ఆమె -సిగ్గు
ఆమె -సిగ్గు
ఏ విషయాలకి భయపడాలో, ఏ విషయాలకి బాధ పడాలో , ఏ విషయాలకి దుఃఖించాలో, ఏ విషయాలకి సిగ్గు పడాలో అమ్మమ్మల కాలం నుండి విన్నది, అమ్మల కాలంలో తెలుసుకున్నది గ్రహిస్తూ పెరిగిన సుకన్య ఆ విషయానికి సిగ్గు పడటంలో ఆశ్చర్యం ఏముంది? క్రమేపీ ఆ సిగ్గు ఓ మోస్తరు దుఃఖంగా కూడా మారుతున్న క్రమం ఆమెకు తెలుస్తూ ఉన్నా, ఆ సిగ్గు-దుఃఖాలను మర్చిపోవడమే తప్ప వాటి మూలాలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఆమెకు ఎప్పుడూ ఉన్నట్టు తోచలేదు. ఆ లజ్జాపురిత సంఘటనను ఆమె మర్చిపోలేకుండా ఉన్నది, అలానే ఎవరితోనూ పంచుకోలేకుండా ఉన్నది.
ఈ మధ్య కాలంలో స్త్రీలు వయసుతో సంబంధం లేకుండా తమకు నచ్చినా అలానే తమకు సౌకర్యంగా అనిపించే దుస్తులనే ధరిస్తున్నారు. దానికి వారు సిగ్గు పడటం లేదు. కానీ సుకన్య ఎంత సమర్ధించుకుందామనుకున్న ఆమె మనసును సముదాయించుకోలేకపోతుంది.'అయినా అంత బుద్ధి తక్కువగా ఎలా ప్రవర్తించానా?' అని ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఆమె అనుకుంటూనే ఉంది.
ఆ భార్యాభర్తలు ఎవరో తనకు అప్పటి వరకు తెలియనే తెలియదు. అయినా తానేమి ఉద్యోగస్థురాలు కాదు. ఏదో చదువుకున్నా అది లెక్కలోకి రాదు. అలాంటప్పుడు తన భర్త అనుకోకుండా విద్యావంతులు, ఉద్యోగస్థులు అయిన భార్యాభర్తలను తనకు చెప్పకుండా ఇంటికి తెస్తే తానేమి చేయగలదు? ఎప్పటి లానే భర్త వచ్చాడనుకుని రోజు లానే నైటీలోనే వెళ్ళి తలుపు తీసింది. భర్తతో పాటు వారు కూడా కలిసి ఇంటికి వస్తారని తానేమైనా కల గన్నదా?అయినా ఇంత జరిగినా భర్తకు ఏం పట్టదే?
వచ్చిన వారికి కాఫీ ఇవ్వకుండా ఉంటే బావుంటుందా? అందులోనూ ఉద్యోగాలు చేస్తున్న వారు ఏదో లోకం నుండి ఊడిపడిన గొప్ప వారిలా తనకు కనిపిస్తారే! వారికి కాఫీలు, మంచి నీళ్ళు ఇచ్చేసినా తనకు అసలు విషయం స్పృహలోకి రాలేదు. ఆ స్పృహే ఉంటే తాను ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ? వారు ఓ రెండు గంటలు ఉన్నారే! ఆ మధ్యలో అతను, ఆమె ఎన్నో సార్లు నవ్వుతూనే మాట్లాడారే! ఆ నవ్వు సాధారణమైన నవ్వేనా లేక తనను చూసి నవ్వుకున్న నవ్వా? అసలు చూసి ఉంటారా? ఐదు పది నిమిషాలు అయితే చూడకపోవచ్చు కానీ తన మూర్ఖత్వం, సిగ్గులేనితనం వల్ల రెండు గంటలు వాళ్ళ ముందే ఉంటే చూడకుండా ఉండిపోవడానికి వారేమైనా గ్రుడ్డి వారా?
ఆ సమయంలోనే సుకన్యకు భర్తతో కలిసి భర్త స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పటి నుండి వారి ఇంటిని, ఆ ఇంట్లో సామాగ్రిని, ఆ ఇంట్లోని మనుషులను, వారు దుస్తులను, ఆఖరికి వారు భోజనం చేసేటప్పుడు వారి చేతి వ్రేళ్ళ కదలికలతో సహా తను గమనించిందే! మరి అటువంటప్పుడు ఎవరైనా అదే చేస్తారు కదా! అదే సహజం కదా!
ఆ రెండు గంటల్లో వారు ఇంటిని చూసినా,మహా అయితే ఖరీదైన సామాగ్రి లేదనుకుంటారు. ఇంకా శుభ్రత లేదనుకుంటారు. ఇటువంటివి అనుకున్నా పర్వాలేదు కానీ తనకు సిగ్గు లేదని అనుకున్నారేమో అన్న ఆలోచనే భరించలేకపోతుంది.
భార్య ఆ రాత్రి రోజులా సరదాగా ఉండకపోవడం గమనించాడు శేఖర్.
"ఎందుకలా అయిపోయావ్? నా ఫ్రెండ్ ను, అతని భార్యను నీకు చెప్పకుండా తీసుకువచ్చానని కోపం వచ్చిందా?"
ఆమె మౌనంగానే ఉండిపోయింది.
"ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా బైక్ టైర్ పంక్చర్ అయింది. ఆ సమయంలో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చారు. వాళ్ళిద్దరూ మా ఆఫీసులోనే పని చేస్తారు. ఇంటి దగ్గరకు వచ్చాక డ్రాప్ చేశారని ఇంటికి రమ్మని అన్నానే తప్ప నిజంగా వస్తారని అనుకోలేదు. నీకు ఫోన్ చేసే సమయం కూడా లేకపోయింది. ఇప్పుడు ఏం జరిగిందని?నాతో చెప్పు."
