చరిత్ర కథ పుటలు

 చరిత్ర కథ పుటలు

-శృంగవరపు రచన



కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన అరుదైన ఆరు తెలుగు నవలల్లో ఒకటి అంపశయ్య నవీన్ గారి ‘కాలరేఖలు.’1944 నుండి 1956 వరకు పదకొండవ ఆంధ్ర మహా సభ నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వటం వరకు ఉన్న తెలుగు రాష్ట్రాల పరిస్థితులను, ముఖ్యంగా నైజాం పాలనలో ప్రజలు పడ్డ బాధలను,అప్పుడు అవతరించిన ఆంధ్రమహాసభ వంటి సంస్థల చురుకైన పాత్రను,నాడు సమాజంలో ఉన్న సంప్రదాయాలను,మూఢ నమ్మకాలను, స్త్రీల జీవిత స్థితి గతులను,విద్య పట్ల ఉన్న అభిప్రాయాలను, నాటి కుటుంబ వ్యవస్థను,రాచరిక కుటుంబ వ్యవస్థలో ఉండే ఆచారాలను,మొత్తం మీద ఈ నవలను అటు స్వాతంత్ర్యం రాకముందు సమిష్టిగా ప్రజల కోణం నుండి, అలాగే వారి వ్యక్తిగత జీవితాల కోణం నుండి, ఆ సమయంలో ఉన్న స్త్రీల పరిస్థితులను కూడా స్పష్టం అయ్యే కోణంలోనూ, సంపూర్ణ పరిస్థితులను అక్షరీకరించేలా రాశారు రచయిత.
ఈ నవలలో ముఖ్య పాత్ర రాజుది. అతని బాల్యంలో మొదలయ్యే ఈ నవల అతను మెట్రిక్ పరీక్ష రాయడంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో అతను సమాజాన్ని,కుటుంబాన్ని చూసే తీరులోనే కథ నడుస్తుంది. రాజు తండ్రి నర్సయ్య. నర్సయ్య అన్నయ్యలు వీరయ్య,వెంకయ్య. తమ్ముడు సత్తెయ్య. సత్తెయ్యను సత్యం అని పిలుస్తారు. ఆంధ్ర మహా సభ పదకొండవ మహా సభ జరగడం అందులో సత్తెయ్య,నర్సయ్య పాల్గొనడంతో నవల ప్రారంభం అవుతుంది.
ఈ నవలలో పాత్రల స్వభావాలు పరిస్థితుల బట్టి,తమకు హానీ లేని మేరకు తమను ప్రమాదం నుండి కాపాడే మార్గం కోసం ప్రవర్తించినట్టు స్పష్టం అవుతుంది చాలా సార్లు. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. ఈ కథ తెలంగాణలో నడుస్తుంది. అప్పటికి నిజాం దొర, ఆ దొర సామంతులుగా ఉన్న దొరలు వెట్టిని,లెవీని అమలు చేస్తూ ప్రజలను ఆర్థికంగా,శారీరకంగా దోచుకుంటున్న పరిస్థితులు. ఆ సమయంలో వారికి ఆంధ్ర మహా సభ తమ సమస్యల కోసం నిలబడటం వారి వైపు మొగ్గెలా చేసింది. కానీ ఎప్పుడైతే నిజాం దొర ఆంధ్ర మహా సభకు మద్ధతు ఇచ్చేవారిని శిక్షలకు గురి చేస్తున్నాడని తెలిసిందో అప్పుడు వారు దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. ఆ స్వభావమే ఈ నవల మొదట్లో స్పష్టం అవుతుంది. ఈ ఆంధ్ర మహా సభలో పాల్గొన్నందుకు నర్సయ్య మిగిలిన వారితో కలిసి దొరకు క్షమాపణ చెప్పి వస్తాడు. కానీ సత్యం మాత్రం ఆంధ్ర మహా సభలో చురుకైన సభ్యుడిగా మారిపోతాడు. ఇకపోతే వీరయ్య,వెంకయ్యలకు ఇవేమీ పట్టవు. ఈ కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తులకు ఈ ఆలోచనల మధ్య ఉన్న భేదం,వారి మార్గాలను కూడా సూచిస్తుంది. ఈ నలుగురు అన్నదమ్ముల తండ్రికి అన్న దొడ్డ రాజయ్య సంపాదించిన ఆస్తులే ప్రస్తుతం అతనికి పిల్లలు లేకపోవడం వల్ల వీరు అనుభవిస్తున్నారు. వారిది ఉమ్మడి కుటుంబం. వెంకయ్యకు సంతానం లేదు.
ఇదే నవలలో రచయిత ఈ కుటుంబంలో ఉమ్మడి కుటుంబ సమస్యలను కూడా చక్కగా కథలో భాగం చేస్తూ రాశారు. సత్యం,నర్సయ్య పెద్దగా వ్యవసాయం చేయరు.వీరయ్య,వెంకయ్య మాత్రమే ఎప్పుడూ వ్యవసాయం చేసేది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఖర్చులన్నీ ఉమ్మడిగానే నడుస్తాయి. అందుకే ఒకరు పని చేయకపోయినా పెద్దగా ఆ ఒక్కరికీ వచ్చే నష్టం ఉండదు. వెంకయ్య మనసులో తాను,అన్న వీరయ్య మాత్రమే కష్టపడుతుంటే కాస్త చదువుకున్న నర్సయ్య,సత్తెయ్య మాత్రం ఏ మాత్రం వ్యవసాయం పట్టకుండా తిరుగుతున్నారని,అందువల్ల వేరు పడితే తమ కష్టం తమకే పూర్తిగా దక్కుతుందని.
నర్సయ్యకు ఇద్దరు సంతానం. ఒకరు సుశీల,ఆమె తర్వాత రాజు. సుశీలకు ఏడేండ్లు నిండుతున్నాయి. విడిపడితే పెండ్లి చెయ్యడం కష్టమని భావించిన నర్సయ్య కుటుంబం ఉమ్మడిగా ఉన్నప్పుడే తన అక్క కొడుకు సోమయ్యకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. సోమయ్యకు తండ్రి లేకపోవడం గారాబం వల్ల చెడిపోయే మార్గంలో ఉన్నవాడు. సుశీలకు జ్వరం వస్తే ఆమెను హాస్పటల్ కు తీసుకువెళ్లకుండా ఉండటం వల్ల ఆమెకు మంత్రాలు పెట్టించడం వల్ల వైద్యం లేక టైఫాయిడ్ తో సుశీల మరణిస్తుంది. ఆ తర్వాత సోమయ్య ఇంకో వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు సుగుణ.
సత్తెయ్య పూర్తిగా ఆంధ్ర మహా సభలో భాగమైపోతాడు. అప్పటికే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఇంకా హైదరాబాద్ సంస్థానానికి రానట్టే. తనకున్న సంవత్సరం కాలంలో రజాకార్లతో నిజాం దొర చేసిన అరాచకాలను కొంత మేరకు ఎదిరించే ప్రయత్నం చేసింది ఆంధ్ర మహా సభే. క్రమేపీ దాని మీద కూడా రష్యన్ కమ్యూనిస్ట్ భావజాలం ప్రభావం ఉండటం వల్ల దొరలను దోచుకుని లేని వారికి పంచడం మొదలు పెట్టారు. రజాకార్ల బారి నుండి తమను కాపాడుతున్నంత మేరకు వారికి సహకారం అందించిన ప్రజలు తమ వరకు వచ్చి తమ ఆస్తులు కూడా పంచుతారేమో అన్న భావనా కలగగానే వారిని వ్యతిరేకించారు. సమాజంలో మనుషుల ఈ ద్వంద స్వభావాన్ని రచయిత ఎంతో చక్కగా ఈ నవలలో స్పష్టం చేశారు. ప్రాణ భయంతో మనిషిలో వచ్చే మార్పు శాశ్వతం కాదు,మరలా మనుషులు పరిస్థితులు మాఉలుగా మారిపోగానే వారి అసలైన మనస్తత్వం బయటకు వచ్చేస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అలాగే ప్రపంచం మొత్తం మీద ఏదైనా నియుతృత్వపు ధోరణి మీద జరిగిన విప్లవాలకు వెన్నుపోట్లు మనిషికి ఉన్న ఈ స్వభావం వల్లే.
సత్తెయ్య పూర్తిగా రజాకార్లకు వ్యతిరేకంగా పని చేయడం వల్ల,అలాగే అతనితో పాటు ఉన్న వారి మీద కూడా నిఘా పెట్టిన రజాకార్లు ఆ ఊరు మీద దాడి చేసినప్పుడు రెండు సార్లు తలెత్తిన ప్రమాదం నుండి ఆ కుటుంబం బయటపడుతుంది. కానీ సత్తెయ్య వల్లనే కుటుంబానికి ఆపద వచ్చిందని నమ్మడం వల్ల అతన్ని వ్యతిరేకిస్తారు అతని అన్నలు. ఆ తర్వాత రజాకార్ల భయం వల్ల నర్సయ్య కుటుంబం,సత్తెయ్య భార్య రుక్కమ్మ సోమయ్య అత్తవారు ఉంటున్న ఆంధ్ర ప్రాంతంకు తరలిపోతారు. మరలా పటేల్ నాయకత్వంలో జరిగిన మిలిటరీ చర్యతో నిజాం దొర లొంగిపోయిన తర్వాత మరలా స్వంత ప్రాంతానికి రావడం జరుగుతుంది. అప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఆంధ్ర మహా సభల సభ్యులను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లొంగిపొమ్మని ప్రభుత్వం హెచ్చరించినా లొంగిపోకపోయినా,చివరికి వేల మంది చనిపోయిన తర్వాత లొంగిపోవడం,ఆ తర్వాత వారిని విడుదల చేయడం జరుగుతుంది. అలా సత్తెయ్య కూడా ఇంటికి తిరిగివస్తాడు. అతను తిరిగి రాగానే మొత్తానికి ఆ నలుగురు అన్నదమ్ములు వేరుపడతారు.
