స్వేచ్చ భారం
స్వేచ్చ భారం
నచ్చినది ఏదో
నచ్చనిది ఏదో
కన్నీరు ప్రవహించే
మార్గమేదో
తెలియనితనం
స్వేచ్చ అయితే
అది భారమైన స్వేచ్చే!
నాగరికతకు అర్ధం
నలుగురి దృష్టిని
త్వరగా ఆకట్టుకోవడం
అయితే
స్వేచ్చ
ఓ నాలుగు మెట్లు
ఎక్కి
ఆ దృష్టిని ఆత్మగౌరవంను
అభిమానాన్ని
అవసరమైన సిగ్గును
దాటిస్తే
ఆ స్వేచ్చ
భారమైన స్వేచ్చే!
ఏకాంతం
ఒంటరితనంగా
మారిపోయి
ఏదో కావాలన్న
తపనతో
బంధాలు ఏర్పడితే
ఆ బంధాల సంకెళ్ళకి
ఆత్మ
భారమైన స్వేచ్చే!
బాధకో
కోపానికో
నిస్సహాయతకో
మాత్రమే
పరిమితమయ్యి
పరిష్కార దిక్కున
మొలకెత్తని భావ స్వేచ్చ
భారమైన స్వేచ్చే!
వ్యతిరేకత లేని
లోక ఆమోదం
స్వేచ్చ
లక్ష్యమైతే
ఆ సంకుచిత్వ సూచి
భారమైన స్వేచ్చే!
భావ స్వరూపం
మారని అంతర్గత
బానిస భావజాలానికి
బహిర్గత స్వేచ్చ
కప్పు అయితే
అది
భారమైన స్వేచ్చే!
బరువెక్కని స్వేచ్చ
అన్నింటి చేత
సిలువెత్తబడని
అంతర్ముఖ స్థిరత్వంలో
ఉన్నది!
భారమవ్వని స్వేచ్చ
కాలానికి
నాగరికతకు
మార్పుకు
లొంగని
మనస్తత్వంలో ఉంది!
* * *

Comments
Post a Comment