ఆకాశం పై సంతకం

 ఆకాశం పై సంతకం

-శృంగవరపు రచన


స్థిరత్వం లేకపోవడం,అనుకున్నవి జరగకపోవడం, ప్రతి సారి ఏదో ఒక ఊబిలో చిక్కుకుపోవడం చాలా మంది మనుషుల జీవితంలో జరిగేదే. జీవితంలో ఏమవ్వాలో అన్నది మొదటే నిర్ణయించుకుని దానికి తగ్గట్టు పయనాన్ని మలచుకునే వారు కొందరైతే, ఇంకొందరు జీవితంలో వచ్చిన అవకాశాలతో పాటు పయనిస్తూ,పడిపోతూ,చివరకు ఆ అవకాశాల మార్గంలో నిర్మించబడిన వ్యక్తిత్వ ప్రతిభ,విలువల ఆధారంగా జీవితాన్ని మలచుకుంటూ సాగేవారు ఇంకొందరు. రెండో రకానికి చెందిన వ్యక్తే నేడు భారత దేశంలో బిలియన్ డాలర్ల పైనే టర్నోవర్ సాధించిన అతి పెద్ద ఐటి సర్వీసెస్ కంపెనీ అయిన ‘మైండ్ ట్రీ’ కో ఫౌండర్ సుబ్రోతో బాగ్చి. ఆయన సాధారణ క్లర్కు స్థాయి నుండి ఓ అతి పెద్ద కంపెనీకి కో ఫౌండర్ గా మారే క్రమంలో ఆయన జీవితంలో ఎత్తు పల్లాల గురించి, ఈ క్రమంలో ఆయన జీవితం గురించి నేర్చుకున్న పాఠాల గురించి ఆయన రాసిన పుస్తకమే ‘Go Kiss the World.’
1957 లో ఒరిస్సాలోని పాట్నాగర్ లో జన్మించాడు బాగ్చి. అతను తల్లిదండ్రులకు ఐదో పుత్రుడు మరియు ఆఖరి పుత్రుడు. బాగ్చి మీద అతని కుటుంబ వాతావరణ ప్రభావం,తల్లిదండ్రుల పెంపకంలో భాగమైన విలువలు,అతని అన్నలు ప్రతిభావంతులు కావడం,అటువంటి వాతావరణంలో పెరగడం వల్ల బాల్యం నుండే అతని మేధస్సు వికసించింది. బాగ్చి తండ్రి మేజిస్ట్రేట్ గా పని చేసినా, ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ లో స్థిరపడినా,తన పై అధికారి బిహార్ కు వెళ్ళమన్నప్పుడు తిరస్కరించడం వల్ల ఆయన్ని డిమోట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ప్రదేశాలకు బదిలీల మీద తండ్రితో పాటు కుటుంబం అంతా మారడం వల్ల బాగ్చి మొదటి నుండే మార్పుకు తనను తాను సిద్ధం చేసుకునే వాతావరణానికి తనను తాను మలచుకున్నాడు. కొత్త ప్రదేశాల్లో ఉండగలగటం,కొత్త వారితో స్నేహాన్ని చేయగలగడం,కొత్త ఆహార విధానాలకు,కొత్త ఆచారాలకు అలవాటు పడి ఆహ్వానించడం బాగ్చికి ఈ బదిలీల వల్లే సాధ్యపడింది.
బాగ్చి కుటుంబంలోనే సర్వైవల్ ఇన్ స్టింక్ట్ బలంగా ఉంది. బాగ్చి అమ్మమ్మ (తల్లికి తల్లి) భర్త మరణించాక,ఆమె కుటుంబాన్ని తానే నిలబెట్టింది. బాగ్చి తల్లి వివాహమయ్యింది. బాగ్చి తండ్రికి మ్యానియాక్ డిప్రెషన్ ఉందన్న విషయం పెళ్ళి అయిన ఎన్నో సంవత్సరాలకు కానీ బాగ్చి తల్లికి తెలియదు. కొన్నేళ్ళ తర్వాత హఠాత్తుగా తిరగపెట్టే ఈ అస్వస్థత వల్ల మధ్యలో హాస్పటల్ లో ఎలక్ట్రికల్ ట్రీట్ మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత మరలా బాగుపడటం వంటివి జరుగుతూ ఉండేవి. బాగ్చి తల్లికి కంటిలో కాట్రాక్ట్ వచ్చినప్పుడు అది ఆపరేషన్ చేసి బాగు చేసినా, ఆ తర్వాత రెండో కంట్లో కూడా రావడంతో దానిని బాగు చేసే క్రమంలో కంట్లో ఏర్పడిన అల్సర్స్ ను వైద్యులు గుర్తించకుండా ఆపరేషన్ చేయడం వల్ల బాగ్చి తల్లి పూర్తి అంధురాలిగా మారిపోయింది. కానీ దాని వల్ల అధైర్యపడకుండా తన పనులు తాను చేసుకోవడానికి అలవాటు పడిపోయింది.
