అంతర్ముఖ అంతరంగం

 అంతర్ముఖ అంతరంగం

-శృంగవరపు రచన




‘మనిషి సమాజ వాస్తవాలతో నెరిపే క్రియాశీల పాత్ర నుండి కవిత్వం ఆవిర్భవిస్తుంది’, అన్నారు క్రిష్టోఫర్ కాడ్వెల్. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లయిన్ కాలనీలో పెరగడం వల్ల, అక్కడి బొగ్గుబాయిల చుట్టూ అల్లుకున్న జీవితాలను అనుభవపూర్వకంగా గమనించడం వల్ల మధుకర్ వైద్యుల గారి కవితల్లో ఈ పెరిగిన సమాజపు వాస్తవికత, ఆ తర్వాత జర్నలిస్టుగా అధ్యాయనశీలిగా మారిన తర్వాత సమాజ స్వరూపంలోని సమస్యల నుండి, వాటి మూలాల ఆన్వేషణ వరకు ఈ క్రియాశీల పాత్ర కనిపిస్తుంది. మధుకర్ వైద్యుల గారి ‘బొగ్గు పూలు’ కవితా సంపుటిలోని కవితలన్నీ సామాజిక సమస్యలతోనూ, వ్యక్తులు సమాజంతోనూ, తమతో తాము జరిపే నిత్య సంఘర్షణతోనూ ముడిపడినవే.
కవితలో అనేక కోణాలను చర్చించే వ్యవధి కవికి తక్కువ. ఈ సందర్భంలో రచయిత ఎంత క్లుప్తంగా విస్తృత అవగాహనతో కవితను రాయగలడు అన్నదే కవిలోని కవిత్వ పటిమకు గీటురాయి. అటువంటి విస్తృత పరిధి గల ‘బొగ్గు పూలు’ కవితతో ఈ కవితా సంపుటి ఆరంభమవుతుంది. గోదావరి నది చారిత్రక, సామాజిక, ప్రయోజనాత్మక నేపథ్యాలతో ఆ నది పుట్టుకతో మొదలుపెట్టి ఆ ప్రాంతంలో జన్మించిన వీరుల పరిచయం, అక్కడి పంటలు పండే వైనం నుండి వ్యాపార ఉత్పత్తి సరుకుగా మారే క్రమం, ఖనిజాలకు,విద్యుత్తుకు కేంద్రంగా ఉండటం, ఎందరికో ఉపాధిని కలిగించడం, ఇవన్నీ ఓ కోణం అయితే, ఇంకో కోణంలో విప్లవాలకు ఆనవాలుగా ఉంటూ తెలంగాణ చిత్రపటంలో దానికున్న ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ ఈ కవితను ముగించారు. నేటి సాంకేతిక ప్రగతి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంది. మనిషి ఆలోచనల్లో కూడా ఇదే స్థాయి ప్రగతి సంభవిస్తే, మనిషిలో అంతర్లీనంగా ఉండే పిరికితనం, బానిసత్వం లాంటివి అంతరించవచ్చని, ధైర్యంగా ముందడుగు వేయవచ్చుననే ఆశావాహా దృక్పథం ‘అక్షరీకరిస్తా…’ కవితలో కనిపిస్తుంది.
