సంతోషానికి దూరంగా!
సంతోషానికి దూరంగా!
ప్రతి మనిషి జీవించడంలో తన చుట్టూ ఉన్న వాతావరణం,పెరిగిన నేపథ్యం,గడిపిన మనుషుల సాన్నిహిత్యాన్ని అనుసరించి ఓ పద్ధతిని అలవరచుకుంటాడు.ఆ జీవించే పద్ధతుల పట్ల మనుషులకున్న దృక్కోణాలు మారుతూ ఉంటాయి.మారుతున్న పరిస్థితుల్లో ఆ దృక్కోణాన్ని మార్చుకోగలిగేవారు కొందరు. ఆ పద్ధతిలోనే స్వేచ్చను,సంతోషాన్ని,జీవితపు అర్ధాన్ని వెతుక్కునే వారు కొందరు. మనిషి స్వేచ్చ ఎక్కువ శాతం మనిషి అభిప్రాయాలూ,జీవించాలనుకునే మార్గాలకు అనుసంధానం అయ్యి ఉంటుంది. అనూహ్యంగా మారిపోయిన జీవితంలో చిక్కుకుపోయి,తన జీవితపు పద్ధతుల నుండి దూరంగా విసిరివెయ్యబడిన స్త్రీ జీవిత కథే అత్తలూరి విజయలక్ష్మి గారి ‘బొమ్మ’ నవల. ఈ నవలలో ప్రధాన పాత్ర యోగిత మనసును స్పష్టపరచడానికి రచయిత్రి ఎన్నుకున్న వస్తువు ఓ బొమ్మ. ఆ ఒక్క బొమ్మ ద్వారా ఒంటరి మనిషి ఆలోచనలను,బాధలను,ఆమె మానసిక స్వరూపాన్ని వినూత్న పద్ధతిలో స్పష్టం చేశారు.
యోగిత తల్లి బాల్యంలోనే మరణించింది.తండ్రి హరినారాయణరావు. ఆమెను మేనత్త సుభద్ర తన కూతుళ్ళైన అరుణ,కరుణలతో సమానంగా పెంచింది. బాల్యం నుండి కుటుంబ ప్రేమల మధ్య,ఇంట్లో ఎప్పుడు మనుషులు,ఆ మనుషులతో మాట్లాడే వాతావరణంలో పెరిగింది యోగిత.సుభద్ర ఆదపడచు కూతురు పెళ్ళికి మేనత్తతో కలిసి షాపింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడ షోకేసులో ఉన్న బొమ్మను చూసి ఇష్టపడుతుంది యోగిత.ఆ షాపు యజమాని ఆ బొమ్మను యోగిత ఇష్టపడటం గురించి తెలుసుకుని ఆమెకు బహుమతిగా ఇస్తాడు.ఆ బొమ్మకు కడుపు వెనుక ఓ పలక లాంటి తలుపు ఉంటుంది.అది ఓ అల్మారాలా ఉంటుంది.ఆ బొమ్మ జీవితంలోకి వచ్చినప్పటి నుండి యోగిత దానితోనే ఎక్కువ సమయం గడిపేది.ఆ బొమ్మతో మాట్లాడేది.ఆ బొమ్మను మనిషిగా భావించి దానిని తన జీవితంలో ముఖ్య భాగంగా చేసుకుంది.
అలా ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆమెకు ఓ పెళ్లిసంబంధం వస్తుంది. కెనడాలో స్థిరపడిన భారతీయ కుటుంబ సంతతి అయిన గౌతమ్ అక్కడ డాక్టర్ గా స్థిరపడ్డాడు.అమెరికా సంబంధం అని మురిసిపోయి ఆ పెళ్లి చేశారు యోగితకు. అక్కడకు అలా వెళ్ళిన యోగిత కూతురు పుట్టాక ఎలాగో పదేళ్ళ తర్వాత కూతురితో కలిసి కుటుంబాన్ని చూడటానికి వచ్చినా,ఆమె వచ్చిన పది రోజులకే ఆమె అత్తామామలు యాక్సిడెంట్ లో మరణించడం వల్ల ఆమె వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె కూతురు భారతీయ కుటుంబ వ్యవస్థను పరిశోధనా అంశంగా ఎన్నుకుని తండ్రికి ఇష్టం లేకపోయినా భారతదేశానికి తాతయ్య దగ్గరికి వస్తుంది.యోగిత తన కూతురు ప్రేరణ వచ్చిన ఆరు నెలలకు ఇండియా వస్తుంది.అలా వచ్చిన ఆమె వచ్చిన మర్నాడే గుండె పోటుతో మరణిస్తుంది.ఆమె మరణంతో ఆమె తండ్రి,మేనత్త కుప్పకూలిపోతారు. యోగిత భర్త గౌతమ్ మాత్రం త్వరగానే నార్మల్ అయ్యి మరలా అమెరికా వెళ్ళిపోతాడు.ప్రేరణ మాత్రం తన రీసెర్చ్ అయిన తర్వాతే వస్తానని తండ్రికి గట్టిగా చెప్పి ఇండియాలో ఉండిపోతుంది.
