జ్ఞాపకాల గది

                                                    జ్ఞాపకాల గది 

                                                            -శృంగవరపు రచన


                                              


      ప్రాంతీయికరణ   సాహిత్యానికి కాలంతో పాటు పాఠక ఆదరణ కూడా పెరుగుతూనే ఉంది. రచయితకు-ప్రాంతానికి ఉన్న సంబంధం రచనల్లో స్పష్టం అయినప్పుడు తెలియకుండానే పాఠకుల మనసులో రచన పట్ల ఓ ఆత్మీయత కలగడం కూడా సహజమే. రాయలసీమ రచయితల ప్రాంతీయ సాహిత్యంలో కరువు బాధలే కాదు, ప్రేమలు-ఆత్మీయతలు-జ్ఞాపకాల తడి కూడా ఉన్న వైనాన్ని స్పష్టం చేసే కథలే బూదూరి సుదర్శన్ గారి ‘బాహుదా’ బతుకు కథలు. తన ప్రాంతం గురించి, అక్కడి జీవితాల గురించి, అక్కడి మనుషుల గురించి చెప్పాలన్న రచయిత  తపన ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథలు సందేశాత్మకంగా రాయబడినవి కావు జీవితంలోని కష్ట సుఖానుభూతులు మనుషుల జ్ఞాపకాల్లో ఎలా పదిలమవుతాయో, ఎంత చిన్న అంశమైనా వ్యక్తి జీవిత పుటల్లో ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో స్పష్టం చేసే కథలు ఇవి. ఈ కథల్లో స్నేహం ఉంది,ప్రేమ ఉంది, బాధ ఉంది, అర్ధం చేసుకోలేని తనం ఉంది, జీవితం అంటే అన్నీ అని చెప్పే ధైర్యం ఉంది. 

          మొదటి కథ ‘ఆడొద్దు.’ వాస్తవానికి ప్రతి కథలోనూ మనుషుల మనస్తత్వంను గురించి వివిధ స్థాయిల్లో చెప్పినట్టే ఉంటుంది. కోస్తా ప్రాంతాల్లో భర్తను ఇంటాయన అనడం అరుదు. కానీ సీమ ప్రాంతంలో భర్తను ఇంటాయన అని అనడం ఈ కథల్లో గమనించవచ్చు. తను చూసిన మనుషుల్లో ఉన్న ప్రేమ గురించి, అది లాభనష్టాల గురించి ఆలోచించనివ్వని తీరును గురించి ఈ కథ స్పష్టం చేస్తుంది. యశోద, నందగోపాల్ భార్యాభర్తలు. నందగోపాల్ కు చెల్లి అంటే ఎంతో ఇష్టం. పెళ్ళయిన ఐదేళ్ళకు యశోద గర్భవతి అవుతుంది.ఆమెకు కూతురు పుడితే చెల్లెలి కొడుకుతో సంబంధం కలుపుకుందామని ఆశ పెట్టుకున్న యశోద భర్తకు ఆశాభంగం అవుతుంది కొడుకు పుట్టడంతో. సాధారణంగా కొడుకు పుడితే సంతోషించడం, కూతురు పుడితే నష్టం అన్నట్టు భావించి బాధ పడటం మాత్రమే తెలిసిన ఈ సమాజంలో చెల్లెలి మీద ఉన్న ప్రేమతో అందుకు భిన్నంగా ఆ భర్త ఆలోచించడం ప్రేమ మనస్తత్వాన్ని ఎలా మారుస్తుందో ఇంకో దిశకు అన్న అంశాన్ని స్పష్టం చేస్తుంది. ఇది ఓ కోణం అయితే మనిషి ఎప్పుడూ తనకు ఉన్నదానితో తృప్తి పడడన్న అంశాన్ని కూడా రచయిత డాక్టర్ ద్వారా స్పష్టం చేస్తారు. పిల్లల పట్ల తండ్రి అభిప్రాయానికి మాత్రమే కుటుంబంలో ఉండే ప్రాధాన్యత కూడా ఇంకో దృక్కోణంగా ఈ కథలో కనిపిస్తుంది. 

