విలువల చిత్రం
విలువల చిత్రం
“బాహ్య జగత్తులో వస్తువు ఎంత అద్బుతమైనదైనా సరే అది కథకుడి అంతరంగ జగత్తులో ఆవిర్భవించే ఒక కళాదృష్టితో సమన్వయం కుదుర్చుకుని తనదైనప్పుడు తప్ప ఆ రచయిత ఆ వస్తువును స్వీకరించడం మూర్ఖత్వం”, అంటారు బుచ్చిబాబు. ఆ సమన్వయ స్థాయే రచయితకు, పాఠకులకు మధ్య ఉండే అనుబంధ రేఖను నిర్ధారిస్తుంది.సమాజంలో తను చూసినా లేదా అనుభవం ద్వారా తెలుసుకున్న ఘటనలకు, రచయిత తన అభిప్రాయాన్ని తన విలువల వాతావరణం ఆధారంగా కథా వాతావరణానికి అనువుగా మార్చుకుంటాడు. ఆ క్రమంలో రచయిత ఆ ఘటనకు, తనకు- పాఠకులకు మధ్య ఉన్న సమకాలీనతను, మానసిక బంధాన్ని ఎంత బలంగా కథగా నిర్మించాడు అన్నదే కథకుడి కథాబలానికి నిదర్శనంగా నిలుస్తుంది.తన అనుభవాలను, గతంలో అనుభవించిన మధుర సమాజపు భావాలను, వర్తమాన వ్యథల మూలాలను, గతానికి-వర్తమానానికి జరిగే సంఘర్షణలో ఓడిపోయే ప్రమాదం ఉన్న భవిష్యత్తుకు వారధిగా నిలిచి తానే తన కథల్లో కొంత మేరకు భాగం అవుతూ ప్రముఖ జర్నలిస్ట్ మరియు రచయిత మధుకర్ వైద్యుల గారు రాసిన కథాసంపుటే ‘నువద్ది.’ ఈ కథలో రచయితకున్న వ్యక్తిగత స్వభావ మూలాలు ఎన్నో కథాపాత్రల్లో ప్రస్పుటంగా గోచరిస్తాయి. ‘నువద్ది’ అంటే నిజం, వాస్తవం. బహుశా రచయిత సమాజంలో తన అనుభవంలోకి వచ్చిన ఎన్నో ఘటనల వాస్తవ స్వరూపాలను కొంతమేరకు చిత్రించే ప్రయత్నం ఈ కథల్లో చేశారు కనుక ఈ సంపుటికి ఆ పేరు పెట్టి ఉండవచ్చు.
ఈ కథా సంపుటిలో మొత్తం పదిహేడు కథలు ఉన్నాయి. ‘పల్లెల్లో ఉన్నది తల్లి భారతి”, అన్నారో కవి.ఆ పల్లెల సంస్కృతిలో వచ్చిన మార్పులు, ఆ పల్లెల్లో జరుగుతున్న విధ్వంసం, ఆ పల్లెల్లోని మానవ సంబంధాల్లో,పండుగ వేడుకల్లో వచ్చిన మార్పులు ‘మా ఊరి జాడేది’, ‘అందమైన విధ్వంసం’, ‘గుట్ట మీద దేవుడు’, ‘మా ఇంటి బతుకమ్మ’,’తాత పూనిండు’ వంటి కథల్లో రచయిత స్పష్టం చేశారు. “చుట్టూ ఉన్న ప్రపంచం రచయిత కోరుకున్నట్టు ఉండదు. అలాగే ఆశించినట్టు నడుచుకోదు. ఎందుకిన్ని అవాంతరాలు అన్న విచికిత్స కలుగుతుంది స్పందించే గుణం గల వ్యక్తికి. తాను సమాధాన పడలేని అంశాలను రూపొందించి కొంతవరకు సంతృప్తి పడతాడు రచయిత. లేదా వ్యక్తులు-సంఘటనలు, ప్రతిస్పందనలు తాను ఎలా ఉండాలనుకుంటాడో ఆ విధంగా రూపకల్పన చేస్తాడు; లేదా యథాతథాస్థితిని ప్రతిపాదించి ‘ఇది సబబా?’అని మన ముందుంచుతాడు; లేదా అనిర్వచనీయమైన అనుభూతినో, ఆంతరికమైన సంవేదననో అక్షరాలా రూపించడంలో రచన వ్యక్తమవుతుంది. తన ఆలోచనలు; తన పరిచయాలు;తన భ్రాంతులు; తన అన్వేషణలు; తన అసంతృప్తులు,ఆశలు,ఆశయాలు,ఆదర్శాలు రచయితకు రచనా ప్రేరణను కలిగిస్తాయి.(“రచయితలు కథలు ఎందుకు రాస్తారు?”అన్న అంశం మీద ‘తెలుగు కథ వెలుగులు’ పుస్తకంలో వ్యక్తీకరించబడిన ఓ అభిప్రాయం.) ఈ కథా సంపుటిలోని ప్రతి కథలోనూ రచయిత ఆశలు,ఆశయాలు, ఆదర్శాలు, రచయిత సమాధానపడలేని అంశాలు స్పష్టంగా పాఠకులకు రచయిత కల్పనగా కాకుండా వాస్తవంగానే కనిపిస్తాయి. అందుకే ఈ కథలకు ఓ సజీవత్వం ఉంది.