అలా అక్కడ ఉండిపోయిన ప్రేరణకు సుభద్ర యోగిత చనిపోయే ముందు తనకు బొమ్మ ఇచ్చి దానిని ప్రేరణను ఇవ్వమని చెప్పడంతో దానిని ప్రేరణకు ఇస్తుంది.ప్రేరణ,సుభద్ర ఆ బొమ్మ పొట్ట వెనుక పెట్టెలో యోగిత రాసిన ఎన్నో చీటీలు కనిపిస్తాయి.ఆ చీటిల్లో తన జీవితం,తన ఆలోచనలు,తన బాధలు అన్నింటిని ఆ బొమ్మకు చెప్పే విధంగా రాసుకుంది యోగిత.ఆ బొమ్మకు యోగిత స్లీపి అని పేరు పెట్టి అదే పేరుతో దాన్ని సంబోధిస్తూ దానికి ఉత్తరాలుగా అవి రాసుకుంది. దాని ద్వారానే యోగిత పడిన బాధలను,ఆమె మనసును అర్ధం చేసుకున్నారు సుభద్ర,ప్రేరణ.
యోగిత పెళ్ళయిన తర్వాత మొదటిసారి దేశం కానీ దేశానికి,తనను ప్రేమించే మనుషులను వదిలి వెళ్లింది. అక్కడ ఆహార పద్ధతులు మొదలుకుని,వేషధారణ,మనుషులు మనుషులతో ఉండే తీరు వరకు అన్ని కూడా యోగితా బాల్యం నుండి పెరిగిన వాతావరణానికి పూర్తిగా విరుద్ధమైనవి. గౌతమ్ కు అంతకు ముందే ఓ చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది.కానీ గౌతమ్ తల్లిదండ్రులు భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె బాధ్యతగా ఉంటుందని,ఆమె కుటుంబాన్ని బాగా చూసుకుంటుందని,పిల్లలను బాగా పెంచుతుందని చెప్తారు.అతను ఈ వివాహం వల్ల ఉన్న లాభాలను గమనించి అప్పుడు యోగితను పెళ్లి చేసుకున్నాడు.
యోగితకు అక్కడి భోజనం పడదు.అన్నం,కూరలు వంటివి తనకు నచ్చినవి తినాలని అనుకున్న ఆరోగ్యంపేరుతో,క్యాలరీల పేరుతో ఏవి తినాలో ఏవి తినకూడదో అన్న నిబంధనలు కూడా గౌతమ్ పెడతాడు.ఆ తర్వాత అక్కడ వెస్ట్రన్ డ్రెస్సింగ్ కు అలవాటు పడటం కూడా యోగితకు కష్టమనిపోయింది. అంతే కాకుండా యోగితకు ఏదైనా తెలియకపోతే అది ఆమెకు చెప్పే ప్రయత్నం చేయడు గౌతమ్. గౌతమ్ కు భారతీయ సెంటిమెంట్స్ నచ్చవు. సగటు అమెరికన్ మనస్తత్వం అతనిలో ఉంది. అతనికి ఎవరికి వారు ఇతరులపై ఆధారపడకుండా,ఎవరితోనూ స్నేహం పెంచుకోకుండా తమదైన పరిధుల్లో జీవించడానికి ఇష్టపడతాడు.యోగిత దీనికి పూర్తిగా విరుద్ధం. మనుషులతో కలవడం,బంధుత్వాలు కలుపుకోవడం ఆమెకు నచ్చిన జీవితంలోని అంశాలు.
ప్రేరణ పుట్టే సమయానికి కూడా ఆమెను ఇండియా పంపలేదు గౌతమ్. ప్రేరణ పుట్టాక పిల్లలకు చిన్నప్పటి నుండి ఒకరిపై ఆధారపడకుండా ఉండటం నేర్పించాలని,నెలల పిల్లలకు సెపరేట్ బెడ్ రూమ్,పాప ఏడిస్తే తెలియడానికి ఓ మానిటర్ పెట్టించాడు గౌతమ్.పిల్ల ఏడవగానే ఎత్తుకోకూడదని ఏడ్చి ఏడ్చి పాపే నిద్రపోవాలని,అప్పుడే ఆధారపడకుండా ఉండటం అలవడుతుందని యోగితను తన బిడ్డను తనకు నచ్చేలా పెంచే స్వేచ్చను కూడా లేకుండా చేశాడు. తన కూతురు ప్రేరణ తండ్రిలా మెటీరియలిస్ట్ కాకూడదని యోగిత తపన. ప్రేరణకు గౌతమ్ లేని సమయంలో తెలుగు మాట్లాడటం నేర్పింది. ఏదో ఒక రోజు తన కూతురు భారత దేశంలో మనుషుల మధ్య స్థిరపడాలని అక్కడ వివాహం చేసుకోవాలని ఆమె కోరిక. యోగిత చిన్నప్పటినుండి అమెరికన్ మనస్తత్వంతోనే ఉన్నా కొంత తల్లి వల్ల ప్రవృత్తిలో భారతీయత ఉంది.భారతదేశం నుండి తిరిగి అమెరికా వచ్చాక కూతురు పరిశోధన కోసం తిరిగి స్వదేశానికి వెళ్తాననడం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. భర్తతో పోట్లాడి మరి ఆమె కూతురు వచ్చిన ఆర్నెల్లకు ఇండియా వచ్చింది.తిరిగి రాననే ఆమె అనుకుంది. అక్కడే మరణించాలని కూడా కోరుకునట్టు ఉంది.అలాగే మరణించింది. తల్లి గురించి తెలుసుకున్న ప్రేరణ బాధపడింది.
ఆ తర్వాత తల్లి చెప్పిన కోణంలో ఆలోచించసాగింది. ఆమె తన రీసెర్చ్ కోసం రెండు మూడు తరాలు ఉంటున్న కుటుంబాలకు వెళ్లింది. సుభద్ర,ఆమె భర్త శేషగిరి ఆమెను ఎంతో ఆప్యాయతతో ఆదరించారు. ఆ తర్వాత తండ్రికి తాను వెళ్ళిన విషయం మెసేజ్ చేసింది. కానీ తండ్రి నుండి సమాధానం లేదు.ఆ తర్వాతి రోజే తండ్రి డిస్ ప్లే లో తండ్రి ఇంకో స్త్రీతో ఉన్న ఫోటో కనపడటంతో తండ్రిని అడిగితే ఆమె తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ,ఇప్పుడు తను ఆమెతో లివిన్ రిలేషన్ లో ఉన్నానని చెప్తాడు. తల్లి మరణించిన వెంటనే అలా మారిపోయిన తండ్రి మనస్తత్వం అర్ధం చేసుకున్న ప్రేరణ భారత దేశంలో తాతయ్య కుటుంబంతోనే ఉండిపోవాలని నిర్ణయించుకోవడంతో నవల ముగుస్తుంది.
ప్రతి మనిషికి తాను కోరుకున్న పరిస్థితులతో ఉన్న జీవితం లభించదు.అప్పుడు కూడా ఉన్న పరిస్థితుల్లో తన స్వేచ్చను కొంతమేరకు కాపాడుకుంటూనే జీవించే ప్రయత్నం చేయలేకపోతే మనిషి ఎలా నలిగిపోతాడో,ఇమడలేని మనుషుల మధ్య,ప్రేమ లేని మనసుల మధ్య ఎలా చిత్రవధ అనుభవిస్తారో ఈ నవలలో యోగిత ప్రాణం లేని బొమ్మకు తన మనసును చెప్పుకోవడం స్పష్టం చేస్తుంది. హృద్యమైన నవల,స్పష్టమైన కథనం పాఠకులను ఈ నవలలో నిమగ్నులయ్యేలా చేస్తుంది.
* * *

Comments
Post a Comment