"ఏం చెప్పను? ఈ రోజు ఉదయమే కొత్త నైటీ తీసి వేసుకున్నాను. దానికి కుట్లు వేయించడం మర్చిపోయాను. మెడ క్రింద కుట్లు ఊడిపోతే పిన్నీసు పెట్టాను. రేపు కుట్టుకుందాములే అనుకున్నాను. ఈ లోపు మీరు వచ్చారన్న కంగారులో హడావుడిగా తలుపు తీస్తుంటే చేతుల దగ్గర కూడా కొద్దిగా చిరిగింది. నేను మీరే కదా అని పైన షాల్ కూడా వేసుకోలేదు. కానీ తీరా వారు వచ్చే సరికి నేను నైటీలో ఉన్నానని, ఆ నైటీకి ఉన్న ఒక్క చిరుగుకు ఉన్న ఒక్క పిన్నిసు బయటకు కనిపిస్తుందని, చేతుల దగ్గర కూడా కొత్తగా చిరిగిందని మర్చిపోయాను. వాళ్ళు ఉన్న ఆ రెండు గంటల్లో నాకు ఆ విషయాలే తట్టలేదు. ఇప్పుడు వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో? నాకు సిగ్గు లేదనుకోరు? పెళ్ళయి ముప్పై ఏళ్ళు దగ్గర పడి సరైన బట్టలు కూడా వేసుకోలేదని హీనంగా భావించరు...చెప్పండి...ఈ విషయం తల్చుకుంటేనే నాకే సిగ్గుగా ఉంది. వారు ఏమనుకున్నారో? అది ఆలోచిస్తూ ఉంటే ..... ఇంకా బాధగా కూడా ఉంది ...మీరు ముందుగానే చెప్పి ఉంటే చక్కటి చీర కట్టుకుని ముస్తాబై ఉండేదాన్ని కదూ!"
భార్య అమాయకత్వం అతనికి నవ్వు తెప్పించింది.
" టెన్నిస్ ఆడే స్త్రీలు షార్ట్ లు వేసుకుంటారు. మోడల్స్ అర్ధనగ్నంగానే ఉంటారు. అలాగే గృహిణులు కాలంతో పాటు మారారు. తమకు ఇంటి పనులతో సౌకర్యంగా ఉండే వాటినే ధరిస్తున్నారు.నువ్వు నీకు నచ్చిన నైటీ వేసుకున్నావు. దానికి ఓ చిన్న చిరుగు ఉంది, ఇంకో చిరుగుకు పిన్నిసు ఉంది. అలా నిన్ను చూసినంత మాత్రాన నీ విలువను, గౌరవాన్ని తూచే మనుషులు ఎవరు లేరు ఇక్కడ. నీ మీద వాళ్ళు ఏర్పర్చుకునే అభిప్రాయాలూ ఎలా ఉన్నా వారు నీ దగ్గరకు వచ్చి చెప్పే ధైర్యం చేయలేకపోతే వారిని నువ్వసలు పట్టించుకోనక్కర్లేదు.
అలా కాదని నీ వేషధారణ పట్ల నిజంగా నీకే అసంతృప్తి ఉండి ఇటువంటి ఆలోచనలు వస్తే అది ఎదుటి వారి దృష్టి దోషం కాదు, అదెక్కడో తప్పని, నీవు వేరేలా ఉండాలనుకుంటూ, కంఫర్ట్ కోసం ఇలా ఉంటున్నావని అర్ధం. నీకే నచ్చనిది ఎదుటి వారికి ఎలా నచ్చుతుంది అన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఇలా నిన్ను ఆలోచించేలా చేస్తేనే ఈ విషయం గురించి బాధ పడినా నువ్వు మారకపోతే అనవసరం. లేదా ఎవరో ఏదో అనుకుంటారని అలా ఉండాలనుకుంటే అది నీ జీవితంలో ఇంత చిన్న అంశంలో కూడా నీ స్వేచ్చను హరిస్తుంది.నీ ఇంట్లో నువ్వు నీకు నచ్చినట్టు ఉండే స్వేచ్చ ఉంటే ఎలా ఉంటావు అన్నది నీకు సంబంధించింది తప్ప సమాజానికి సంబంధించింది కాదు అని నా అభిప్రాయం.
సిగ్గు తప్పు చేస్తే కలగాల్సిన భావం తప్ప మనిషి తనలా తాను ఉన్నందుకు రావాల్సిన భావన కాదు. స్త్రీ సిగ్గును ఆమె శరీరానికి, ఆమె సౌందర్యానికి,ఆమె వ్యక్తిత్వానికి ముడి పెట్టే నేపథ్యంలో పెరిగిన స్త్రీలు ప్రతి చిన్న విషయానికి అవసరం ఉన్నా లేకపోయినా సిగ్గు పడుతూ తమ వ్యక్తిత్వాన్ని తామే తక్కువ చేసుకుంటారు. నువ్వు అలా ఉండకూడదు. నీకు నచ్చేది నువ్వు చేసినప్పుడు ఆ క్రమంలో ఏం జరిగినా దాని పట్ల పూర్తి అంగీకారం, మార్పు చేసుకునేలా ఉండు."
వ్యక్తిత్వ సౌందర్యానికి స్త్రీకి అనవసరమైన సిగ్గు ఎలా అడ్డు పడుతుందో సుకన్యకు కొంత అవగతమైంది. ఆమె సిగ్గు, దుఃఖం ఒకేసారి మాయమవకపోయినా కొంత ఆ వాతావరణానికి అనువైన ఆలోచనలు ఆమె మెదడులో నాటబడ్డాయి.
* * *

Comments
Post a Comment