సమాజంలో అనేక రూపాల్లో జరుగుతున్నా అన్యాయాన్ని పట్టించుకోకుండా మనిషి తనలోని మానవత్వం నుండి ఎడారితత్వం లోకి పయనిస్తున్నాడన్న ఆవేదన 'నేను ప్రశ్ననై ప్రశ్నిస్తున్న' కవితలో కనిపిస్తుంది. ఈ కవితలో 'ఎడారితత్వం' అనే నవీన వాడుకను ఉపయోగించారు. ఈ నిర్లిప్త ధోరణికి మూలాన్ని ఈ ఒక్క పదంతో తేల్చేశారు.మగవాడిగా పుట్టినంత మాత్రాన సుఖజీవి అని అనుకునే పరిస్థితులు లేవని, బాధలను,భయాలను, సమస్యలను గుండెలో దాచుకుని పైకి మాత్రం ధైర్యంగా ఉండే జాతి అని పురుష కోణం నుండి రాసిన కవితే 'నాది 'మేల్' జాతి.' ఇందులో ఓ నిస్సహాయ భర్త దుస్థితిని కూడా స్పష్టం చేశారు. సార్ధకత,సంతోషం లేకుండా భయం, కసాయితనం, క్రూరత్వం మధ్య ఊగిసలాడే మానవ జన్మ వద్దు అని గట్టిగా చెప్పే కవితే 'మానవ జన్మకు మరో జన్మా...?' 'స్త్రీ'లో అమ్మను చూడలేని కామాంధులను ఉద్దేశించి రాసిన కవితే 'అమ్మనని మరిచిపోయావా?'
భౌతిక మరణం కన్నా మనిషి ప్రతిరోజూ మానసికంగా మరణిస్తూ బ్రతుకుతూ 'బ్రతుకు-మరణం' మధ్య ఘర్షించే మానసిక మరణం గురించి హృద్యంగా రాసిన కవితే 'సహజమరణం!'
'పగిలిన గుండెను ఫెవిక్విక్ అంటించి
ముక్కలైన మనసును స్టిచ్చింగ్ చేసి
మరణాన్ని మురిపెంగా పెంచుకుంటున్న
ఆత్మవంచన తప్ప ఆత్మత్యాగం చేసుకోలేని పిరికితనం'
ఈ వాక్యాలతో మనిషి భౌతికంగా మరణించకుండానే మానసికంగా మరణం ఎంత సహజమైన ప్రక్రియగా పరోక్షంగా అనేక సార్లు ఎలా జరిగిపోతుందో స్పష్టం చేశారు 'సహజ మరణం!' కవితలో. గాయపడ్డ మనసు గురించి వేదనతో రాసిన కవిత 'చితి పేర్చుకున్న!'
'జీవితమంతా ఓటమై కమ్ముకున్న కారుమబ్బులు
రీకాలింగ్ సిగ్నల్స్ దొరకక కూలిన కమ్యూనికేషన్స్
డాటా వీకై నైట్ ఎవరికీ చేరని ఎమోషన్స్'
ఈ వాక్యాలతో మనిషికి మనిషికి మధ్య ఉండే బంధాలు బలహీనపడటం వల్ల మానసికంగా గాయపడే మనసుకి ఏ చికిత్స పని చేయదని, ఆ గాయపడ్డ మనసు ఆశయాలకు,ఆలోచనలకు చితి పేరుస్తుందని, మానసిక వ్యథను చక్కగా అక్షరీకరించారు.
కాలం, పరిస్థితులు, సమస్యలు, కన్నీళ్లు ఒకేసారి పరీక్ష పెడుతున్నా, వాటిని ఎదిరించి తన మార్గం తాను ఏర్పరచుకుంటానన్న స్పూర్తితో రాసిన కవితలు 'శంఖారావం', 'చావును స్వాగతిస్తా',' నేను పరాజితున్ని కాను', నేను నేనే..', 'అన్వేషణ', 'మళ్ళీ చిగురిస్తా', 'విజయ బావుటా', 'విజయం', 'ఆశల సౌధాలు నిర్మిస్తా', 'మౌన మునిని', 'విజయ గర్వం.'
సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకుని రాసుకుని కవితలు కూడా ఈ కవితాసంపుటిలో ఉన్నాయి. సమాజంలో పేద-మధ్యతరగతి వర్గ ప్రజల్లో ఉండే జీవితం మీద ఆశను బలహీనతలుగా మార్చుకుని వ్యాపారం చేసే వ్యాపార ప్రవృత్తి గురించి చెప్తూ, వినియోగదారుడికి ఉండాల్సిన అవగాహన గురించి రాసిన కవితే 'వినియోగదారుడే రారాజు!' ప్రకృతి వనరుల విధ్వంసం వల్ల జరిగే నష్టాలను గురించి రాసిన కవితే 'ఇంధనం ప్రగతికి మూలధనం.' స్నేహితుడి విలువ గురించి రాసిన కవిత 'హితుడా ...ఓ స్నేహితుడా!' ప్రకృతికి,అభివృద్ధికి మధ్య జరిగే యుద్ధం వల్ల భూసారం తగ్గడం వల్ల తెలంగాణ చిత్రపటంలో హరితత్వం విరాజిల్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కవితే 'హరితోత్సవం.' సిరియాలో జరుగుతున్న హింసపై ప్రతిస్పందనగా రాసిన కవితే 'మానవత్వమా చిరునామెక్కడ?' జన్మభూమి కోసం ప్రాణాలివ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే సైనికుల గురించి రాసిన కవిత 'అమర జవాన్లు.' స్వాతంత్ర్యం ఎలా భ్రమగా సామాన్యుడి జీవితంలో మారిపోయిందో అన్న అంశాన్ని స్పష్టం చేసే కవితే 'అవును!మాకు స్వాతంత్ర్యం వచ్చింది.'తమ కవిత్వంతో సమాజాన్ని చైతన్యపరచిన కాళోజీ, సినారె గారి గురించి రాసిన కవితలు, 'విశ్వకవి కాళోజీ', 'కన్నారమ్ విశ్వంభరుడు.' అబ్దుల్ కలాం గారి గురించి రాసిన కవిత, 'నింగికెగిసిన మిస్సైల్.'
"ఎప్పటికయినా మానవ పథికుడు చేరుకునే గొప్ప విశ్రాంతి మందిరం కవిత" అన్నారు ఆరుద్రగారు. అటువంటి ఆహ్లాదాన్ని కలిగించే కవిత 'తల్లిపువ్వు తంగేడు.'సాదాసీదా గడ్డిపువ్వు జీవితంలో ఉన్న అసాధారణ సౌందర్యాన్ని స్పష్టం చేసే కవిత ఇది. 'స్వాగతం..సుస్వాగతం' కవితలలో నూతన సంవత్సరం గురించి కూడా ఎంతో ఆశావాహకంగా రాశారు. 'ఉగాది శుభాకాంక్షలు' కవితలో కూడా ఇదే స్పూర్తి కనిపిస్తుంది.
"ఆవశ్యకత గుర్తింపే స్వేచ్చ", అని ఎంగెల్సు అన్నట్టు కొన్ని కవితల్లో వ్యక్తి తన ఆలోచనలనల నుండి తాను పొందాల్సిన స్వేచ్చ గురించి కూడా బహిర్ముఖ మరియు అంతర్ముఖ భావనల స్వరూప యుద్ధం ద్వారా కొన్ని కవితల్లో చిత్రీకరించారు. 'తమ్ముడు!', 'ఏడ్చి చావు!', 'నా చావు నేను చస్తా!','స్వార్ధపు బతుకు', 'అర్ధనారీశ్వరం', నేను ఓడిపోయిన','మనో వైద్యం.'
'మనిషికి మస్తిష్కానికి కమ్యూనికేషన్ తెగి
కుప్పకూలిన నాడీవ్యవస్థకు చికిత్స లేక
చిన్నాభిన్నమైన అవయవ వ్యవస్థకు
శస్త్రచికిత్స చేసినా ఒక్కటి కాలేని గ్యాప్' అని 'అర్ధనారీశ్వరం' కవితలో శారీరక,మానసిక రుగ్మతలకు కారణం మెదడుకు మనిషికి మధ్య సమన్వయం లేకపోవడమే అని స్పష్టం చేశారు.
