఎంతోమంది రచయితల వ్యక్తిగత జీవితాలలో అవి ఉండకపోవడం పాఠకులు తెలుసుకున్నప్పుడు వారి రచనలని, వారి జీవితాన్ని విడిగా చూడలేరు. ఇలాంటి పరిస్థితుల్లో రచయిత తన అక్షరాల్లో తాను జీవించాల్సిన అవసరాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది.
తొమ్మిదో కథ 'వారసత్వం.' ఎదుటి వారి జీవితాలను అర్ధం చేసుకుని దానికి తగ్గట్టు వారికి ఎంతో కొంత సహకరించే విధంగా ఉండాలన్న విషయాన్ని తండ్రి దగ్గర నేర్చుకున్న వత్సల పని వాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర పాటిస్తూ వారికి పనికి, వ్యక్తిత్వానికి గౌరవం ఇస్తుంది. మనం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడూ మన కింది స్థాయి వారికి మన సహకారం అందించాలని ఈ కథ స్పష్టం చేస్తుంది.
పదో కథ 'తల్లి మనసు.'ఖర్చు పెట్టుకోలేక రోజు తన భార్యకు తనకు మాత్రమే చిరుతిండి తల్లికి తెలియకుండా తెచ్చుకునే వాడు సత్యం. భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత గదిలో చిరుతిండి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. తల్లి తానే పెట్టానని చెప్తుంది. ఏది ఆశించని ప్రేమ తల్లిది అని స్పష్టం చేసే కథ ఇది.
ఈ కథలు ఈనాడు ఆదివార పత్రికలో, ఆంధ్రభూమి వార -మాస పత్రికల్లో, విపులంలో ప్రచురించబడ్డాయి. ఓ రెండు కథలు వివిధ పోటిల్లో బహుమతి కూడా పొందాయి.ఈ కథల్లో మనుషుల జీవితాల్లో ఉండే సాధారణత్వం ఉంది, అనుకోకుండా సంభవించే కష్టాలు ఉన్నాయి. కొంతమేరకు పరిష్కారం గురించి ఆలోచించాలంటే ఉండాల్సిన మనస్తత్వ స్పష్టత కూడా ఉంది. మనుషులను అర్ధం చేసుకుని జీవితం అర్ధవంతంగా మార్చుకోవాలన్న తత్త్వము ఉంది. ఇంకొంత నాటకీయత కూడా ఉంది. వీటన్నింటితో పాటు కథలను మర్చిపోకుండా చేసేలా కథల వెనుక ఉద్దేశ్యాలు ఉన్నాయి. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక స్థాయిలో జరగాల్సిన మనస్తత్వ-వ్యక్తిత్వ మార్పులను తన కథల్లో స్పష్టం చేసే ప్రయత్నం చేసిన రచయితకు అభినందనలు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