బాగ్చి పెద్దన్న దాదాముని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. బాగ్చి తల్లి,అప్పటికే రిటైర్ అయిన బాగ్చి తండ్రి,బాగ్చి దాదాముని తో కలిసి ఉండేవారు. బాగ్చి కి చదువు విషయంలో మెంటర్ గా వ్యవహరించాడు దాదాముని.జీవితంలో ఓ లక్ష్యం కోసం ఎలా కష్టపడాలో అన్న దగ్గరే నేర్చుకున్నాడు బాగ్చి. ఇక రెండో అన్న శాంతి స్వరూప్. హై స్కూల్ పూర్తి చేశాక ఎయిర్ ఫోర్స్ లో చేరాడు. సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వచ్చే ఆ అన్న షూ పాలిష్ చేయడం లాంటి చిన్న పనుల్లో ఉండే పర్ఫెక్షన్ గురించి నేర్పించాడు. ప్రతి చిన్న అంశాన్ని పరిపూర్ణంగా చేయడంలో ప్రాధాన్యతను బాగ్చి రెండో అన్న నుంచి నేర్చుకున్నాడు. ఇక మూడో అన్న అమితావ్. రెబెల్ లా ప్రవర్తించే మనస్తత్వం ఉన్నవాడు అమితావ్. కళాశాల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాడు. మనం సాధించే లక్ష్యల్లో మానవత్వం,మన విలువలు ఉండాలని నమ్మే వ్యక్తి అమితావ్. తనకు నచ్చని దానిని ప్రశ్నించే తత్వం ఉన్నవాడు. ఆ తర్వాత పెళ్ళి చేసుకుని, ఇద్దరి బిడ్డల తండ్రి అయ్యాక, జీవితం మీద ఆసక్తి కోల్పోయి సన్యాసం తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన అతను కొన్నేళ్ళ తర్వాత ఓ యాక్సిడెంట్ లో కొడుకు మరణించాక అతని దహన సంస్కారానికి మాత్రం తిరిగి వచ్చాడు. జీవితంలో తన చుట్టూ ఉన్న వారి నుండి ఏదో ఒకటి నేర్చుకునే అలవాటు బాగ్చికి తన కుటుంబ సభ్యుల నుండే మొదలయ్యింది. బాగ్చి తండ్రి బాగ్చి అమెరికాలో విప్రో కోసం పని చేస్తున్న సమయంలో అప్పటికే కాటరాక్ట్ ఉండటం వల్ల కళ్ళు కనిపించకపోవడం వల్ల సిగరెట్ వెలిగించే క్రమంలో బత్తలకు మంటలు అంటుకోవడంతో హాస్పటల్ లో కాలిన గాయాలతోనే మరణించాడు. బాగ్చి తల్లి మరణించే ముందు బాగ్చి ఆమె నుదురు మీద ముద్దు పెట్టినప్పుడు,ఆమె వెళ్ళి ప్రపంచంపై ముద్దు పెట్టు. అదే అతనిలో అప్పటికే ఉన్న తపనను అధికం చేసింది.
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బాగ్చి ఇంకా చదవాలన్న కోరిక ఉన్న దాదాముని పై తన చదువు భారం కూడా పడటం ఇష్టం లేక ఒరిస్సా ప్రభుత్వ పరిశ్రమల శాఖలోని ఓ క్లర్క్ ఉద్యోగం సాధించి అందులో చేరిపోయాడు. చిన్న ఉద్యోగ స్థాయి నుండి జీవితాన్ని చూడటం తన ఉద్యోగాల వల్లే నేర్చుకున్నాడు బాగ్చి. క్లర్కు గా ఆఫీసులో ప్రతి లెటర్ కు ఫైల్ ఎలా ఓపెన్ చేయాలో బాగ్చి నేర్చుకున్నాడు. ప్రభుత్వ పని తీరులో ఉండే పద్ధతుల వల్ల ఓ క్రమపద్ధతిలో పని ఎలా చేయాలో కూడా ఈ ఉద్యోగం అతనికి నేర్పించింది.ఆ ఉద్యోగం చేస్తూనే లా కూడా పూర్తి చేశాడు బాగ్చి.
