చైతన్య స్పృహ

                                     చైతన్య స్పృహ

                                        -శృంగవరపు రచన


ప్రతి రచయితకు తన రచనాఉద్దేశ్యం ఉండటం సహజం.రచయిత తన రచనల్లో ప్రదర్శించే కథనం, కంఠస్వరం అనుసరించి ఆ రచయిత ఉద్దేశ్యం ఏమిటి అన్న అంశం మీద పాఠకుడు ఓ అవగాహనకు వస్తాడు.మన నిత్య జీవితంలో ఉండే అనుబంధాల్లో, సామాజిక సంబంధాల్లో, సంస్థల స్వరూపంలో, వ్యక్తుల మనస్తత్వాలలో ఉండే సహజ ధోరణులని గురించి ఓ పక్కన చెప్తూ, వాటి స్వరూప మూలాలను చర్చిస్తూనే, సంస్కార శక్తి వీటిలో ఎలా ప్రేమ స్పూరిత మార్పును అనేక స్థాయిల్లో తీసుకురాగలదో, బాధ్యత ఎలా మనుషుల్లో అలవడుతుందో వంటి ఆలోచింపజేసే ఉద్దేశ్యాలను స్పష్టం చేసే కథా సంపుటే డాక్టర్ లక్ష్మి రాఘవ గారి 'అనుబంధాల టెక్నాలజీ.'
ఈ కథాసంపుటిలో 32 కథలున్నాయి. ప్రతి కథ మన చుట్టూ ఉన్న జీవితాలనో, మనకు తెలిసి లోతుగా ఆలోచించడానికి ఇష్టపడని ఎన్నో అంశాలను ఈ కథల్లో వ్యక్తపరిచారు రచయిత్రి. మొదటి కథ 'అనుబంధాల టెక్నాలజీ.' తరాలు మారేకొద్ది ఆలోచనలు మారుతాయి. కాలంతో పాటు మనుషులకు తెలివితేటలు వచ్చే వయసును కుదించివేస్తాయి. తన పెద్ద మనవడు తన దగ్గర అన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చూపిన కూతుహలం చిన్న మనవడు చూపించకపోవడం వెనుక ఉన్న కారణాల గురించి ఆలోచిస్తాడు శేషాచలం. అన్ని అంతర్జాలంలో తెలుసుకోగలమన్న భావన జనరేషన్ గ్యాప్ వల్ల తమకు తెలిసినంత తమ వెనుకటి తరాల వారికి తెలియదనే భావన కూడా ఈ నిర్లక్ష్యానికి కారణం అని భావించిన శేషాచలం తనకు తెలిసినవి బోధించే పద్ధతిలో కాకుండా మనవడి నుండి తెలుసుకునే ప్రయత్నం చేసి మనవడికి దగ్గరవుతాడు. క్రమంగా మనవడు కూడా ఆ తాతయ్య ఆప్యాయతను అర్ధం చేసుకుంటాడు.అనుబంధాలు బలపడాలన్న సరే టెక్నాలజీ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ కథ స్పష్టం చేస్తుంది.
రెండో కథ 'జ్ఞానోదయం.' చాలా విషయాల్లో తప్పు ఒప్పుల మీద ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనిషి తన జీవితంలో ఒకలా ఇంకొకరి విషయంలో అయితే ఇంకోలా ప్రవర్తించడం సహజం.ఝాన్సీ విద్య వల్ల ఆలోచించడం, చుట్టూ జరిగేవి గమనించడం వల్ల ఆమెకు తండ్రి వేరే స్త్రీతో సంబంధం పెట్టుకోవడం తల్లి వేరే ఆధారం లేక రాజీ పడటం వల్ల ఆమె తల్లితో ఘర్షణ పడేది. ఆ తర్వాత తనకు ఉద్యోగం వచ్చాక తల్లి తండ్రికి అనారోగ్యంగా ఉందని చూసుకోవడానికి వెళ్ళిపోతే అపోటి నుండి కుటుంబ అనుభవం వల్ల పెళ్ళి లేకుండా ఉండిపోయి, తల్లికి కూడా దూరంగా జరిగిపోయింది. ఆమె తన దగ్గర పని చేసే రంగమ్మ కూతురు శాంతకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఆమె చదివించి ఆ తర్వాత తన ఆఫీసులోనే అటెండర్ ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. శాంత తన మేనమామను వివాహం చేసుకోవడానికి సుముఖత చూపడంతో ఆమె ఆశ్చర్యపడుతుంది. శాంత తనను చదువుకున్న వ్యక్తి పెళ్ళి చేసుకున్నా బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి అని అర్ధం చేసుకోలేకపోవచ్చని మేనమామ తన తండ్రి కుటుంబాన్ని పోషించకుండా బాధ్యతారహిత్యంగా ఉన్నప్పుడు కుటుంబానికి అండగా ఉన్నాడని తన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలంటే మేనమామ సహకారం తనకు ఉంటుందని చెప్తుంది. శాంత చెప్పింది విన్నాక తన తల్లి గురించి ఆలోచనా దృక్కోణంలో ఝాన్సీలో మార్పు వస్తుంది. ఏ తప్పు చేయని తల్లికి తను దూరంగా ఉండటం తప్పని అనుకుని తల్లికి అండగా ఉండాలని నిర్ణయించుకుంటుంది.
