జీవితం విలువ

 జీవితం విలువ

-శృంగవరపు రచన



తెలుగు నవలా సాహిత్యంలో కొమ్మూరి వేణుగోపాలరావు గారిది విశిష్ట శైలి. మనిషి ఆలోచనలకు,ఊహలకు,కప్పిపుచ్చుకునే ధోరణులకు,మనిషిలోని అస్థిరత్వాన్ని,ఇలా మనిషి తనకు తానుగా తనను చూసి భయపడే ఎన్నో అంశాలను ఆవిష్కరించే ఆయన రచనలు పాఠకులను ఏదో రకంగా ఆమోదించడానికో లేక తిరస్కరించడానికో ప్రేరేపిస్తాయి. మనిషి తనకు నచ్చింది చేయలేకపోవడానికి ఎన్ని కారణాలను వెతుక్కుని అందులో సంతృప్తి పడుతూ అసంతృప్తిలోని శాంతితో తాను చేయలేని దాని పట్ల ఉన్న అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడో స్పష్టం చేసే నవలే కొమ్మూరి వేణుగోపాలరావు గారి ‘సూర్యుడు దిగిపోయాడు.’
ఈ నవలలో రెండే ముఖ్య పాత్రలు. అనంతమూర్తి,రాఘవ. ఈ ఇద్దరు స్నేహితులు. వీరిద్దరి జీవితాలు,వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో స్పష్టం చేస్తూ ఈ సమాజంలో ఉన్న రెండు వర్గాల వ్యక్తుల గురించి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు రచయిత. అనంతమూర్తి,రాఘవ చిన్ననాటి నుండి స్నేహితులు. బాల్యం నుండే అనంతమూర్తికి పుస్తకాలంటే ఇష్టం. రాఘవకు సంగీతం అంటే ఇష్టం.
రాఘవ జీవితం పట్ల కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకున్నాడు. తల్లిదండ్రులను గౌరవించడం,వారిని బాధ పెట్టకుండా ఉండటం,వారికి ఇష్టమయ్యేట్టు ప్రవర్తించడం అతను మంచి జీవితాన్ని వచ్చేలా చేస్తుందనే నమ్మాడు. అతనికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తితో మొదట పిల్లన గ్రోవి వాయించాలనే కోరికను తల్లిదండ్రుల కోసం వదిలేశాడు.ఓ సారి తల్లిదండ్రులు తీర్ధయాత్రలకు వెళ్ళిన సమయంలో అతను మరలా వాయించాడు. అది విని అతని పక్కింట్లో ఉన్న సీత అనే అమ్మాయి అతన్ని ఇష్టపడింది. రాఘవ కూడా ఆమెను ఇష్టపడ్డాడు. అదే ఆమెకు చెప్పాడు.ఆ తర్వాత తల్లిదండ్రులు తిరిగివచ్చారు. తండ్రి మరలా పిల్లన గ్రోవిని వాయించవద్దని హెచ్చరిస్తే తాను చేసింది తప్పని భావించి దానిని పెట్టెలో పెట్టేశాడు. అలాగే తల్లో సీతతో మాట్లాడటం,ప్రేమించడం తప్పని చెప్తే తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని చెప్పి ఆమెకు అదే స్పష్టం చేశాడు. మొత్తానికి డిగ్రీ చదివి మొత్తానికి గుమాస్తా ఉద్యోగం సంపాదించాడు.
అనంతమూర్తి తన జీవితం తనదే అని నమ్మేవాడు. తనకు నచ్చేది,తనకు ఏర్పడిన వాస్తవికత నుండి నమ్మిన జీవితమే తనదని నమ్మిన వాడు. అందుకే సాహిత్యం చదువుతూ ఇంటర్ తప్పినప్పుడు చదువు మానేసి ఓ ప్రెస్ లో కంపోజిటర్ గా చేరాడు. ఆ తర్వాత ప్రూఫ్ రీడర్ గా,సబ్ ఎడిటర్ గా,ఆ తర్వాత ఎడిటర్ గా కూడా ఓ పత్రికకు ఎదిగాడు. రచయితగా కూడా ఎదిగాడు. ఇది జరిగే క్రమంలో తల్లిదండ్రుల నిరసనను ఎదుర్కున్నాడు. అతన్ని అభిమానించి ప్రేమించిన వసంతను వివాహం చేసుకున్నాడు.తల్లిదండ్రులతో చెప్పి వేరు కాపురం పెట్టుకున్నాడు.అలాగే అందరి భార్యల్లా వసంత కూడా తన భార్య ప్రతి సాయంత్రం త్వరగా ఇంటికి రావాలని,తనతో సరదాగా గడపాలని ఆశపడినప్పుడు తనకు తన విధి నిర్వహణ ముఖ్యమని చాలా కచ్చితంగా స్పష్టం చేస్తాడు.అలాగే ఏ విషయంలోనూ కూడా మొహమాటంగా ఉండడు. కానీ స్పష్టత కలిగి ఉంటాడు.
