కొన్ని ఆలోచించాలి!!

                                 కొన్ని ఆలోచించాలి!!

(Intellectual Masturbation-Pseudo Intellectual Masturbation)

                                                                                    -శృంగవరపు రచన


మనకు ఏం తెలుసు? మనకు ఏం తెలియదు? ఏం తెలుసుకోవాలి? ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు? ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకకూడదు?ఏది తెలిస్తే అన్ని తెలిసినట్టు? ఈ ప్రశ్నలకు సంతృప్తినిచ్చే సమాధానాలు ఎంత మంది దగ్గర ఉన్నాయి?అలా అనిపించడానికి ఆలోచింపజేసే ఏదో ఓ గాఢ అనుభూతిని కలిగించే ప్రేరణ కలగాలి లేదా జీవితంలో కొన్ని పరిస్థితులు ఆ సందర్భాన్ని కల్పించాలి.
సినిమాల్లో జీవితం ఉంది. సాహిత్యంలో జీవితం ఉంది. సాంకేతికతలో జీవితం ఉంది. అధికారంలో జీవితం ఉంది. డబ్బులో జీవితం ఉంది. సుఖాల్లో జీవితం ఉంది. అందంలో జీవితం ఉంది. ఆడంబరాల్లో జీవితం ఉంది. ప్రకృతిలో జీవితం ఉంది. విశ్వంలో జీవితం ఉంది. మనుషుల అభిరుచులను బట్టి ఒక్కో అంశంలో జీవితం ఇమిడి ఉంది.
పైన చెప్పినవి అన్ని మనిషి జీవితాన్ని బాహ్యంగా తృప్తి పరిచే విషయాలు అయినా, వీటిని మించి మనుషులందరికి ఉమ్మడిగా సంతృప్తిని ఇచ్చే ఓకే అంశం తన తెలివి తేటలను నిరూపించుకోవడంలో ఉంది. అదే తెలివి తేటల నిరూపణలో మనిషి ఇగోల మధ్య యుద్ధం అనివార్యం.
మనిషి తన తెలివి తేటలను నిరూపించుకోవడానికి చేసే వ్యాఖ్యలను 'Intellectual Masturbation'కు ఉదాహరణగా గూగుల్ పేర్కొన్నది.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాస్తవంగా ఆచరించలేని, ప్రయోజనం లేని అంశాలను గట్టిగా నమ్మడం లేదా వాటి అవాస్తవికతను వాస్తవికతగా నిరూపించే ప్రయత్నం చేయడం.బహుశా అదే వ్యవస్థలో కూడా ఇమిడిపోయింది. రాష్ట్రాల్లో, దేశాల్లో, సమాజాల్లో అవినీతిని, అక్రమాలను నిరసించే పౌరుల్లో మనమందరం ఉన్నాం. అదే సమాజంలో సమాజ మార్పులో భాగం కావడానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ తెలివిని, సామర్ధ్యంని వివిధ స్థాయిల్లో నిరూపించుకుని Intellectuals గా మారిన వారే వ్యవస్థల్లో అడుగుపెడతారు. సగటు పౌరుల్లో తెలివితేటలు పక్కన పెడితే మనుగడ గురించి ఆలోచించగలిగే మనిషి ప్రకృతిలో తెలివి లేదని ఎవరూ అనగలరు?