మూడో కథ 'పల్లెటూరు మనుష్యులూ-పట్నం మనసులూ.'రజిత, రవీంద్ర భార్యాభర్తలు. పట్టణంలో ఉంటున్న రజితకు పల్లెటూర్ల మీద సదాభిప్రాయం లేదు. రవీంద్ర తమ్ముడు రాజు పల్లెటూరి అమ్మాయి గిరిజను వివాహం చేసుకున్నాడు.రజిత ఆస్తుల కోసం తల్లితో సరిగ్గా మాట్లాడను లేదు. ఆమె చనిపోయాక కూడా ఆస్తుల ఆలోచనలకే పరిమితమైంది. గిరిజ తండ్రి మరణించడంతో ఆ పల్లెటూరికి భర్తతో పయనమైన రజిత అక్కడి ప్రేమలను చూసి మనిషికి జీవితంలో కావాల్సింది కష్టాసుఖాల్లో మనుషులని, ఆప్యాయతలని తెలుసుకుంటుంది అక్కడి వాతావరణంలో. మనిషికి మార్పుకు అనుకూలమైన వాతావరణం కల్పించి అటువంటి మనుషుల మధ్య ఉంటే మార్పు వచ్చే అవకాశం ఉందని రచయిత్రి ఈ కథ ద్వారా స్పష్టం చేసారు.
నాలుగో కథ 'జెల్ పాడ్.'మనిషి తెలివితేటలతో దోమల నుండి తనను బాధించే అన్నింటిని అంతం చేయడానికి సాంకేతికత వైపు పరుగులు పెడుతున్నాడు. రామచంద్రానికి కోడలు ఎలుకల బాధను వదిలించుకోవడానికి జెల్ పాడ్ తీసుకురావడం వల్ల ఎలుకలు దానికి అతుక్కుపోయి పడుతున్న బాధను చూసాక దాని బదులు బోను తెస్తే బావుండని అనిపించి మర్నాడు ఎలాగో తెప్పించి కోడలని ఒప్పించి ఎలుకలు బోనులో పడ్డాక వాటిని దూరంగా వదిలేసి వచ్చాడు. ఈ సంఘటన గురించి ఆలోచిస్తున్న క్రమంలో రచయిత్రి హింసా ప్రవృత్తి గురించి, సాంకేతికత పెరిగే కొద్ది దానిని జయించే ఇంకా తెలివైన తరాలు జన్మించే అవకాశాన్ని గురించి స్పష్టం చేసారు. మనకు సంతోషం ఇవ్వని వాటిని హింసించడం మనిషి ప్రవృత్తిలో ఓ అంశమని కూడా రచయిత్రి పరోక్షంగా చెప్తారు. చిన్న కథల్లో లోతైన ఆలోచనలను స్పృశించారు రచయిత్రి.