       రెండో కథ ‘నట్రాజు పెన్సిలు.’ ఈ కథలో రచయిత బాల్యంలో పిల్లల మధ్య ఉండే స్నేహాలకు ఏ భేధాలు తెలియవని, అవి అర్ధం చేసుకోలేని ప్రపంచం వారిది కనుక అది ఎంతో సంతోషంగా  ఉంటుందన్న భావనను స్పష్టం చేశారు. అలాగే కథలోని చివరి మూడు వాక్యాలతో పెద్దలైన వారిలో ఉండే అజ్ఞానాన్ని కూడా సున్నిత వ్యంగ్యంతో బట్టబయలు చేశారు రచయిత. 

        మూడో కథ ‘ఇంటాయన.’ బాల్యంలో మనమందరం మనకు తెలిసిన పరిధిలో ఏది మంచిదో ఏది చెడ్డదో కొంతమేరకు నిర్ణయించుకోగలము. కథకుడు గోపి పన్నెండేళ్ళ వాడు.అతని బాల్య స్నేహితురాలు బిందు.బిందుకి మామ కొడుకుతో అతనికి గండం ఉండటంతో పెళ్ళి చేస్తారు. గోపి చదువుకోవాల్సిన వయసులో బిందు చదువుకి దూరమైపోవడం గురించి ఆలోచిస్తాడు. అతనికి అంత వరకే తెలుసు. అతని తల్లి కొంత కాలం అయ్యాక అ గండం తొలగిపోయాక బిందు భర్త ఇంకొకరిని వివాహం చేసుకుంటే  ఆ అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుందని ఆలోచిస్తుంది. అది తల్లి ద్వారా తెలుసుకున్న గోపి ఆవేశపడినా, పిల్లల మాటకు విలువ ఉండదని అందుకే తాను త్వరగా పెద్దవాడవ్వాలని కోరుకుంటాడు. ఈ కథలో బాల్యంలో ఉండే అమాయకత్వం ఉంది. ఆ బాల్యంలో పిల్లలు తమ మిత్రుల గురించి ఎలా ఆలోచిస్తారో, వారికి ఏదైనా మంచి జరగకపోతే ఎలా స్పందిస్తారో అన్న అంశాన్ని రచయిత స్పృశించారు. 

     ‘పగిలిపోయిన గోలీలు, తవ్విన గుంతలు, ఇసకలో ఏసిన బొమ్మలు. ఎవరో బాల్యాన్ని వదిలేసి వెళ్లారన్న దానికి గుర్తుగా ఆడ కనబడ్డాయి’, ఈ వాక్యంతో బిందు బాల్యం కోల్పోయింది అన్న బాధ గోపిలో ఏ మనో చిత్రాన్ని ఏర్పరిచిందో చెప్పడం రచయితకు అనుభూతులను పదా లతో పట్టుకోవడంలో ఉన్న నేర్పును స్పష్టం చేస్తుంది. 

       నాలుగో కథ  ‘చిన్న సేటు-పెద్ద సేటు.’ తండ్రి కొడుకుల ఆలోచనలు ఎలా ఉంటాయో అన్న అంశం కేంద్రంగా రాసిన కథ ఇది. ఈ రెండు తరాల  మధ్య వ్యత్యాసం వేషధారణలో ఎలా ఉందో, యవ్వన ప్రేమ పట్ల సామీప్యత ఎలా ఉందో అన్న అంశాన్ని గురించి ఈ కథ పరోక్షంగా స్పష్టం చేస్తుంది. 

