ఉద్యమ జీవితం

                                                 ఉద్యమ జీవితం

                                         -శృంగవరపు రచన




విప్లవం గురించి చెప్పుకోవడానికి,స్పూర్తి పొందడానికి ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. కానీ ఆ ఉద్యమంలో కూడా మారని మనుషుల వల్ల తలెత్తే సమస్యలు,స్త్రీ-పురుష వ్యత్యాసాలు,ఉద్యమం ఆగిపోయాక ఉద్యమంలో ఓ రకమైన ప్రయోజనకరమైన లక్ష్యంతో సాగే మనుషులు ఒక్కసారిగా సాధారణత్వంలో ఇమిడిపోవటానికి పడే ఇబ్బందులు,ఉద్యమ జీవితంలో స్త్రీలు ఎదుర్కునే సమస్యలు,ఉద్యమం లక్ష్యాల్లో వచ్చే మార్పులు,ఉద్యమాన్ని సభ్యులు అర్ధం చేసుకునే తీరు,రాజకీయ జీవితంలో ఉద్యమంలో అంకితభావంతో పని చేసే వారు స్పందించే పద్ధతి,వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు ఇలా ఎన్నో అంశాలను తుంగతుర్తి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి,పన్నెండేళ్ళ వయసు నుండే ఉద్యమమే ఊపిరిగా సాగి తన పాటలతో,ఉపన్యాసాలతో,శిక్షణతో శత్రువులను ఎదుర్కోవటంలో అదే ఉద్యమ దూకుడు అవలంబించి చివరి శ్వాస వరకు తన జీవితాన్ని ఉద్యమాన్ని విడదీయలేనటువంటి వ్యక్తిగా మారిపోయిన స్వర్గీయ మల్లు స్వరాజ్యం గారు తన ఆత్మకథ ‘నా గొంతే తుపాకి తూట’లో పొందుపరిచారు. మల్లు స్వరాజ్యం గారు రాయలేకపోవడం వల్ల ఈ ఆత్మకథ అంతా ఆమె చెప్పే పద్ధతిలోనే సాగింది.మల్లు స్వరాజ్యంగారికి ఉద్యమం పట్ల ఉన్న అంకితభావం వల్ల ఉద్యమాలు ఎలా ధైర్యవంతులను,కళాకారులను,చైతన్యవంతులను,త్యాగం చేసే వారిని,రక్షించేవారిని,ప్రజలు నమ్మేవారిగా రూపొందే నాయకులను తయారు చేస్తుందో స్పష్టం చేసే జీవితంగా తన జీవితాన్ని గడిపారు అన్నది కాదనలేని సత్యం.
స్వరాజ్యం గారి కుటుంబం అణచివేతకు గురి కాలేదు.వారిది కూడా ఓ భూస్వామ్య కుటుంబమనే చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఆ వర్గంలో స్త్రీలకు విద్య,గుర్రపు స్వారీ మరియు ఆత్మరక్షణకు కొంత తర్ఫీదు ఇచ్చేవారు. స్వరాజ్యం గారికి అక్క శశిరేఖ.అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి. చెల్లెలు సరస్వతి.తమ్ముడు కుశలవరెడ్డి. ఆ రోజుల్లో భూస్వాముల ఇళ్ళల్లో స్త్రీలు పర్దాలు ధరించాల్సిందే. స్వరాజ్యం కుటుంబంలో కొందరు బంధువులు అప్పటికే ఉద్యమ స్పూర్తితో ఆ సాహిత్యం చదవడం,చర్చించడం,కొన్ని కుటుంబాలే విప్లవ సభ్యులుగా మారిపోవడంతో పుట్టింది భూస్వామ్య కుటుంబం అయినా ఆ కుటుంబ వాతావరణంలో విప్లవానికి సానుకూల వాతావరణమే నేపథ్యమైంది. స్వరాజ్యం గారు తప్ప ఆమె తోబుట్టువులు అందరూ కూడా చదువుకున్నారు. స్వరాజ్యం గారు 1930ల్లో పుట్టారు.తండ్రి చనిపోయేసరికి ఆ కుటుంబ పెత్తనం బాబాయి అయిన కోనారెడ్డికి వచ్చింది.ఆయన స్త్రీ విద్య,పిల్లలకు శిక్షణ విషయంలో వెనుకబడి ఉండటం వల్ల పూర్తిగా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నాడు. స్వరాజ్యం మేనత్త బుచ్చిరావమ్మ భర్త మరణించడం ఆమె పుట్టింటికి రావడం,ఆమె కూతురిగా తనకు కూడా ఆస్తి హక్కు ఉందని సాధించి కేసు వేసి ఎన్నాళ్ల తర్వతో సాధించడం జరిగింది. ఆమె కొడుకు రాజిరెడ్డినే స్వరాజ్యం అక్క శశిరేఖకు ఇచ్చి వివాహం చేశారు.స్వరాజ్యం అన్న,అక్క,బావ ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు.కూలీలకు ఇస్తున్న వేతనాలు పెంచాలని సమ్మె చేయాలని స్వరాజ్యం అన్న కూలీలకు చెప్పి వారిని సమాయత్తం చేశాడు. కానీ ఆ రాత్రే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడం,కానీ తల్లి అతన్ని కాపాడి బయటకు పంపడం, ఆ సమయంలో స్వరాజ్యంకు అన్న ఎలా అయినా ఆ సమ్మె చేయించమని ఆ బాధ్యత అప్పగించడం జరిగింది.అప్పటి వరకు విన్నది,ఇంట్లో చర్చల ద్వారా తెలుసుకున్నదే తప్ప స్వయంగా సమ్మె ఎలా చేయించాలో స్వరాజ్యంకు తెలియకపోయినా ఎలా అయినా ఆ పని చేయాలనే ఉదయమే ఆ కూలీల ఇళ్లకు వెళ్ళి వారిని పనికి వెళ్లకుండా ఆపడానికి రెండు రోజులు అలాగే అడ్డం పడి ఉండి, మొత్తానికి కొంత జీతం పెరిగేలా ఆ సమ్మె ఫలితమివ్వడానికి కారణం అయ్యింది. అలా ప్రత్యక్ష ఉద్యమ జీవితంలోకి అడుగు పెట్టారు స్వరాజ్యం.
ఈ సంఘటన వెనుక అర్ధం చేసుకోవాల్సిన నేపథ్యం కొంత ఉంది. మాక్సిం గోర్కీ ‘అమ్మ’ నవల ప్రభావం ఈ కుటుంబం మీద ఉంది.ఆ నవలలో అమ్మ పాత్ర స్వరాజ్యం తల్లి గారి మనసులో ఎంతగా ముద్రించుకుపోయిందంటే ఆమె తన కొడుకును సాష అని పిలిచేది. కొడుకును అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు ఆమె అప్పట్లో పెద్దింటి కుటుంబాల స్త్రీల ఇళ్లకు సోదాకు రాత్రిళ్ళు రాకూడదని పొరాడి ఆ రాత్రి అంతా వారిని అక్కడే నిలువరించగలిగింది.ఆ తర్వాత కూడా ఈ ఉద్యమ నేపథ్యంలో ఆమె జైలుకు కూడా వెళ్లింది.ఇంట్లో తల్లి ప్రోత్సాహం ఉండటం కూడా ఆ సంతానంలో దాదాపుగా అందరూ ఉద్యమం వైపు మరలేలా చేసింది.
ఆ సమయంలో ఐలమ్మ కౌలు రైతుగా తన హక్కును కాపాడుకోవటానికి సంఘం సాయం తీసుకోవడం ఎదిరించడం మొత్తానికి వెట్టి చాకిరీ బానిసత్వంకు వ్యతిరేకత నుండి మొత్తానికి రైతాంగ పోరాటంగా మారేందుకు దారి తీసింది. మొదట సాంస్కృతిక ఉద్యమంగా ఆంధ్రమహాసభ మొదలైనా చివరకు ప్రజల సమస్యలకు అనుగుణంగా ఉద్యమం రూపు మార్చుకుంది. అందుకే ప్రజా ఉద్యమాలకు ప్రజామద్ధతు కూడా బలంగా ఉండేది.
స్వరాజ్యం అప్పటికే స్త్రీల ఇష్టాలకు వ్యతిరేకంగా ముసలివారితో జరిగే వివాహాలకు వ్యతిరేకంగా కూడా పోరాడింది. ఈ సంఘం వల్ల స్త్రీలలో కూడా చైతన్యం వచ్చింది. ప్రభుత్వ భూముల్లో పశువులను మేపుకోవాలన్న పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తూ దొడ్డి కొమురయ్య,దొడ్డి మల్లయ్య ఉద్యమం చేయటం కొమురయ్య కాల్పుల్లో మరణించడం వంటి సంఘటనలు ప్రజల్లో కూడా పోరాట ధోరణికి దోహదం చేశాయి. భూస్వాములు ఈ ప్రయత్నం అణచి వేయటానికి చేసిన ప్రయత్నం అడ్డుకోవటానికి దళాలుగా ఏర్పడి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను ఉద్యమం తీసుకుంది. మహిళలను కూడా గట్టడం,ప్రసంగాలతో ఉత్తేజిత్తులను చేయడం వంటివి స్వరాజ్యం ముఖ్యంగా ఉద్యమంలో చేసినవి.దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక యూనియన్ లో విలీనం అయ్యాక ఉద్యమకారులను లొంగిపొమ్మని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం,మొదటి దశలో దొరికినవారికి జైలు శిక్ష రెండో దశలో దొరికిన వారిని కాల్చి చంపేయ్యడం జరిగింది.స్వరాజ్యం అన్న మొదటి దశలో దొరకడం వల్ల జైలు శిక్ష అనుభవించాడు. ఇకపోతే స్వరాజ్యం మీద పది వేల బహుమానం ఉన్నా ఆమె ఎలా ఉంటుందో తెలియకపోవడం,ఆమె ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో మెలగడం వల్ల ఆమె వివరాలు లేకపోవడం వల్ల ఆమె మీద పెద్ద కేసులు లేకుండానే ఆమె బయటపడింది.
ఇక ఆ ఉద్యమం తర్వాత సామాన్య గృహిణిగా జీవించడం స్వరాజ్యంకు అంతగా నచ్చలేదు.ఆమె ఉద్యమంలో ఉన్న వి.ఎన్ ను వివాహం చేసుకుంది.ఆమె అక్క శశిరేఖ భర్త ఉద్యమంకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల శశిరేఖ అతన్ని వదిలేసి కొన్నాళ్లు పుట్టింట్లోనే ఉన్నా ఆ తర్వాత భర్త దగ్గరకు వెళ్లింది.స్వరాజ్యం కుటుంబంలో స్త్రీలకు వంట,సామాన్య స్త్రీలు చేసే పనులు రావు.అవేమీ చేతకాని కారణంగా,అప్పటికే ఇంకో స్త్రీతో సంబంధం ఉండటం వల్ల కొన్నాళ్లకే భర్త ఆమెను వదిలేశాడు.ఆ తర్వాత ఆమె టీచర్ ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడినా,బిడ్డల దగ్గర ఉండలేక జీవితాంతం వ్యథ చెందుతూనే మరణించింది.
స్వరాజ్యం కూడా మేనత్త లానే తమకు ఆస్తిలో హక్కు ఉందని అడగటంతో మొత్తానికి ఆ ఇంట్లో అక్కాచెల్లెలకు కూడా ఆస్తులు లభించాయి. స్వరాజ్యంకు వచ్చిన భూమి పంటకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆమె ఎంతో కష్టపడి దానికి సాగుకు అనుకూలంగా చేసి రైతుగా కూడా మారింది. భర్త సంఘ రాజకీయాల్లో నిత్యం ఉండేవాడు.ఓ దశాబ్దం పైనే అండర్ గ్రౌండ్ లో కూడా గడిపాడు.ఆ సమయంలో ఇద్దరు కొడుకులు,కూతురు బాధ్యత స్వరాజ్యం నెత్తి మీదే పడింది.ఎంతో పేదరికాన్ని కూడా అనుభవించారు.ఆ తర్వాత తుంగతుర్తి నుండి రెండు సార్లు ఎమ్మెల్లే గా గెలిచి ఆ ప్రాంతానికి విద్యుత్ తీసుకురావడంలోనూ, భూములు పేదవారికి ఇప్పించడంలోనూ స్వరాజ్యం విజయం సాధించారు.దానితో పాటు ప్రజల సమస్యలకు ప్రత్యక్షంగా ఉద్యమ కర్త తీరులోనే గట్టిగా స్పందించడం వల్ల త్వరితగతిన సామాన్య ప్రజలకు తన స్థాయిలో న్యాయం జరిపించడంలో ఆమె సఫలీకృతం కాగలిగారు.
ఈ రాజకీయాల్లో అన్నకు ఆమె ఆమె భేధాభిప్రాయాలు రావడం వల్ల మాటలు లేకుండా పోయాయి.ఇకపోతే తమ్ముడు ఉద్యమపార్టీకి వ్యతిరేకంగా మారిపోయి తెలుగు దేశం పార్టీలోకి వెళ్లిపోవడమే రాజకీయ నాయకురాలిగా ఎదిగినా సాదాసీదా బట్టలువేసుకోవడం,తనకు వచ్చే ఆరు వందల జీతంలో రెండు వందలు పార్టీకి ఇవ్వడం,ఇక రాజకీయ నాయకురాలిగా ఎన్నుకోబడ్డాకే ఆమె పేదరికం అనుభవించానని చెప్పడం వల్ల ఆమె ఎంత నిజాయితీపరురాలో అర్ధం చేసుకోవచ్చు.ఆమె వేషధారణలో రాజకీయం ఏ మాత్రం మార్పు తీసుకురాలేకపోయింది.
జీవితంలో అన్నింటి పట్ల సంతృప్తిగానే ఉన్నా తన భర్త మరణం పట్ల మాత్రం కొంత అసంతృప్తి ఉందని ఆమె చెప్పారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడూ ఆమె పార్టీ కార్యక్రమాల కోసం ఢిల్లీ వెళ్లాల్సి రావడం ఆ సమయంలో ఆ అనారోగ్యం ముదిరిపోవడం,స్వరాజ్యం వచ్చేసరికి వెన్నుకు ఇన్ఫెక్షన్ ఉందని వఓడ్యూలు చెప్పి ఆపరేషన్ చేయించినా పక్షవాతం వచ్చి కొన్ని నెలల తర్వాత మరణించడం జరిగింది. వృద్ధాప్యంలో చిన్న కొడుకు మాత్రం తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకున్నాడు.స్వరాజ్యం గారి తర్వాత వారి పిల్లల్లో తల్లిదండ్రులు పడిన కష్టాలు చూశాక ఈ జీవితం వైపు మరలాలి అని అనిపించలేదు.అందుకే వారు ఎవరు ఇటువైపు రాలేదు.
ప్రజల అనుభవాల నుండి నేర్చుకోవడం,తన అనుభవాన్ని ప్రజలకు అందించడం అనే సూత్రం ద్వారానే తన జీవితం గడిచిందని,పోరాటమే జీవితాన్ని తీర్చిదిద్దుతుందని గట్టిగా నమ్మే స్వరాజ్యం గారి జీవిత చరిత్ర ఎందరికో స్పూర్తి దాయకం. ఈ పుస్తకంలో ఉద్యమంలో చేరినా ఆ సభ్యుల్లో ఉండే పురుషస్వామ్య కోణం,భార్యాభర్తలు ఇద్దరు పని చేసేటప్పుడు భార్య నైపుణ్యాన్ని ఒప్పుకోలేక విడిపోయిన భర్తల గురించి,ఉద్యమంలో అవివాహితులుగా చేరిన వారికి ఆ తర్వాత వివాహ విషయంలో ఎదురయ్యే సమస్యల గురించి,ఆ అడవుల్లో బహిష్టు సమయంలో పడే కష్టాల గురించి,ఈ ఉద్యమంలో ప్రవేశించిన పిల్లల తల్లులు తమ పిల్లల్ని సైతం వదిలేసి రావడం వంటి ఎన్నో సంఘటనల గురించి ఎంతో స్పష్టంగా చెప్పారు స్వరాజ్యం గారు. ఉద్యమం గొప్పదైనా మనుషుల స్వభావం,సామాజిక స్వరూపంలో మార్పు రాకపోతే అది చేయాల్సిన స్థాయిలో మేలు చేయలేదని కూడా అంటారు. ఈ పుస్తకం గురించి అంతా సమీక్షించటం సాధ్యమయ్యే పని కాదు.ఇది స్వయంగా చదివి ఆ విప్లవ పుటల్లో పయనిస్తూ చేయాల్సిన ప్రయాణమే.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