ఐదో కథ ' నిలబడి నీళ్లు...'దీప్తి, శంకర్ భార్యాభర్తలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న శంకర్ తనకు కాకుండా ప్రాజెక్ట్స్ కొత్త వారికి ఇవ్వడం వల్ల కొంత డిప్రెస్ అవుతాడు. పోటీ యుగంలో తాను నెట్టుకురాలేనేమోనన్న భయంతో అతను కుచించుకుపోతూ తనలో తానే మధనపడుతూ ఉంటాడు. దీప్తి కూడా ఉద్యోగస్తురాలే. భర్తను అత్తమామల దగ్గరకు తీసుకువెళ్తే ప్రయోజనం ఉంటుందని ఆశించి అక్కడకు భర్తతో కలిసి వెళ్తుంది.ఆ పల్లెటూరి వాతావరణంలో కొంత మార్పు కనిపించడం మొదలు అవ్వడంతో భర్త సమస్యను అత్తమామాల దృష్టికి తీసుకువెళ్తుంది. శంకర్ కు జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పుల గురించి మెడిటేషన్, పూజ, తను మాత్రమే అని కాకుండా అందరితో మనం అనే ఆలోచనా శైలిని పెంపొందించుకోవాల్సిన అవసరం గురించి తండ్రి చెప్పడంతో కొంత మార్పు వస్తుంది శంకర్ లో. తర్వాత కంపెనీ వారు ఇంకో ప్రాజెక్ట్ కు సీనియర్ గా ఎవరినైనా సూచించమంటే హుందాగా దానికి ఒప్పుకుని ఆఫీసుకు వెళ్ళడానికి పయనమవుతాడు. ఈ మార్పుకు అందరూ సంతోషిస్తారు.
ఆరో కథ 'పరిష్కారం.'విజయ, ప్రభు భార్యాభర్తలు.వారిద్దరికి పిల్లలు లేరు. లోపం ప్రభులో ఉండటం వల్ల కృత్రిమ గర్భధారణ ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్య సమయంలో ఓ రాత్రి వారిద్దరూ సెకండ్ షో నుండి వస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు విజయ మీద అత్యాచారం చేస్తాడు. ఆ సమయంలో ప్రభు నిస్సహాయుడైపోతాడు. ఆ తర్వాత ఆ ఘటన వల్ల విజయ గర్భవతి అవుతుంది. విజయ జరిగిన దాని పట్ల
బాధ పడుతుంది. ఆ బిడ్డ వద్దనుకుంటుంది. ఆ సంఘటన ఎంతో బాధించినా ప్రభు మాత్రం ఎలా అయినా గర్భం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో అపరిచిత వ్యక్తి వల్ల కలిగేదే కనుక ఇప్పుడు ఈ గర్భం ఉంచుకోవడమే మంచిదని భావించి భార్యను ఒప్పిస్తాడు. దానితో పాటు అత్యాచారాలకు గురైన స్త్రీల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం నిర్మించాలని ప్రభు నిర్ణయించుకుంటాడు.వచ్చిన సమస్య నుండి ఉన్నత పరిష్కారం వైపు ఎలా పయనించవచ్చో, సమాజంలో చైతన్య వారధిగా ఎలా మారవచ్చో ఈ కథ ద్వారా రచయిత్రి చెప్పే ప్రయత్నం చేసారు.
ఏడో కథ 'ఈ ఎడబాటు వద్దు!'అమెరికాలో కొడుకు ఒక్క తల్లిని మాత్రమే తన దగ్గరకు అవసరానికి పిలిపించుకుని, తండ్రికి -తల్లికి మధ్య వేర్పాటు సృష్టించినప్పుడు ఆ తల్లి ఆ వృద్దాప్యంలో తండ్రికి రాసిన లేఖ ద్వారా ఆ వయసులో ఉండే ఆప్యాయత, ప్రేమ, ఒకరికొకరిగా ఉండిపోయేతనం గురించి ఈ లేఖ ద్వారా ఈ కథలో ఎంతో హృద్యంగా రాసారు.
ఎనిమిదో కథ 'ఎస్సెమ్మెస్.'భార్యభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ గురించి చెప్పే కథ ఇది. పెళ్ళికి పూర్వం స్త్రీ పురుషులిద్దరికి కూడా వేరే వారితో పరిచయాలు స్నేహాలు ఉండవచ్చు. ఆ క్రమంలో ఓ భార్యకు మొదట నిశ్చయించబడి ఆగిపోయిన పెళ్ళి కొడుకు ఆమె జీవితంలో పెళ్లయి స్థిరపడ్డాక ఆమెను ఓ సారి కలవమని మెసేజీలు చేస్తూ ఉంటాడు. చివరకు తెలిసేది ఏమిటంటే అతను ఇష్టపడిన ఆమెను మేనరికం కోసం వదులుకున్నాక అతని జీవితంలో భార్యా వియోగం తో పాటు ప్రస్తుతం అతను క్యాన్సర్ చివరి దశలో ఉండటం వల్ల ఆమెకు ఓ సారి క్షమాపణ చెప్పాలని అనుకోవడం కోసం అతను అలా చేశాడు. ఆ మెసేజ్ లు ఆ భార్య తప్పు చేయలేదు కనుక డిలీట్ చేయదు. అనుమానానికి చోటు ఉంటుందని దాచే ప్రతి విషయం తప్పుగానే పక్కన వారి దృష్టిలో ముద్రించబడుతుంది. దానికి ఆస్కారం లేని సంబంధం ఉండాలని స్పష్టం చేసే కథ ఇది.
తొమ్మిదో కథ 'పెంపకం.'బాల్యం నుండి పిరికిగా పెరిగిన ఓ వ్యక్తి తన కొడుకుకు ధైర్యం నేర్పుతున్నాననుకుని ఆ పిల్లవాడు బాల్యం నుండి ఎవరిని కొట్టినా ఏం చేసినా అలానే ఉండమని ప్రోత్సహించాడు. దాని ఫలితంగా అతను పెద్దవాడయ్యాక రౌడీగా మారడమే కాకుండా తల్లిని సైతం బెదిరించి నగలు పట్టుకువెళ్తాడు. దానితో తండ్రి తన పెంపకంలోని లోపాన్ని తలచుకుని బాధపడతాడు.
పదో కథ 'సంఘటనా-సంస్కారమూ.'మనుషులను కొన్ని సంఘటనలు ఎలా సంస్కారం పాటించనివ్వని ఇబ్బందుల్లో పడవేస్తాయో స్పష్టం చేసే కథ ఇది.అల్లుడు కట్నం కోసం కూతురిని ఇబ్బందులు పెడుతున్నాడని తెలుసుకున్న ఓ రిటైర్డ్ స్కూల్ మాస్టర్ బస్సులో బయలుదేరతాడు. ఆ బస్సులో ఓ స్త్రీ తన కూతురితో సహా పెళ్ళికి బయల్దేరుతుంది. ఒకేచోటుకు కావడం వల్ల ఆమె భర్త ఆమెను చూస్తూ ఉండమని ఆయనకు చెప్తాడు. మధ్యలో బస్సుకు ప్రమాదం కలగడం ఆ మాస్టారూ తప్పించుకున్నా ఆ స్త్రీ ఆమె కూతురు మరణించడం జరుగుతుంది. ఆమె చనిపోయే ముందు ఆయనకు ఓ సంచి ఇస్తుంది. దానితో కూతురింటికి వెళ్ళి జరిగింది చెప్తాడు. ఆ సంచిలో ఉన్న బంగారాన్ని అల్లుడికి ఇస్తానని ఆయన అంటే కూతురు దానికి నిరాకరించి తండ్రితో ఏదో ఒక ఉద్యోగం చేసుకుని జీవించాలని నిర్ణయించుకుని తండ్రితో పుట్టింటికి వచ్చేసాక, ఆ సంచిని ఆ భర్తకు అందజేస్తారు. అతను తన భార్య జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు సంతోషించి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్తాడు. మనిషి ప్రలోభాన్ని కష్ట సమయంలో దాటగలిగితే అప్పుడు దానిని మించిన ఫలితం వస్తుందని రచయిత్రి ఈ కథ ద్వారా స్పష్టం చేసారు.
పదకొండో కథ 'గెలుపు గుర్రం.' జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రేరణతోనే ఏ కార్యమైనా చేస్తారు. అటువంటి ప్రేరణ మనం ఊహించని రూపంలో కూడా రావచ్చు. పరిస్థితులకు తగ్గట్టు భావోద్వేగ సమతుల్యత దెబ్బ తినకుండా ఎలా ప్రేరణతో ముందుకు సాగాలో ఈ కథ స్పష్టం చేస్తుంది.తల్లి ప్రేరణతో అంగవైకల్యం ఉన్నా విజయం సాధించిన వ్యక్తి ఆమె మరణం తర్వాత ఓ అమ్మాయి కేవలం అతని విజయంలో తప్ప జీవితంలో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపకపోవడంతో గెలుపు గుర్రమే తనకు తోడు అని నిశ్చయంగా సాగిపోతాడు.
