ఉత్సాహం ఉన్నవాడు

 ఉత్సాహం ఉన్నవాడు

-శృంగవరపు రచన


భారతీయ ఆంగ్ల రచయితల్లో ఎందరో చక్కగా రాస్తున్నారు.ఈ మధ్య భారత రచయితల్లో ఆంగ్లంలో రాసేవారిలో యువతకు చేతన్ భగత్ మాత్రమే తెలిసిన రోజుల నుండి ఎందరో కొత్త రచయితల రచనల గురించి తెలుసుకునే అవకాశం ఎన్నో పుస్తకాల వల్ల కలిగింది. ప్రస్తుతం దుబాయ్ లో స్థిరపడిన హైదరాబాద్ ఆంగ్ల రచయిత సుహాస్ ఇనామ్ దార్ గారి ఆంగ్ల నవల 'Return Journey Of a stranger' స్ఫూర్తినిచ్చే నవల.
మనిషి ఉత్సాహానికి ఓ శక్తి ఉంటుంది. తెలియనిది తెలుసుకోవాలన్న ఆసక్తి మనిషిని ఎంత శక్తిమంతుడిని చేస్తుందో ఈ నవల స్పష్టం చేస్తుంది. సుహాస్ రచనల్లో మోటివేషన్ ప్రధానంగా ఉంటుంది.
ఈ నవలలో ప్రధాన పాత్ర చందు. ముంబైలోని సవంత్ వాడి స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగిన చందుకు 12 ఏళ్ళు. తల్లి, తండ్రి, చెల్లి అతని కుటుంబం.చందు తండ్రికి కొంత కాలం క్రితం మిల్లులో చేస్తున్న పని వల్ల, తల్లి ఇళ్లల్లో పని చేసి సంపాదించే ఆదాయం మీదే కుటుంబం గడిచే పరిస్థితుల్లో ఉండటం వల్ల చందుకు చదువు చెప్పించలేపోతారు. చందు తండ్రికి తర్వాత ఉద్యోగం వచ్చినా అప్పటికే చందు వయసు ఎక్కువ ఉండటం వల్ల అతను చదువుకునే ఆలోచనను విరమించుకుంటాడు.చందు తల్లిదండ్రులు నైతికత డబ్బు కన్నా ప్రధాన అంశంగా భావించే వ్యక్తులు.అదే ప్రాంతంలో నివసించే ఓ చిన్న కాంట్రాక్టర్ ముకుందిలాల్ కొడుకు కుందన్. బీడీలు కాల్చడానికి అలవాటు పడిన కుందన్ కొన్నిసార్లు ఇంట్లో దొంగతనం చేసి తన సరదాలు తీర్చుకున్నా, అది సాధ్యపడకపోవడం వల్ల తాగుబోతులను దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. చందు కుందన్ చెప్పింది విని కుందన్ ఎలా దొంగతనం చేస్తాడో చూద్దామని వెళ్తాడు. ఓ వ్యక్తి తూలుకుంటూ నడవటం చూసి అతను తాగి ఉంటాడని అనుకున్న కుందన్ అతన్ని లక్ష్యంగా ఎన్నుకుని అతని వైపుకు చందుతో కలిసి వెళ్తాడు.అతన్ని దోచుకుందామని కుందన్ ప్రయత్నం చేయడం అప్పటికే అతను ముందుకు కుప్పకూలి పడిపోవడం జరిగుతుంది.అప్పటికే అతన్ని ఎవరో పొడుస్తారు.అతన్ని కాపాడే ప్రయత్నంలో అతన్ని పొడిచిన కత్తిని చందు బయటకు తీస్తాడు. ఆ వ్యక్తి మరణిస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముకుందిలాల్ జరిగింది తెలుసుకున్నాక, చందు దగ్గర కత్తి ఉండటం వల్ల అతన్నే నేరస్థుడిగా భావిస్తారని పారిపొమ్మని సలహా ఇవ్వడంతో, భయంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఓ రైలెక్కి ఢిల్లీ వస్తాడు చందు.
తెలియని ప్రాంతంలో చందు జీవిత పయనం మొదలవుతుంది.ఆ రైల్వే స్టేషన్ లో ఓ ఫుడ్ స్థాల్ నడుపుతున్న యజమాని చందు పరిస్థితి తెలుసుకుని జాలిపడి తన దగ్గర పనిలో పెట్టుకుని తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు.ఆ యజమాని కొడుకు ప్రతాప్. అతను చదువుకుంటున్నాడు.మూడేళ్ళు అక్కడ పని చేసాక ఓ రోజు యజమానికి అనుకోకుండా స్థాల్ లో జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల పక్షవాతం రావడం, అతను మంచానికే పరిమితమైపోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఇంటికి దగ్గరలో ఓ చిన్న స్థలంలో చిన్న టీ మరియు టిఫిన్ సెంటర్ తెరుస్తారు. ప్రతాప్ చదువు మానేసి కౌంటర్ దగ్గర ఉంటే, పనులు చందు చూసుకునేవాడు.ప్రతాప్ చందును అవమానించేవాడు.