       ఐదో కథ ‘కట్ట కింద ప్రేమ.’ ఈ కథలో బావామరదళ్ళ ప్రేమకు కొన్నిసార్లు అడ్డు వచ్చే కుటుంబ జోక్యాలు, కుటుంబం గురించి ఆలోచించడం, కొంత ఆవేశపడటం, తర్వాత ఆ ప్రేమ ఎలా బలపడుతుందో అన్న అంశం మీద, కథలో ఆ ప్రేమను ఒకరి పట్ల ఒకరికున్న కన్సర్న్  ను వ్యక్తపరిచేలా ఉండేలా జాగ్రత్త తీసుకుని రాయడం ఈ కథకు పఠనీయతను ఆపాదిస్తుంది. 

     ఆరో కథ ‘చెరుకు తోటలో చాటెడు బియ్యం.’ బాల్యంలో ఉండే ఊహాలు, గ్రహాంతర వాసుల గురించి విన్నవి నిజమైతే ఎలా ఉంటుందన్న ఊహాతో రాసిన ఈ కథ నిజంగా జరిగిన బావుంటుందన్న భావనను కలిగిస్తుంది. చిన్న పిల్లల మనసులో ఎవరిని అనుమానించకుండా స్నేహం చేసే అమాయకత్వం ఈ కథలో కనిపిస్తుంది. 

       ఏడో కథ ‘శరత్తు లోన వెన్నెల.’ కలిసి పెరిగిన పిల్లలు వరసైన వాళ్ళైన సరే వారిలో ఉండే పసితనాన్ని స్పష్టం చేసే కథ ఇది. ఆ పసితనంలో ఉండే ఉక్రోషం,అమాయకత్వం ఈ కథలో కనిపిస్తుంది. ఎనిమిదో కథ ‘హిందీ పరీక్ష.’ పరీక్ష అంటే చదువులోనే కాదు జీవితంలో కూడా సమాధానాన్ని సాధించాల్సిందే అని స్పష్టం చేసే కథ ఇది. మనుషుల మంచితనం అవసరాల్లోనే ఉంటుందన్న కఠోర వాస్తావాన్ని గట్టిగా చెప్పే కథ ఇది. తన గండం తప్పించుకోవడానికి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని, అది అయిపోయాక ఇంకో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి ఆ భర్తకు ఎలా సమాధానం చెప్పిందో చెప్పే కథ ఇది. 

       తొమ్మిదో  కథ ‘మూగ మనుషులు.’ ప్రేమ అబ్బాయి-అమ్మాయిల మధ్య అంకురించినా  మౌనంగా ఉండటం వల్ల అది ఎలా దూరమైపోతుందో, అలాంటి ఎన్ని మౌనాలు మన జీవితాల్లో ఉన్నాయో చెప్పే కథ ఇది. పదోకథ ‘బెస్టు ఫ్రెండ్.’ స్నేహానికి ప్రేమకు మధ్య ఉండాల్సిన సన్నని గీత కలిసిపోతే కొన్ని సార్లు ప్రేమ కూడా స్నేహంగా ఎలా మిగిలిపోతుందో చెప్పే కథ ఇది.పదకొండో  కథ ‘ఒంటిల్లు బస్టాపు.’ ఈ కథలో తన తండ్రి వల్ల అన్యాయంగా  చనిపోయిన దంపతుల కొడుక్కి ఓ అమ్మాయి ఎలా జీవిత భాగస్వామి అయ్యిందో, ఎలా తనకు న్యాయం అనుకున్నది చేసిందో, ప్రేమ అంటే ధైర్యాన్ని ఇవ్వడం అన్న అంశాలను స్పష్టం చేశారు రచయిత. 