పన్నెండో కథ 'మహాలక్ష్మిలో మార్పు.' పట్టణం నుండి పల్లెటూరిలో ప్రశాంత జీవితాన్ని గడుపుదామని భర్తతో సహా వచ్చిన మహాలక్ష్మి అక్కడ కూడా పట్నం పోకడలు ఉండటంతో ఆశ్చర్యపోతుంది. అక్కడ భక్తి భావం తగ్గిపోవడంతో అక్కడ ప్రవచనాలు చెప్పిద్దామనుకుంటుంది. ప్రవచన కర్తలు ఎక్కువమంది శ్రోతలు, అధిక పారితోషకం లేకపోతే రానని చెప్పడంతో ఆసక్తి ఉండి వచ్చిన ఆ ఊరి దగ్గరలోని పూజారి చేత చెప్పిస్తే పట్టుమని పదిమంది వినకపోయినా ఆయనా సంతృప్తిగానే ఉంటాడు. దేవుడు, భక్తి వంటి అంశాల ద్వారా మార్పు రాదని అది కూడా వ్యాపార సాధనమే అని తెల్సుకున్న మహాలక్ష్మి ఇక ఇతరులను మార్చే పనులు చేయకూడదనే మార్పును ఆహ్వానిస్తుంది.
పదమూడో కథ 'స్వేచ్చ కోసం.' కేవలం ఓ హోదాగా భావించి భర్తను చేసుకున్న భార్య భర్తకు ఏ విషయంలోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడం దానికి కారణం తనకు డబ్బు లేనితనం అని, తల్లి ఏదో అందరు ఉంటారని చేసిన వివాహంలో ఒంటరిగా మిగిలిపోయానని గ్రహించిన భర్త ఆ ఇల్లు వదిలి తనను టానుగా గుర్తించే గుడిసెల దగ్గర టీచర్ గా మారతాడు. మనిషి తన స్వేచ్చను దేని కోసం పణంగా పెట్టకూడదని దాని వల్ల జీవితంలో ఏ అనుభూతికి, అనుభవానికి విలువ ఉండదని ఈ కథ స్పష్టం చేస్తుంది.
పదనాలుగో కథ 'వెంకీ...' పడుకునే ముందు భార్యతో వికిలీక్స్ గురించి చర్చించిన భర్తకు కలలో అలానే తన కుటుంబంలో ఉన్న భార్య, భర్త, కొడుకుల రహస్యాలు వెల్లడిస్తానని వెంకీ అనే అతను ఉత్తరాలు రాస్తున్నట్టు కల వస్తుంది. మేల్కొన్న అతను సంసారాలను బయటపెట్టేవి ఉంటే జీవితమే దుర్భరమవుతుందని అనుకుంటాడు. ఈ హాస్య కథలో మన వరకు వస్తే? అన్న అంశాన్ని సున్నితంగా రచయిత్రి స్పృశించారు.
పదిహేనో కథ 'తేడా.' బాగా చూసుకునే తండ్రి కూతురు కార్తీక. పట్టించుకోకుండా ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూతురు సుమన. వీరిద్దరి మధ్య స్నేహం, సుమన తండ్రి వల్ల వచ్చే సమస్యల కోసం లాయర్ అయిన కార్తీక తండ్రి సలహా ఇవ్వడం, దానిని కార్తీక అపార్ధం చేసుకోవడం చివరకు జరిగింది తెలుసుకుని స్నేహంగా ఉండటంతో కథ ముగుస్తుంది. ఒకే వయసు ఉన్నవారు ఏ దశలో ఉన్నా తమ జీవితాల్లో ఉన్న సంబంధ బాంధవ్యాలను కొంతమేరకు పోల్చుకోవడం, ఆ స్థితిలో ఉండే సంఘర్షణ మీద ఈ కథ చిత్రికరించబడింది.
పదహారో కథ 'రాజమార్గం.' జీవితంలో అవసాన దశలో భార్యాభర్తల్లో ఎవరైనా ఒంటరిగా మిగిలిపోయే దశ కోసం సంసిద్ధం అవ్వాలని భావించిన ఓ రిటైర్డ్ మేనేజర్ అప్పటి నుండి తన జీవన శైలిని మార్చుకుంటాడు. భార్యతో ప్రేమగా ఉండటం, పనుల్లో సాయపడటం, పనులు నేర్చుకోవడం చేస్తాడు. ఈ ప్రక్రియలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా పెరుగుతుందో ఈ కథ స్పష్టం చేస్తుంది.
