ఊహలు -వాస్తవికత

 ఊహలు -వాస్తవికత

-శృంగవరపు రచన


మానవ సంబంధాల్లో ఉండే సాధారణత్వం, వైవిధ్యం, వైఫల్యం,ఉద్వేగం వంటి ఎన్నో అంశాలు భావాలకు, అభిప్రాయాలకు, వ్యక్తిత్వాలకు, అనుభవాలకు విస్తరిస్తూ మనుషుల జీవితాల్లో అలజడిని రేపుతూ ఉంటాయి. మనుషులు మనుషులతో ఉండే అనుబంధాల పట్ల స్పందించే తీరు విభిన్నంగా ఉంటుందన్న వాస్తవాన్ని అంగీకరించలేనితనం, అనుబంధ గాఢతను ప్రభావితం చేసే అంశాల గురించి ఆలోచించలేకపోవడం, భావాలకు-కలలకు , వాస్తవ అవసరాలకు మధ్య కుదరని సంధి గురించి ఆలోచించలేకపోవడము వంటి వాటి వల్ల స్త్రీ-పురుష సంబంధాల్లో వచ్చే మార్పులు, వారి మానసిక స్థితుల గురించి ఎస్వీ కృష్ణ గారు రాసిన కథల సంపుటి 'హలో.... మిసెస్ చక్రపాణి స్పీకింగ్..!'
ఈ కథల్లో మనుషుల జీవితాల్లో ఉండే బలహీనతలు,రెండు విభిన్న కోరికలతో యుద్ధం చేసే పరిస్థితుల్లో మనుషులు రాజీ పడిపోయే సంఘర్షణలు ఉన్నాయి.అలాగే మానవ సంబంధాల్లో ఉండే సంక్లిష్టత స్థాయి చిత్రణ కూడా ఈ కథల్లో ఉంది.
మొత్తం 13 కథలున్న ఈ పుస్తకంలో మొదటి కథ 'చివరి ఉత్తరం.' మామూలు పరిచయాల్లో, స్నేహల్లో లేని ఎన్నో ఇబ్బందులు స్త్రీ-పురుషల మధ్య ఉన్నప్పుడు మాత్రం ప్రత్యక్ష -పరోక్ష అభిప్రాయాలుగా మారిపోతాయి.ప్రేమకు, ఆకర్షణకు,అవసరంకు తేడా తెలిసినా అందులో తమకు ఏది ఇష్టమో అన్న దాని గురించి తెలిసినా సరే ఈ మూడు పదాల్లో ప్రేమకు పవిత్రతను మిగిలిన వాటికి అపవిత్రతను ఆపాదించడం ఎప్పటి నుండో స్థిరపడి పోయిన సూత్రం. ఈ కథలో ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమ అంటే అతను పెళ్ళి, జీవితాంతం కలిసి ఉండటం అనుకున్నాడు. ఆమె ప్రేమ అంటే సరదా, అవసరం అనుకుంది. పెళ్ళి తప్ప ఏదైనా పర్లేదు అని స్పష్టం చేసింది. ప్రేమ అంటే ఆమె దృష్టిలో సరదా, అవసరం. ఎప్పుడైతే అతను తనకు నచ్చని ప్రేమ దృక్కోణమైన పెళ్లిని అతను ఆమె ముందుకు తెచ్చాడో అప్పుడు ఆమె అతన్ని తిరస్కరించి ఆమెకు తగ్గట్టు ఉన్న ఇంకో వ్యక్తిని ఎన్నుకుంది. అది తెలిసిన అతను తన ప్రేమలోని గాఢతను స్పష్టం చేసేలా ఆమెకు ఓ ఉత్తరం రాసి, ఆత్మహత్య చేసుకున్నాడు. అది చదివిన ఆమె జీవితాన్ని అనుభవించడం చేతకాని వ్యక్తిగా అతన్ని భావించి, తనకు నచ్చిన వాడితో సాగియింది.ప్రేమ పట్ల మక్కువ ఉన్న ఇద్దరు ప్రేమ గురించి తాము నిర్వచించుకున్న అభిప్రాయ భేదానికి ఒక్కోలా స్పందించారు. ప్రేమ భావన ఆమెతో పాటు తనలో అంతమైందనుకున్న అతను జీవితాన్ని ముగించుకుంటే, ఆమె అది తనకు సంబంధించని ప్రేమ భావ వైఫల్యం కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు.
రెండో కథ 'ప్రేమించాను కానీ..'లో ప్రేమ, ఆర్ధిక భద్రత రెండు ఒకేసారి లభించవని తెలుసుకున్న ఓ స్త్రీ తాను ప్రేమించిన వ్యక్తిని కాదని ఆ భద్రత ఇవ్వగలిగిన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. జీవితంలో ప్రేమ సుఖాన్ని ఇచ్చే స్థాయి కన్నా భద్రత ఇచ్చే సుఖం, సంతృప్తి ముఖ్యంగా జీవితానికి అవసరం అనుకునే దృక్కోణం ఈ కథలో కూడా స్పష్టమవుతుంది.
ఇక వివాహితులైన వారి అంతరంగాలను ఆవిష్కరించే కథ 'పర్ఫెక్ట్ కపుల్.' ఈ కథలో సుశీల, చక్రపాణి భార్యాభర్తలు. వారిద్దరూ పెళ్ళికి ముందు ఇంకో వ్యక్తిని ప్రేమించినా సమాజపు హోదా, ఆర్ధిక భద్రతలను అనుసరించి ఆ అర్హతలకు సరిపోయే వ్యక్తులను వివాహం చేసుకున్నారు.దాని పట్ల వారికున్న అసంతృప్తి వారి మనసుల్లోనే ఉంచుకుని పెళ్ళి ఫోటో లోనే తమను తాము బిగించుకోవడానికి రోజు సంసిద్ధం అవుతూ ఉంటారు.మానసిక పవిత్రత వంటి అంశాలు కనపడనివి అవ్వడం వల్ల సామాజిక పవిత్ర జీవనంలో కలిసిపోతూ సాగిపోయే సాధారణ జంట కథ ఇది.
తన భార్య తనను ప్రేమించడం లేదనే అంశాన్ని ఓ భర్త ఎలా తెలుసుకున్నాడో చెప్పే కథే 'హలో... మిసెస్ చక్రపాణి స్పీకింగ్.!' మనుషుల జీవితాల్లో తీవ్రంగా ఉండే అసంతృప్తుల వల్ల అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.సంతృప్తి ఓ కోణంలో, అసంతృప్తి ఇంకో కోణంలో ఉండి, సంతృప్తిని ఇచ్చే కోణమే అసంతృప్తికి కారణమైతే సంతృప్తినిచ్చే అసంతృప్తి వైపు మరలడమే మనిషి సాధారణంగా చేసేది.
తన భార్యకు సరదాగా అపరిచితుడిగా ఫోన్ చేసిన భర్తకు తన భార్యకు గతంలో ఉన్న ప్రేమలు, సంబంధాలు తన పట్ల ఉన్న అసంతృప్తి గురించి తెలుస్తుంది. తను అందంగా ఉండకపోయినా తనను ఆమె పెళ్ళి చేసుకోవడానికి కారణం తన ఉద్యోగం, తన వల్ల వచ్చే హోదా మాత్రమే అని తెలుసుకున్న అతను ఆమెతో తన బంధాన్ని తెంచుకుంటాడు.
వాస్తవానికి వివాహ బంధాల్లో భార్యాభర్తలు ఒకరికి ఒకరు నచ్చకపోయినా సర్దుకుపోవడమే మంచిదన్న భావనతో ఉండిపోవటం సహజం. దానికి ఎవరో కారణం కాకపోయినా ఇష్టం లేని బంధం నుండి బయట పడలేకపోవడానికి కారణం మాత్రం ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటపడలేకపోవడమే. తాము బయట పడితే వచ్చే అభద్రతలు, భయాలు ఎక్కువ అని భావించడమే అ బంధ గాఢత నిలిచి ఉండటానికి కారణం.అది ఒప్పుకోలేకే మనిషి ఆ బంధం పట్ల బాధ్యత ఉన్నట్లు నటిస్తాడు కూడా. ఇటువంటి మానసిక అసంతృప్తిని స్పష్టం చేసే కథ ఇది.
పెళ్ళయిన స్త్రీ తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి తో స్నేహం పెంచుకోవడం, భర్తకు దొరికిపోవడం, అతన్ని ఇంటి నుండి గెంటడం 'పూర్ ఫెలో!' కథ. ఇదంతా జరిగాక ఆ భార్య ఆ పురుషుడితో మరలా ఆ బంధాన్ని కొనసాగించాలనుకున్నపుడు అతను ఆమెకు భర్త పట్ల తృప్తి లేదు కనుక అతనికి విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకోమంటే తాను వివాహం వల్ల వచ్చే భద్రతను కోల్పోనని, అలాగే వ్యక్తిగతంగా అతని వల్ల ఆనందం కూడా కావాలని స్పష్టం చేస్తుంది. అంకితభావం లేని ఆ బంధాన్ని అతను వదులుకుంటాడు. భద్రత, ప్రేమ ఒక చోట ఉండవా? వివాహంలో యాంత్రికత వల్ల ప్రేమ కనిపించకుండా పోతుందా అన్నది ఆలోచించాల్సిన అంశం.
డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు అని భావించే ఓ ధనవంతుడు అమ్మేవాళ్ళు ఉంటేనే అది సాధ్యం అని తెలుసుకోవడాన్ని స్పష్టం చేసే కథ కనువిప్పు. వాస్తవానికి డబ్బుకు దొరికేవి అన్ని కూడా ఆ డబ్బు కోసమే అన్న పరోక్ష వ్యాపార ఉత్పత్తిగా మారినవే.