తెలుగు సినిమాల్లో మెలోడియస్ టోన్ లో ఉండే సినిమాలే సూపర్ హిట్లు అయ్యాయి. కానీ ఓకే విషయాన్ని ఆలోచింపజేసే రీతుల మార్పుతో చెప్పిన దర్శకులు ఉన్నారు. తాను చెప్పదలుచుకున్నది చెప్పడమే ముఖ్యమనుకునే దర్శకుల్లో దేవకట్టా ఒకరు. రిపబ్లిక్ సినిమాలో ఇంటర్ వ్యూ సన్నివేశంలో Pseudo Intellectual Masturbation అనే పదాన్ని ప్రయోగించిన రా ఎమోషనల్ ఇంటెన్సిటీ ఉన్న దర్శకుడు దేవకట్టా. డార్విన్, నిషేలను, రాజకీయాలను గురించి మాట్లాడుతూనే సిస్టమ్ లో విభిన్నంగా ఉండే వాడిని అవినీతి వ్యవస్థ చంపదు, బ్రేక్ చేస్తుంది. అపజయాలతో వాస్తవాన్ని గ్రహించి అదే విభిన్న వ్యక్తి వ్యవస్థలో కలిసిపోతాడు. అలా కాలేనివాడు చంపబడతాడు. ఇది రిపబ్లిక్ స్టోరీలో దేవకట్టా చెప్పిన అంశం.ఇది సిస్టమ్ లోని అవినీతికి వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన ఎందరో ఐఏఎస్ ఆఫీసర్ల జీవితాలలో కొన్ని ఉదంతాలకు నిదర్శనం కూడా.అదే దేవకట్టా 'ప్రస్థానం'లో మనుషుల్లో మనుగడ, అధికారం కోసం జరిగే రక్తపాతంలో మనిషి అనుబంధాలకు, కుటుంబాలకు విలువ ఇవ్వడం వ్యక్తుల అధికార దాహన్ని అనుసరించి ఉంటుందని రా ఎమోషనల్ సినిమాగా మలిచిన దర్శకుడు.
ఇక బాలచందర్ 'రుద్రవీణ'లో దేవుడు-మనుషుల మధ్య దూరాన్ని పుట్టుక, కులాన్ని బట్టి కొలిచే సంస్కృతిలో మార్పును తెచ్చే ప్రయత్నం. బాల లాంటి తమిళ దర్శకులు అదే నిజాన్ని రా ఫార్మ్ లో చెప్పారు.
'మార్పులు-మనుషుల సమస్యలు-పరిష్కారాలు-మనం'ఈ వలయంలో మనం ఎక్కడ ఉన్నాం? కొందరం మనుగడ దగ్గర ఉంటే, ఇంకొందరం ఇంకో అడుగు పైనా ఉన్నామేమో. ఎవరూ ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే,అందరం కలిసే సమిష్టి స్థాయి ఒకటే అది గుర్తింపు, న్యూనతను కప్పి పుచ్చుకునే దశ. అక్కడే 'Intellectual Masturbation', Pseudo Intellectual Masturbation లకు పునాది పుడుతుంది. సినిమాల్లో నాయకుడు కష్టాలు ఎదుర్కోవడంలో ప్రేక్షకులు సంతృప్తిని పొందడం Intellectual Worship క్రమానికి ఓ రూపం. ఒకరిని ఆరాధిస్తూ వారు చేసేది సరైందని నిర్ణయించుకోవడం, వారిని నాయకులను చేయడం సగటు మనుషులు తమ ఆరాధనలో హీరోలను సృష్టించే క్రమం. ఇక పాఠకులు అదే వర్షిప్ భావనతో ఇంటలెక్చువల్స్ ను సృష్టించే క్రమం.
ఇకపోతే ఇదే సమాజంలో Intellectuals/Leaders పుట్టడం ఎంత సహజమో, Gaslighting (వ్యక్తుల వ్యక్తిగత శీలాన్ని సందేహాస్పదంగా మార్చి వారు మాటలు, చర్యలు నమ్మదగినవి కాదని నమ్మించగలగడం)ద్వారా వారిని నాశనం చేయడం కూడా మనుషుల స్వరూపంలో దాగి ఉన్న వికృతే.
జీవించే ప్రతి దశలో మనకు ఉత్సాహన్ని ఇచ్చే అంశం మన తెలివితేటల ప్రదర్శన కాకపోతే ఏది మరి జీవితంలో ఉత్సాహన్ని ఇస్తుంది? ఆ ఉత్సాహంలో గెలుపును పొందిన స్ఫూర్తి ఉంటే దానిని ఎలా దాటగలము? ప్రతిభా ప్రదర్శనలో పోటీను ఎదుర్కోవడంలో మళ్ళీ అదే తెలివితేటల నిరూపణ కాదా?! ఈ రెండు కోణాల్లో అంశాలను దర్శించే దృష్టి విభిన్నం అయినప్పుడు, ఆలోచనలో నిర్ధిష్ట అభిప్రాయం లేనప్పుడు Intellectual /Pseudo Intellectual Masturbation లేని దశ సాధ్యం కాదేమో!!
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