లక్ష్యమున్న జీవితం

 లక్ష్యమున్న జీవితం

-శృంగవరపు రచన


మనిషి జీవితానికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఆ మనిషి ఆలోచనలకు దగ్గరగా ఉండవచ్చు లేదా విద్యకు దగ్గరగా ఉండవచ్చు. కానీ వ్యక్తిత్వంలో భాగమై విద్యతో బలపడిన లక్ష్యం ఎన్ని అడ్డంకులనైనా దాటుకుని పయనించి తన మార్గం చేరుకుంటుంది. ఆ లక్ష్య సాధనకు ఆ మనిషి ఓ వాహనాంలా మారతాడు అంతే. అటువంటి వారే కార్యదీక్షకులు అవుతారు. అటువంటి కార్యదీక్షతో ఓ స్త్రీ చదువుతో ఈ సమాజంలో మార్పు తీసుకురాగల స్థాయికి ఎదిగి,ఆమె వ్యక్తిత్వపు బలాన్ని అదే అధికారం బలహీనం చేస్తున్న సమయంలో ఆమె ఆ అధికారాన్ని వదిలి కూడా తన ఆలోచనాపరిమళ పుష్పాలను ఎలా సుగంధించేలా చేసిందో స్పష్టం చేసే నవలే శివకుమార్ గారి 'ఆమె జయించింది.'
అభిజ్ఞ పుట్టుకతోనే సమస్యలను ఎదురించడం, సహనంతో తన లక్ష్యాన్ని చేరుకోవడం శ్రమించడం నేర్చుకుంది.ఓ చెత్త కుండీలో మూసి ఉన్న ప్లాస్టిక్ కవర్ లో పారేయ్యబడ్డ పసి పాపను రాత్రాంతా వీధి కుక్కలు కాపలా కాస్తే, ఉదయమే ఓ పూజారి గారు ఆ పాపను రక్షించి ఇంటికి తీసుకువెళ్లారు.ఆ పూజారి గారికి పిల్లలు లేకపోవడం వల్ల ఆ పాపనే తమ కన్నబిడ్డ గా పెంచుకుంటున్న సమయంలో ఓ సంవత్సరం గడిచాక ఆయన మరణించడంతో అభిజ్ఞ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఆ సమయంలో పూజారి గారి భార్యను ఆమె అన్నయ్య తనతో పాటు తీసుకు వెళ్లాలంటే ఆ పాపను తీసుకురావద్దని కచ్చితంగా చెప్తాడు. ఆ సమయంలో గుడి దగ్గర చెప్పులు కుట్టే రహీమ్ చాచా ఆమెను పెంచుకుంటాడు.
అప్పటికే ఆరుగురు పిల్లలున్న రహీమ్ చాచా తన ఉండి లేని సంసారంలో కూడా అభిజ్ఞను చదివిస్తాడు. మొదటి నుండే అన్యాయాన్ని ఎదురించడం, ఆవులు, కుక్కలు, మేకలు వంటి జంతువులకు ఆహరం పెట్టడం వంటి స్వాభావిక లక్షణాలు అభిజ్ఞతో పాటే పెరుగుతూ ఉంటాయి.అభిజ్ఞ టెన్త్ లో స్టేట్ ర్యాంకు తెచ్చుకుని,తరువాత ఐఏఎస్ అవుతుంది.
తన లాగే కష్టపడి పైకి వచ్చిన ఐపియస్ ఆఫీసర్ ఈశ్వర్ ను వివాహం చేసుకుంటుంది. అతని నిజాయితీ వల్ల అతను కూడా చంపబడతాడు.
అధికారంలో ఉన్న ఆమె నిజాయితీకి ఆమెకు ఎన్నో అవరోధాలు కలిగించి ఆమెకు ఎన్నో బదిలీలు చేయిస్తే ఆమె తాను ఉన్న ప్రతి శాఖలో అవినీతిని అంతం చేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది.
బదిలీలు, తనను తాను కాపాడుకునే ప్రయత్నాల్లో తాను ఉంటే తాను ఏమి చేయలేనని భావించిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది.
ఆమె ఆ తర్వాత ఓ గ్రామంలో సమిష్టి వ్యవసాయం మొదలుపెడుతుంది. మొదట్లో నష్టం వచ్చినా, తర్వాత రసాయనాల వాడకం తగ్గించి, సహజ వ్యవసాయం చేసి దిగుబడి ఎక్కువ వచ్చేలా చేసి భూసారం పెంచి విజయం సాధిస్తుంది.
ఆ గ్రామంలో నివసించే వారికి ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందెలా చేస్తుంది. ఆ గ్రామ ఆర్ధిక వ్యవస్థను, ఆ గ్రామపు జీవన శైలిని మార్చేస్తుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.
అందరూ అన్ని చేయలేకపోవచ్చు. చేసే అవకాశం ఉన్న ఒత్తిడి ఉన్న వ్యవస్థలో నెరవేర్చలేకపోవచ్చు. కానీ మనిషి వ్యక్తిగతంగా మాత్రం తనకు సంతృప్తిని ఇచ్చే ఏదో ఓ పని చేయవచ్చు. అది ఎంత చిన్నదైనా సరే దాని ప్రభావ స్థాయి కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది.అదే జీవితపు అర్ధంగా మారిపోతుంది. అటువంటి జీవితాలే లక్ష్యాలు ఉన్న జీవితాలు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