అవసరాల చట్రం
అవసరాల చట్రం
మనుషుల మనసుల్లో మెటీరియలిజం కొంత మేరకు ఉండటం నేడు సహజమైన అంశంగానే పరిగణించబడుతుంది. మనిషి తన గురించి తాను ఆలోచించుకునే క్రమంలో తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి,తన జీవితం సంతోషంగా ఉండటానికి తన కుటుంబాన్ని,తన వారిని మినహాయించి మిగిలిన వారితో ఎంతో కొంత ఏదో ఆశించే వారిని జీవితంలోకి ఆహ్వానించి,వారిని తన జీవితంలో భాగం చేసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సగటు జీవులు తమ జీవితాన్ని ఇటువంటి చక్రభ్రమణంలోనే కొనసాగిస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవడానికి,అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళిన ఓ అమ్మాయి అక్కడ మెటీరియలిస్టిక్ సమాజంలో ఎలా తనను తాను ఇముడ్చుకుంటూ,మనుషుల మనసుల్లో ఉండే అవసరాల-అవకాశాల వలయంలో చిక్కుకుంటూ,బయటపడుతూ మనుషులను అర్ధం చేసుకుంటూ,తన లక్ష్యాన్ని ఎలా సాధించే స్పష్టం చేసే నవలే శ్రీధర గారి ‘కలలకు రెక్కలొచ్చాయ్.’
ప్రణతి బాల్యంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి ఎంతో కష్టపడి ఆమెను చదివించింది. ప్రణతికి ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. ప్రణతి తండ్రి మరణించాక తండ్రి స్నేహితుడు పద్మనాభం ఆ కుటుంబాన్ని కొంతమేరకు ఆదుకోవడం వల్ల ఆ కుటుంబం పట్ల కృతజ్ఞతతో ఉంటారు. పద్మనాభం కొడుకు శివశంకర్. శివశంకర్,ప్రణతి కలిసే చదువుకున్నారు. ప్రణతి స్కాలషిప్స్ తో మెరిట్ తో చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొంత కాలం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసి, ఆ తర్వాత శివ శంకర్ తో కలిసి అమెరికాలోని యూనివర్సిటీకి ఎమ్ ఎస్ చదవడానికి అప్లై చేయడం, ప్రణతికి మాత్రమే సీటు రావడం ఆమె అమెరికా వెళ్ళడం జరుగుతుంది.
తాను బాగా చదువుకుని, తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చి, తన కుటుంబానికి అండగా ఉండటమే తన జీవితంగా భావించి కష్టపడుతుంది ప్రణతి. ప్రణతి రూమ్ మేట్ కాళింది. ప్రణతికి ఒక సంవత్సరం సీనియర్. అక్కడ ఉండే మనుషులు చాలా వరకు మెటీరియలిస్టిక్ ఉంటారని,వారి అవసరం మేరకు ఉంటారని, అందరినీ నమ్మినట్టు ఉండాలని,కానీ ఎవరిని నమ్మకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండాలని కాళింది చెప్తుంది ప్రణతికి.
ప్రణతి అమెరికాలో అడుగుపెట్టగానే ఆమెను రిసీవ్ చేసుకోవాల్సిన సుందర్శన్ రాకపోవడం వల్ల అమెరికాలో తన లానే చదువుకోవడానికి వచ్చిన సాయిబాబాను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాస్ ప్రణతిని ఆమె కాలేజీలో దింపుతాడు. అలా వారిద్దరితో కూడా ప్రణతికి పరిచయం ఏర్పడుతుంది. అలాగే అదే యూనివర్సిటీలో క్లాస్ మేట్ అయిన జోసెఫ్ తో కూడా పరిచయం ఏర్పడుతుంది.
పుట్టింది మధ్య తరగతి కుటుంబం అవ్వడం వల్ల, కష్టాలు,ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ వెంటాడుతూ ఉండటం వల్ల ప్రణతి అందరితో మంచిగా ఉండటం, పరిచయాల్లో తన అవసరానికి ఉపయోగపడేవారిని ఎలా ఆప్షన్స్ గా ఉంచుకోవాలో అమెరికాలో అలవాటు చేసుకుంటుంది. బాల్యం నుండి ఎంతో సన్నిహితంగా మెలిగిన శివశంకర్ కు తన కుటుంబానికి ఆర్థిక వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా, తాను అందంగా ఉంటాను కనుక, తనను శివశంకర్ ఇష్టపడి వివాహం చేసుకుంటాడనే ఆశ కాస్త అమెరికాలో ఆమె అడుగుపెట్టిన తర్వాత ప్రణతి కుటుంబానికి తెలియకుండా పెళ్లి కుదుర్చుకుని శివశంకర్ కుటుంబం శివశంకర్ కు చేసుకున్నారని ప్రణతికి తెలుస్తుంది. దానితో మనుషుల మనసుల్లో డబ్బుకు ఉన్న విలువను,మనుషుల మనస్తత్వాలను కొంతమేరకు అర్ధం చేసుకుంటుంది ప్రణతి.
శివశంకర్ తో పెళ్లి జరగకపోవడంతో అప్పటికే కొంత సన్నిహితంగా ఉంటున్న శ్రీనివాస్ తో సన్నిహితంగా ఉంటుంది ప్రణతి. శ్రీనివాస్ ఇచ్చిన ఫోన్ ,డ్రెస్,కంప్యూటర్ తీసుకుంటుంది. అతని వివరాలు సాయి బాబా ద్వారా తెలుసుకుంటుంది. అతని తండ్రి ధనవంతుడని తెలుసుకున్నాక,అతనితో సన్నిహితంగా మెలిగి,అవకాశం ఉంటే ముందుకు వెళ్ళవచ్చని అనుకుంటుంది.ఓ సారి శ్రీనివాస్ తో కలిసి హాలిడేకు వెళ్ళిన ఆమె శ్రీనివాస్ తో సన్నిహితంగా ఉండకపోవడం వల్ల ఆ తర్వాత ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేస్తాడు. అతను ఇచ్చిన ఫోన్ తిరిగి సాయిబాబా కు ఇచ్చేస్తుంది ప్రణతి.
జోసెఫ్ తల్లి లూసి తో ప్రణతికి పరిచయం ఏర్పడుతుంది. జోసెఫ్ చదువులో వెనుకబడటం పట్ల లూసికి బెంగగా ఉంటుంది. జోసెఫ్ కు చదువులో సాయం చేస్తూ ఉంటుంది ప్రణతి. జోసెఫ్ ప్రణతి ఎక్కడికైనా వెళ్ళాలన్నా,లేదా ఏదైనా డబ్బుల అవసరం వంటి వాటిల్లో ఆదుకుంటూ ఉంటాడు. ఇకపోతే ప్రణతికి అమెరికాలో ఎదురైన ఇంకో వ్యక్తి సుందర్శన్. ప్రణతితో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేసి ఆమె గట్టిగా హెచ్చరించడంతో ఆమె గురించి దుష్ప్రచారం చేస్తాడు.
ఎందరో మనుషులను చూస్తూ,పరిస్థితులకు,తన అవసరాలకు తగ్గట్టు మారుతూ, ఎంతో దీక్షగా చదువుతూ, అక్కడ చదువుకుంటూనే ఓ ప్రొఫెసర్ సాయంతో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రణతి తల్లికి స్ట్రోక్ రావడంతో ప్రణతి ఇండియా తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు జోసెఫ్ తల్లి ఐదు వేల డాలర్ల సాయం చేస్తుంది. ప్రణతి వచ్చాక ఆమె తల్లి మరణిస్తుంది. చెల్లి,తమ్ముడు పేరు మీద కొంత బ్యాంకులో వేసి అమెరికా తిరిగి వస్తుంది.
ఇక తన కుటుంబం కోసం నిలబడటమే తన లక్ష్యంగా భావించి కష్టపడి ఎన్నో ఉద్యోగాలు చేస్తూ ఎలాగో ఇంటికి పంపించడమే కాకుండా చదువు పూర్తయ్యే సరికి లూసి ఇచ్చిన డబ్బు కూడా ఇవ్వబోయినా లూసి తన కొడుకు కూడా పాస్ అయ్యేలా చేసినందువల్ల ఆ కృతజ్ఞతతో తీసుకోదు. భారతదేశం చదువు తర్వాత తిరిగి వస్తుంది. లక్ష రూపాయల ఉద్యోగంలో చేరుతుంది. చెల్లికి,తమ్ముడికి భద్రతను ఏర్పరుస్తుంది. జోసెఫ్ ఆమె కోసం భారత దేశం వస్తాడు. వారిద్దరూ వివాహం చేసుకోవాలనుకోవడంతో నవల ముగుస్తుంది.
మనిషి జీవితంలో తన అవసరాలకు తగ్గట్టు మెలగడంలో తప్పు లేదు. మడి కట్టుకుని మనుషులకు దూరంగా దేశం కానీ దేశంలో బ్రతకడం కూడా సాధ్యం కాదు. కానీ ఇద్దరు మనుషులు అవసరాల కోసం పరిచయాలు పెంచుకునే క్రమంలో ఒక్కో పరిచయం ఏమి ఆశిస్తుందో కూడా తెలుసుకుని,అది ఆమోదం కానీ సందర్భంలో దానిని వదిలించుకోగల మనోస్థైర్యం కూడా ఉండాలి. జీవితం ఎప్పుడూ ఆప్షన్స్ మీద నిలబడదు. జీవితంలో కొన్ని సహజంగా జరిగే స్పేస్ ఇవ్వాలి. అప్పుడే జీవితంలో కొంత మెటీరియలిజం ఉన్నప్పటికీ కూడా కొంత మానసిక సంతృప్తినిచ్చే కోణం కూడా ఆవిష్కృతమవుతుందని ఈ నవల స్పష్టం చేస్తుంది.
ఒక్కో రచయితకు ఒక్కో కథనశైలి ఉంటుంది. జీవితంలోని బాధలను,ఏ ఆసరా లేనప్పుడు మనిషి చిన్న ఆసరా కోసం ఎలా తపించిపోతాడో,మనిషి ఒక్కో అవకాశాన్ని ఎలా వెతుక్కుంటాడో,ఆ అవకాశాల ఆకాశంలో ఉండే కష్టానష్టాలను,వాటి వల్ల ప్రేమ లాంటి అంశాలు జీవితంలో కొన్ని సార్లు విలువభ్రంశం ఎలా చెందుతాయో వివిధ కోణాల్లో శ్రీధర గారు తన రచనల్లో స్పష్టం చేస్తారు. శ్రీధర గారి రచనల్లో పాత్రల్లో మనం ఒప్పుకోలేని మనల్ని చూసుకుంటాము. అందుకే ఈ రచనలు మానసికంగా పాఠకులను కదిలిస్తాయి.
* * *

Comments
Post a Comment