జీవితంలో ఇంకా ఎదగాలన్న కోరిక బాగ్చి లో బలపడింది.తన అర్హతకు సరిపోయే ఉద్యోగ వేటలో అతనికి డిసిఎమ్ గ్రూప్ మేనేజ్మెంట్ ట్రెయినీస్ కు ఉద్యోగాలు ప్రకటించడం,బాగ్చి ఆ ఉద్యోగాన్ని సాధించడం జరిగిపోయింది. అంతకు ముందు క్లర్కుగా సంపాదించిన దాని కన్నా మూడు రెట్లు ఎక్కువ ఉన్న ఉద్యోగం ఇది. డిసిఎమ్ ఎన్నో రంగాల్లో ఉంది. అందుల్లో బట్టల పరిశ్రమ కూడా ఒకటి. ఢిల్లీలో ఉన్న క్లాత్ మిల్ లో బాగ్చికి శిక్షణా ఉద్యోగం ఇవ్వబడింది. ఓ సంవత్సరం శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా బాగ్చికి పదోన్నతి వచ్చింది. అక్కడ వర్క్స్ సెక్రటరీగా పని చేస్తున్న మహేశ్ చాంద్ కింద బాగ్చి పని చేయవల్సి వచ్చింది. అప్పటికే మహేశ్ ఉద్యోగం బాగ్చికి ఇస్తారన్న పుకారు ఉండటం వల్ల తన వృత్తి అభద్రతా భావనా వల్ల బాగ్చిని ఇష్టపడేవాడు కాదు మహేశ్ . ఆ తర్వాత ఓ అంశంలో మహేశ్ మీద అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు బాగ్చిని అడిగినప్పుడు బాగ్చి మహేశ్ అటువంటి పనులు చేయడని చెప్పడం మేనేజ్మెంట్ కు కోపం తెప్పించడంతో మహేశ్ తో పాటు అతని ఉద్యోగం కూడా తొలగించబడింది. ఐదేళ్లు ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ లో పని చేసిన బాగ్చికి తర్వాత ఆ అనుభవం ఎందుకు పనికి వస్తుందో స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఆ తర్వాత హెచ్ సి ఎల్ లో కంప్యూటర్స్ సేల్స్ మ్యాన్ ఉద్యోగంలో చేరాడు బాగ్చి. సేల్స్ మ్యాన్ గా ఎన్నో నేర్చుకున్నాడు. తిరస్కరణను జీవితంలో భాగంగా ఎలా ఆహ్వానించాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుండి పిఎస్ ఐ సిస్టమ్స్ సేల్స్ మ్యాన్ గా పని చేశాడు. అదే సమయంలో కంప్యూటర్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్న క్రమంలోనే బాగ్చి డాటా క్వెస్ట్ అనే కంప్యూటర్ పత్రికకు ఆర్టికల్స్ రాసేవాడు.అలా తనకు ఇష్టమైన రాయడాన్ని కూడా తన జీవితంలో తన వృత్తితో అనుసంధానం చేసుకున్నాడు.
బాగ్చి అంతకు ముందు ఉద్యోగం చేసిన సంస్థల్లో కొందరు ప్రాజెక్ట్.21 అనే కొత్త సంస్థను నెలకొల్పాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో బాగ్చి కూడా భాగస్వామి అయ్యాడు. అప్పటికే ఇంటిని నడపటానికే డబ్బులు లేని సమయంలో బాగ్చి కంపెనీ లాభాల్లో నడిచాక అతని వాటా ఇవ్వవచ్చని చెప్పడంతో ఒప్పుకుని అలా ఎంటర్ ప్రెన్యూర్ అయ్యాడు బాగ్చి. కంప్యూటర్ అక్షరాస్యత కలిగించే దిశలో స్థాపించిన ఈ సంస్థ రెండేళ్లకు మించి నడవలేక మూతబడింది. అలా మొట్టమొదటిసారి బాగ్చి ఓ వ్యాపారవేత్తగా మారాడు.
తర్వాత విప్రోలో సేల్స్ కో ఆర్డినేటర్ గా ఉద్యోగం మొదలు పెట్టి అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ఎదిగాడు బాగ్చి. విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జి తో సన్నిహితంగా కూడా పని చేశాడు.ఆ తర్వాత విప్రో కంపెనీకి అమెరికాలో ఆర్ ఆండ్ డి టీం బలపడటానికి అహర్నిశలు శ్రమించాడు బాగ్చి. ఆ కంపెనీలోని ఎందరికో రోల్ మోడల్ గా మారాడు. ఆ తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వల్ల ఇంకో ఉద్యోగ అవకాశం రావడంతో విప్రోను వదిలివేసినా, ఆ కొత్త కంపెనీలో కూడా ఇమడలేకపోయాడు. ఆ తర్వాత పది మందితో ఏర్పడిన ‘మైండ్ ట్రీ’ లో కో ఫౌండర్ గా ఉన్నాడు. మైండ్ ట్రీ ను నేడు విజయవంతమైన సంస్థగా రూపుదిద్దడంలో బాగ్చి కూడా ముఖ్య పాత్ర పోషించాడు. అలా సామాన్యుడిగా జీవితాన్ని మొదలు పెట్టి తన జీవితంలోని ప్రతి దశలో నేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగి ఎందరికో స్పూర్తినిచ్చిన వ్యక్తి బాగ్చి.
ఓ వ్యాపారవేత్త కావాలని బాగ్చి తన వృత్తి జీవితాన్ని మొదలు పెట్టినప్పుడు అనుకోలేదు. కానీ బాగ్చి చేసిన ప్రతి ఉద్యోగం నుండి అతను నేర్చుకున్న నైపుణ్యాలే అతన్ని గొప్ప వ్యాపారవేత్తను చేశాయి.మనిషి తన జీవితంలో నేర్చుకుంటూ ఉండే నైపుణ్యాలను సమిష్టి ఉత్పాదకతకు ఎలా వినియోగించుకోవచ్చో స్పష్టం చేసే జీవితమే బాగ్చిది.
* * *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష