ప్రేమ అమ్మకం
ప్రేమ అమ్మకం
గంగుల నరసింహారెడ్డి గారి 'జీవన సమరం' నవల రెండేళ్ళ క్రితం చదివాను, సమీక్షించాను కూడా.అది దాదాపు ఐదు దశాబ్దాల క్రిందట రాసిన రచన. కొంత అసహనం, కోపం ప్రదర్శించిన నవల అది.ఈ మధ్య వచ్చిన ఆయన కథ 'కొనుక్కోవాలి' ఈనాడు ఆదివార పత్రికలో ప్రచురించబడింది.వాస్తవాన్ని నిష్ఠురంగా కాకుండా ప్రాక్టికల్ గా చెప్పడం ఈ కథకు ఓ ప్రత్యేకతను ఆపాదిస్తుంది.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించినట్టు, వారు తమ పిల్లలని ప్రేమించడం సహజం. తల్లిదండ్రులు వృద్దాప్యంలో పిల్లల నుండి ప్రేమను సహజంగా ఆశించడం జరిగేది అయినా, అది జరగని పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలో అన్న అంశం కేంద్రంగా రచయిత ఈ కథను రాశారు.నెమ్మదితనం, పరిష్కార దిశగా రాసిన కథ ఇది.
ముగ్గురు స్నేహితులు వృద్దాప్యంలో ఉన్నారు. వారిలో ఇద్దరు పిల్లలకి ఆస్తులు ఇచ్చి వారి ప్రేమ పొందలేక బాధపడుతున్నారు. ఆ సమయంలో మూడో మిత్రుడు మాత్రం ముందే ఆస్తులన్నీ తన దగ్గరే ఉంచుకుని, ఆ పిల్లలకు కొంత ఆసరా ఇచ్చి, ఆ పిల్లల భార్యలకు, పిల్లలకు బహుమతులు ప్రతి పుట్టినరోజు, పండుగకు, బయటకు వెళ్ళిన ప్రతి సారి ఏదో ఒకటి ఇస్తూ వారి ప్రేమను కొనుక్కోవాలని, అలానే తను చేస్తున్నానని చెప్తాడు.ఇది ఆర్ధిక బంధంగా మారిన తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకే తర్వాత ఇచ్చినా, ముందు నుండే వాటిని ఎలా ప్రేమకు పెట్టుబడిగా మార్చుకోవాలో కొత్తగా చెప్పే కథ ఇది. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ ఇది. అయ్యో!డబ్బుతో ప్రేమ కొనుక్కోవడమా అనే కోణంలో ఆలోచించడం కన్నా కూడా ప్రేమను పొందడం వరకే ఆలోచించడం ఉత్తమం అని స్పష్టం చేసే కథ ఇది.
ఆస్తుల కోసం పిల్లలు ప్రేమిస్తారు అనే నిజాన్ని అంగీకరించి, వారిని వదులుకోవడమా లేదా అన్నది నిర్ణయించుకుని, వారితో ఉండాలనుకున్నప్పుడు, వారి మార్గంలో ఎలా వెళ్ళాలి అని చెప్పే కథ ఇది. ఎమోషన్స్ కి విలువ లేని చోట ఎమోషనల్ గా మిగిలిపోయి బాధ పడే కన్నా, ప్రాక్టికల్ గా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కథ ఇది.
* * *

Comments
Post a Comment