జీవితం-ఆత్మగౌరవం

 

జీవితం-ఆత్మగౌరవం

           -శృంగవరపు రచన

                                                


                       కాలంతో పాటు స్త్రీ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తన ఉనికి గురించి, తనకు కుటుంబంలో ఉన్న విలువ గురించి ఆలోచించేలా ఆమె మనస్తత్వం ఏర్పడే క్రమానికి తల్లిదండ్రులు, విద్యా ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. సాధారణ మనిషిలో ఉండే లోపాలు, పరిస్థితుల ప్రభావానికి లోనవ్వడం ఆమెలోనూ ఉంది. కానీ ఏదేమైనా తనకు అంతిమంగా ఏం కావాలో అన్న అంశం పట్ల స్పష్టత తెచ్చుకోవడానికి, అందుకు ఇతరులను గమనించడానికి కూడా ఆమె సిద్ధంగానే ఉంది. స్త్రీ జీవితంలో కుటుంబ బాధ్యతలు మాత్రమే కాకుండా ఆమె స్పేస్ ఆమెను ఎలా జీవితాన్ని ఎలా అర్ధం చేసుకోవడానికి దోహదపడుతున్నాయో అన్న అంశాన్ని ధృడపరుస్తూ తటవర్తి నాగేశ్వరి గారు రాసిన కథా సంపుటి అమ్మాయి కోరేది. అంతేకాకుండా మనిషి స్వార్ధం అనే వలయంలో, ఎలా తిరుగుతూ ఉంటాడో, ఏది కోరుకుంటే అదే దక్కినా ఏది కోరుకోవాలో తెలియని ప్రలోభపరుల గురించి కూడా ఈ సంపుటిలో కథలు ఉన్నాయి.

                    మొదటి కథ అమ్మాయి కోరేది. పెళ్ళి అంటే ఒకప్పటి స్త్రీలకు ఉన్న దృక్కోణంలో నేడు ఎన్నో మార్పులు వచ్చాయి. పెళ్ళి అయ్యే వరకు అమ్మాయి చొరవ తీసుకోకూడదని, అత్తింట్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు నడచుకోవాలని ఒకప్పుడూ భావించేవారు. కానీ నేటి తరం అమ్మాయి తన వైవాహిక జీవితం గురించి, అక్కడ తను కొత్త మనుషులతో ఎలా మెలగాలి అన్న అంశం గురించి లోతుగా ఆలోచిస్తుంది. ఈ తరం అమ్మాయిలకు ఉన్న ఆ లోతైన ఆలోచనలను, దృక్పథాన్ని స్పష్టం చేసే కథ ఇది. ఈ కథలో ముఖ్య పాత్ర సంజన. ఆమె వివాహం చేసుకునే ముందు తాను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి కుటుంబంతో ఓ వారం రోజులు కలిసి ఉండాలని షరతు పెడుతుంది. దాని వల్ల ఎంతో మంది వెనుదిరిగినా ఆమెను ప్రేమించిన శ్రీధర్ మాత్రం దానికి ఒప్పుకుని ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ వారం రోజుల్లో శ్రీధర్ తన ఇంట్లో వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్న అంశాన్ని గమనిస్తుంది. అలాగే ఆ వాతావరణంలో తాను ఇమిడిపోవడానికి ఉన్న సానుకూలతను కూడా పరిశీలించాక అతన్ని వివాహం చేసుకుంటుంది. అత్తింట్లో ఒక అమ్మాయి ఓ కుటుంబంలోని అందరి మనస్తత్వాలను మెప్పించేలా ప్రవర్తించడం తేలికైన విషయం ఏం కాదు. అభిప్రాయ భేదాలు, వయసు వ్యత్యాసాలు, వ్యక్తిగత అలవాట్లు-అభిరుచులు ఇలా ఎన్నో ఆ అమ్మాయి మనసును అతలాకుతలం చేయవచ్చు. వాస్తవానికి ఇటువంటి ఏర్పాటు ఆచరణలో ఉంటేనే ఉమ్మడి కుటుంబాలు నిలబడే అవకాశం, అమ్మాయి తన జీవితంలో వైవాహిక జీవితానికి సిద్ధపడటం జరుగుతుందేమో! వరుడిని మాత్రమే చూసే వధువు కుటుంబం, ఆ కుటుంబం మొత్తం గురించి, తమ కూతురి మనస్థితి గురించి, ఆ కొత్త వాతావరణంలో ఇమడగలిగే నేర్పు గురించి కొంత ప్రోగ్రెసివ్ గా ఆలోచించాల్సిన అవసరాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది.