ఆ తర్వాత కథ మొత్తం రాజు వివిధ ఊర్లు మారుతూ మెట్రిక్ పరీక్షలు రాసే వరకు జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చిన రాజకీయ మార్పులు,అవి ప్రజల్ని ప్రభావితం చేసిన తీరును కూడా రచయిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రాంతం వారికి,తెలంగాణ ప్రాంతం వారికి బాష,ఉద్యోగం వంటి వాటిల్లో తలెత్తిన విభేధాల గురించి,రాజకీయ వాతావరణం గురించి రచయిత ఎంతో బాగా రాశారు. ఈ కథనంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల పట్ల పాఠకులకు అవగాహన కలిగిస్తూనే వాస్తవాన్ని చరిత్ర పాఠంలా కాకుండా కథను ఎంతో ఆసక్తిగా మలిచారు రచయిత.
ఈ కథలో రాజు బాల్యం నుండి అతను ప్రపంచాన్ని,తన చుట్టూ జరిగే దాన్ని చూసే తీరును,అతను ప్రతి దాని గురించి ఆలోచించే తీరును రచయిత ఈ కథలో ముఖ్య పాత్రగా ఉన్న రాజు సమాజంలోని ప్రతి విషయాన్ని,తన కుటుంబంలో జరుగుతున్న వాటిని,మూఢ నమ్మకాలను కూడా కాలంతో పాటు మారిన వాటి గురించి కూడా స్పష్టం చేస్తూ పాఠకులు ఎలాంటి చిన్న విషయాల గురించి కూడా లోతుగా ఆలోచించాలో ఓ మార్గం ఏర్పరచినట్టు అనిపిస్తుంది. మొదట చదువు గురించి మాత్రమే ఆసక్తి కలిగి ఉండి,ఎంతో కష్టపడి చదువుకున్న రాజు మధ్యలో చిన్న చిన్న తప్పులు చేస్తూ తన తప్పులు దిద్దుకుంటూ ముందుకు సాగుతాడు రాజు.
చదువు మధ్యలో సినీ ఆకర్షణలో పడినా చదువు మీద కొంత నిర్లక్ష్యం ఏర్పడినా తనను తాను దిద్దుకుంటూ ముందుకు సాగుతాడు రాజు. అతను మెట్రిక్ పరీక్ష రాయడం,అతను పుట్టిన వాయల్ పాడులో బడితో పాటు మిగిలిన వసతులు కూడా ఆ ఊరికి రావడం, అప్పటికే పొట్టి శ్రీరాముల నిరాహార దీక్ష వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం,ఆ ప్రగతిని సూచిస్తూ ఈ నవల ముగుస్తుంది.
ఇది నవలా త్రయం. మొదటి నవల కాలరేఖలు,అయితే మిగిలిన రెండు నవలలు చెదిరిన స్వప్నాలు మరియు బాంధవ్యాలు.చరిత్రలో సామాన్యుల జీవితాలను స్పష్టం చేసే నవలా శైలి ఇది. సమాజాన్ని చూసే తీరు ప్రజల్లో తమకున్న పరిస్థితులను బట్టి ఎలా మారిపోతుందో ఈ నవల స్పష్టం చేస్తుంది. ఈ నవలలో రచయిత ప్రస్తావించిన ఇంకో అంశం కులవృత్తులు.ఎక్కువ చదువుకుంటూ తమ పిల్లలు కులవృత్తులను నిర్లక్ష్యం చేస్తారో అని వారిని చదివించే స్థోమత ఉండి కూడా చదివించని తల్లిదండ్రులు ఓ వర్గం అయితే, చదివించే స్థోమత లేక కులవృత్తులకే పిల్లలను అంకితం చేసే తల్లిదండ్రులు ఇంకో వర్గం. దీనితో పాటు రచయిత రోగాలకు కారణం దేవతలకు కోపం రావడం అని భావించి వైద్యం వైపు దృష్టి సారించకుండా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులను,దొరల దగ్గర ఉండే ఆడ బాపలు జీవితాలు ఎలా దుర్భరంగా ఉంటాయో,బాల్య వివాహాలు,వితంతువుల బాధలు వంటివి కూడా రచయిత ఈ నవలలో వివిధ పాత్రల ద్వారా స్పష్టం చేశారు. ఓ సారి చరిత్రను,చరిత్రలో మనం ఉండని పుటల్లో మనుషులను చూసేలా ఈ నవల చేస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!