కళాకారుల జీవితం

  కళాకారుల జీవితం 

                -శృంగవరపు రచన
    
                                                           


        సాహిత్యం-కళలు మనిషి సృజన, ప్రతిభలకు నిదర్శనాలుగా ఉన్నప్పటికీ డబ్బు లావాదేవీల కేంద్రంగా నడిచే సమాజంలో  కళలే కేంద్రంగా బ్రతికే వ్యక్తుల జీవితాలను సామాజిక-కుటుంబ-వ్యక్తిగత కోణాల్లో ఆవిష్కరించిన నవలే తమిళ రచయిత అఖిలన్(పి.వి.అఖిలాండం) గారి ‘చిత్రసుందరి.’ ఈ నవలను 1975 లో జ్ఞానపీఠ్ పురస్కారం వరించింది. సాహితీవేత్తలు,కళాకారులు తప్పకుండా చదవాల్సిన నవల ఇది.

 ఈ  నవలలోని ప్రతి పాత్రకు కేవలం కథలో భాగం కావడమే కాకుండా విస్తృత పరిధిలో ఓ ప్రయోజనం ఉండేలా రచయిత తీర్చిదిద్దారు. ఈ నవల 1967లో తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’ లో సీరియల్ గా ప్రచురించబడింది. ఈ నవలలోని ముందు మాటలో రచయిత ఇంకో మహిళా రచయిత్రితో కలిసి తమ కథలను తమ అంగీకారం లేకుండా ఓ తమిళ చిత్ర నిర్మాత వినియోగించుకున్న అంశం పట్ల న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు. ఆ సమయంలో ఆ ఖర్చులు రచయితే పెట్టుకున్నారు.ఆ కేసులో రచయిత వాదం వీగిపోయినా ఆ రచయిత్రి వాదం నెగ్గింది. ఆ తర్వాత రచయిత ఆ కేసు కోసం తాను  వెచ్చించిన సొమ్మును ఆ రచయిత్రి తిరిగి ఇస్తుందని ఆశించినా, ఆమె ఇవ్వకపోవడంతో ఆ విషయ సంబంధంగా లేఖ రాశారు. కానీ ఆ ఉత్తరం వల్ల ఆమె భర్త ఆమె ఆ అప్పుకు పత్రం,రశీదు లాంటివి లేవని, అది ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందో అని ఆమెను హింసించిన వైనాన్ని ఆ రచయిత్రి లేఖ ద్వారా తెలియజేసింది. ఇది జరిగిన 15 ఏళ్ల తర్వాత అదే రచయిత్రి ఆ సొమ్మును రచయితకు తిరిగి ఇచ్చేసింది. కానీ ఈ సందర్భంగా రచయిత మనసులో డబ్బు కేంద్రంగా జీవితాన్ని మలచుకునే మనుషుల మనస్తత్వాలను గమనించి, తన గమనింపు-అనుభవాల నుండి ఈ నవలను రాశానని స్పష్టం చేశారు.

 1967 కాలంలోనే రచయిత కళాకారులను-సాహితీవేత్తలను ఈ సమాజం-కుటుంబం చూసే తీరును చెప్పిన వైనం పాఠకులను అబ్బురపరుస్తుంది. ఈ నవలలో ప్రధాన పాత్రలు అణ్ణామలై, చిదంబర మేస్త్రి, మాణిక్యం, ఆనంది, కదిరేశన్ ,సుందరి,దండపాణి,శారద, మీనాక్షమ్మ, చెల్లమ్మ.ఈ ఏడు పాత్రల ద్వారా కూడా డబ్బుకు-సృజనా మరియు కళా ప్రతిభకు మధ్య జరిగే సంఘర్షణను రచయిత చిత్రించారు. ఈ సంఘర్షణ తలెత్తే మూలాలు కూడా చిత్రించడం వల్ల ఈ నవలలోని పాత్రల్లో క్లిష్టత కూడా ఉండేలా రచయిత జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘నవలా శిల్పం’ లో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు పాత్రలలో ఉన్న రెండు ముఖ్య రకాల గురించి చర్చించడం అవసరం. ఒకే ఒక భావాన్నో, గుణాన్నో ఆధారం చేసుకుని రూపొందించబడ్డ పాత్రల్ని క్లిష్టత లేని పాత్రలు లేదా ఫ్లాట్ కారెక్టర్స్ అనవచ్చు. ఇలాంటి పాత్రలు మొదటిసారిగా పాఠకునికి పరిచయమైనప్పటి నుంచీ చివరి వరకూ ఒకే పద్ధతిలో, ఒకే మనస్తత్వంలో కొనసాగుతాయి. ఈ పాత్రల మనస్తత్వంలో ఎటువంటి సంఘర్షణ ఉండదు. పాఠకుల ఊహకు అందే పాత్రలు ఇవి. వీటికి వ్యతిరేకంగా ఉండేవి క్లిష్టత ఉన్న పాత్రలు లేదా రౌండ్ కారెక్టర్స్. వీటిలో భిన్న వ్యక్తిత్వాలు ఉంటాయి. అందుచేత అంతః సంఘర్షణ ఉంటుంది. పరిస్థితుల ప్రభావం చేత మార్పు చెందుతాయి. పాత్రల్లో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయినా ఆ మార్పుకు ఉన్న కారణాలు ఉన్నాయన్న నమ్మకాన్ని రచయిత పాఠకుల్లో కలిగించగలిగితేనే ఆ పాత్రల ప్రయోజనం నెరవేరినట్టు. ఈ నవలలో క్లిష్టత లేని పాత్రలు మాణిక్యం, సుందరి, దండపాణి, మీనాక్షమ్మ,చెల్లమ్మ  అయితే మిగిలిన పాత్రలు క్లిష్టత ఉన్న పాత్రలే.

 మద్రాసుకు పొట్ట చేత్తో పట్టుకుని వచ్చి, కూలి పని నుండి మేస్త్రీగా ఎదిగిన వ్యక్తి చిదంబర మేస్త్రి. ఆకలి,డబ్బు బాధలు అనుభవించడం వల్ల అతనికి జీవితానికి అర్ధం, ప్రయోజనం సంపాదన అనే నమ్మకం బలపడి పోయింది. ఎంతో కష్టపడి అతను సొంత ఇల్లు కట్టుకోగలిగాడు. అతని భార్య మీనాక్షమ్మ. కొడుకు ఆణ్ణామలై. చిదంబర మేస్త్రి స్నేహితుడు మరణిస్తే అతని భార్య చెల్లమ్మ, కొడుకు మాణీక్యాలను కూడా ఆదరించి తన ఇంట్లోనే ఆశ్రయమిస్తాడు. మాణిక్యం కొంత చదివాక, అతన్ని తనతో పాటు పనికి తీసుకువెళ్లి తనకన్నా పై స్థాయి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. ఈ రెండు కుటుంబాలు ఒకే కుటుంబంలా మెలిగేవి. ఇకపోతే ఆణ్ణామలైకు బొమ్మలు గీయడం అంటే ఎంతో ఇష్టం. కానీ తన అభిరుచి ద్వారా తన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలన్న అవగాహన అతనికి లేదు. అతన్ని ఎలా అయినా ఇంజనీర్ ను చేస్తే సంపాదనాపరుడు అవుతాడని తండ్రి నమ్మకం. కానీ లెక్కలపై అస్సలు ఆసక్తి లేని అణ్ణామలై రెండేళ్ళు పరీక్ష తప్పుతాడు.ఆసక్తి లేకపోయినా తండ్రి కోసం ఆ పరీక్ష రాస్తూ ఉంటాడు. కథ ప్రారంభం అయ్యేనాటికి ఈ మాత్రం వివరాలు పాఠకులకు స్పష్టం అవుతాయి.

 అణ్ణామలై మరియు చిదంబర మేస్త్రి పాత్రల చిత్రణలో రచయిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అణ్ణామలై జీవితానికి ఏ లక్ష్యం, అవగాహన లేని క్రమంలో మొదలైన నవల అతని జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడి, అది సమాజ మరియు జీవిత స్థితి గతుల్లో తోడ్పడలేని దిగంతాల్లోకి జారిపోయి, మరలా తన జీవితపు అంతిమ సంతోషం,సంతృప్తి పొందే సూచనతో ముగుస్తుంది. దానికి తోడ్పాటు ఇచ్చేవే మిగిలిన పాత్రలు ఈ నవలలో. అణ్ణామలై పాత్ర వ్యక్తి రీత్యా ఎటువంటి సంఘర్షణ లేని పాత్రే అయినా అతనిలోని కళాకారుడు, అతని అభివ్యక్తి రూపాంతరం చెందే పద్ధతిలో మాత్రం క్లిష్టత ఉంది. ఈ నవలలో అణ్ణామలై పాత్ర గుర్తింపు, ప్రోత్సాహం లేని సమాజం-కుటుంబం వల్ల అతను పడే క్షోభ, జీవితంలో కోల్పోయిన స్వేచ్చ వంటి వాటి ద్వారా అతని అంతరంగంలో ఉండే ప్రపంచానికి అతను ఈ వాస్తవిక జీవితంలో గడిపే విభిన్న జీవితానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని రచయిత స్పష్టం చేశారు. పరీక్ష తప్పిన అణ్ణామలై బీచుకు వెళ్లినప్పుడు అతనికి తండ్రికుతుళ్ళు అయిన కదిరేశన్, ఆనంది పరిచయమవుతారు.

 కళకు,నైపుణ్యానికి ఎంతో వ్యత్యాసం ఉంది. కళాకారులు తమ కళకు గుర్తింపును ఆశిస్తారు. ఆ కళనే జీవిత ఆలంబనగా ఎలా కొనసాగించాలి? కుటుంబంలోని ఆర్థిక అవసరాలకు ఆ కళ భవిష్యత్తులో దోహదపడుతుందా? లేదా? అన్న అంశాన్ని కళాకారులు చాలా వరకు ఆలోచించరనే అనుకోవచ్చు. నైపుణ్యం అనేది విద్య,ఆసక్తి ద్వారా అలవడుతుంది. నైపుణ్యానికి ఎప్పుడు ఆర్థిక కోణం ముడిపడి ఉంటుంది. సమాజ స్వరూపంలో కళలు జీవిత కనీస అవసరాలు నెరవేరిన తర్వాతే మనిషికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనే చింతన ఉంది. మనిషి జీవన క్రమంలో అన్నింటికన్నా అతి పెద్ద బాధ్యత కుటుంబాన్ని పోషించడం. ఆ తర్వాత ఆర్థికంగా ఆ కుటుంబ ప్రతిష్టను పెంచడం. ఈ రెండు లక్షణాల ఆధారంగానే ప్రయోజకత్వాన్ని నిర్ధారించే ప్రామాణికత సమాజ దృష్టి కోణంలో ఉంది.

 అణ్ణామలై తండ్రి చిదంబర మేస్త్రి పల్లెటూరి నుండి పట్టణానికి వచ్చినవాడు. పట్టణంలో మనిషిని మనిషి పట్టించుకోని స్థితిలో డబ్బు మాత్రమే మనిషికి ఎలా రక్షణను ఇస్తుందో గమనించినవాడు. తన కొడుకు గీసే బొమ్మలకి ఆర్థిక కోణం లేదని ఆయన భావించడం వల్ల ఆ ‘కళ’ఆయనకు పనికి రాని వ్యాపకంగా అనిపించింది. ఆయనకు చదువు లేదు. ఆయన వ్యక్తిత్వాన్ని రచయిత ఎంతో సున్నితంగా చిత్రించారు. ఆయన తనకు సరైనదని అనిపించిందే చేస్తాడు తప్ప అవినీతి,అన్యాయం చేయాలనుకునే తత్వం లేని వాడు. డబ్బు లేమిని అనుభవించినవాడు కనుక డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం, ప్రతి పనిని ఆర్థిక కోణంలో చూడటం ఆయనకు అలవాటు అయ్యింది. ‘చదువురాని అజ్ఞాని’గా తనను తాను ప్రచురించుకుంటూనే ఎక్కడికక్కడ ప్రశ్నలు గుప్పించి, కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి క్షుణ్ణమైన పరిజ్ఞానం సంపాదించి పెట్టుకోవడం ఆయనకు అలవాటు అని రచయిత ఓ సందర్భంలో చిదంబర మేస్త్రి ఏ అంశం గురించి అయినా నేర్చుకునే విధానం గురించి స్పష్టం చేశారు.

 ఈ నవలలో రచయిత అణ్ణామలైకు మార్గదర్శిగా నిలిచే పాత్రగా కదిరేశన్ ను చిత్రించారు. కదిరేశన్ ప్రముఖ చిత్రకారుడు. పరీక్ష తప్పిన అణ్ణామలై బీచ్ లో ఉండి బొమ్మలు గీస్తున్నప్పుడు అతని కళను గుర్తించి, దానిని ఓ విద్యగా ఎలా అభ్యసించడానికి మార్గం చూపాడు. అణ్ణామలైకు విద్యాలయంలో చేరాలనే ఉన్నా డానికి తండ్రి సమ్మతించడనే అనుమానం ఉంది. దండపాణి కూతురు సుందరి. సుందరికి అణ్ణామలైతో వివాహం చేయాలన్న ఆలోచన ఇరు కుటుంబాలకు ఉంది. దండపాణి వ్యాపార శైలిలో ఆలోచించే దృక్కోణం కలవాడు. సినిమా పోస్టర్ల బొమ్మలు, రంగులు అద్దడం అతని దృష్టిలో అణ్ణామలై కళకి ఉన్న ప్రయోజనం. దాని ద్వారా ఎంతో డబ్బు సంపాదించవచ్చని దండపాణి చిదంబరమేస్త్రికి చెప్పడం వల్ల అణ్ణామలై కళాభ్యాసం చేయడానికి తండ్రి అనుమతి లభించింది.

 అణ్ణామలై విద్యాలయంలో చేరడానికి కొంత వ్యవధి ఉండటం వల్ల కదిరేశన్ దగ్గర కళలో మెళుకువలు నేర్చుకోవడానికి రోజూ వెళ్తుండేవాడు. ఆనంది కదిరేశన్ కూతురు. ఆనంది,అణ్ణామలైల మధ్య అవ్యక్త ప్రేమ చిగురించింది. ఆనంది సాహిత్యంలో డిగ్రీ చదువుతుంది. తండ్రికి శిల్ప కళ స్టూడియోనూ రోజు సిద్ధం చేయడం ఎంతో ఇష్టంగా, భక్తిగా చేస్తూ ఉంటుంది. ఆమె చేసే ఆ పని వల్ల అణ్ణామలై మనసులో చిత్రకారుడి భార్య ఎలా ప్రోత్సాహం అందించవచ్చో అన్న అంశానికి ఓ ఊహ ఏర్పడుతుంది. సాహిత్యం పట్లే కాక, శిల్ప కళ పట్ల కూడా ఆనందికి ఉన్న ఇష్టాన్ని, భక్తిని రచయితగా చక్కగా స్పష్టం చేశారు.

 కదిరేశన్ భార్యను వివాహం చేసుకునే సమాయానికి ఆమె వితంతువు మరియు ఆనందికి తల్లి. ఆ వివాహంతో కదిరేశన్ తన కులంలో, సమాజంలో బహిష్కరణకు గురయ్యాడు. కదిరేశన్ భార్య కొంతకాలం క్రితమే మరణించింది. చిదంబరమేస్త్రికి ఆనంది తల్లి,ఆమె తండ్రి తెలుసు. ఆనంది తాతయ్య దగ్గర మేస్త్రీగా పని చేశాడు. తన యజమాని అల్లుడే తన కొడుక్కి గురువు అని తెలియగానే చిదంబరమేస్త్రి ఎంతగానో సంతోషించి, వారితో అనుబంధాన్ని ఆమోదిస్తాడు.

 ఈ నవలలోని విశిష్టత ఏమిటంటే ప్రతి పాత్ర స్వభావం, ఆలోచనల గురించి,ఆ పాత్ర జీవితం గురించి, కళల గురించి కలిగి ఉన్న అభిప్రాయాల గురించి రచయిత సందర్భానుసారంగా స్పష్టం చేస్తారు. కళ సామాన్యులకి, కళాప్రవేశం-కళాభిమానం లేని వారికి ఎలా గోచరిస్తుందో, కళాకారులు సైతం వ్యతిరేకత ఉన్న వాతావరణంలో మానసికంగా ఎలా బలహీనులు అవుతారో కూడా ఈ నవలలో అనేక సందర్భాల్లో రచయిత స్పష్టం చేస్తారు. ఈ నవలలోని పాత్రలన్నీ మధ్యతరగతి మనస్తత్వం ఉన్న పాత్రలే.

 కదిరేశన్ కుటుంబం తమ ఒకప్పటి యజమాని కుటుంబమవ్వడమే కాకుండా ఆయన ఇల్లు నిర్మించే పనితో బాటు ఆ ఇంటి ప్రక్కన జాగాను కూడా చిదంబర మేస్త్రి కొనుక్కునేట్టు ఏర్పాటు జరిగిపోతుంది. ఆ ఇల్లు కొనడం కోసం మేస్త్రి ప్రస్తుతం ఉంటున్న ఇంటిని అమ్మేస్తాడు. ఆ సందర్భంగా మేస్త్రి కదిరేశన్ కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ సందర్భంలో మేస్త్రి హంగుల ప్రదర్శన గురించి రచయిత ఇలా రాస్తారు.

 “జబ్బుల జాబితా ఒకటి సరఫరా చేయమని డాక్టర్లనెవరినైనా ప్రాధేయపడితే జలుబు, జ్వరం,తలనొప్పి మొదలైన మామూలు వాటి దగ్గర నుంచే ప్రారంభించి కలరా,మశూచి వంటి తీవ్రమైన వాటి దాకా రకరకాల జబ్బుల్ని ఏకరువు పెడతారు. డాక్టర్లు అయినంత మాత్రాన సర్వజ్ఞులు కారు గదా! వాళ్ళకు సైతం తెలియని జబ్బు ఒకటి కద్దు. ఇది సాధారణంగా మధ్యతరగతి నాగరిక వర్గం వాళ్ళని మాత్రమే పీడిస్తుంది. ‘తాత్కాలిక వ్యామోహం’ అన్న పేరుతో ప్రారంభమైంది కాల క్రమేణా ‘ఆడంబర అలవాటు’ క్రిందికి వచ్చేస్తుంది.

 ఇదొక అంటుజాడ్యం. జీవితంలో ఇరుగుపొరుగు వాళ్ళు ఏర్పరుచుకుంటున్న హంగుల్నీ గమనించడం ద్వారా ఏది వ్యాపిస్తుంది. క్రిములు కళ్ళ ద్వారా మనసులో ప్రవేశించి ఇక్కడ గ్రుడ్లు పెట్టి పొడిచి పిల్లల్ని చేస్తాయి. మగవాళ్ళ విషయంలో హోటల్లో మకాము, సోఫా, కరెంటు ఉపకరణాలు మొదలైన వాటి దగ్గర నుంచే ప్రారంభమై కంతుల పద్ధతిలో కారు కొనే దాకా ఇది విషమిస్తుంది. ఆడవాళ్ళ విషయంలో ఎవర్ సిల్వర్ పాత్రల దగ్గర నుంచి ప్రారంభమై, పట్టు చీరల దాకా అన్ని బంగారు నగల దాకా విస్తరిస్తుంది. ఈ జబ్బుకి లోనయిన వారికి ఎంత ఆదాయం వచ్చినా చాలదు. డబ్బు చాలని కొరత వీరిని ఆహారహమూ పీడిస్తూనే ఉంటుంది. వేరొకవైపున పేరాశ అనే విషజ్వరం వీరిలో శృతి మీరీ రాగాన పడుతూ వస్తుంది.”

 ఈ ఆడంబరత్వాన్ని ప్రదర్శించడానికి చిదంబర మేస్త్రి కిటికీ తెరలు, పూల కుండీలు, సోఫా సెట్టు, టేబుల్ ఫ్యాన్లు మొదలైనవి వారి రాకని పురస్కరించుకుని కొంటాడు. ఇలా సన్నివేశాల ఆధారంగా పాత్ర లోతులను పాఠకులకు రచయిత పరిచయం చేస్తారు.

 మాణిక్యం పాత్ర కూడా ఈ నవలలో ప్రధానమైనదే. డబ్బే ధ్యేయంగా గడిపే వ్యక్తి, ఇతరులు ఇష్టపడిన వాటిని వారికి దూరం చేసి తాను సొంతం చేసుకోవడంలో పైశాచిక ఆనందాన్ని పొందే వ్యక్తి అతను.ఆనంది, అణ్ణామలైలు ఒకరికొకరు చెప్పుకోకపోయినా వారి మధ్య ప్రేమ ఉందని తెలుసుకుని,ఆ ప్రేమను ధ్వంసం చేసైనా ఆనందిని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు.మాణిక్యానికి ప్రేమ విషయంలో కూడా నిబద్ధత లేదు. చిదంబర మేస్త్రి స్వంత ఇల్లు, కదిరేశన్ ఇల్లు నిర్మాణం ఒకేసారి మొదలు అయ్యాయి. ఆ సమయంలో అణ్ణామలై విద్యాలయానికి వెళ్తుండటం వల్ల ఆనంది,కదిరేశన్ గార్లను అంతకు పూర్వంలాగా కలిసే వీలు లేదు. ఆ సందర్భాన్ని వినియోగించుకుని రెండిళ్ళ నిర్మాణం చేస్తున్న నెపంతో మాణిక్యం ఆనందితో చనువు పెంచుకునే ప్రయత్నం చేస్తాడు.ఈ నవలలో మాణిక్యం మీద కదిరేశన్, ఆనంది, చిదంబరమేస్త్రి లకు మీద ఉన్న అభిప్రాయాలను రచయిత ఈ సందర్భంలో స్పష్టం చేస్తాడు. మాణిక్యం ఆనంది ఇంటి నిర్మాణంలో ఎక్కువ శ్రద్ధ చూపడం, ఆమెతో రోజూ ఆ సాకు మీద మాట్లాడటం మొత్తానికి ఆమెను ఎలా అయినా వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నాడు.

 అణ్ణామలై పాత్రచిత్రణను రచయిత ఎంతో వాస్తవికంగా చిత్రీకరించారు. ఈ చిత్రణలో అణ్ణామలైకి ‘శిల్ప కళ’ ఓ  బలంగా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసే అంశంగా ఉన్నా, అతనిలో మామూలు మనిషిలో ఉండే ఎన్నో బలహీనతలు కూడా ఉన్నాయి. అతని వ్యక్తిత్వంలో బలహీనమైన మనస్తత్వం రూపొందడానికి కారణాలను గమనిస్తే తండ్రి దృక్కోణంలో అణ్ణామలై బలమైన శిల్పకళకు ఏ మాత్రం ప్రాధాన్యత లేకపోవడం కూడా ఓ కారణంగా భావించవచ్చు. 
 తండ్రి తర్వాత అణ్ణామలై మనస్తత్వం రూపొందే క్రమంలో ప్రాధాన్యత ఉన్న పాత్ర మాణిక్యం. మానిక్యానికి తండ్రి లేడు.తల్లితో కలిసి తండ్రి స్నేహితుడైన చిదంబర మేస్త్రి ఆశ్రయంలో పెరిగాడు.బాల్యం నుండే డబ్బు సంపాదన ద్వారా సమాజంలో ఎదిగిపోవాలనే తత్వం ఉన్న మాణిక్యాన్ని ఉద్యోగరీత్యా కూడా ఎంతో ప్రోత్సహించాడు. చిదంబర మేస్త్రి దృష్టిలో చదువు ప్రయోజనం అనేది సంపాదన కోసమే.చిదంబర మేస్త్రిని కూడా తన అవసరాలకు అనుగుణంగా మార్చుకున్న వ్యక్తి మాణిక్యం. ఆనంది, కదిరేశన్ లను మొదటిసారి అణ్ణామలై బీచ్ లో కలిసినప్పుడు మాణిక్యం తనకు తానుగా వారితో పరిచయం పెంచుకున్నాడు. అణ్ణామలైని వారికి దూరం చేయడానికి వారి గురించి చిదంబరమేస్త్రి చెడుగా చెబుతాడు మాణిక్యం. దానిని నమ్ముతాడు మేస్త్రి.

 ‘ఒక వ్యక్తిని నిన్నటి వరకు పొగడ్తలతో ముంచెత్తి, ఈ రోజు తిట్ల దండకంతో నోరు నొచ్చేటట్టుగా శపించి, రేపటి నుంచీ అతడి పట్ల ఇంకొక విధంగా వ్యవహరించడమనేది మానవ స్వభావంలోని ఒక సహజ దౌర్బల్యమే అనవచ్చు. చిదంబర మేస్త్రిది కూడా ఇందుకు విభిన్నమైన ప్రవృత్తేమీ కాదు’, అని రచయిత మేస్త్రి మనస్తత్వం గురించి పాఠకులకు ఓ చోట స్పష్టం చేస్తాడు. మొదట మాణిక్యం ద్వారా కదిరేశన్, ఆనందిల గురించి చెడ్డ వారుగా భావించినా, తన కొడుకు దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా విద్య నేర్పడం వారి పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది. కదిరేశన్ ఇంటికి చిదంబర మేస్త్రి వెళ్ళినప్పుడు  ఆనందిని బియ్యేలో సాహిత్యం చదువుతున్నానని చెప్తే చిదంబర మేస్త్రి అభిప్రాయాన్ని సాహిత్యం పట్ల సామాన్య జనులకు ఉండే దృక్కోణంగా రచయిత చిత్రించారు.

 “సాహిత్యమంటే ఏమిటో చిదంబర మేస్త్రికి అర్ధం కాలేదు. ఏ ఉద్యోగం కోసం చదివే చదువులు ఇవి? స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లనైతేనేమి, అందుకు జరుగుతున్న ప్రచారం వల్లనైతేనేమి రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగు మొదలైన విషయాలకు సంబంధించిన వైజ్ఞానిక ప్రాధాన్యత ఏర్పడింది. అలాంటి చదువులు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగావకాశాల సదుపాయం కూడా హెచ్చింది. ఉప్పు, చింతపండులా నిత్యావసర వస్తువుల కోవలోకి చేరని సాహిత్యం ఒక మూలకు నెత్తివేయబడుతూ వచ్చింది.”

 చిదంబర మేస్త్రి పాత్రలో నేడు కళాకారుల తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆ మాస్ సైకాలజీ మూలంలో ఉన్న అవసరాలు, జీవిత ప్రాధాన్యతలను కూడా రచయిత చిత్రించి ఆ సగటు తల్లిదండ్రులకు కళా ప్రాధాన్యత జీవిత అవసరాలకు సంబంధం లేని అంశంగా మారిపోవడానికి గల కారణాలను కూడా అణ్ణామలై చుట్టూ ఉన్న పాత్రలు, సన్నివేశాల్లో కూడా రచయిత సున్నితంగా చిత్రించారు. అణ్ణామలైకి తండ్రి మనస్తత్వం నచ్చలేదు. అదే సమయంలో రచయిత అప్పటికే గొప్ప కళాకారుడిగా స్థిరపడిపోయిన కదిరేశన్ పాత్రలో ఉన్న వైరుధ్యాల ద్వారా కళాకారులు సమకాలీన సమాజంలో చేసే ఘర్షణను కూడా స్పష్టం చేశారు.

 ‘అందంగా జీవించడం నేర్చుకో, వీలైనంత వరకు జీవితాన్ని ఆనందమయం చేసుకో. వీలు కాలేదని దాన్ని వికారంగా మాత్రం మార్చవద్దు’ అన్నది కదిరేశన్ జీవితసూత్రంగా మొదటే రచయిత పాఠకులకు పరిచయం చేస్తాడు. చిదంబర మేస్త్రికి సాహిత్యమంటే ఏమిటో అర్ధం కాలేదన్నప్పుడు కదిరేశన్ తాను నమ్మిన జీవిత సూత్రాన్ని ఆయనకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ మాటల ద్వారా కళాకారుడి దృష్టిలో జీవితం ఎలా కనిపిస్తుందో రచయిత స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.

 “ప్రయోజనమనేది రెండు రకాలు. బాహాటంగా కంటికి కనిపించే ప్రయోజనాలు ఒక రకం. అలా కానరాని ప్రయోజనాలు రెండో రకం. పెద్ద కట్టడాలు, ఆనకట్టలు, విద్యుచ్చక్తి,ఫ్యాక్టరీలు, రహదార్లు అన్నీ మనకు స్పష్టంగా తెలియవచ్చే ప్రయోజనాలు.వీటిని మనం విజ్ఞానం ద్వారా పెంపొందించుకోవచ్చు. కానీ మనుషుల మాటేమిటి? మనుషులు మనుషులుగానే ఉండాలి గాని, మర మనుషులులాగా ఉండకూడదు. మర మనుషుల్లా ఉండే వాళ్ళందరూ నకిలీ మనుషులే!”

 మనిషికెలా జీవించాలో నేర్పించడం ముఖ్యం.అది మానేసి , కేవలం ఆర్జనకు సంబంధించిన విద్యలు మాత్రమే నేర్పడం వల్లనే ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా స్వార్ధం, పేరాశ, వంచన, కల్లాకపటం,ఇచ్చా విహారం సల్పుతున్నాయి. మనిషిలో సంస్కారం లోపించి, సమాజంలో తాను ఒక్కడినన్న జ్ఞానం నశించిన తర్వాత సిరిసంపదలెంతగా విలసిల్లినా దేశం బాగుపడదు. మనిషి అంతరంగాన్ని, ఆలోచనల్ని,ప్రవర్తనని అందంగా తీర్చేదే సాహిత్యం. మనిషి లోపలి యంత్రాలే ఇంద్రియాలు. వాటిని సరైన కట్టుబాటులో ఉంచేదే సాహిత్యం.”

 కళాకారుడిగా తన పరిధిలో అందమైన జీవితానికి అర్ధాన్ని, దానికి మనిషి తనలో సంతోషాన్ని, సంతృప్తిని వెల్లివిరిసేలా చేయడానికి సాహిత్యం ఎలా తోడ్పడుతుందో చెప్పినా, అది కళలన్నింటికి వర్తిస్తుంది. అణ్ణామలై కదిరేశన్ ను గురువుగా భావించాడు. అణ్ణామలై,ఆనంది,కదిరేశన్ ల చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజం అర్ధం అయితేనే సాహిత్యం,కళలు సగటు మనిషి దృష్టిలో ఏ విలువను కలిగి ఉన్నాయో పాఠకులకు స్పష్టం అవుతుంది.

 అణ్ణామలై ఆనంది బొమ్మను గీస్తాడు. దానిని చూసిన మాణిక్యం అది తప్పని తన ఓర్వలేనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నమ్మిస్తాడు. ఆ బొమ్మ వల్ల ఆమెను ప్రేమించిన భావన అణ్ణామలై తల్లిదండ్రులకు కలుగవచ్చని చెప్తాడు. ఈ సందర్భంగా అణ్ణామలైకి ప్రేమంటే సమాజంలో మంచి అభిప్రాయం లేదన్న వరకే అవగాహన ఉంది. ఆనందిని ప్రేమించినా అది తానే నమ్మలేని స్థితి ఉంది. అందుకనే మాణిక్యం చెప్పిందే నిజమేనేమో అనుకుంటాడు. బాల్యం నుండే మాణిక్యం మనస్తత్వం తెలిసినా, సాటి మనుషులను చదివి, అర్ధం చేసుకుని, వారి నిజ స్వరూపాలను గ్రహించే తెలివి మాత్రం అణ్ణామలైకి లేదు. ఆ తెలియనితనమే అతని జీవితాన్ని చిక్కుల్లో పడేస్తుంది.’ఇతరుల అభిప్రాయాల పట్ల తనకు ఏకీభావం లేకపోయినా వాటిని కరాఖండిగా ఖండించే గుణం అణ్ణామలైకి అలవడలేదు’ అని రచయిత అతని గురించి రాశారు.

 అణ్ణామలై తల్లి మీనాక్షి గురించి, ‘ఆర్థిక విలువల కన్నా బాంధవ్య బంధాలకు, మమతానురాగాలకు పెద్ద పీట వేసే స్వభావం ఆమెది’ అని రచయిత చెప్పడం ద్వారా అణ్ణామలైని ప్రభావితం చేసింది కుటుంబంలో తల్లి అని పాఠకులకు స్పష్టమవుతుంది. శిల్పకళ మీద సమాజంలో ఉన్న ఓ అభ్యంతరాన్ని కూడా రచయిత ఈ నవలలో ప్రస్తావించారు. శిల్పకారులు నగ్న స్త్రీల బొమ్మలు గీస్తారని, దాని వల్ల వారి నైతిక విలువలు దిగజారిపోతాయని సమాజంలో ఓ అభిప్రాయం ఉంది. సామాన్యులకు నగ్నత్వంలో హీనత్వం కనిపిస్తే,కళాకారులకు కళా, కళాప్రేరణ కనిపిస్తుంది. ఈ అంశం వ్యక్తులకు కళ మీద ఉన్న అవగాహన, మనస్తత్వ పరిధిలోని సంకుచిత్వాలకు సంబంధించినది. ఈ అంశమే అణ్ణామలై తల్లిదండ్రులను వేధిస్తుంది. ‘సంపాదన లేకుండా కొడుకు అప్రయోజకుడైపోతాడేమోనాన్న తండ్రి చింత. నీతి మాలిన పనులకు పాల్పడి బిడ్డ ఎక్కడ చెడిపోతాడో అని తల్లి బెంగ.’ అణ్ణామలై మొదట విద్యాలయంలో చేరడానికి అతని తల్లిదండ్రులకున్న అభ్యంతరాలు విరుద్ధమైనవి.ఒకరిది ఆర్థిక దృక్కోణమైతే,ఇంకొకరిది నైతికమైనది. సాధారణ మనుషుల వరకు శిల్పకళ చేరలేనంత ఖరీదైనది, అలాగే ఖరీదు ఎందుకో అర్ధం చేసుకోలేనంత దూరం ఆ కళకు, సామాన్యులకు ఉందన్న సత్యాన్ని కూడా అంగీకరించాల్సిందే.

 “డ్రాయింగులోనూ, పెయింటింగులోనూ డిప్లొమా పుచ్చుకున్న వారిలో చాలామంది బ్రతుకు తెరువు కోసం కిళ్ళి కొట్టు పెట్టుకున్నారనీ, సైకిళ్ళు రిపేరు చేసుకుంటున్నారని మరచిపోకూడదు. ఈ ‘ఆర్ట్’ అనేది బ్రతుకును బాగుపరిచినా పరచొచ్చు, లేదా పాడు చేసినా  చేయవచ్చు. దేనికయినా సిద్ధపడే సాహసం ఉండాలి’, అని అణ్ణామలై ఆరేళ్ళ డ్రాయింగ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి వెళ్లినప్పుడు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంటాడు. ఎంతో అనుభవం ఉన్న ఆయన అభిప్రాయం ద్వారా ‘కళలు జీవనోపాధి కాని పరిస్థితి’ని రచయిత సున్నితంగా,పరోక్షంగా చెప్పారు. విద్య ఉద్యోగం కోసమే అన్న మధ్యతరగతి మనస్తత్వానికి కళల పట్ల విముఖత కలగడం కూడా సహజమే.

 అణ్ణామలై చిత్రకళా పద్ధతిని కూడా సామాన్యులకు అర్ధమయ్యేలా రచయిత స్పష్టం చేస్తారు. గీయాలనుకున్న బొమ్మలో బాహ్య రూపాన్ని మాత్రమే కాకుండా, భావావేశాలను కూడా చిత్రంలోకి తీసుకురావాలన్నది అతని సంకల్పం. బాహ్య సౌందర్యం వైపు నిలిపినప్పుడు భావోద్వేగం సరిగ్గా ప్రతిఫలించడం లేదనిపిస్తుంది.భావోద్వేగాన్ని పట్టి తెచ్చినప్పుడు బాహ్య సౌందర్యం కొరవడినట్టు తోస్తుంది. ఏమైనా రెండు విధాలా న్యాయం చేకూర్చి తీరాలన్నదే అణ్ణామలై పట్టుదలగా ఎంట్రన్స్ టెస్ట్ లో చూపిన దీక్షకు రెండు సంవత్సరాలు ముందుకు ప్రమోట్ అయ్యి మూడో సంవత్సర విద్యార్ధి అవుతాడు. ఆ కళాశాలలోనే ఇంకో విద్యార్ధి ఆనంది స్నేహితురాలైన శారద. ఆమె ద్వారా ఆనంది అణ్ణామలై విద్యలో రాణిస్తునన్ తీరును గురించి తెలుసుకుంటూ ఉంటుంది.

 ఇల్లు కడుతున్న సందర్భంలోనే చిదంబర మేస్త్రి ఆనంది,మాణిక్యంలకు వివాహం చేస్తే బావుంటుందని అనుకుంటాడు. కదిరేశన్ ఆనంది,అణ్ణామలైల వివాహానికి సానుకూలంగా ఉంటాడు. ఈ సమాజంలో తన కొడుక్కి వైవాహిక జీవితం వల్ల ఓ అండ అన్నది ఏకాకులుగా, వెలి వేయబడి బ్రతుకుతున్న ఆనంది కుటుంబం వల్ల లభించదని భావించిన చిదంబరమేస్త్రి తన కొడుక్కి దండపాణి కూతురు సుందరితో వివాహమే యోగ్యమైనదని నిర్ణయించుకుంటాడు. మేస్త్రి  కూతురి దృష్టికి ఆ విషయం తీసుకువెళ్ళడు. శారద ఆనంది కోసం అణ్ణామలై ఆహార మరియు ఇతర విషయాల పట్ల శ్రద్ధ వహిస్తుంది. ఓ సారి సుందరి తన తండ్రితో కలిసి వచ్చినప్పుడు శారదతో అణ్ణామలైను చూసి ఆమెను అవమానించి అతన్ని తీసుకువెళ్ళినపుడు అణ్ణామలై ఆమె చిత్రాన్ని గీస్తాడు.

 ఆనందిని ఎలా అయినా దక్కించుకోవాలని ఆమెపై అత్యాచార ప్రయత్నం చేస్తాడు మాణిక్యం. ముందు నుండి ఆనంది మాణిక్యం పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని గురించి రచయిత ఎంతో చక్కగా చెప్తారు. ‘అణ్ణామలై పట్ల మాణిక్యం కనబరుస్తూ వచ్చిన మమకారాన్ని బట్టి, వాత్సల్యాన్ని బట్టి కాలక్రమాన ఆనంది మాణిక్యాన్ని గురించి తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ వచ్చింది.’ అలాగే మాణిక్యం గురించి కదిరేశన్ అభిప్రాయాన్ని కూడా రచయిత ఇలా వ్యక్తపరుస్తారు. ‘మాణిక్యం తెలివైనవాడే. కార్యదక్షుడే. లౌకిక దృష్టితో చూసినప్పుడు అతడు గొప్ప ప్రయోజకుడని ఒప్పుకోక తప్పదు. కాని కదిరేశన్ గారికి అతడి ప్రవర్తనలో ఊహ కందని లోపమేదో స్పురిస్తూ వచ్చింది. ఇంగిత జ్ఞానం, చిత్త సంస్కారం, హృదయ వైశాల్యం- అంటూ ఇలా ఒక్కొక్క గుణాన్నే లెక్కకు తీసుకుంటూ వచ్చి, వీటిలో ఏ ఒకటో రెండో అతడిలో కొరవడి ఉండవచ్చునని ఆయన భావించాడు. అలివిమీరిన ప్రయోజనం మనిషికి ఏమంత మేలు చేసేది కాదని ఆయన అభిప్రాయం. మాణిక్యానికి ఉన్నది అదే! బాహ్య లక్షణాలను బట్టి, చేష్టలను బట్టి చూసినప్పుడు అతడి చిత్తప్రవృత్తి అంత ఉన్నతమైనది కాదేమోనని అనుమానించక తప్పడం లేదు. అలాగని పరమోత్కృష్టమైన శుభలక్షణాలన్నీ అణ్ణామలై దగ్గరే ఉన్నట్టు కూడా ఆయన అనుకోలేదు. కాని ఆ ఇద్దరిలోనూ ఆయన బుద్ధి అణ్ణామలై వైపు మొగ్గినంతగా మాణిక్యం వైపు మొగ్గడం లేదు.’ దీని ద్వారా రచయిత కళాకారుడు సాటి మనిషిలో ఔన్నత్యాన్ని ఏ అంశాల ఆధారంగా నిర్ధారిస్తాడో స్పష్టం చేశారు.

     ఇకపోతే ఆనంది శారద ద్వారా అణ్ణామలైకి సుందరితో వివాహమనుకుంటున్న విషయాన్ని తెలుసుకుంటుంది. అలాగే అతను గీసిన సుందరి చిత్రాన్ని చూసి అతను ఆమెను ఇష్టపడుతున్నాడని అనుకుంటుంది. ఆ సందర్భంలో మాణిక్యం చేసిన అత్యాచార ప్రయత్నానికి ఆమె మనఃస్థితి పూర్తిగా నిస్సహాయంగా మారిపోతుంది. ‘పూర్తిగా తానొక పాతకాలపు మనిషై ఉంటే, అతడు మెట్లెక్కి వచ్చి తన గదిలోకి ప్రవేశించడానికి అనుమతించి ఉండేది కాదు. పూర్తిగా నవనగరిక యువతి అయి ఉంటే కపోలానికంటుకున్న అతడి ఎంగిలిని ఎడమచేతితో తుడి చేసుకుని, ఖాండ్రించి ముఖాన ఉమ్మి, ‘సముద్రంలో గాదు, ఏ పాడు నూతిలో నైనా దూకి చావమంటూ ఇంటి నుంచి వెడల గొట్టేది. తానీ రెండు పనుల్లో ఏ ఒకటీ చేయలేకపోయింది. ప్రాచీన కాలానికి సంబంధించిన భయంకరమైన కట్టుబాట్లకు, ఆధునిక యుగానికి చెందిన బాధ్యతారహితమైన విశృంఖల చిత్త రుత్తికి మధ్య తనది నిజంగా త్రిశంకుడి స్వర్గమైపోయింది.’ ఇలాంటి దశలో ఆమె మాణిక్యంతో వివాహానికి ఒప్పుకుంటుంది. అణ్ణామలై ఆ తర్వాత వచ్చి ఆమెను తాను వివాహం చేసుకుంటానని చెప్పినా, ఆమె ఆధునికంగా మారలేక ఒప్పుకోలేదు. అలా మాణిక్యం,ఆనందిల వివాహమైపోతుంది. ఆ తర్వాత సుందరి, అణ్ణామలైల వివాహం కూడా జరిగిపోతుంది.

   ‘నవనాగరికత నేర్పే పాఠాల కన్నా, సాంప్రదాయాన్ని గౌరవించే గుణమే అణ్ణామలై స్వభావాన్ని తీర్చిదిద్దింది. అందుకు కారణం తల్లి పెంపకమైతే కావచ్చు’ అనే వాక్యాల ద్వారా ఆనంది,అణ్ణామలైల వ్యక్తిత్వంలోని సామీప్యతను రచయిత స్పష్టం చేశారు. 

 మాణిక్యం మాట మీద నమ్మకంతో తక్కువ ధరలో స్థలాలు కొని ఎక్కువకు అమ్మవచ్చన్న ఆశతో మేస్త్రి తన ఇంటిని, కదిరేశన్ ను ఒప్పించి ఆయన ఇంటిని తాకట్టు పెట్టించి మాణిక్యంతో కలిసి కొని, బ్రోకరు విషయంలో మోసపోతాడు. అసలు యజమాని కాకుండా మధ్యవర్తి అమ్మి మోసం చేయడంతో యజమాని కేసు పెట్టడం వారిద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేక, తెలియక తప్పు చేసిన భావన, మాణిక్యాన్ని అనవసరంగా నమ్మిన చింతతో మేస్త్రి మరణిస్తాడు. మాణిక్యం తెలివిగా తన ఇంటి పత్రాలపై అప్పుకు కూడా ష్యూరిటీ సంతకం అణ్ణామలై చేత పెట్టిస్తాడు. వివాహమయ్యాక ఇంటి మీద అప్పు తీర్చడం కోసం దండపాణి ఏర్పాటు చేసిన సంస్థలో సినిమా పోస్టర్లు, రంగులు వేస్తుంటాడు అణ్ణామలై. అందులో తన కళ మరణించినట్టు భావిస్తాడు.

 అణ్ణామలై కళ మీద గౌరవం లేకపోవడం, అతన్ని అనుమానించడం, పుట్టింటికి వెళ్ళడం, ఓ సారి అలా వెళ్ళి సుందరి ఆత్మహత్య చేసుకుని మరణించడం జరుగుతుంది. ఇక మాణిక్యం ఆనందిని హింసించడం, కదిరేశన్ ఆస్తిని తన గుప్పిట్లో ఉంచుకోవడం, చివరకు తన ఇంటి అప్పు భారం అణ్ణామలై మీద పడేయడంతో, తప్పని సరి పరిస్థితుల్లో అణ్ణామలై ఇల్లు జప్తు చేయడం జరుగుతుంది. ఇక నవల ముగింపులో అలా ఆస్తి కోల్పోయిన అణ్ణామలైతో కలిసి జీవించడానికి ఆనంది నిర్ణయించుకోవడం, దానికి కదిరేశన్,మీనాక్షి ఒప్పుకోవడం జరుగుతుంది.

 ఈ నవలలో కళాకారులు లౌకిక జీవితానికి ఎలా తమను తాము మార్చుకోలేరో, తమ కళ పట్ల గౌరవం, అభిమానం లేని చోట ఎలా జీవించలేరో స్పష్టం చేశారు రచయిత. కళకు, సామాన్యులకు మధ్య ఉన్న దూరం, ‘కళ’ కోసం జీవించడం సాధారణత్వంగా భావించలేని సమాజ ఆలోచనా శైలిని, ‘కళ’ సామాన్య జనానికి అందుబాటులో ఉండేలా చేయాల్సిన ఆవశ్యకతను కూడా ఈ నవల సూచిస్తుంది. 
   *        *        *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