తన బాల్యంలో, తన జీవితం పల్లెతో ముడిపడినప్పుడు ఉన్న పల్లె చిత్రం నేడు పూర్తిగా మారిపోవడం పట్ల రచయితకు ఉన్న అసంతృప్తి, అలాగే ఏమి చేయలేని నిస్సహాయత ‘మా ఊరి జాడేది’ కథలో కనబడుతుంది. ఒకప్పుడు గ్రామాల సౌందర్యానికి ప్రతికలుగా ఉన్న అంశాలు నేడు వ్యాపార సంస్కృతికి పెట్టుబడులుగా ఎలా మారిపోయాయో అన్న అంశాన్ని చిత్రించే క్రమంలో రచయిత గతం నుండి నేటి వరకు పల్లెల్లో జరిగిన వ్యాపార ప్రగతి, పల్లె చిత్ర ధ్వంసాన్ని హృద్యంగా చిత్రీకరించారు. నాటి పల్లెల్లో ఆధునిక వసతులు లేవు. బస్సులు లేవు. అలాగే మరుగుదొడ్లు లేవు. కానీ పల్లెల్లో పచ్చదనం ఉంది. పల్లె మొత్తం తమకు కష్టం వచ్చినప్పుడు ఏకమై దైవాన్ని ప్రార్ధించే సంబరాలు ఉన్నాయి. ఎన్నో గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల మీద ఉన్న మట్టితో ఇళ్లను అందంగా అల్లుకుని ముగ్గులు పెట్టే సౌందర్య చిత్రం ఉంది. వాగుల్లో ఉండే నీరు , ఉదయాన్ని సూచించే కోడి కూత వంటివి ఎన్నో ఉండేవి. అలాగే భూముల్లో పంట చేలు ఉండేవి. ఇప్పుడు అది వ్యాపారం కోసం పత్తిగా మారిపోయింది. స్వతహాగా కవి అవ్వడం చేత మధుకర్ గారు ఈ కథలో విమలక్క మరియు గోరటి వెంకన్న పాడిన పాటలను సందర్భానుసారంగా ఉపయోగించి, తన భావాలను మరింత స్పష్టపరిచారు.కొన్ని రోజులు ఉండి పల్లె బ్రతుకులో సంతోషాన్ని పొందుదామనుకున్న పాత్ర అక్కడి మార్పులను చూసి వెనుదిరగడం ద్వారా, కాలంతో పాటు జరుగుతున్న ప్రాంత ధ్వంసం పాఠకులకు స్పష్టమవుతుంది. ‘అందమైన విధ్వంసం’ కథలో ప్రకృతి ప్రసాదించిన సంపదని వెలికి తీసేందుకు భూతల్లి గర్భాన్ని చీల్చి బొగ్గును తవ్వుతూ, ఎన్నో ఊర్ల-కాలనీల-కార్మిక వాడల చారిత్రక ఆనవాళ్లను మిగలకుండా చేస్తున్న అభివృద్ది తెరలను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను, ప్రకృతిలో జీవరాశి, చెట్లు పెరిగే ఆస్కారం లేకుండా సారం లేని భూమిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆ పల్లెటూర్ల ఆత్మగా మారి రచయిత అద్భుతంగా చిత్రీకరించారు. ‘గుట్ట మీద దేవుడు’ కథలో రచయిత చెట్లు, చేమలతో పాటు వర్షాకాలంలో గుట్ట మీద పడే వర్షపు నీరు కిందికి చేరి గుట్ట కింద భూములకు నీరందించి పంటలు పండటానికి దోహదపడుతూ, పశువులకు ఆహారం మరియు పక్షులకు ఆవాసంగా ఉన్న గుట్టలను కరిగించి రాళ్ళుగా మార్చుకుని వ్యాపారం చేయాలనుకున్న ఓ వ్యాపారవేత్తకు ఆ గుట్ట మీద దేవుడు వెలిసేలా చేసి, ఆ పథకంతో ఆ విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ఓ వ్యక్తి చేసే ప్రయత్నంగా మలిచారు. ఈ కథలో వాస్తవం కన్నా కూడా రచయితకు ఇటువంటి విధ్వంసాన్ని ఎలా అయినా వ్వ్యక్తి స్థాయిలో అయినా రూపుమాపేందుకు ఓ పరిష్కార ప్రయత్నంగా ఉండాలన్న పట్టుదల ఉన్నట్టు అనిపిస్తుంది. ‘మా ఇంటి బతుకమ్మ’ కథలో బతుకమ్మ పండుగ ద్వారా ఆడపిల్లల్లో బలపడే స్నేహాలు, ఆ పండుగ ద్వారా ఊరంతా ఒకటిగా మారడం, పాటల ద్వారా సంస్కృతిని స్మరించుకోవడం, ప్రకృతిని ప్రకృతితోనే అంటే పువ్వులతో దేవతగా పూజించడం, వంటి ఆచారాలు నేడు ఎలా యాంత్రికంగా నేడు ఎలా మారిపోయాయో అన్న వ్యథను ఈ కథలో వెలిబుచ్చారు. ‘తాత పూనిండు’ కథలో పల్లెల్లో ఉండే ఆచారాల ద్వారా, ఆ ఆచారం ఆధారంగా మన కుటుంబంలోని వారు పైకి చెప్పుకోలేని సరదాలను, అలవాట్లను, ఇష్టాలను తీర్చడానికి ఓ అబద్ధం చెప్పిన తప్పు లేదనే ఓ మనవడు బామ్మ మీద ప్రేమతో అలా చేయడం సరైనదే అని, ఆచారాల కోసం మనసును చంపుకోకుండా, ఇతరులకు హాని కలిగించని చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం తప్పు కాదనే రచయిత స్పష్టం చేస్తారు.
రచయితలోని కవి మనసు కూడా ఈ కథాసంపుటిలోని ప్రేమ కథల్లో స్పష్టమవుతుంది. ఈ కథల్లో నాయకుడి పాత్రలో భావుకత్వం, కొంత కవి గుణం ఉండేలా చిత్రీకరించారు.ప్రేమలో ఉండే అనేక దశలను ఈ కథల ద్వారా రచయిత చిత్రీకరించారు. ‘ప్రేమిస్తే’ కథలో విద్యార్ధి దశలో వికసించే ప్రేమకు అడ్డంకులు ఏర్పడితే ఆ ప్రేమించిన హృదయం ఎలా గాయపడుతుందో, అది జీవితాన్ని ఎలా అస్తవ్యస్తం చేస్తుందో అన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఇంటర్మీడియర్ లో ఓ అమ్మాయిని ప్రేమించిన రాజేష్ ఆమెకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుండి తన జీవితాన్ని తాను కూడా నాశనం చేసుకోవడమే ప్రేమ అనుకున్నాడు. అందుకే ఆమె మరణించాక కూడా ఓ పిచ్చివాడిగా మారిపోయి,ఆ పిచ్చితనాన్నే ప్రేమగా భ్రమించిన ఓ పిచ్చివాది ప్రేమ కథగా స్పష్టం చేశారు రచయిత ఈ కథను. ‘పూర్తిగా వికసించకుండానే ఒక పువ్వు రాలిపోయింది. ఒక సీతాకోకచిలుక గొంగళి పురుగు దశలోనే తన చివరి మజిలీ పూర్తి చేసింది’, అన్న వాక్యంతో అటు ఆ అమ్మాయి జీవితం, దాని వల్ల ఆ అబ్బాయి జీవితం ముగిసిపోయిన విధానాన్ని ఎంతో చక్కగా చెప్పారు. ప్రేమకు మనుషులు ఏర్పర్చుకునే నిర్వచనాలు వయసుకు తగ్గట్టు ఎలా మారిపోతాయో, ఆ ప్రేమే మనిషిని ఎలా ఛిద్రం కూడా చేసే ప్రమాదం ఉందో స్పష్టం చేసే కథ ఇది. ఈ కథలో ప్రేమికుల మధ్య ప్రేమ ఉంది, ఎవరూ ఆ ప్రేమకు అడ్డు పడలేదు, నిందించాల్సిన వారు ఎవరూ లేరు, కానీ ప్రేమను జీవితంలో ఓ భాగంగా కాకుండా ప్రేమే జీవితం అనుకునే అపరిపక్వ యవ్వన దశలో జనించే ప్రేమ భావం వల్ల ఆ రెండు జీవితాలు నాశనం అయ్యాయి. ప్రేమ పిచ్చిగా మారకముందే విద్యార్ధులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది.
‘క్షణికావేశం’ అన్న ప్రేమ కథలో ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ గాఢత తగ్గుతుందన్న భయం, అభద్రతల వల్ల ఆ ప్రేమికుల జీవితాలు ఎలా మారతాయో అన్న అంశాన్ని రచయిత స్పష్టం చేశారు. డిగ్రీ చదువుతున్న సమీర్ మంచి కవితలు రాయగలడు. అతనిలోని ఆ భావుకత్వాన్ని ఇష్టపడిన శైలజ అతన్ని ప్రేమిస్తుంది. ఆ ఇద్దరి మధ్య ప్రేమ బలపడిన తర్వాత, ఆ ప్రేమ బలహీనతగా మారి సమీర్ పరీక్ష తప్పుతాడు.ప్రేమ వల్ల చదువు నిర్లక్ష్యానికి గురవుతుందని గుర్తించిన శైలజ సమీర్ ను దూరంగా ఉంచడంతో, ఆ అంశాన్ని అపార్ధం చేసుకున్న సమీర్ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటాడు. ఈ కథలో ప్రేమికులలో ఒకరికి ప్రేమ నుండి బాధ్యత భావన స్పురించినప్పుడు ఇంకొకరు దానిని ప్రేమించిన వారు దూరమవుతున్నారన్న భావనగా భావించడం వల్ల ఆ ప్రేమ మరలా ఎలా ఆత్మహత్యా యత్నాలకు దారి తీస్తుందో అన్న అంశాన్ని స్పష్టం చేశారు.
‘ప్రేమే నేరమౌనా..?’కథలో ప్రేమలో అనవసర అనుమానాల వల్ల జరిగే అనార్ధాలను రచయిత స్పష్టం చేశారు. యువతీయువకుల మధ్య ఉండే ప్రేమలో ఉండే గాఢత, దానిని సమాజం ఆమోదించదన్న భయంతో ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమతో ఒప్పని భావించి అందరికీ తప్పని అనిపించే పనులు చేస్తూ ,అప్పుడు ప్రేమను బహిరంగంగా ఒప్పుకోలేక ,దానిని తప్పుగా భావించే ద్వంద ఊగిసలాట వల్ల ప్రేమికుల్లో ఉండే నైతిక సంఘర్షణ, వదులుకోలేని ప్రేమ మధ్య ప్రేమికుల్లో ప్రాణం విలువను అర్ధం చేసుకోలేనితత్వం వల్ల ఏర్పడే ప్రాణ నష్టాన్ని స్పష్టం చేశారు. ‘పరువు హత్య...’ కథలో తల్లిదండ్రుల ప్రేమకు పరువు ఎలా అడ్డంకిగా మారి కన్నబిడ్డల్ని చంపుకునే వరకు దారి తీస్తుందో స్పష్టం చేశారు. ‘ప్రేమ ఎంత మధురం’ కథలో పరిణతి చెందిన ప్రేమ కనిపిస్తుంది. ప్రేమించి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్న ప్రేమికులలో ఉండే ఓర్పు వల్ల ఆ ప్రేమ కుటుంబాన్ని మరలా ఎలా ఒకటయ్యేలా చేస్తుందో స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ‘ఒక అమ్ము ..ఒక అభి’ కథలో ప్రేమలో వచ్చే అనవసర అనుమానాల వల్ల ఏర్పడే అపార్ధాలు, దాని వల్ల ఏర్పడే ప్రాణ నష్టం, ఆ పోయిన ప్రాణం ఉన్న ఇంకో ప్రేమ ప్రాణాన్ని కూడా ఎలా బలిగొనే ప్రయత్నం చేస్తుందో చెప్తూనే, ప్రేమ భావనను ప్రయోజనాత్మకంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని కూడా స్పష్టం చేశారు.