        పన్నెండో కథ ‘ఎంకటేసు ఎంత మంచోడు?’ ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు ఆమెను భర్త బాగా చూసుకుంటాడా లేదా అన్న భయం ఎలా ఆ ఇంటి అన్నదమ్ములను వేధిస్తుందో, ఓ మగవాడు భార్యను బాగా చూసుకుంటాడన్న అంశాన్ని ఎలా నమ్మాలి అన్న అంశం మీద రాసిన కథ ఇది. ఇందులో సగటు తల్లిదండ్రులు,అన్నదమ్ములు కనిపిస్తారు. పదమూడో కథ ‘శుభవార్త.’ వివాహమయ్యాక ఆడపిల్ల గర్భవతి అవ్వాలని అనుకునే సమాజ ధోరణిలో భార్యను భర్త ఎలా అర్ధం చేసుకోవాలి,ఆమె మౌనాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో,ఆమెకు నచ్చినట్టు ఎలా మెలగాలో స్పష్టం చేసే కథ ఇది. 

        పద్నాలుగో కథ దండుమిట్ట రేగుపండ్లు.’ అత్తా కోడళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న భేదాభిప్రాయాలు, భార్యాభర్తల మధ్య ఉండే సున్నితమైన ప్రేమను స్పష్టం చేసే కథ ఇది. పదిహేనో కథ ‘పెద్ద మనుషులు.’ నేటికి గ్రామ సంస్కృతిలో పెద్ద మనుషులు ఏదైనా  తప్పు జరిగినప్పుడు తీర్పు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. వారు కూడా ఎలా అవినీతిపరులుగా మారుతున్నారో, ఇటువంటి సందర్భంలో పోలీస్ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కథ ఇది. పదహారో కథ ‘రాణి గారి ఏకాంతం.’ ‘ఓడిపోయిన ప్రేమ కథలు ఉంటాయేమో గాని, ఓడిపోయిన ప్రేమ లేదు,’ అని ఈ కథలో రాశారు రచయిత. ప్రేమకు ఏది అడ్డు రాదని స్పష్టం చేసే కథ ఇది. 

      పదిహేడో కథ ‘వయసైపోతాండాది.’ తల్లిదండ్రులయ్యాక పిల్లల పట్ల వారి ఆలోచనల పట్ల పెద్దలకు ఉండే ఆలోచనలు ఎప్పుడూ పిల్లలు సవ్యంగా లేరనే దృక్కోణంలోనే ఉంటుంది.దానికి కారణం తరంతో పాటు వచ్చే మార్పులు. ఆ మార్పులు ఎప్పుడు వెనుకటి తరానికి ఓ రకమైన ఎదురు తిరగడం లానే అనిపిస్తాయి.ఆ సున్నిత మనఃవిరుద్ధాలను సున్నితంగా చెప్పే కథ ఇది. ఈ సందర్భంలో తరం మారే కొద్ది ముందు తరంలో తాము ఎలా ఉన్నమో అన్న అంశం గురించి వెనుకటి తరాల వారు ఆలోచించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కథ ఇది. 

       పద్దెనిమిదో కథ ‘ఇనప పెట్టె.’ ప్రతి మనిషికి కుటుంబంతో, సమాజంతో సంబంధం లేకుండా కొన్ని అనుభూతులు-అనుభవాలు రహస్యంగా ఉంటాయి. వాటి ద్వారా వ్యక్తి తనతో తానే జీవిస్తాడు. వాటి గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసే కథ ఇది. ‘మనిషికి  అందరితో గడపటానికే కాదు, తనతో తాను గడపటానికి కూడా కొంత సమయం కావాలి. తనతో పాటుగా పెరిగే జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాల్లో కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలకి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉండరు. ఆ రహస్యాలని ఇంకొకరితో పంచుకోవాలని గానీ, చెప్పుకుని సంతోష పడాలని గానీ, బాధ పడాలని గానీ సామాన్యంగా అనిపించవు’, అని రచయిత ఈ కథలో రాశారు. 

     పంతొమ్మిదో కథ ‘జ్ఞాపకాలే ఓదార్పు.’ మనిషి తనను బాధ పెట్టే విషయాలను మర్చిపోయి తనకు సంతోషాన్ని ఇచ్చే విషయాలను, మనుషులను మాత్రమే గుర్తు పెట్టుకోవాలని అనుకుంటాడు. వాటి చుట్టూ ఉన్న దుఃఖాన్ని మర్చిపోదామని అనుకుంటాడు. సంతోషంతో పాటు దుఃఖం కూడా జ్ఞాపకాల్లో ఉంటుందని స్పష్టం చేసే కథ ఇది. 

    ఇరవయ్యో కథ ‘ఆరడుగుల గుంత.’ 

       ‘చావంటే అంతే! సచ్చినోళ్ళు తప్ప అందరూ ఉంటారు. అదే సావు. 

      అసలు చనిపోయినప్పుడు ఎందుకు ఎగరాలి? ఏడుస్తూ పుట్టి ఎంతో మంది నవ్వుకి కారణమైనందుకా? పడుతూ లేస్తూ నడిచి చివరకు పరుగెట్టినందుకా? పది మంది మెచ్చకపోయినా వందమంది మెచ్చేలా నడుచుకున్నందుకా? తోడబుట్టిన వాళ్ళకి తోడుగా ఉన్నందుకా? అంతో ఇంతో చదివి జ్ఞానం సంపాదించుకున్నందుకా? జ్ఞానాన్ని పోసి ఉద్యోగాన్ని కొనుక్కునందుకా? కొన్న ఉద్యోగాన్ని కరెన్సీతో కొలిచినందుకా? కరెన్సీ కాగితం ఎన్ని వేషాలేసినా దాని ప్రలోభళాకు లోబడకుండా దాన్ని పక్కనే ఉంచుకుని బంధాలను నిలుపుకున్నందుకా? కొన్ని బంధాలను తెంపుకున్నందుకా? ఎన్నో పుట్టుకల నడుమ ఉన్నందుకా? చావుని చివర తోసేసినందుకా? చివరకు సచ్చిపోయినందుకా? ‘ చావు గురించి రాసిన సందర్భంలో మనిషి జీవిత గమనంలో ఎలా ఉన్నందుకు చావును సంబరం చేసుకోవాలి అనే ప్రశ్నను ఇన్ని కోణాల్లో రచయిత సంధిస్తాడు. తండ్రి చనిపోయినప్పుడు కొడుకు మనోభావాలను ఈ కథలో ఒడిసి పట్టడంలో రచయిత సఫలీకృతులు అయ్యారనే చెప్పాలి. 

         బాహుదా నది చుట్టూ పక్కల ఉండే ఒక పది ఊర్లలో జరిగిన కథలు ఇవి. నది ప్రవాహం లానే మనిషి జీవిత ప్రవాహంలో ఉండే అనేక దశల్లో మనుషుల భావోద్వేగాలను పట్టుకునే కథలు ఇవి. ప్రేమ-పెళ్లి నడుమ ఉండే దశలు, తరాలు మారే కొద్ది మనుషుల్లో పెరిగే చాదస్తం, తమ పరిస్థితుల్లో ఒకలా,ప్రక్క వారి పరిస్థితుల్లో ఇంకోలా ప్రవర్తించే తీరు, బాల్యంలో ఏమి పట్టనితనం, ఆ బాల్యం కోల్పోయాక బాల్యం విలువ తెలుసుకునే పరిణతి వంటి అనేక అంశాలు ఈ కథల్లో కనిపిస్తాయి. ఇవి అనుభూతి ప్రధానంగా రాయబడిన కథలు ఇవి. ఈ కథలకు ముగింపు లేదు ఎందుకంటే అనుభూతులకు అంతం లేదు కనుక. మనిషి మనసులో అనుభూతులు-జ్ఞాపకాలు పదిలంగా ఉన్నంత కాలం ఇటువంటి కథలు పాఠకుల మదిలో కూడా అనుభూతులుగా మారుతూనే ఉంటాయి. మనసులో అనేక జ్ఞాపక కవాటాలను తెరిచే మంచి కథలను తన ప్రాంతీయ అనుబంధంతో రాసిన సుదర్శన్ గారికి ఈ సందర్భంగా అభినందనలు. 

  *        *     *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!