పదిహేడో కథ 'ఒక పద్ధతి.' వృద్దాప్యంలో నచ్చిన పనులు చేయడం మీద దృష్టి పెట్టి ఒంటరితనాన్ని జయించాలి అన్న అంశాన్ని స్పష్టం చేసే కథ ఇది. పద్దెనిమిదో కథ 'మానవత్వం.' యవ్వనంలో ఆకర్షణలకు లోనవ్వకుండా క్యాన్సర్ తో బాధ పడుతున్న మిత్రుడి బాధను పంచుకుంటూ జీవితంలో ప్రాధాన్యత ఉన్న అంశాలను నిర్ణయించుకోగల పరిణతి యవ్వన దశ నుండే ఉండాల్సిన ఆవశ్యకతను గురించి ఈ కథలో రచయిత్రి చెప్పే ప్రయత్నం చేసారు.పందొమ్మిదో కథ 'ఎర.' ఉద్యమాల వల్ల స్థంభించిపోయే చిన్న చితకా జీవితాల వారికి ఆ పరిస్థితిని కల్పించి దానినే ఆసరాగా తీసుకుని వారిని ఉద్యమానికి ఆహుతి చేసే స్వార్ధపరుల స్వార్ధం గురించి స్పష్టం చేసే కథ ఇది. ఇరవయ్యో కథ 'మూగవీణ.' పెళ్లయ్యాక భర్తను మాత్రమే ప్రేమించాలనుకున్న అమ్మాయికి అప్పటికే ఇంకో అమ్మాయినే మనసులో నిలుపుకున్న పురుషుడు భర్తగా వచ్చినప్పుడు ఆమె ఎలా జీవం లేని జీవితానికి అలవాటు పడిపోతుందో అతను మారినా ఆమెలో మార్పు అనేది ఉండదని,ప్రేమ స్వతహాగా కాకుండా జీవితంలో ఇతరుల పోలికలతో వస్తే దానిని నిజమైన ప్రేమను గుర్తించగలిగేవారు ఆమోదించరని ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఇరవై ఒకటో కథ 'బలి.' తల్లి ప్రాణం కాపాడటానికి తెలియకుండా ఎర్రచందనం స్మగిలింగ్ లో ఇరుక్కుపోయిన ఓ యువకుడు కాల్పుల్లో మరణించడం ఈ కథ. ఇటువంటి వాటిల్లో పొట్ట కూటి కోసం చేసే కూలీలే తప్ప నిజమైన వ్యక్తులు బయట పడరని, శిక్ష కూడా కూలీలకే విధించి అసలు నేరస్థులను పట్టుకునే ఓపికను అలవర్చుకునే తత్త్వం ఇంకా న్యాయయంత్రాంగం లో రాలేదని రచయిత్రి ఆవేదనను ఈ కథలో వ్యక్తపరిచారు.ఇరవై రెండో కథ 'ఇలా జరుగుతుంది మరి.'మనిషి తాను సాయం పొందినప్పుడు అదే తీరులో తన లాంటి వారి పట్ల వ్యవహరించడం కష్టమని తన అవసరాల కన్నా ఆదర్శం అతనికి ముఖ్యం కాదని ఈ కథ స్పష్టం చేస్తుంది.ఇరవై మూడో కథ 'సాంప్రదాయం తెరలో ఆధునికం.' సహజీవనం వైపు మగ్గు చూపిన ఓ అమ్మాయి ఎలా సమాజం పరిస్థితులను అర్ధం చేసుకుని వివాహం వైపు మగ్గు చూపిందో ఈ కథ స్పష్టం చేస్తుంది. సహజీవనంలో స్వేచ్చ ఉండవచ్చు కానీ బాధ్యత ఉంటుందా అన్నది ఆలోచించాల్సిన అంశం.