తల్లిదండ్రుల జీవన చిత్రం మూలంగా కూడా కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. సాధారణంగా తల్లిదండ్రుల కథల్లో పిల్లల నిర్లక్ష్యం గురించి రాయడం పరిపాటే. కానీ వృద్ధాప్య దశలో తమ భారాన్ని పిల్లలపై మోపడం ఇష్టపడకుండా,దానికి కారణమైన తమ బాధ్యతా రాహిత్యానికి ప్రాయశ్చిత్తంగా చేసుకునే అంశాన్ని రచయిత ‘ప్రాయశ్చిత్తం కథగా మలిచారు. ‘కడప..టూ..హైదరాబాద్...వయా అనంతపూర్ ‘ కథలో అనారోగ్యాలు, ఆర్థిక లేమి ఉన్న పరిస్థితుల్లో జీవితంలో పిల్లలు తల్లిదండ్రులకు పరిస్థితుల రీత్యా దూరమైతే, పిల్లల పరిస్థితులను అర్ధం చేసుకునే తండ్రులకు ప్రతీకగా తండ్రి పాత్రను రచయిత మలిచారు.’అమ్మ కావాలి’ కథలో బిడ్డలు బాధించినా బిడ్డల బాధకు చలించిపోయే తల్లి మనసును చిత్రీకరించారు.
నేటి చదువు ఒత్తిడిగా మారి వ్యాపారమయ్యే క్రమంలో విద్యార్ధులు ఎలా బలవుతున్నారో అన్న అంశాన్ని, అలాగే పేదరికంతో ప్రతిభ ఉన్న విద్యార్ధులకు కూడాఈ విద్యా వ్యాపారంలో ఎలా పావులుగా మారుతున్నారో ‘’చదువుల వ్యాపారం’ కథలో స్పష్టం చేశారు. ‘బతుకు చిత్రం’ కథలో స్త్రీని కేవలం స్త్రీగా మాత్రమే చూసే దృష్టి కోణంలో ఆమెలో కళను గుర్తించి,ఆమెలో శారీరక వైకల్యాలను ఆదరించే గుణం సమాజంలో ఉండాలన్న భావనను ఎంతో హృద్యంగా స్పష్టం చేశారు. ‘ఆడజన్మకు ఎన్ని కష్టాలో...’ కథలో ఆడపిల్లలకు విద్య లేకపోవడం, భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, ఏ ఆసరా లేకపోవడం వల్ల ఎలా జీవితాన్ని నష్టపోతుందో అన్న అంశాన్ని ఓ కుటుంబ కోణంలో చిత్రీకరించారు.
మధుకర్ గారు స్వయంగా కవి, కథకులు మాత్రమే కాకుండా వృత్తి రీత్యా జర్నలిస్టుగా పని చేస్తూ ఉండటం వల్ల సమాజంలో తారసపడ్డ ఎన్నో జీవిత మూలాలను గమనించడం వల్ల, సామాజిక శాస్త్ర అధ్యాపకులుగా సమాజాన్ని, విద్యార్ధులను చూసి ఉండటం వల్ల, సామాజిక సంస్థను నడిపిన అనుభవం వల్లా, జానపద నృత్య నైపుణ్యం వల్ల, బహుముఖ ప్రజ్ఞ ,అధ్యాయనం వల్ల, సమాజం పట్ల బాధ్యతగా అక్షరాలు మారాలన్న ఆకాంక్ష వల్ల మధుకర్ గారి కథల్లో సమాజ స్వరూపంలో, మనుషుల స్వభావాల్లో, సమాజంలో ఉండే ప్రేమ,మానవత్వం వంటి దృక్కోణాలు సమాజాన్ని, అందులోని వ్యక్తులను మనుషులుగా మార్చే క్రమం, అందుకోసం పడే తపన కనిపిస్తుంది. ఓ సామాజిక లక్ష్యంతో కథలు రాస్తున్న మధుకర్ వైద్యుల గారికి ఈ సందర్భంగా అభినందనలు.
* * *

Comments
Post a Comment