ఆదర్శాలు-వాస్తవాలు
ఆదర్శాలు-వాస్తవాలు
మనిషికి మనుగడ ముఖ్యమా లేక ఆదర్శాలా అన్న సంద్గిదత తలెత్తినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాడు అన్నదే మనిషి జీవన గమనాన్ని నిర్ణయిస్తుంది. ఆదర్శాలకు,వాస్తవికతకు చాలా దూరం ఉన్నప్పుడూ,రోజూ రోజూకూ ఆ దూరం మరింత పెరుగుతున్నప్పుడు ఆ ఆదర్శవాదం మనిషికి నైతిక బలాన్ని ఇచ్చినా,సమాజంలో బ్రతికే మార్గాన్ని మాత్రం ఇవ్వలేనప్పుడు ఆ మనిషి పడే సంఘర్షణను స్పష్టం చేసే నవలే డాక్టర్ ఆలూరి విజయ లక్ష్మి గారి ‘ప్రత్యూషపవనం.’ ఈ నవలలో వైద్యం చదివిన ఓ అమ్మాయి ఆదర్శాలకు-సమాజంలో వైద్యాన్ని వ్యాపారం చేసే వారితో,ఆ వ్యాపారానికి లొంగిపోయిన మనుషులతో యుద్ధం చేస్తూ ఆదర్శవైద్యాన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో ఆమె కోల్పోయినదేమిటి? పొందిందేమిటి? అన్న అంశం స్పష్టం అవుతుంది.
వాసంతి వైద్య విద్య చదివింది. ఎమ్మెస్ చేయాలని ఉన్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ప్రాక్టీస్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆమె స్నేహితురాలు సంధ్య.సంధ్య స్నేహితుడు సుధీర్. వాసంతి చదువుకునే సమయంలో కూడా ఆమె స్నేహితులు ఆర్థికంగా ఆదుకోవడం వల్లే ఆమె చదువు పూర్తి చేయగలుగుతుంది. ఆమె చదువుకుంటున్న సమయంలో ఆమె తనతో పాటు చదువుకుంటున్న రాజాను ప్రేమిస్తుంది.
సుధీర్ కి వైద్య రంగం వ్యాపారం అయిపోయిందని,ఏ వైద్యుడు ఆదర్శంగా మనుషుల ప్రాణాలని కాపాడటానికి లేడని,డబ్బు సంపాదించే మార్గం మాత్రమే వైద్యం అని వాసంతి,సంధ్యలతో అన్నప్పుడూ,సంధ్య దానిని వ్యతిరేకించకపోయినా,వాసంతి ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తుంది. వాసంతికున్న ఆర్థిక ఇబ్బందులు గమనించిన సుధీర్ ఆమె ఓ గ్రామంలో ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఆమెకు ఆర్థిక సహకారం అందిస్తాడు. అక్కడ ప్రాక్టీస్ పెట్టిన వాసంతి తన దగ్గరకు వచ్చే రోగుల్లో పేదవారు ఉంటే వారికి ఉచితంగా వైద్యం చేసేది. దానిని ఆసరాగా తీసుకుని కొందరు ఉన్నవారు కూడా ఆమెకు ఫీజులు ఇచ్చేవారు కాదు. అలాగే ఆ ఊరిలో ప్రముఖుల ఇంటికి వెళ్ళి వైద్యం చేయడానికి వాసంతి నిరాకరించడం, అలాగే మందుల షాపుల వారితో కలిసి రోగులకు అనవసరమైన టెస్టులు రాయడానికి నిరాకరించడం వంటి వాటి వల్ల ఆ గ్రామంలో ఎందరో శత్రువులను కూడా పెంచుకుంది వాసంతి.
సంధ్య వైద్యం పూర్తి చేసి,ఓ డాక్టర్ ను వివాహం చేసుకుంటుంది. వాసంతి ప్రాక్టీస్ పెట్టిన గ్రామంలో తమ కులం వారు ఉండటం వల్ల,ఆ కులం బలంతో సంధ్య,ఆమె భర్త అక్కడ హాస్పటల్ పెట్టడం,ఖరీదైన వైద్యం అందించడం,రొగులు ఆమె వైపుకే ఆకర్షించబడటం జరుగుతుంది. రాజా వాసంతిని ఆ గ్రామం వదిలేసి తనతో పాటు వస్తే తాను వివాహం చేసుకుంటానని చెప్పడం,వాసంతి నిరాకరించడం జరుగుతుంది. ఆ తర్వాత వాసంతి అప్పులు పెరగడం, ఇంటికి డబ్బులు పంపలేకపోవడం, వాసంతి కుటుంబ సభ్యులు కూడా ఆమెను అర్ధం చేసుకోలేకపోవడం జరుగుతుంది.