                    రెండో కథ అనుమానం. ఈ సమాజంలో విద్య మనుషులకు తమ వ్యక్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. వివాహమయ్యాక భార్యను అనుమానంతో వేధిసే ఆమె ఆ అనుమానాన్ని నిజం చేయడమో లేకపోతే అతన్ని వదిలి వేసి తన జీవితాన్ని గడపటమో చేస్తుంది. భర్త ఇంట్లో సోమరిగా ఉంటూ తనను అనుమానిస్తూ ఉంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఈ తరం స్త్రీ తన ఆత్మగౌరవం విషయంలో రాజీ పడటం లేదని ఈ కథ స్పష్టం చేస్తుంది.

                మూడో కథ అర్పణ. ఈ కథ కూడా స్త్రీ లైంగిక జీవితంలో ఓ విభిన్న కోణం నుండి రాయబడింది. స్త్రీ నాటి నుండి నేటి వరకు ఎంత ప్రగతి పథంలో పయనించినా వైవాహిక జీవితంలో భర్తతో తనకు ఉండే అనుబంధం పట్ల మాత్రం ఓ సొంత భావన ను ఏర్పరచుకుంటుంది. వివాహమయ్యాక ఆ భర్త అలా ఉన్న లేకపోయినా పిల్లలు పుట్టాక కుటుంబమే జీవితం అనుకుంటుంది. పిల్లలు కూడా భర్త తనను పూర్తిగా ప్రేమించినప్పుడే కనాలని అనుకున్న ఓ భార్య గురించి ఈ కథను రచయిత్రి రాశారు. స్త్రీ వ్యసనం ఉన్న భర్తలో ఉన్న మానవీయ దృక్కోణాన్ని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ స్త్రీ అతను తనతో పాటు మిగిలిన స్త్రీలతో కూడా సన్నిహితంగా ఉంటే తాను బిడ్డను కనకూడదు అనుకుంటుంది. ఆ తర్వాత అతనికి యాక్సిడెంట్ అవ్వడం, భార్య పట్ల అతని దృక్కోణంలో మార్పు రావడం, ఆమె బిడ్డను కనడం జరుగుతుంది. భార్యా భర్తల మధ్య పిల్లలు యాంత్రిక లైంగిక ప్రక్రియ వల్ల కాకుండా ఇద్దరి మనసుల్లో ఒకరి పట్ల ఇంకొకరికి అర్పణా భావం ఉండాలని ఈ కథ స్పష్టం చేస్తుంది.

             నాలుగో కథ దాడి. ఈ సమాజంలో ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల పట్ల మగ పిల్లలు యాసిడ్ దాడుల వంటి వాటికి పాల్పడుతుండటం కూడా మగ పిల్లలు రిజెక్షన్ ను ఓ అవమానంగా భావించడం వల్ల జరుగుతుంది. దానికి ప్రతిస్పందన హింసా రూపాన్ని తీసుకుంటుంది. అటువంటి వారి ఆలోచనల్లో మార్పు  రావాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కథ ఇది. ఆడ పిల్లల గురించి మగ పిల్లలు సహానుభూతి పెంచుకోవాలంటే వారింట్లో ఉండే తోబుట్టువులతో మంచి అనుబంధం ఉండాలని, వారి కోణంలో ఆడ పిల్లలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే వారిలో ధ్వంసాపూరిత ఆలోచనలు తలెత్తవని రచయిత్రి ఈ కథ ద్వారా స్పష్టం చేశారు.

        ఐదో కథ దారి తప్పిన మనిషి. మనిషి తోటి మనిషి ఆర్థిక స్థితి గతులను అనుసరించి ప్రవర్తించడం వల్ల మనిషి కుటుంబ అనుబంధాలకు ఎలా దూరమవుతాడో స్పష్టం చేసే కథ ఇది. డబ్బు అనేది అవసరాలకు ముఖ్యమే అయినా, కేవలం సంపాదన ఆధారంగానే వ్యక్తి విలువను లెక్క కట్టడం తప్పని, అన్ని డబ్బు కోసమే చేయాల్సినవి కావని, కొన్ని పనులు సమాజం కోసం చేసేవి కూడా అని, అటువంటి కార్యాల్లో చురుగ్గా ఉండేవారికి ప్రోత్సాహం అందించాలని స్పష్టం చేసే కథ ఇది.

      ఆరో కథ జాతర. జాతర సంవత్సరానికి ఓ సారి జరిగినప్పుడు జీవిత భాగస్వామిని మార్చుకునే కట్టుబాటు నేపథ్యం ఉన్న కథ ఇది. ఆ నేపథ్యంలో స్త్రీ పురుష బంధం ఎలా ఉంటుందో, స్త్రీ ఎంత గడుసుగా కూడా వ్యవహరించగలదో స్పష్టం చేసే కథ ఇది.

    ఏడో కథ కష్టే ఫలి. ఈ కథ ఓ విభిన్న కోణంలో రాయబడింది. ఇద్దరు అన్నదమ్ముల్లో అన్న మొదటి నుండి కష్టపడి చదివే వాడు. పెద్ద ఉద్యోగం, సంపాదనతో అమెరికాలో స్థిరపడ్డాడు. తమ్ముడు బద్ధకస్తుడు. మొదటి నుండి తమ్ముడిని అన్నతో పోల్చడం ఉండేది. తమ్ముడికి వివాహమవుతుంది. ఓ చిన్న ఉద్యోగంలో స్థిరపడతాడు. కానీ ఉద్యోగానికి సరిగ్గా వెళ్లడు. భార్యతో గొడవలు రావడంతో పిల్లలతో సహా ఆమె వెళ్ళిపోతుంది. ఈ సమస్యకు ఓ వినూత్న పరిష్కారం ఆలోచించిన అన్న, తన ఉద్యోగం పోయిందని భార్యాపిల్లలతో సహా తమ్ముడి దగ్గరకు వస్తాడు. అన్న విషయం తెలియగానే తమ్ముడు బాధ్యతగా ఉద్యోగం చేస్తాడు తర్వాత అన్న అతనికి తెలియకుండా రహస్యంగా పెట్టిన పెట్టుబడి వల్ల ఓ వర్క్ షాప్ లో పార్టనర్ గా ఎదుగుతాడు. తర్వాత అన్న నిశ్చింతగా విదేశానికి కుటుంబంతో వెళ్ళిపోతాడు. కుటుంబంలో ఉండే సామర్ధ్య పోలికల వల్ల ఎలా నైపుణ్యం ఉన్న వారు కూడా తమకు తగిన గుర్తింపు, విలువ లభించని స్థితిలో జీవితంలో వెనుకబడిపోతారో ఎలా జీవితాన్ని ధ్వంసం చేసుకుంటారో స్పష్టం చేసే కథ ఇది. పరోక్షంగా కుటుంబంలో పిల్లలను అందరిని ఒకేలా ఉండాలని ఆశించడం కూడా తప్పేనని, విభిన్న వ్యక్తిత్వాలను గౌరవించాలనే సున్నితమైన మందలింపు కూడా ఈ కథలో ఉంది.