వైద్యరీత్యా యజమాని, అతని భార్య మూడు నెలలు వెళ్లడం, ప్రతాప్ తో చందు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది.ఒక్కసారిగా వచ్చిన స్వేచ్చ వల్ల ప్రతాప్ తాగుడికి అలవాటు పడతాడు. రోజు ఈ హోటల్ కు వచ్చే మాతుర్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ చందు పని పట్ల చూపే ఉత్సాహం, అంకిత భావం నచ్చి అతనికి ఏదైనా సాయం కావాలంటే తనను సంప్రదించమని తన కార్డు ఇస్తాడు. ప్రతాప్ అవమానాలు భరించలేని స్థాయిలో ఉండటంతో అక్కడి నుండి బయటకు వచ్చి మాతుర్ ని కలుస్తాడు. మాతుర్ చందును తన ఆఫీస్ బాయ్ గా చేర్చుకుంటాడు.స్టాఫ్ క్వార్టర్స్ లో ఉంటాడు. మాతుర్ సలహాపై చదువుకుని టెన్త్ క్లాస్ పాసవుతాడు. అక్కడి నుండి తన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీ సిఈఓ స్థాయికి ఎదుగుతాడు. అదే సమయంలో తాను ఎ హత్య వల్ల తన వారికి దూరం అయ్యాడో ఆ హత్యకు గురయ్యింది మాతుర్ తండ్రి అని తెలిసేసరికి షాక్ అవుతాడు.
చందు పుట్టి పెరిగిన స్లమ్ ఏరియాను ధ్వంసం చేసి వేరే వెంచర్ చేయడానికి ఉన్న అనుకూలతను అంచనా వేయడానికి చందును మాతుర్ అక్కడికి పంపుతాడు. తను నిర్దోషి అని ఈ సమయంలో నిరూపించుకోకపోతే ఇక ఎప్పటికి తాను తన జీవితంలో భయాన్ని జయించలేనని నిర్ణయించుకున్న చందు ఆ రోజు అక్కడ తనతో పాటు ఉన్న కుందన్,ముకుందిలాల్ లను కలుసుకుంటే తనను నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని భావించడం,ముకుందిలాల్ యాక్సిడెంట్ లో చనిపోబోతుంటే హాస్పటల్ లో చందు చేర్పించి, మేజిస్ట్రేట్ ను అభ్యర్థించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి తీసుకువెళ్తే, ముకుందిలాల్ ఆ హత్య తానే చేసానని, తనకు కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం వల్ల కక్షతో తానే హత్య చేసానని చెప్తాడు. కోర్టు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మొత్తానికి చందు నిర్దోషిగా బయటపడతాడు.మొత్తానికి అతని జీవితంలో ప్రశాంతత వచ్చినా ఆ స్లమ్ కూల్చడానికి అక్కడి వారు ఒప్పుకోకపోవడం,చందు కూడా సముఖంగా లేకపోవడం వల్ల చందును కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ కింద మాతుర్ అక్కడ స్లమ్ ను పూర్తిగా అభివృద్ధి పరిచేలా, వారికి విద్యా వైద్య సహకారం అందించేలా బాధ్యతలు అప్పగించబడతాయి. సంపూర్ణ విద్య లక్ష్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడు చందు.
చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోయినా ఉత్సాహం ఉన్న చందు తర్వాత చదువుకోవడమే కాకుండా రోజు కొంత సమయం ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవడం ఓ అలవాటుగా చేసుకున్నాడు. అతనిలోని ఆ ఉత్సాహమే అతన్ని జీవితంలో ఎన్నో సాధించేలా చేసింది.చదవడంలో ఓ ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహం మనిషిలో కొత్త ఆలోచనలు, కొత్తదనాన్ని నింపుకునేలా చేస్తుంది. అటువంటి ఉత్సాహవంతుడిని ఏ అడ్డంకి ఎక్కువకాలం అడ్డుకోలేదు.అటువంటి ఉత్సాహం పాఠకుల్లో నింపడమే ఈ నవల లక్ష్యం.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