'ఆకలితో కడుపు నేర్పిన పడుపు
మనసు పవిత్రమై శరీరం మలినమైన జీవితం
దారులన్నీ చీకటైన వేశ్యను నేను...మరి నీవు ?' అని 'నేను వేశ్యను...మరి నీవు?' కవితలో విటుడిని వేశ్యగా మారిన స్త్రీ కారణాలను చెప్పి, అతను ఎందుకు విటుడుగా మారాడో అని సూటిగా ప్రశ్నించారు. రాత్రిలోకి తొంగి చూస్తూ పగలు చూడలేని దృశ్యాలను, ఆలోచనలను స్పష్టం చేసేలా రాసిన కవితే, 'నగరం నిద్రపోతున్న వేళ.' తెలంగాణ ఉద్యమ స్పూర్తితో రాసిన కవిత 'అమరుల తెలంగాణ.'అలాగే తెలంగాణ జీవనం తనలో నింపిన ధైర్యాన్ని స్పష్టం చేయడానికి రాసిన కవిత, 'నేను తెలంగాణోన్ని...' తెలంగాణ బాష నేపథ్యంతో రాసిన కవిత, 'ప్రభాత గీతం.' పల్లెల సౌందర్యం, మనుషుల స్వచ్చతను స్పష్టం చేసే కవిత, 'మా ఊరు.'
అరవై కవితలతో ఉన్న ఈ సంపుటిలో సామాజిక అంశాలపై స్పందన మాత్రమే కాదు, అనేక విషయాల్లో మనిషి తనను తాను ప్రశ్నించుకుంటూ, సమాధానాలు దొరక్క నిరాశపడుతూ, మరలా వెతుకుతూ ముందుకు సాగే అన్వేషణ క్రమం కూడా అంతర్లీనంగా ఉంది.
"నేను ఏదో సాధించాలని అనుకున్న ప్రతిసారి సరైన సహకారం అందక కుప్పకూలిపోవడం ఎన్ని సార్లు జరిగిందో. అదే నన్ను మౌనమునిగా మార్చింది. బాధలో ఉన్నప్పుడు చిటికెడు ఓదార్పునిచ్చి ఒడిలో తల వాల్చుకొనిచ్చే తోడు కోసం తపించిన సందర్భాలెన్నో. ఆ బాధ, ఆవేశం,ఆవేదనలో ఉబికి వచ్చిన కన్నీటి సెలయేటి తడికి ఊపిరి పోసుకుని పూసిన ఫూలే ఈ 'బొగ్గు పూలు.' ఈ బొగ్గు పూలలో పూర్తిగా నలిగిన నా మనసే కనపడుతుంది. చుట్టూ జరుగుతున్న సంఘటనలు కూడా నా మనసును గాయపరిచినవే. ఆ గాయాలు రేపిన అలజడినే ఈ కవితాసంపుటికి శ్రీకారం. మరోవైపు రాస్తూ పోతున్న సందర్భంలో కొంతమంది స్నేహితులు ఇచ్చిన బలం కూడా దీనికి కారణం. ఈ పుస్తకంలో పూర్తిగా కాకపోయిన కొంతలో కొంత నన్ను నేను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాను", అని 'బొగ్గు పూలు' కవితా సంపుటిలో 'నా మనసు పలుకు'లో రాశారు మధుకర్ వైద్యుల గారు.
ఈ కవిత్వ సంపుటిలోని కొన్ని కవితలతో కవికి ఉన్న వ్యక్తిగత అనుబంధం భావగాఢత ద్వారా స్పష్టమవుతుంది. నేడు సమాజంలో కనిపిస్తూ ఉన్న 'Toxic Positivity" తో బ్రతకడం సాధ్యం కాదన్న భావనను బలపరిచారు. మనిషి తన భావోద్వేగాలను అంగీకరించి, స్వీకరించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టం చేశారు. అరవై కవితలున్న ఈ సంపుటిలో ప్రతి మనిషి అనేక సందర్భాల్లో తనను తాను యథాతథంగా దర్శించుకోవచ్చు. కవిత్వం కొన్ని సార్లు గొప్ప ఓదార్పు అని స్పష్టం చేస్తూనే, ఇంకో పక్క సమాజంలో పౌరుడిగా బాధ్యతను ప్రకటించే అస్త్రం కూడా అని 'బొగ్గు పూలు' స్పష్టం చేస్తుంది. ఈ సందర్భంగా మధుకర్ వైద్యుల గారికి అభినందనలు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