శ్రమ చైతన్యం

 శ్రమ చైతన్యం

-శృంగవరపు రచన



సమిష్టి సంపదలు,వ్యక్తిగత సంపదలు జన్మించే శ్రమ శక్తి దోపిడి నేటికీ కూడా పరిష్కరించబడని అంశమే. కార్మికుల కష్టాలు చట్టాల్లో పరిష్కరించబడినట్టు ఉన్నా,కార్మికుల హక్కులను కాలరాస్తూ వారి ప్రాణాలకు,శ్రమకు విలువ ఇవ్వకుండా వ్యవహరించే యాజమాన్యాలు, కార్మికుల యూనియన్లల ద్వారా కూడా కార్మికుల పై చేసే కుట్రలు,ఐక్యత కార్మికుల్లో ఉండకుండా ఉండటానికి చేసే ప్రయత్నాలు,కార్మికుల ప్రాణాలు సేఫ్టీ మెజర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల గాలిలో కలిసిపోవడం వంటి ఉదంతాలు అసత్యాలు కాదు. సత్యాలైన ఈ కథనాలను నవలగా మార్చి పాఠకులను చైతన్యపరిచే ప్రయత్నమే అక్కినేని కుటుంబరావు గారి ‘కార్మిక గీతం.’
ఈ నవలలో రెండు ఫ్యాక్టరీలు,అందులో పని చేసే కార్మికులు,వారి కష్టాలు,వారిని పట్టించుకోకుండా వారిని ఇంకే పద్ధతుల్లో దోచుకోవచ్చో ఆలోచించే యజమానుల కథల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓ ఫ్యాక్టరీలో కార్మికులకు సరైన వేతనాలు ఉండవు.కార్మికుల్లో భయం పెంచడానికి యాజమాన్యం ఒక్క మాట మాట్లాడినా సరే గేటు బంద్ అంటుంది.ఓటిలు చేయించి వాటికి జీతాలు ఇవ్వకపోగా వాటిని చేయలేని పరిస్థితి ఉంటే ఆ చేయని ఓటిలకు జీతాలు కట్ చేస్తారు. కొత్తగా పెళ్ళయిన వారికి నైట్ షిఫ్ట్ లు వేయడం ద్వారా కూడా పైశాచిక ఆనందాన్ని పొందే అధికారుల మధ్య వర్కర్లు పని చేయాలి.
కార్మికులకు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండవు.క్యాంటిన్ ఉండదు. ఒక్కో కార్మికుడు ఒక్కోసారి రెండు మూడు రోజులు ఆపకుండా పని చేయాల్సిన పరిస్థితులు.ఆ పని ఓటి పేరుకు మాత్రమే కానీ ఆ విషయంలో కూడా కార్మికులకు ఛాయిస్ ఉండదు. చేయమంటే చేయాల్సిందే. ఈ కార్మికుల కష్టాలను అనుభవంతో తెలుసుకున్న అబ్దుల్లా అనే వర్కర్ ఈ విషయం మీద వర్కర్స్ ని ఏక తాటి మీద తీసుకువద్దామని ప్రయత్నం చేశాడు. ఫలితం ఏముంది? అబ్దుల్లా ఎలక్ట్రీషియన్. అతను పని చేసేటప్పుడు మెయిన్ ఆన్ చేసి అతను షాక్ కొట్టి చచ్చిపోయేలా చేసి అతని ఆలోచనను అతనితో పాటే అంతం చేసింది యాజమాన్యం.
ఇక ఆ ఫ్యాక్టరీలో అబ్దుల్లా మరణం గురించి ప్రశ్నించిన చంద్రయ్య,సుబ్బారావుల ఆచూకీ లేకుండా చేశారు. ఆ ఫ్యాక్టరీలో దాదాలు ఇక ఆ విషయం గురించి ఎత్తకుండా ఆ కార్మికులు ఒక చోట కలవకుండా నిఘా పెట్టారు. వారిని భయపెట్టారు. ఒక వేల అబ్దుల్లా ఆలోచన ఫలించి ఉంటే యూనియన్ ఆలోచన అయిన కార్మికుల్లో ఉండేదేమో కానీ ఇక ఆ ఆలోచన స్థానంలో భయం మాత్రమే ఉంది.
ఇక రెండో ఫ్యాక్టరీ విషయానికి వస్తే యాజమాన్యం యూనియన్ ఆలోచన కొందరు కార్మికుల్లో రావడం గమనించింది. కార్మికుల్లో చాలా మంది చదువు లేని వారు. ఐటి చదివిన కొందరిని పనిలో పెట్టుకున్నాక చదువుకున్న వారు అవ్వడం వల్ల వారు కార్మికుల్లో చైతన్యం తీసుకుని వచ్చి ఓ యూనియన్ పెట్టుకుని దాని ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కార్మికులను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క సారి ఆలోచన వచ్చాక ఆ ఆలోచనను భయపెట్టాలని చూసినా ప్రయోజనం ఉండదని భావించిన యాజమాన్యం వర్కర్లు యూనియన్ పెట్టుకునేందుకు అనుమతిస్తూనే,ఆ యూనియన్ నాయకుడిగా తమ వాడు ఉండేలా చూసుకుంటారు. ఆ నాయకుడు కార్మికులతో ఉన్నప్పుడూ వారి మాటలు,యాజమాన్యంతో ఉన్నప్పుడూ యాజమాన్యానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, మొత్తానికి ఈ రోజు,రేపు అంటూ ఆలస్యం చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఆ తర్వాత నాయకుడు మంచి వాడు కాదని,అతను యాజమాన్యానికి అనుకూలంగా పని చేస్తున్నాడని కార్మికుల్లో తెలివైన వాడు తెలుసుకున్నప్పుడు,అతనికి అంత కన్నా పెద్ద ఉద్యోగానికి మార్పించి,మిగిలిన కార్మికులు తెలుసుకుని,ఇంకో నాయకుడిని తెచ్చుకుంటే అతను కూడా అంతకు ముందు నాయకుడు నడిచిన దారిలోనే నడుస్తాడు.
ఫ్యాక్టరీల్లో పని చేసేవారు అనేక ప్రమాదాల్లో మరణించినప్పుడు వారి కుటుంబాలకు నష్ట పరిహారాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఆ కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతూ,తమకు పుట్టిన పిల్లలను కూడా పనులకు పంపుతూ ఉండే పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. కేబుల్ కంపెనీల్లో కేబుల్ నాణ్యతను పరీక్షించడానికి పిల్లల అరిచేతులు వాడేవారు.కేబుల్ బయటకు వస్తున్నప్పుడు పిల్లల అరచేతులు గీసుకుపోకుండా ఉంటే కేబుల్ నాణ్యమైనది అయినట్టు. అలా కాకుండా ఎంత లోతుకు దిగితే అంత నాణ్యత లోపించినట్టు. ఇక వేరే గత్యంతరం లేక తమ పిల్లల చేతులు పోతాయని తెలిసినా సరే కేబుల్ కంపెనీల్లో పనులకు కూడా పంపే తల్లిదండ్రులు ఎంతోమంది.
యాజమాన్యం మోసాలు,తమ హక్కులు నలిగిపోతున్న తీరు తెలుసుకున్న కార్మికులు ఐక్యమై నిరాహార దీక్షలు చేసినా సరే వారిని పాట్టించుకోకుండా,పేదరికంలో,బాధల్లో ఉన్న కార్మికుల ఇబ్బందులు వారిని ఎక్కువ కాలం అలాంటి దీక్షల్లో నిలపకుండా ఉండేలా చేసి,యూనియన్ నాయకులు కూడా మొహం చాటేసే క్రమంలో కార్మికుల్లో కూడా చివరి వరకు ఉండే శక్తి సన్నగిల్లడం గ్రహించి,మిగిలిన వారిని పనిలో నుండి తీసేసిన మేనేజ్మెంట్ కు ఎదురు తిరగలేని పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగించే జీవితాలు కార్మికులవి.
ఇంత కష్టపడి సమ్మెలు చేస్తే మేనేజ్మెంట్ మాత్రం తాను పెంచాలనుకున్న స్థాయిలోనే తనకు అనుగుణంగానే పెంచుతుంది. ఇక్కడ డిమాండ్లు ఎవరివి అయినా సరే యాజమాన్యాలు తమకు అనుగుణంగా పరిస్థితులను మలచుకుంటారు. ఇక ఈ పరిస్థితుల్లో జీవించడం కష్టమని భావించిన కార్మికులు పోలీసులను,ప్రభుత్వ అధికారులను ఆశ్రయించిన ప్రయోజనం లేని పరిస్థితుల్లో కార్మికులందరూ ఏకం అయ్యి,వారి కుటుంబాలతో సహా ఉద్యమం చేయడం,వారికి ప్రజల మద్ధతు లభించడం,వారికి భవిష్యత్తు మీద ఆశ కనిపిస్తూ ఉండటంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో పాత్రల కన్నా కార్మికుల కష్టాలు పాఠకులను వెంటాడుతూ ఉంటాయి. నేటికి ప్రమాదాల్లో మరణించే కార్మికుల వార్తలు,సరైన వేతనాలు లేని కార్మికుల వ్యధలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలియనితనం,పేదరికం కార్మికులను ఎలాగో జీవితం గడిపేస్తే చాలు అన్న భావనను బలపడేలా చేస్తాయి. ప్రలోభాలు మనుషులపై ప్రభావం చూపే కాలంలో వీరి సమస్యలు పరిష్కార మార్గంలో పయనించే పయనంలో ఎన్నో ముళ్ళు. అయినా తమ ఉద్యమాల ద్వారా తమ ఆశయ దృఢత్వాన్ని స్పష్టం చేసిన కార్మికులు ఎప్పటికీ ఆదర్శనీయులే. కార్మికుల కష్టాలను మూలాల నుండి స్పష్టం చేసే నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