       ఎనిమిదో కథ లీలా వినోదం. మనిషి ఏది కోరుకుంటే దేవుడు అదే ఇస్తాడని ఈ కథ ద్వారా రచయిత్రి స్పష్టం చేస్తూనే, మనిషికి తనకు ఏది అవసరమో  అన్న అంశంలో ఉండే గందరగోళం వల్ల సంతోషంగా ఉందలేడని కూడా సున్నితంగా చెప్పారు. ఓ కోటీశ్వరుడు రెండు వందల కోట్లతో దేవుడికి బంగారు కిరీటం చేయించిన రోజే అనారోగ్యం రావడం, వారంలో మరణించడం జరుగుతుంది. దేవుడి భక్తుడు ఇంకొకతను పేదవాడు.అనాధ అయిన అతనికి జీవితం ఇచ్చిన తండ్రి ఆరోగ్యం గురించే దేవుడిని కోరుకునేవాడు.అందుకే అతను సజీవంగా ఉన్నాడు అనారోగ్య సమస్యలు ఉన్నా. కోటీశ్వరుడు డబ్బు వృద్ది చెందాలని మాత్రమే కోరుకున్నాడు. అందుకే అది మాత్రమే అతనికి లభించింది.ఆ  తర్వాత అతని కొడుకు కొన్నాళ్ళ తర్వాత 500 కోట్లతో దేవుడి మంటపం కట్టించడానికి వస్తాడు. అతని తల్లి అనారోగ్యంగా ఉన్నా అతను దేవుడిని డబ్బు వృద్ది చెందడమే కోరుకుంటాడు. ఇలా మనిషి తనకు ఏం కావాలో కోరుకోవడంలో ఉన్న గందరగోళం వల్ల, మనిషి జీవితం కన్నా డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, అది అతనికి దక్కినా, జీవితం దక్కదన్న విషయం మాత్రం గ్రహించకుండానే జీవితం అంతమైపోతుంది. డబ్బు వ్యసనంగా మారిన సంస్కృతిలో మనిషి మారాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కథ ఇది.

          తొమ్మిదో కథ లేత మనసులు. బాల్యంలో మగ పిల్లలు  ఆకర్షిత ప్రభావాల వల్ల ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తే వారి జీవితాలు తారుమారయ్యేంత తీవ్రంగా స్పందించకూడదని, సున్నితంగా వారి తప్పు తెలుసుకునేలా చేయాలని స్పష్టం చేసే కథ ఇది. దీనికి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఆలోచించి పిల్లల ప్రవర్తనను సరిదిద్దేలా చూడాలని కూడా పరోక్షంగా ఈ కథ చెప్తుంది.

       పదో కథ నవ్వూ...నవ్వించు.యాంత్రికంగా, చిరాకుగా ఉండే జీవితంలో నవ్వు ఎంతో ప్రధానమైనదో, దాని వల్ల జీవితం ఎంతో సంతోషంగా మారుతుందో స్పష్టం చేసే కథ ఇది. పదకొండో కథ రెండో జీవితం. పేరు పొందిన స్త్రీ వాద రచయిత ఓ అభిమానితో సంబంధం పెట్టుకోవడం,ఆ తర్వాత భార్య ఒప్పుకోవడంతో ఆమెను ద్వితీయ వివాహం చేసుకోవడం జరుగుతుంది. భర్త పరువు కోసం ఆలోచించి, పెళ్లయ్యాక భర్త అవసరం లేనప్పుడు లేకపోవడం వల్ల బాధ పడ్డ ఆ స్త్రీ జీవితం ఎలా వ్యథాభరితం అయ్యిందో స్పష్టం చేసే కథ ఇది. స్త్రీలు వివాహం పేరుతో తమను తాము ప్రక్కన పెట్టి భర్త గురించి భర్త కోణంలో మాత్రమే ఆలోచిస్తే ఏమవుతుందో, స్త్రీ తన  గురించి స్వార్ధం కూడా కలిగి ఉండటం కూడా అవసరమే అన్న అంశాన్ని గట్టిగా చెప్పే కథ ఇది.