వాసంతి తన దగ్గరకు వచ్చే రోగుల్లో మిగిలిన ఆసుపత్రుల వారు చేతులెత్తేశాక వచ్చిన రొగులు మరణించే పరిస్థితుల్లో ఉన్నా వారికి వైద్యం చేసే ప్రయత్నం చేయడం వారు మరణించడం,వాసంతిని ఒకప్పుడు పొగిడిన వారే ఆమెను నిందించడం జరుగుతుంది. అటు కుటుంబాన్ని ఆదుకోలేక, తన జీవితాన్ని సుఖంగా గడుపుకోలేక, ఆదర్శంగా ఉండే ప్రయత్నంలో కూడా ఆమె ఆదర్శంలోని ఉన్నతత్వాన్ని గుర్తించలేని మనుషుల మధ్య వాసంతి ఘర్షణ పడుతూ ఉన్న సమయంలో ఆమెకు అండగా సుధీర్ నిలబడటంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో ఆదర్శవంతమైన జీవితానికి ఆశయం,ఆలోచన మాత్రమే సరిపోదని,దానికి అనువుగా ఉండే సమాజం కూడా ఉండాలని,అటువంటి అనుకూలత లేని సమాజంలో ఆదర్శవంతులు జన్మించినా,వారి ఆదర్శాలు కొందరిని అవసరంలో ఆదుకున్నా,వారు జీవించే మార్గానికి అవే అడ్డంకిగా మారతాయని,అనుకూలత లేని సమాజంలో ఆదర్శాలు మనలేవని స్పష్టం అవుతుంది.
ఆలూరి విజయలక్ష్మి గారు రాసిన ఇంకో నవల ‘వెలుతురు పువ్వులు.’ బాల్యం నుండి స్వతంత్ర భావాలతో పెరిగిన ఓ అమ్మాయి పరిస్థితుల వల్ల ఎలా రూపాంతరం చెందిందో స్పష్టం చేసే నవల ఇది. స్రవంతి తల్లిదండ్రులకు ఆమెతో పాటు ఇంకో ఇద్దరు ఆడపిల్లలు, ఓ మగపిల్లవాడు ఉన్నా, తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ నిలుపుకునే ప్రయత్నమే చేసింది. ఆమె ఇద్దర్ఊ అక్కలు వివాహం చేసుకుని వెళ్ళిపోయినా ఆమె మాత్రం చదువు కొనసాగించింది. కానీ ఆమె తండ్రికి పక్షవాతం రావడం,తండ్రికున్న షాపులో పనివాళ్లు మోసం చేయడంతో పరిస్థితులు తలక్రిందులు అయినా సరే ఆమె ధైర్యంగా ఎదుర్కుని పుస్తకాల షాపు పెట్టుకుని,మెల్లగా జీవితాన్ని గాడిలోకి తెచ్చుకుంది. అదే సమయంలో ఆమె ప్రేమలో పడటం,మోసపోవడం,గర్భస్రావం జరగడం జరిగింది.
బాల్యం నుండి బాధల్లో పుట్టి పెరిగిన వ్యక్తి శరత్. తండ్రి మూర్ఖత్వం వల్ల చదువుకునేటప్పుడు కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుని,స్నేహితుల-ప్రతిభ ఆలంబనతో మొత్తానికి అమెరికాలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు తల్లిని చూడటానికి వచ్చిన శరత్ అనుకోకుండా స్రవంతిని కలవడం,స్రవంతితో పరిచయం పెరగడం, స్రవంతి ఏం దాచకుండా జరిగిందంతా చెప్పడం,వారిద్దరూ ఒకటవ్వడంతో ఈ నవల ముగుస్తుంది.
ఈ రెండు నవలలు 1980 ల్లో విజయలక్ష్మి గారు రాశారు. స్త్రీ జీవితంలో సంఘర్షణను,ఆమె జీవితంలో చేసే పోరాటాన్ని మొదటి నవలలో ఆదర్శవంతమైన జీవితం కోసం చేసే సమరంగా, రెండో నవలలో తలక్రిందులైన కుటుంబ బాధ్యతలను తలకెత్తుకుని ధైర్యంగా ఎదుర్కున్న పోరాటంగాను చిత్రీకరించారు. ఈ రెండు నవలల్లో మనిషి స్వభావాన్ని-ఆదర్శాన్ని-మారే సమాజ అనుకూలతను ప్రశ్నిస్తూనే వాస్తవికతను స్పష్టం చేసేలా మాత్రమే కథను నడిపించారు. కథల్లో నిజంకు,కల్పనకు మధ్య ఉన్న వ్యత్యాసం ఆ పాత్రలే పాఠకులకు స్పష్టం చేసేస్తాయి. స్వయంగా వైద్య వృత్తిలో ఉన్న రచయిత్రి ‘ప్రత్యూషపవనం’ లో వైద్యులు డబ్బు కోసమే పని చేస్తారని,వైద్యుల్లో లోపించిన అంకిత భావం వల్ల వారు వ్యాపారవేత్తలుగా మారిపోయారనే అభిప్రాయం స్థిరపడిపోయిన సమాజంలో,ఆ సమాజమే వారిని అలా మారేలా ఎలా రూపొందిస్తుందో స్పష్టం చేశారు. ఆదర్శాలను గుర్తించని,అర్ధం చేసుకోలేని,కనీసం అది తమ కోసమే అని కూడా తెలుసుకోలేని మనుషుల మధ్య ఆదర్శాలు ఎలా జీవిస్తాయనే ప్రశ్న ఈ నవల ద్వారా రచయిత్రి పరోక్షంగా పాఠకులనే వేసినట్టు అనిపిస్తుంది. అలాగే ‘వెలుతురు పువ్వులు’ లో కూడా స్త్రీ కేవలం పురుషుడితో తప్పు జరిగినప్పుడు వాటిని సహజంగా స్వీకరించి,ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? అనే ప్రశ్నను కూడా సంధించినట్టే అనిపిస్తుంది. జీవితానికి దగ్గరగా ఉన్న ఈ రెండు నవలలు చదివింపజేస్తూనే,పాఠకులను ఆలోచించాలని కూడా గుర్తు చేస్తాయి.
* * *

Comments
Post a Comment