రాఘవకు లక్ష్మీతో వివాహం అయ్యింది. రాఘవకు ఉన్న తత్వం తన జీవితాన్ని కేవలం తన కుటుంబానికి మాత్రమే పరిమితం చేసుకోవడం. తన భార్యకు ఒంట్లో బాగా లేకపోయినా,తన నలుగురు సంతానంలో ఎవరికి బాగోలేకపోయినా,ఏ చుట్టాలింటికి వెళ్లాలన్నా మొత్తానికి సెలవులు పెడుతూనే ఉన్న రాఘవ అంటే యాజమాన్యానికి సదభిప్రాయం లేకపోవడం అతను ఎన్నేళ్లు గడిచినా గుమస్తాగానే మిగిలిపోయాడు. అతను పెద్ద కొడుకు సిగరెట్లు కాల్చినప్పుడు అతన్ని కొడతాడు.అతను ఇంటికి రాకపోయేసరికి భయపడి పేపర్లో వేయించి హామీ ఇస్తాడు. ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత కూతురు విమల అన్య మతస్తుడిని ప్రేమించి నెల తప్పితే ఆ పెళ్ళికి ఒప్పుకోడు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేయడం,ఆ తర్వాత ఆమెకు రిజిస్టర్ మ్యారేజ్ ప్రేమించిన వ్యక్తితో జరగడం జరిగిపోతుంది. సీత వివాహం చేసుకున్న అతను సీత ప్రోత్సహాంతో గొప్ప పిల్లన గ్రోవి వాయుధ్య కారుడిగా ప్రసిద్ధి పొందుతాడు.
రాఘవ భార్యకు క్యాన్సర్ రావడం,రాఘవ రిటైర్ అవ్వడం,ఇంటిని తాకట్టు పెట్టి భార్యకు వైద్యం చేసే ప్రయత్నం చేసినా ఆమె మరణించడం,రాఘవ పిల్లలు తండ్రి ఇల్లు,ఆస్తులు లేకుండా చేయడం పట్ల నిందించడంతో బాధ పడతాడు రాఘవ.తన పిల్లల కోసం తాను జీవించినప్పుడు వారు అలా ఉండటం ఎంతవరకు సమంజసం అని అనంతమూర్తిని అడిగితే,పిల్లల పట్ల చేసింది బాధ్యత కానీ దానికి ప్రతిఫలం ఆశించడం మూర్ఖత్వం అని చెప్తాడు స్నేహితుడు.
అనంతమూర్తి రాసిన ఓ నవల సంచలనమవుతుంది.స్త్రీలు మొదట్లో విమర్శించినా తర్వాత అతను నిజాయితీగా రాసిన పద్ధతికి అతనికి పాఠకులు అభిమానులవుతారు. ఆ తర్వాత ఆ పత్రిక యజమాని ఆ పత్రిక అతనికి అప్పగించి మరణిస్తాడు. ఆ తర్వాత ఇందిరాగాంధి కాలంలో వచ్చిన యమర్జెన్సీ వల్ల జైలులో తన రాతల వల్ల దానిని స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతను తిరిగి వచ్చాక పత్రిక నుండి రిటైర్ అయ్యి,బుద్ది పుట్టిన చోటుకు పోతూ,కుదిరినప్పుడు నవల రాసుకోవాలని నిర్ణయించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అలా అతను కన్యాకుమారిలో రాక్ కాసిల్ దగ్గర రాఘవను కలుస్తాడు. తాను జీవితాన్నే తన అజ్ఞానంతో చేజార్చుకున్నానని బాధపడతాడు రాఘవ.
జీవితంలో సాధారణంగా ఈ రెండు రకాల మనుషులే ఉంటారు. తమకు నచ్చిన దానిని గురించి తెలుసుకున్నా, సమాజంలో ఇమిడిపోయే ప్రయత్నాన్ని కుటుంబంతో మొదలు పెట్టి,దాని కోసమే శ్రమిస్తూ,తాము చేసిన దానికి తమ పిల్లలో లేదా సమాజమో గుర్తింపు ఇవ్వలేదని,దానిలో తమ ప్రత్యేకత,త్యాగం చూడలేదని బాధపడే వారు. ఇంకో వర్గం కూడా అదే సమాజంలో జీవిస్తూ,అదే పరిస్థితులు ఎదురైనా వాస్తవాన్ని వాస్తవంగా చూసుకుంటూ,జీవితాన్ని చేజారనీయకుండా జీవించేవారు.ఈ రెండు రకాల మనుషుల జీవిత సరళిని రచయిత రెండు పాత్రలను ప్రతినిధులుగా తీసుకుని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకో శైలిలో ఇదే రకాన్ని తనకు నచ్చిన ప్రతినిధి పాత్ర జీవితం చుట్టూ కథను నడిపిస్తూ చెప్పే శైలి.ఆ శైలిలో కథను పక్షపాతం లేకుండా నడపటం కత్తి మీద సాము లాంటిది. ఈ నవలలో అనంతమూర్తి పాత్ర సంభాషణలు పాఠకులను ప్రశ్నిస్తున్నట్టే ఉంటాయి.
వ్యక్తిత్వం-విలువలు-కుటుంబ,సమాజ విధేయత,అభిరుచులు,అభిప్రాయాలూ మధ్య ఇరుక్కుపోయి సతమయ్యే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!