        పన్నెండో కథ ఋణానుబంధం. వివాహమయ్యాక భర్త చనిపోతే స్త్రీ తన పిల్లల కోసం మరో వివాహం చేసుకోకుండా ఉండిపోవటం అనేక సార్లు జరిగేదే. అలా ఉండిపోయిన సుమిత్ర తన దగ్గర పని చేసే వసుంధర భర్త మరణించాక ఆమెను ప్రేమించే వ్యక్తితో వివాహం జరిపిస్తుంది.పిల్లల బాధ్యతలు నిర్వర్తించాక ఆమె కొన్నాళ్ళకే మరణిస్తుంది. తల్లి గురించి తెలిసినా తల్లి ఓ అపరిచితుడు తనకు తలకొరివి పెట్టాలని కోరడం, తన ఇల్లు తన తదనంతరం అతనికే చెందాలని డైరీలో రాయడం చూసిన ఆమె కూతుళ్ళు ఆ వ్యక్తి పట్ల తల్లికి ఉన్న సంబంధాన్ని అనుమానిస్తారు. చక్రవర్తిని కొడుకుగా ఆదరించి తల్లి చేసిన మేలు తెలిసినప్పుడు వారు సిగ్గు పడతారు. స్త్రీ ఎంత సంపాదించినా, ఆమెకు ఓ తోడు ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూనే, స్త్రీ జీవితం చుట్టూ సమాజం విధించే సంకుచితపు వలయాన్ని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది. వాటిని ఛేదిస్తేనే స్త్రీ సంతోషంగా ఉండగలదని, స్త్రీకి తల్లిగా ఇల్లాలిగా మాత్రమే కాకుండా తనకంటూ ఓ జీవితం ఉందని గుర్తు పెట్టుకోవాలని లేకపోతే ఆమె ఒంటరిది అయిపోతుందని ఈ కథ స్పష్టం చేస్తుంది.

         పదమూడో కథ సమంతరాలు. మారే కాలంతో పాటు భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న ఇగో క్లాషెస్ వల్ల కాపురాన్ని వదిలేయకూడదని, చిన్న సమస్యలను సామరస్యంగా ఆలోచించి పరిష్కరించుకోవాలని, విపరీతమైన సెన్సిటివిటీ కూడా భార్యాభర్తలకు మంచిది కాదని, ప్రేమ-గౌరవం ఉన్న చోట చిన్న చిన్న విషయాల్లో సర్దుకు పోవడం మంచిదేనని ఈ కథ స్పష్టం చేస్తుంది.

      పద్నాలుగో కథ అమ్మ ప్రేమ. భార్యాభర్తలు ఉద్యోగస్థులై పిల్లల గురించి పట్టించుకోకపోతే పిల్లలు ఒంటరితనంతో ఎలా వ్యసనాల పాలవుతారో, అటువంటి సమయంలో తల్లి ప్రేమే గొప్ప ఔషధం అని, తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయించాలని, వారి అభిరుచుల పట్ల శ్రద్ధ వహించాలని ఈ కథ స్పష్టం చేస్తుంది. పదిహేనో కథ మాంగల్యం...ఒక తంతేనా?’ వివాహం ముందు ఉన్న ప్రేమల కన్నా వివాహం అయ్యాక ఏర్పడే బంధం వల్ల వచ్చే ప్రేమలో బాధ్యత,అనురాగం ఉంటాయని, అవి వివాహ పూర్వ ప్రేమలను మరిచిపోయేలా, వాటిని ఓ జీవిత అనుభవంలా మాత్రమే చూడగల దృష్టిని వచ్చేలా మనస్తత్వ పరిణతి కలిగేలా చేస్తాయని ఈ కథ స్పష్టం చేస్తుంది.

       నాగేశ్వరి గారి కథల్లో విలువలను మర్చిపోకూడదు అన్న భావనతో పాటు వ్యక్తి తన స్వేచ్చను కూడా కోల్పోకూడదు అన్న రెండో కోణాన్ని కూడా బలపరిచారు. స్త్రీ తన గురించి తాను ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని కూడా రచయిత్రి తన కథల్లో స్పష్టం చేశారు. స్త్రీ తన ఎమోషన్స్ ను అర్ధం చేసుకుని, తనకు ఏది మేలు చేస్తుందో అన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోతే జీవితంలో కోల్పోయిన భావన తలెత్తుతుందని కూడా పరోక్షంగా చెప్పారు. అలాగే సమాజంలో  డబ్బు వల్ల వచ్చే గుర్తింపు సౌఖ్యాల కోసం కుటుంబాన్ని, మనిషిగా మనిషిగా చూడాల్సిన అవసరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని కూడా రచయిత్రి కొన్ని కథల్లో స్పష్టం చేశారు. ఆలోచనల పట్ల స్పష్టతతో కథలు రాస్తున్న రచయిత్రికి ఈ సందర్భంగా అభినందనలు.

  *            *        *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!