ఇరవై నాలుగో కథ 'సరోజ.'పార్వతి తన ఇంటి పక్కన కొత్తగా అద్దెకు వచ్చిన సరోజతో స్నేహం చేస్తుంది. సరోజది వింతైన మనస్తత్వం. ఆమె కొన్నిసార్లు బాగానే ఉన్నా పక్కన వారు ఇంకెవరితో అయినా ఉంటే తట్టుకోలేని తత్త్వం.సరోజకు పార్వతికి మధ్య గొడవ అయ్యి మాటలు ఉండవు. సరోజ అన్న తన స్నేహితుడితో సహా ఇంటికి వస్తాడు. ఆ సమయంలో సరోజ అక్కడికి వస్తుంది. అన్న సరోజ గురించి ఆసక్తి చూపేసరికి ఆమెను ఎక్కడ వివాహం చేసుకుంటాడో అని భయపడిన సరోజతో ఆమె అన్న ఆ వివరాలు తన మిత్రుడి కోసం అని చెప్పడంతో కథ ముగుస్తుంది. కొందరిని భరించడం కష్టమని అటువంటి వారు బంధువులు అయితే ఇంకా కష్టమని ఈ కథ స్పష్టం చేస్తుంది.ఇరవై ఐదో కథ 'ఉద్యోగం.' మేధావులు, ప్రశ్నించే వారు ఆ వాతావరణాన్ని ప్రోత్సహించే విదేశాల్లో స్థిరపడతారని, అణుకువ ఉన్నవారు ఇండియా ఉద్యోగాల్లో స్థిరపడతారని, కొంత బ్రెయిన్ డ్రెయిన్ కు ఈ మనస్తత్వ విభిన్నత కూడా కారణమని రచయిత్రి ఈ కథ ద్వారా స్పష్టం చేసారు.ఇరవై ఆరో కథ 'కారణం?'ఇది హాస్యపు కథ. శోభనం రాత్రి భార్య భర్త బాడీ స్ప్రే వాసన భరించలేక దగ్గరకు వస్తే బెంబేలెత్తి పోవడం ఈ కథ. ఈ సున్నితపు హాస్యాన్ని రచయిత్రి చెప్పిన తీరు బావుంది. ఇరవై ఏడో కథ 'అమెరికా అడ్జస్ట్మెంట్.' అమెరికాకు వచ్చిన బామ్మ అక్కడ తన మనవడికి ఎంత దగ్గర అవుదామనుకున్న ఆమెను అతను నిర్లక్ష్యంగా చూడటం ఆ బాధతోనే ఆమె తిరిగి రావడం జరుగుతుంది. మనుషులకు విలువ ఇవ్వడం నేర్పని సంస్కృతిలో పిల్లలు ఎలా వస్తూ ప్రధాన సమాజ సంస్కృతిలో కొట్టుకుపోతారో స్పష్టం చేసే కథ ఇది.ఇరవై తొమ్మిదో కథ 'నానమ్మ ఆలోచన.' పిల్లలు ఎదుగుతున్న సమయంలో వారి మనసులను నొప్పించకూడదని వారితో సమయం గడపాలని ఆర్ధిక ఇబ్బందుల తెర కన్నా కూడా పిల్లల ఆలోచనల్లో బాధ ఉండకుండా ఉండేలా చూసుకోవడమే ముఖ్యం అని స్పష్టం చేసే కథ ఇది.ముప్పయవ కథ 'మా వూరి దేవుడు.' కుల సమస్య కాలంతో పాటు ఎలా కనుమరుగయితుందో స్పష్టం చేసే కథ ఇది. ఆఫీసుల్లో సాంకేతికత అడుగులు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న టైప్ రైటర్ వదిలించడానికి మేనేజర్లు చేసిన ప్రయత్నమే ఈ కథ. కొత్తవి వచ్చే కొద్ది పాతవాటికి కాలం చెల్లిపోతుందని 'మన ఆఫీసుల తీరు'కథ స్పష్టం చేస్తుంది. బాల్యం నుండే సమాజ పరిస్థితుల పట్ల చిన్నారుల మనస్సులో వాస్తవిక అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కథ 'స్వచ్చభారత్.'
ఇందులోని ప్రతి కథలో రచయిత్రి వ్యక్తిగత, సామాజిక స్థాయిల్లో విలువల, సంస్కార, బాధ్యతల పరంగా చైతన్యం రావాల్సిన ఆవశ్యకత గురించి సూచించారు. చైతన్యపరిచే కథలు. ఆలోచింపజేసే కథలు.ప్రతి కథలోనూ ఓ ఆలోచనను సాహిత్య స్పృహగా మార్చే ప్రయత్నంగా రాసిన రచయిత్రి డాక్టర్ లక్ష్మి రాఘవ గారికి అభినందనలు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