ప్రేమించి తల్లి అభిష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న కొడుకు తల్లి అంగీకారం కోసం తన భార్యను ఒప్పించి ఆమెకు శారీరకంగా దూరంగా ఉంటాడు. చివరకు ఆ విషయాన్ని గ్రహించిన తల్లి కొడుకు, కోడలు గురించి అర్ధం చేసుకుంటుంది. మనిషిలో ఉండే తప్పు చేశామనే భావనకు పరిహారంగా తమను తాము శిక్షించుకోవడం వల్ల కొంత సంతృప్తి పొందే మనస్తత్వం ఈ 'ప్రత్యుషం'కథ స్పష్టం చేస్తుంది. దానిలో ఉండే అంకిత భావం, తల్లి బాధకు సమానంగా తాము బాధను అనుభవించడం ఓ రకమైన పరిష్కారం అవ్వవచ్చు, కాకపోవచ్చు. కానీ తప్పుకు ఏదో ఒక పరిహారo చెల్లిస్తున్న భావం కొంత మేరకు తప్పు వల్ల కలిగే భావనను తగ్గిస్తుంది.
మనుషులు ఇతరుల అవసరాల్లో తమ అవకాశాన్ని ఎలా వెతుక్కుంటారో స్పష్టం చేసే కథే 'అవసరం-అవకాశం.' తన కింద పని చేసే ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చే సాకు మీద అతని భార్యను ఓ రాత్రి అనుభవం కోసం అడుగుతాడు. ఓ సారి హోటల్ లో ఓ విటురాలితో యజమానికి కనపడితే ఆమెను అతని భార్యగా భావించి ఆమెను అడిగితే, ఆమె తన భార్య అని చెప్తాడు. వాస్తవానికి అతని భార్య పుట్టింట్లో పురిటికి వెళ్ళింది. తన భార్య కాదన్న విషయాన్ని ఆ ఉద్యోగి చెప్పలేదు. ఇక్కడ ఇద్దరు తమ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అవసరం అవకాశానికి ఎలా పెట్టుబడిగా మారుతుందో స్పష్టం చేసే కథ.
మేధస్సు ఉన్నా వ్యాపార ప్రజ్ఞ, డిమాండ్-సప్లై సూత్రం అన్వయంచుకోవడం తెలియకపోతే మేధ ఎలా నిరూపయోగం అవుతుందో స్పష్టం చేసే కథ 'ఇందనం.'కృత్రిమ పెట్రోల్ ను తయారు చేసిన ఓ సామాన్యుడు ఎలా ఈ వ్యాపార సంస్థల రాజకీయాలకు, దేశాల మధ్య ఏర్పడిన మేధయుద్దాల మధ్య నిలువలేక ఎలా ఎ గుర్తింపు లేకుండా మిగిలిపోయాడో ఈ కథ స్పష్టం చేస్తుంది. మనిషి వ్యసనానికి బలహీనుడైనప్పుడు తన బలహీనతను కప్పిపుచ్చుకుంటూ ఇంకా ఆ వ్యసనంలో ఎలా మునిగిపోతాడో గుర్రపు పందెపు వ్యసనంలో మునిగిపోయిన ఓ టీచర్ ద్వారా స్పష్టం చేసే కథే 'వ్యసనం.'
సీరియల్స్ ఇంట్లో గృహిణులను ఎలా వాటినే జీవితం అనుకునేలా చేస్తున్నాయో వ్యంగ్యంగా స్పష్టం చేసే కథ 'సీరియల్ వైరస్.' 'మతిమరపు' కథలో మతిమరపు వల్ల పుట్టే హాస్యాన్ని, ఇబ్బందులను స్పష్టం చేస్తూనే, మనిషి మతిమరపుకు కారణం మనిషి ఒక పని చేసేటప్పుడు ఇంకో పని ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం,ఏకాగ్రత లోపించడం వల్ల అని కూడా స్పష్టం చేసారు.
సెల్ ఫోన్ వచ్చిన కొత్త రోజుల్లో సెల్ ఉండటమే గొప్పగా భావించే పరిస్థితుల్లో ఓ సెల్ గొప్పకు తెచ్చుకుని ఇబ్బందులు పడిన వ్యక్తి కథను హాస్యంగా చెప్పేదే 'ఇంతేనయా... తెలుసుకోవయా!' కథ.
ఈ కథల్లో కలలు-వాస్తవాల మధ్య జరిగే సంఘర్షణ ఉంది. వాస్తవికత లో ఈ రెండు వ్యతిరేక భావాల మధ్య ఒకరు బాధపడటం, ఇంకొకరు సాధారణంగా భావించడం వంటి అభిప్రాయాలు జీవితాలను ప్రభావితం చేసే తీరును స్పష్టం చేయడము ఉంది. మనస్సులో జరిగిపోతూ, పైకి మాములుగా ఉండే భావాలకు రూపమే ఈ కథలు.
* * *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష